Buddhist Trail | బుద్ధుడు నడయాడిన శ్రావస్థి కథలు వినితీరాలి
x

Buddhist Trail | బుద్ధుడు నడయాడిన శ్రావస్థి కథలు వినితీరాలి

కాంతి నల్లూరి ఉత్తర భారత బౌద్ధయాత్ర విశేషాలు


కపిలవస్తు లో బుద్ధుడు కోసం తండ్రి శుద్దోదనుడు నిర్మించిన స్థూపం.కపిలవస్తు లో బుద్ధుడు కోసం తండ్రి శుద్దోదనుడు నిర్మించిన స్థూపం.20.10.24 న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అంబేద్కర్ పార్కు చేరుకున్నాం. ఈ పార్కు లక్నో గోమతి నగర్ లో ఉంది. అధికారికంగా డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ సామాజిక పరివర్తన ప్రతిక్ స్థల్ అని పిలుస్తారు. సూర్యాస్తమయ సమయాన ఈ ఉద్యానవనం, అంబేద్కర్ స్తూపం భలే ఉంది. స్థూపం ఈ పార్కుకు నిండుతనాన్ని ఇస్తుంది. అంబేద్కర్, కాన్షీరాం నిలువెత్తు పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. వీరితోపాటు ఈ ఉద్యానవనంలో జ్యోతిబాపూలే, నారాయణగురు, బీర్సాముండా, సాహుజి మహారాజు ల పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. ఒక పాలరాతి చతురస్రాకార స్థంభంపై నాలుగు వైపులా మాజీ ముఖ్యమంత్రి మాయావతివి నాలుగు విగ్రహాలు ఉన్నాయి. బాలికల, మహిళల విద్య కోసం అనేక కష్టాలను ఎదుర్కొన్న సావిత్రిబాయి పూలే విగ్రహం కోసం కళ్ళు ఇంత చేసుకుని వెతికాను.

పక్కనున్న అన్న ఎందుకు తొందర పడతావు? ఎక్కడన్నా ఉంటుంది చూద్దాం అన్నారు. సావిత్రిబాయి పూలే విగ్రహం లేకపోవడం చాలా బాధగా,దుఃఖంగా, వెలితిగా, అన్యాయంగా అనిపించింది.

ఈ పార్కును నిర్మించిన సమయములో ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి కూడా (సావిత్రిబాయి కృషి వల్లనే మనం మహిళలలు గా ఈ స్థాయికి వచ్చాం) సావిత్రిబాయి పూలేను గుర్తించకపోవడం మన దురదృష్టం.

మహిళలు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు అయినంత మహిళల సమస్యలు, లేదా దళితులు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు అయినంత మాత్రాన దళిత సమస్యలు తీరుతాయని అనుకోవడం పొరపాటు.

ప్రతిబింబ్ స్థల్ ఎదురెదురుగా (31+31) 62 భారీ పాలరాతి ఏనుగులు ఉన్నాయి. (లెక్కించాం తప్పులు తడకలాగా) ఈ ఏనుగులపైన కూడా చిన్నచిన్న డిజైన్లు ఉన్నాయి. అక్కడున్న ఓ ఉద్యోగిని అడిగితే పార్క్ అంతా 124 ఏనుగుల పాలరాతి విగ్రహాలు ఉన్నాయాన్నాడు. కాని ఇంకా చాలానే ఉన్నాయి లెక్కిస్తే.

ఏనుగులతో పాటు సుమారు 3o అడుగుల(లెక్కించలేదు) స్తంభాలు ఉన్నాయి. ఒక్కొక్క స్తంభంపై ఎనిమిది పిల్ల ఏనుగులు ఉన్నాయి. మన వరంగల్ లోని వేయి స్తంభాలా గుడిలాగా ఇక్కడున్న స్తంభాలు, ఏనుగులు అన్ని లెక్కిస్తే వెయ్యి ఏనుగులు ఉంటాయి. వెయ్యి ఏనుగుల విహార్ అనవచ్చు అని నవ్వుకున్నాము.

