
చెరువు గుండె పగిలింది-- ఊరు తీరు మారింది
నా నుంచి నా వరకు 9 (కవి, రచయిత జూకంటి జగన్నాథ జ్ఞాపకాలు)
1972 --19723 సంవత్సరం వానలు సరిగా పడలేదు.అవి గండ కరువు రోజులు. బావులను నీటి కోసం మరింత లోతుగా తవ్వుతున్న కాలం పాత బావులనుంచి పూడిక తీస్తున్న సమయం. ఆ రోజుల్లో బావుల పనికి పోతే రూపాయి పావుల కైకలి కూలీ ఇచ్చేవారు. గడ్డపారతో తవ్వుతుంటే మొరం మట్టి తట్టలకు ఎత్తే వాన్ని. పాత బాయిల పూడికను లోపలి నుండి పై వరకు ఒకే వరుసలో కూలీలు నిలబడి , సుమారు ఐదు మంచి పది కిలోల బరువు ఉన్న మట్టి అంచె బుట్టిలోకి ఎత్తి పైకి విసిరితే పైన ఉన్న కూలీలు కిందికి ఖాళీ బుట్టను ఏక కాలంలో విసిరేవారు. నేను బావిలో వంగుడు అంచె బుట్టి దగ్గర ఉండేవాడిని అంటే బుడుగును బుట్టిలోకి ఎత్తి సుమారు రెండు గజాల ఎత్తులో నిలుచున్న కూలి చేతుల్లోకి విసిరి వేసేవాడిని. ఈ పని ఒక తెగిపోని ధారగా కొనసాగేది. ఈ పనిని అమిది* అని పిలిచేవారు.
ఇది ఇలా కొనసాగుతుంఢగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగులోంచి చెరువు కాలువను మనం తీస్తే పై గ్రామాల రైతులు వాడుకుంటున్నారనే ఒక ప్రశ్న ఆలోచన మెల్ల మెల్లగా గ్రామ రైతులలో మొలకెత్తింది. ఈ ఆలోచనలు ఎంత దూరం పోయిందంటే ఇక కాలువ తీయవద్దు మనం ఆనే వరకు పోయింది. దాంతో కాలువ నీళ్లు రాక చెదువు గుండె పక్కున పగిలింది. చెరువు అంతా నీళ్ల స్థానంలో నిండా సర్కార్ తుమ్మలు బేషరమ్ మొక్కలు మొలిచాయి.
మరోవైపు మానేరు వాగులోంచి కట్టు కాలువ ద్వారా చదువులోకి నీళ్లు వస్తుండేది. మరోవైపు చెరువు పక్కనుండే పోతుండే బసవని కుంట ఒర్రె వాన కాలంలో నిండుగా పారుతుంఢేది. ఒకవైపు వానాకాలంలో ప్రవహించే ఒర్రె నీటికి అడ్డంగా మట్టి కట్ట పోసి చెరువులోకి నీళ్లను మళ్లించేవారు.మరోవైపు పై గ్రామాల రైతులు వాడుకోగా మిగిలిన నీళ్లు కాలువ ద్వారా చెరువులోకి వస్తుండేవి. ఇలా చెరువులోకి వచ్చే నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి.
దీనికి సమాంతరంగా ఊరిలోకి అప్పుడే కరెంటు వచ్చింది. వ్యవసాయ బావుల దగ్గరికి స్తంభాలు వేసి కరెంటు వైర్లు గుంజుతున్నారు. బావుల్లోంచి నీటిని వేగంగా తోడే మోటర్లు పైపులు విక్రయించే షాపులు వచ్చాయి. ఇందుకోసం అప్పులు ఇచ్చే సహకార పరపతి వ్యవసాయ సంఘాలు ఏర్పడినవి.వాటితో పాటు మోటార్లు కాలిపోతే వైండింగ్ చేసే కార్మికులు వచ్చారు.
హరిత విప్లవంలో భాగంగా వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు ఈ దశాబ్దంలో వచ్చాయి ఉదయం సాయంత్రం రేడియోలో వ్యవసాయదారులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు , ఎరువులు రసాయనిక మందులు ఎలా ఏ తెగులుకు ఏమి వాడాలో ఏ మోతాదులలో వేయాలో రైతులకు సూచనలతో కూడిన పొద్దున సాయంత్రం రేడియో కార్యక్రమాలు రూపొంచి ప్రసారం చేయడం జరిగుతుండేది.
వ్యవసాయ రంగంలో చేపడుతున్న మార్పులకు సమాంతరంగా ఇంటి వెనుక పెంటలో ఇల్లు ఊడ్చిన కసువు, పశువుల పెండ గడ్డి వేయడం వలన ఎరువుగా మారిపోయేది. కానీ పాడి పశువుల దొడ్డి అంతర్దానమై అయిపోయాయి. వ్యవసాయ ఆధారిత కులవృత్తులు అన్ని క్రమక్రమంగా తెరమరుగు కావడం ప్రారంభమైంది. వ్యవసాయ కూలీలు కుల వృత్తుల వారు ఇతర రంగాలలోకి వలస పోవడం మొదలైంది . వ్యవసాయంలో ట్రాక్టర్ల ఇనుప నాగళ్ళని వాడకం పెరిగిపోయింది.
