నడక దారిలో రెండు ఉదయాలు
పొద్దునే మసక చీకటిలో మార్నింగ్ వాక్ వెళ్తున్నపుడు ఆ అలికిడి విన్నారా? తుర్రుమని పరిగెత్తిన కుక్కపిల్లని గమనించారా, ఆ సిమెంట్ బెంచ్ మీద ఎవరున్నారో చూశారా
నడక దారిలో.... (రామ్ సి కవిత)
నేడు
నిశ్శబ్దంగా ఉందీ ఉదయమ్,
రాత్రి చూసిన అలెక్స్ నావల్నీ* అంతిమ యాత్ర మార్చిపోలేకున్నా,
నాతో నడుస్తామని వెంటబడ్డ కుక్క పిల్లలను తల్లి వింతగా చూస్తోంది,
ఒక్కడే మెట్రో బెంచ్ పై కూచోని పాటలు వింటున్నాడు ఓ వృద్దుడు,
ఆర్డర్ల కోసం వేచి ఉన్నారు స్విగ్గి వాళ్ళు,
భుజాన సంచితో ఏదో కార్యక్రమానికి వెడుతున్నాడు బ్రహ్మడు,
వాహనంలో అతి వేగంతో పిల్లల్ని స్కూలు తీసుకెడుతున్నాడు ఓ నాన్న,
ఇక చాలు నీ సమయం చూసుకోమంది కాలం.
నిన్న
చల్ల గాలి తాకి ఎందుకో రాగాలు పోతోంది,
సూర్యుడు వచ్చినా, ఎందుకో చంద్రుడు ఇంకా ఇంటికి పోలేదు,
పెళ్లికి కొత్త రంగులతో, పూలతోరణాలతో ముస్తాబైన ఇల్లు ఏదో దర్జాగా చూస్తున్నట్టు ఉంది,
నిశ్శబ్దాన్ని చీల్చుకొంటూ మెట్రో రైలు నిశ్శబ్దంగా దూసుకెడుతోంది,
రోజు నన్ను సమయం అడిగే పెద్దాయన కనిపించలేదు,
మునిసిపల్ కార్మికురాలు అమ్మవారికి మొక్కుకొంటుంది,
ఇస్త్రీ బండివాడు పనికి సిద్దమవుతున్నాడు,
పార్కులోని వాళ్ళు యోగ చేసి కళ కోల్పోయినట్టు ఉన్నారు,
ముగ్గురు గుర్ఖాలు యేవో మాట్లాడుకొంటున్నారు,
నీకెందుకు సమయమైంది ఇంటికి పద అంది కాలం.
(అలెక్స్ నావల్నీ (Alex Lavalny) రష్యా ప్రతిపక్ష నాయకుడు.19 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఫిబ్రవరి 16 ఆయన జైలులోనే చనిపోయాడు. ఆయన అంతిమ యాత్ర నిన్న మాస్కోలో జరిగింది.)
Next Story