నేల అంతా తెల్లటి పాలిష్ రాయి పరవబడినది. జారిపడతామన్నoతా నున్నగా ఉంది. చాలా జాగ్రత్తగా నడిచాం. మరికొన్ని కట్టడాలు ఆఫీసులు కూడా ఉన్నాయి. చుట్టూ ప్రాకారoలా ఎత్తైన ప్రహరీ కోడలు ఉన్నాయి. అన్ని రాజస్థాన్ నుండి తెప్పించిన ఎర్ర ఇసుకరాయితో నిర్మింపబడినవి.

గర్భగుడిలో అంబేద్కర్ జీవిత చరిత్రను తెలిపే అనేక విగ్రహాలు ఉన్నాయి. రెండు గోపురాల ఎదురుగా కుర్చీలో కూర్చున్న అంబేద్కర్ కాంస్య విగ్రహం ఉంది. పునాదిపై నా జీవన పోరాటం నా ఏకైక సందేశం అని హిందీలో రాసి ఉంది. అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని తీసుకోవడం లేదు ఎవరు.

ఉద్యానవనాలు, వనాలలో మొక్కలు, మొక్కలు అందకుండా అందమైన, గుండ్రంగా ఉన్న చిన్న చిన్న రాళ్ల పేరుపు ఆకర్షణయంగా ఉంది. ఆ ప్రభుత్వాల సమయంలో లైట్ల వెలుగులతో దేదీప్య మానంగా చాలా అందంగా ఉండేదట. ఇప్పుడు ఆ లైటింగ్ లేదు. తొమ్మిదింటికి గుడ్డి వెలుతురులో బయటకు వచ్చాము.

108 ఎకరాల స్థలములో ఏడు బిలియన్ల (సుమారు 700 కోట్లు) ఖర్చుతో అంబేద్కర్ పుట్టిన రోజైనా ఏప్రిల్ 14/ 2008లో తెరవబడింది. ఈ ఉద్యానవనం చూడటానికి రోజంతా పట్టవచ్చు. సమయం లేక మేం ప్రధానమైనవి మాత్రమే చూసాం. అయిన ఖర్చుపై, ఏనుగుల గుర్తులపై (బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు) రాజకీయ దుమారంలేగి హైకోర్టు, సుప్రీమ్ కోర్టులలో న్యాయ పోరాటం జరిగింది.

కొత్తగా ఏర్పడినప్పటికి, చంద్రబాబు వందల కోట్లు కేటాయించి గోదావరి, కృష్ణ పుష్కరాలు. కెసిఆర్ వందల కోట్లు కేటాయించి వేదాద్రి గుడి, ఈమధ్య రేవంత్ రెడ్డి కూడా ఓ గుడికి 100 కోట్లు కేటాయించాడట. చారిత్రిక కట్టడాన్ని పగలగొట్టి, మతసిచ్చు పెట్టి మరొక చోట వందలకోట్లతో కట్టిన రాములోరి గుడి, ఈ 700 కోట్లు, ఐదువేల కోట్లతో పెళ్లి చేసిన అంబానీ... చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది.

ఇదంతా ప్రజల రెక్కల కష్టం. రక్తాన్ని చేమట చుక్కలుగా మార్చిన కష్టం. సరైనా విద్య, వైద్యం, భృతి, కూడు గూడు గుడ్డ లేనప్పటికీ, రహదారులు గుంతలు పడ్డప్పటికీ, పెళ్ళిళ్ళు, గుళ్ళు గోపురాలతో సంపన్న దేశంగా భారత్, ప్రపంచంలో వెలిగిపోతుంది నిజమే. ఈ కోట్ల డబ్బుతో ఎన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు, వ్యవసాయ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెడితే దేశం నిజంగా వెలిగిపోదా? ప్రభుత్వ ఆధీనములో ఉక్కు పరిశ్రమలు కొనసాగవా? కాని వీటన్నిటితో దేశం వెలిగిపోతే తరతరాలకు సంపదను కూడేసుకుంటున్న ఆదాని అంబానీ, వేదాంత, టాటాలు, వారి కనుసన్ననల్లో మెలిగే రాజకీయవేత్తలు కూలిపోతారుగా. అందుకే దేశం పేదప్రజలతో వెలిగిపోతూనే ఉండాలి.

