నడక దారిలో...
పొద్దుటి ప్రశాంతత ఇంకా భగ్నం కానపుడు, వెలుతురింకా మబ్బుతెరలను లాగి అవతల పారేయక ముందు రోడ్డు మీద నడుస్తూన్నపుడు ప్రపంచం ఒక అద్భుతమైన పెయింటింగ్... ఇదిగో ఇలా
నడక దారిలో...
-రామ్. సి
'ఈ ఉదయం..... నా హృదయం' అని పాట, తెలియకుండానే పలికాను,
అలసట, దేనికో చెప్పలేను,
'ఒన్ను సహాయిక్కిమో' అంటే 'నాక్కొంచెం సహాయం చేస్తారా' అని మలయాళంలో,
పక్క వీధిలో తీన్మార్ మార్మోగిస్తున్నారు,
గుంపుగా కార్మికులు భోజనాలు కట్టుకొని ఎక్కడికో పనికి వెడుతున్నారు,
స్కూల్ లేకపోవడంతో, పిల్లలు అమ్మానాన్నకు చెత్త వేరు చెయ్యడంలో సహాయం చేస్తున్నారు,
పెళ్లికి ముస్తాబైనా కారు, వయ్యారాలు పోతోంది,
ఎమ్.ఎస్ గారి విష్ణు సహస్రనామాలు వింటూ
రోజుకు వందో రెండొందలు ఖర్చు పెట్టి
కాలోనిలో కనిపించిన కుక్కలకు బిస్కెట్లు వేస్తారు శంకర్ గారు,
నాడు సాక్షి రంగారావు, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డిల పాత్రలు లేని తెలుగు సినిమాలూ చాల తక్కువ,
సమయం తన పాత్ర గుర్తించమంటోంది.....
2
నిశబ్దం,
'నీంగళ్ ఎప్పిడి ఇరుక్కిరింగళ్' అంటే తమిళంలో 'మీరు ఎలా ఉన్నారు' అని,
చనిపోయిన బంధువుకు రాసిన నివాళి పై అభిప్రాయమడిగిన రాజు గారితో, 'కృతిమంగా' ఉందoటే, 'మీరు రాసి పెట్టండన్నారు'
,'అయ్యబాబోయ్!ఐతే, ఇదే బావుందంటూ', ముందుకు కదిలాను,
'మా అబ్బాయి అంటున్నాడు, ai వల్ల ఉద్యోగాలు పోతాయంటనే', ప్రో. రాణి గారు అంటే,'మనం చెయ్యకూడదనుకున్నవి, ఇష్టం లేనివి మాత్రమే పోతాయి, అంటూ కొంచం తెలిసిన విషయాలు పంచుకొన్నాను,
Gene Hackman, బహు అరుదైన హాలీవుడ్ నటుడు,
అత్యుతమ పురస్కారాలు పొందిన స్థాయిలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు,
You Should Know When To Exit, అని నా సిద్ధాంతం,
తెలుసుకుంటోంది చాలు కానీ, సమయం కూడా కొంచెం తెలుసుకొంటే.
3
చీకటి, ఎదో విసుగు గాల్లో,
'సొన్నా కేక్కాదా' అంటే 'చెబుతుంటే వినపడుతోందా', అని తమిళంలో,
అబ్దుల్ హక్ గారి ఇల్లు పెద్ద మామిడి చెట్టు గొడుగులో ఉంటుంది,
'వినడం'; ప్రస్తుతం ప్రపంచంలో కావలసిన అతి ముఖ్య నైపుణ్యం,
'మీరు దేంట్లోను ఇన్వెస్ట్ చేయడంలేదు, కొంపతీసి ఎలక్టోరల్ బొండ్స్ లో చేశారేంటి', అంటూ చమత్కరించారు రాజు గారు,
సినిమాలు రాజకీయాలు మన దేశంలో ఓకే రీతిగా ఉన్నాయ్; ఓ భాగంతో పోయే సినిమాను పలు భాగాలుగా తీస్తున్నారు, ఓ సారితో సరిపుచ్చేసుకోవాల్సిన పార్టీలను ఎన్నుకోవడం,
'పూరి జగన్నాధ్' దర్శకుడి కన్నా మంచి వ్యాఖ్యాత,
ఈ వ్యాఖ్యానం ఇక చాలు, ఇంటి కెళ్లమంటోంది సమయం.