గ్రామీణ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో గణనీయమైన మార్పులు చేర్పులు జరిగాయి. భూస్వాములకు చిన్న కమతాల మరియు కౌలు రైతులు రైతు కూలీల మధ్య విపరీతమైన హెచ్చుతగ్గుల అగాధం ఏర్పడింది. హైబ్రిడ్ వరి వంగడాలు, వాణిజ్య పంటలు వచ్చాయి. కొత్త కొత్త తెగుళ్లు పంటలకు సోకాయి రసాయనిక పిచికారి మందులు. స్పేయర్లు సబ్సిడీల వ్యవసాయదారిత ఉపకరణాలపై ప్రభుత్వం సబ్సిడీల రూపంలో అనేక ప్రోత్సాహకాలను కల్పించేది. ఊర్లలోకి బోరింగ్ మెషిన్లు వచ్చి వ్యవసాయ గొట్టం బావులు తవ్వకం జరిగింది . కూలీల ఉపాధి పోగొట్టే బుల్డోజర్లు ట్రాక్టర్లు అనేకానేక ఆధునిక పద్ధతులు వచ్చి చేరాయి.
ఇటువంటి పరిస్థితుల్లో నేను కూలీగా అనేక పనులు చేసే వాడిని. ఎండాకాలం వచ్చిందంటే మబ్బుల నిద్ర లేచి నేను మా బాపు అమ్మా అందరూ కలిసి మోతుకు ఆకులు తెంపుకు రావడానికి ఎర్రగుంటకు బూసీకుంట్లకు దగ్గర దగ్గర ఓబులాపురం జన్న ఈదుల వరకు పోయే వాళ్ళం. పెద్ద పెద్ద మోదుగ చెట్లు ఎక్కి ఒప్పుగా మూడు ఆకుల కొమ్మలను ఒడుపుగా దింపి కిందికి వేసేవాడిని మా అమ్మ పాత చీరతో చేసిన కట్టిన జోలెను నింపేది అలా మూడు ముళ్లెలు నింటి నిండిన తర్వాత మెడలు ఇరిగే అంత నెత్తి మీద ఎత్తుకొని వచ్చి ఆసాని మల్లారెడ్డి బాయి దగ్గర మామిడి చెట్టు నీడకు మోతుకు ఆకుల ముల్లెలు దించుకునేవాళ్లం. కరెంటు మోటర్ నీళ్లకు మోకాలు కడిగి కడుపు నిండా చల్లని మంచినీళ్లను కడుపునిండా తాగే వాళ్లం.. ఉదయం తొమ్మిది వరకు ఇంటికి చేరే వాళ్ళం.
ఇంటికి వచ్చి స్నానాలు చేసి వచ్చేంతలోనే మా అమ్మ అన్నం వండి పెట్టేది. వేడివేడి అన్నంలో కొత్త చింతకాయ తొక్కూ, రెండు మూడు చెంచాల కమ్మని మంచి నువ్వుల నూనె వేసుకుని కలుపుకొని ఇష్టంగా తినే వాళ్ళం. అన్నం తిన్న తర్వాత ఒక కునుకు నిద్ర తీసేది. ఆగబాగం లేచి మధ్యాహ్నం దబ్బునంకు జానపదాల జనప దారం బ్రిడ్జి పొద్దున తీసుకొచ్చిన మోతుకాలను దోర్నాలుగా కుచ్చేది. అలా ముగ్గురి మోతుకు ఆకులు తొమ్మిది దోర్నాలు అయ్యేవి. వాటిని ఇంటి వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో ఎండకు వేసేవాళ్ళం. అలాఎండాకాలం మొత్తం నెలరోజులు తీసుకువచ్చిన మోతుకు ఆకుల తోరణాలు తో ఒక గది నిండిపోయేది.
వానాకాలం ప్రారంభం కన్నా ముందే మా అమ్మ రోజు చెప్పగా చెప్పగా కోపంగా మా బాపు తాడూరు, గోపాల్ రావు పల్లె, తాళ్లపల్లి రైతుల పశువుల దొడ్డి దగ్గరకు పోయి చొప్ప కట్టెల మోపులు తెచ్చేవాడు. మా అమ్మ వాటిని మా అమ్మ ఎండిన చొప్ప ఆకులను తీసేసి ఆ కట్టెలను బండ మీద పెట్టి రాయితో చెదిపోకుండా ఓడుపుగా కొట్టేది. అనంతరం చొప్పబెండులనువేరుచేసి మిగిలిన గొప్ప చొప్ప కట్టే నుంచి ఇస్తార్లను కలిపి కుట్టడానికి పుల్లలను
సంవత్సరానికి సరిపోయేన్ని కట్టలు కట్టి సుతారంగా విరిగేటట్టు ఎండకు పెట్టేది . ఎండాకాలం అంతా మా ఇంటిల్లిపాదీ విస్తారి ఆకుల సేకరణలో వాటి సహాయకారి చొప్ప పుల్లల తయారీలో నిమగ్నం అయ్యేవారు.