21.10 24. ఉత్తరప్రదేశ్ లోని శ్రావస్థి (Shravasti) కి ఓ ప్రత్యేకత ఉంది. బుద్ధుడు 24 సంవత్సరాలు జ్ఞానబోధ చేసిన ప్రాంతం. టూర్ మేనేజరు వంటని, కూరగాయలని, బస్సులోకి ఎక్కించి కూడా 10, 10: 30 వరకు టైం సెన్స్ లేకుండా కదిలేవాడు కాదు. 1: 00 కల్లా ఆకలి మొదలయ్యేది. దీంతో చూసే టైం తక్కువ అయ్యేది.

ఇక వీళ్ళతో పెట్టుకుంటే కాదని 7: 30 కల్లా రెడీ అయ్యి వచ్చేసి, దగ్గరలో చుట్టుపక్కల చూడటం మొదలెట్టాను. కొంతమంది మగవాళ్ళు చూసి వచ్చేవాళ్ళట. నేను వస్తాను నాకు చెప్పండి అన్నాను. ఇలా శ్రావస్తిలో బాగ్ వ్యాంగ్ ( BOGWANG) ప్రైమరీ స్కూల్ చూశాను.

శ్రావస్థి లోని కొరియా ఆర్థిక సహాయంతో నడుస్తున్న  BOGWANG ప్రైమరీ పాఠశాల.

శ్రావస్థి లోని కొరియా ఆర్థిక సహాయంతో నడుస్తున్న BOGWANG ప్రైమరీ పాఠశాల.

ఆ స్కూల్ ఉపాధ్యాయలు, నేను టీచర్ ని అనగానే సంతోషంగా ఆహ్వానించారు. అప్పుడే చాలా క్రమశిక్షణగా ప్రేయరు జరుగుతుంది. విద్యార్థులందరూ ఉదయం విచ్చుకుంటున్న పువ్వుల్లా ఉన్నారు. ఒకటి నుండి ఎనిమిది తరగతుల వరకు 300 మంది పైగా విద్యార్థులు ఉన్నారు.

పాఠశాల చాలా అందంగా నీట్ గా ఉంది. ఇంగ్లీషు, కొరియన్ భాషలలో స్లొగన్స్ ఉన్నాయి. కొరియా మీడియమా? కొరియా ఒక లాంగ్వేజ్ గా ఉంటుందా? మీకు వచ్చా? అని అడిగాను. కాదు, లేదు, రాదు అని చెప్పారు. కొటేషన్స్ ఉన్నాయిగా అంటే కొరియన్ గవర్నమెంట్ ఆర్థిక సహాయంతో స్కూల్ నడుస్తున్నదని చెప్పారు. ఈ పాఠశాలలో

"The world is flower" స్లోగను భలే నచ్చింది. పక్కనే థాయిలాండ్ టెంపులు ఉంది. దాని వెనక విశాలమైన ప్రాంతంలో విశాలమైన గదులతో విడిది కేంద్రం ఉంది.పాఠశాలకు కొద్ది దూరంలో దిగంబర జైన్, సాంబనాథ్ టెంపుల్స్ ఉన్నాయి.

శ్రావస్థీ లో అంగుళికమహల్ (Angli Mahal), అనాధ పిండక మహల్, జేతవనం బౌద్ధమతంతో సంబంధం ఉన్నవి. భార్గవుడు మైత్రిల కొడుకు అహింసకుడు. తక్షశిలకు వెళ్లి విద్యను అభ్యసిస్తాడు(ఇతనితో పాటు కృష్ణ, ఓ అమ్మాయి కూడా). వీరి మధ్య ట్రయాంగిల్ లవ్ ఉందట. శ్రావస్తీలో ఆ మహిళ, అహింసకుడుకు దక్కుతుందేమోనని, గురువు గారితో అబద్ధాలు చెబుతూ, గురువుగారి పత్నితో అహింసకుడకు సంబంధం ఉందని చెబుతాడట. (అప్పట్లో కూడా ఇప్పటి తిక్కలున్నాయన్నమాట) కోపించిన గురువుగారు అతనిని దుష్టుడిగా మలచటానికి వెయ్యి మందిని (మన అపూర్వ చింతామణి కథలా) చంపి బొటనవేలు సాక్ష్యంగా తెమ్మంటాడట. గురువాజ్ఞ అని, అహింసకుడు 999 మందిని చంపి ఆ బొటన వేళ్లను మెడలో వేసుకుని తిరుగుతుంటాడట. విషయం అంతా బుద్ధినికి తెలిసి నన్ను చంపు, కానీ రెండు కోరికలను తీర్చు అంటాడట. 1.రావి చెట్టు ఆకును తెంపుకు రావాలి. 2 తెంచిన ఆకును చెట్టుకు అతికించాలి. అహింసకుడు ఆకును అతికికించలేడు. ఆకునే అతికించ లేనప్పుడు చంపిన మనిషిని ఎలా తేగలవు అని బుద్ధుడు ప్రాణం గురించిన జ్ఞానబోధ చేస్తాడట. ఈ అహింసకుడే బుద్ధునికి గొప్ప అనుచరుడిగా మారిపోతాడట. ఈ అంగుళికుడు గుర్తుగా అతని పేరుతో అశోకుడు కోసల రాజ్యంలో అంగుళికమహల్ (పెద్ద ధ్యాన మందిరం) కట్టించాడట.

శ్రావస్తీ లోని అంగుళి మహల్

శ్రావస్తీ లోని అంగుళి మహల్

దీని ఎదురుగా కొద్ది దూరంలో అనాధ పిండకమహల్ ఉంది. సుదత్తు అనే వ్యాపారస్తుడు జంబుద్వీపంతో కూడా వ్యాపారం చేసి ఆ కాలంలోనే అత్యంత ధనవంతుడయ్యాడట. అనాధపిండక మహల్ సుధత్తు తన బంగారు నాణేలు దాచుకునే ఖజానాగా ఏడు అంతస్తులతో నిర్మింపబడినదట. సుధత్ శ్రావస్తిలో అనాధలందరికీ నిత్య అన్నదానం చేస్తుంటాడట. చివరకు అతనికి తినడానికి కూడా లేకపోవడంతో బుద్ధుడు అతనికి జ్ఞానబోధ చేసి కొద్ది మట్టిని చేతిలో ఉంచుతాడట.

సుధత్ ఇలా కావడానికి మరొక కథ కూడా చెప్పారు. బుద్ధుడు ఈ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి ఓ పెద్ద స్థలాన్ని ఇవ్వాలనుకుంటాడట సుధత్. అతను ఇవ్వాలనుకున్న స్థలం మహారాజు ఆధీనంలో ఉంటుంది. రాజు ఆ స్థలాన్ని ఇవ్వడానికి ఇష్టపడడు. చివరకు నీదగ్గిర ఉన్న బంగారు నాణేలు పరిచినంతమేరా ఇస్తాను అంటాడట. 18 కోట్ల బంగారునాణేలను 150 ఎడ్ల బండ్ల మీద తరలించి వందలు ఎకరాలు పరుస్తాడట. అక్కడే అంగుళిక అనాధ పిండకమహల్ వచ్చింది. అక్కడి గైడ్ చెప్పినవే ఇవ్వన్ని. ఇప్పుడు ఇవన్నీ జాతక కథలే అనుకోవాలి.

శ్రావస్థీ లోని అనాధపిండక మహల్

శ్రావస్థీ లోని అనాధపిండక మహల్

పై కథనం ప్రకారం శ్రావస్తీ అనేది కోసల రాజ్యం ముఖ్య పట్టణము. కోసల రాజ్యాన్ని ప్రసేన్ జిత్ కొడుకు జేతకుమారుడు పరిపాలిస్తున్న రోజుల్లో బుద్ధుడు సుదర్శన్ ఆహ్వానం మేరకు శ్రావస్థి వస్తున్నాడు. బుద్ధుడు వస్తున్నాడని తెలిసి సుధత్, బుద్ధినికి ఒక ఆశ్రమాన్ని కట్టించాలన్న ఉద్దేశంతో జేత కుమారుడిని స్థలం ఇవ్వమని కోరగా జేత కుమారుడు బంగారునాణ్యాలు పరిసినంత మేర తీసుకోమంటాడు. సుధత్ పరిచిన బంగారు నాణేలు బుద్ధుని కోసమని తెలిసి ఆ నాణేలు తీసుకోకుండా స్థలాన్ని ఇచ్చి వేస్తాడు. కనుక ఆ రాజు పేరుతో ఈ ప్రాంతమంతా జేతవనముగా ప్రసిద్ధి అయింది.

ఈ వనంలోనే బుద్ధుడు 24 సంవత్సరాల పాటు శిష్యులకు 82, 000 సూక్తులను బోధించాడట. ఇక్కడ ఇప్పుడు 15, 20 ఎకరాలలో 15 స్తూపాల వరకు ఉన్నాయి. అప్పటి స్తూపాలన్నీ అలాగే లేవు. వాటి ఆకారంలో ఫౌన్ డేషన్ వరకు ఉన్నాయి. బ్రిటిష్ జనరల్ అలెగ్జాండర్ కన్నిమ్ హోమ్ కాలం నుండి దశల వారి తవ్వకాలలో ఇవి బయటపడినవి.

బుద్ధుడు ఇరవై నాలుగేళ్ళు ఎనబైరెండు వేల సూక్తులు బోధించిన  జేత వనం

బుద్ధుడు ఇరవై నాలుగేళ్ళు ఎనబైరెండు వేల సూక్తులు బోధించిన జేత వనం

ప్రధాన స్తూపం చతురస్ర ఆకారంలో 4×8=32 గదులు ఉన్నాయి. ఇది ఏడంతస్తులలో, నాలుగు అంతస్తులు ఇటుకలతో, మూడు అంతస్తులు గంధపు చెక్కలతో నిర్మింపబడినదట. ఓ చిన్న స్తూపం దగ్గర పూజలు జరుగుతున్నవి. ఇక్కడ బుద్ధుడు, ప్రధాన శిష్యులు ఉండేవారట. ఈ స్థూపం ఎదురుగా శిష్యుల కోసం కంటికి కనిపించినంత మేర అనేక గదుల నిర్మాణాలు ఉన్నాయి.

సంఘారామం అంటున్నారు. సంఘారామం అంటే బిక్షువులు ఉండే స్థలం అని అర్థం. నీటి వసతి కోసం ఉన్న బావి కూడా ఉన్నది. పైన ఇనుప తడికతో మూసివేయబడినది. స్థూపాల దగ్గర ఆకుపచ్చగా, దూరంగా పెద్ద పెద్ద వృక్షాలతో జేతవనం అందంగా ఉంది.

బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం(రావి) శాఖను తెచ్చి నాటిన రావిమొక్క ఇక్కడున్నదని చెబుతున్నారు. ఈ బోధి వృక్షం ఓ శాఖకు సపోర్ట్ గా బలమైన ఇనపనిచ్చన పెట్టి ఉన్నది. కానీ ఇది నిజం కాదు.

జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం నుండి తెచ్చిన శాఖ అట.

జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం నుండి తెచ్చిన శాఖ అట.

ఏ మొక్క 2500 సంవత్సరాలు బ్రతకదనుకుంటాను. విత్తనము నుండి విత్తనంగా తరతరాలుగా వృద్ధి చెందుతాయి. ఈ బోధి వృక్షం దగ్గరగా మాతో వచ్చిన ‘బంతి’ గారు బోధన చేయగా భక్తుల నుండి కానుకలు 2500 పైగా వచ్చాయి. అలాగే అంగుళిక అనాధ పిండకమహల్ లు కూడా జాతకథలే. నిజమెంతో తెలియదు కానీ అశోకుని కాలంలో నిర్మింపబడినవి. శిథిలావస్థలో ఉన్నవి. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అపరిశుభ్రత కనబడుతుంది.

జేతవనంలో పురావస్తు శాఖవారు వేసిన ఓ శిలాఫలకం ప్రకారము, క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో శ్రావస్తి ముఖ్యమైన నగరం. అర్చిరావతి (రప్తి)నది ఒడ్డున ఉన్న శ్రావస్తి నగరం 5.23 కి.మీ ల సర్క్యూట్ లో ఇటుకగోడతో ఎత్తైన ఋజువులతో, విభిన్నమైన అనేక ద్వారాలతో ఉంది.

కపిలవస్తు లో బుద్ధుడి కోసం తండ్రి శుద్దోదనుడు నిర్మించిన స్థూపం.

కపిలవస్తు లో బుద్ధుడి కోసం తండ్రి శుద్దోదనుడు నిర్మించిన స్థూపం.

పశ్చిమం వైపున ప్రవేశ ద్వారము దగ్గర ఉన్న శోభనాధ్ ఆలయం, జైన ఆలయం యొక్క అవశేషాలను సూచిస్తుంది. పై భాగములో ఉన్న గోపురం మధ్యయుగకాలం నాటిది. ఈ ప్రదేశం మూడవ జైన తీర్థంకరుడైన సంభవనాథ్ జన్మస్థలంగా పవిత్రమైనది. శ్రావస్థినగరం, మహేత్ లోని పురావస్తు అవశేషాలతో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలుస్తున్నది.

జేతవనం లో బుద్ధుడు ఉన్న ప్రధాన భవనం

జేతవనం లో బుద్ధుడు ఉన్న ప్రధాన భవనం

శ్రావస్థి లో బౌద్ధమతం ఉన్న దేశాలన్నీ విశాలమైన స్థలాలలో బౌద్ధ విహారాలు, మందిరాలు లేదా గుడులు కట్టుకొని దాని చుట్టూ హోటలు గదులు నిర్వహిస్తూ అద్దెలకిస్తున్నారు.ఇదో పెద్ద వ్యాపారం అనిపించింది. ప్రతి చోట ధ్యాన మందిరాలు ఉన్నాయి. ఇలా ఇక్కడ శ్రీలంక,బర్మా, బాంగ్లాదేశ్, కొరియా, థాయిలాండ్, చైనా, నేపాల్ ఆఖరికి వియత్నం దేశాల బౌద్దమందిరాలు ఉన్నాయి. శ్రావస్థి లో మేము మయన్మార్ మనిస్ట్రీ (Mayanmar Monastery) లో స్టే అయ్యాం .

జేతవనం పక్కనే ప్రపంచ శాంతి సoస్థ చాల విశాలమైన ప్రాంతంలో నిర్వహిస్తున్న 30 అడుగుల బంగారు బుద్ధవిగ్రహం, విపాచన సెంటర్, పెద్ద పగోడా ఉంది. విగ్రహం చూపించారు. పగోడా ఈసారి చూపిస్తామన్నారు. ఎత్తైన పీఠంపై నిలువెత్తు బుద్ధ విగ్రహం శాంతిని తెలియజేస్తున్నట్లుగా ఉంది. దాదాపు గంటసేపు ధ్యానం చేయించారు. పీఠమంతా డిజైన్లతో అందంగా ఉంది.

మాలో ఎవరో ఈ విగ్రహన్ని చూసే తెలంగాణలోని సమతా విగ్రహం తాయారు చేశారన్నారు. అసలు ఈ రోజు ఇక్కడ సెలవట. మేము నిరాశగా కంచే ఇవతల నుండి చూసి రాబోతుండగా బెంగాల్ డీజీపీ, అతని టీం వాళ్లు స్పెషల్ పర్మిమిషన్ తో వెళుతుండగా వారితో మేం కూడా వెళ్ళాము. ఇక్కడున్న వారంతా మహిళలేనట. 99 శాతం బౌద్ధ బిక్షువులేనట. చాలా మర్యాదలు చేశారు. ఆ రాత్రికి అక్కడ ఉంటే భోజనాలు అవి ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ విదేశీ బౌద్ద స్థలాలన్నీ మాలో కొంతమంది సొంతంగా చూశాము. జేతవనం పక్కనే ఉన్న ప్రపంచ శాంతి సంస్థను కూడా నిర్వాహకులైన శివకుమార్ గాని బంతి గాని చూపించలేదు. ఉందని చెప్పను కూడా చెప్పలేదు. పక్కనే ఉంది కదా చూపించవచ్చు కదా అంటే, లిస్టులో లేనివి చూపించం అని చాలా కేర్లెస్ గా సమాధానం చెప్పాడు శివకుమార్. చూపించకపోయినా ఇవి ఉన్నాయి చూడండి అని కూడా చెప్పడు. అసలు ఇతనికి టైం సెన్స్ లేదు. ఎంతసేపు మిగుల్చుకోవాలని చూస్తాడు. ప్రోగ్రామ్ మొత్తం బౌద్ధ సన్యాసి అయినా "బంతి" చేతిలో పెట్టాడు. వీరిద్దరికీ బౌద్ధం కన్నా లాభార్జనే ముఖ్యమనిపించింది. వీరికన్నా విద్య కోసం కృషి చేస్తున్న కొరియన్ పాఠశాల నచ్చింది.

ఈ విదేశీ సంస్థలన్నీ పెద్ద పెద్ద స్థలాలను భక్తి పేరుతో (ఆక్రమించినవేననుకున్నాను) ప్రభుత్వం నుండి తీసుకున్నవే. ఈ విదేశీ సంస్థలు, బౌద్ధ మతము, బుద్ధ విగ్రహాలు, వస్తువులు అమ్మే షాపులు, టూరిజం, బుద్ధిజం లేకపోతే ఇక్కడ ఎలా ఉండేదో అనిపించింది.

22.10. 24న కపిలవస్తు లో అడుగుపెట్టగానే బుద్ధుడు తిరిగిన ప్రాంతాన్ని చూస్తున్నామన్న ఆనందం మా అందరి ముఖాల్లో కనిపించింది. ఎవరికి వారే ముందు ముందు అక్క డున్న శిలాపలకాలను చదవడం, ఫోటోలు దిగడం చేశారు. అక్కడున్న శిలపలకాల, బౌద్ధమత మూలదారాల ప్రకారం కపిలవస్తు, క్రీస్తుపూర్వం ఆరు ఐదు శతాబ్దాల మధ్య శాఖ్యవంశ రాజధాని. బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు పరిపాలించిన ప్రాంతం. సిద్ధార్థ, గౌతముడుగా(బుద్ధుడుగాక ముందు) మొదటి 29 సంవత్సరాలు (ఇల్లు విడిచేటంతవరకు) జీవించినప్రాంతం. ఈ ప్రాంతంలో ఎర్రటి ఇసుక సమృద్ధిగా ఉన్నందున (పచ్చటిప్రాంతం) కపిల వస్తుగా పిలవబడింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉంది.

ఓ చెట్టు కింద బౌద్ధ సన్యాసుల గుంపు ప్రశాంతంగా ధ్యానం (ప్రార్థన) చేస్తున్నారు. ఆహా! అనిపించేటట్లు. వీరంతా శ్రీలంక నుండి వచ్చి కపిలవస్తు స్థూపం దగ్గర ధ్యానం చేస్తున్నారు. వారి దగ్గర మా వారందరూ ఆగిపోయారు.

వీరిని చూడగానే నాకు మాత్రం ప్రభాకరన్ కొడుకు 12 ఏళ్ల వాడు, ఒంటిమీద ఒక నిక్కర్ తో, ఆకలితో నకనకలాడుతూ బిస్కెట్ తింటున్నవాడు. నిర్ధాక్షణ్యంగా కాల్చి చంపిన సింహళ్లీయులు కనిపించి కడుపు మండిపోయింది. శరణం గచ్చామి, బుద్ధం గచ్చామి, ధర్మం గచ్ఛామి అప్పుడు ఏమైంది. తమిళలను వరి కంకుల్లా ఊస కూతకోసి వారి కోరికలను సమూలంగా అణిచివేసి ఓ జాతి హననానికి పూనుకున్న వీరికి ఇక్కడ బౌద్ధ మత ధర్మం కనిపిస్తుందా? అని కడుపు మండిపోయింది.

ఈ ఆరు రోజుల బౌద్ధ యాత్రలో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ల లాగా అంతా బౌద్ధంలోనే, అన్ని అంబేద్కరుడు ఇచ్చాడనే వాగ్ధాటి కనిపిస్తున్నది. దేనిలోనైనా నాయకుడితోపాటు ప్రజల పాత్ర ఉంటుంది.

ఈ ప్రాంతం గురించి బంతి వివరించాడు. కపిలవస్తుకి బుద్ధుడు ఐదు వేలమంది శిష్యులతో మొదటిసారి వచ్చినప్పుడు వారికోసం నిర్మించిన గదులు, బుద్ధుడు నిర్యాణం పొందిన తర్వాత ఆతని హస్తికలు 8 భాగాలలో ఒక భాగాన్ని ఉంచి నిర్మించిన స్థూపము ఉన్నాయి.

బౌద్ధమత స్థూపాలకన్నా శుద్ధోదని కోట, యశోద, రాహుల్ ఉన్న భవనాలు, భవనంలో ఉన్న బావి చూసాం. ఈ ఈ బావినీళ్లు స్పష్టంగా, స్వచ్ఛంగా ఉన్నట్లు కనిపించాయి. బుద్ధుడు స్నానం చేసిన కొలను అని ఒక కొలను చూపించారు. ఇప్పుడు అది ఎర్రటి తామరలతో నిండి ఉంది. ఆ పువ్వుల అందానికి అందరము దాసోహ మై ఇష్టం వచ్చినన్ని ఫోటోలు దిగాము టైం అవుతుందని పిలిచే వరకు.

ఈ భవనాలు, అంటే పడిపోయి పునాదుల వరకు ఉన్న ప్రాంతం. ఇవి కూడా పురాతనమైన కావు. పురావస్తుశాఖవారు తవ్వగా బయల్పడిన ఇటుకలతో (1860 ప్రాంతం లో అలెగ్జాండర్ కన్నింగ్ హమ్) కొన్ని తాళపత్ర గ్రంథాలు మరియు బౌద్ధమత గ్రంథాల ఆధారంగా కొంత ఎత్తుగా నిర్మించిన కట్టడాలే.ఉదా:- పాత కొత్త ఇటుకల కు తేడాలు ఉన్నాయి. కొత్త ఇటుకల్లో స్వస్తిక్ గుర్తు (M అనే అక్షరము) ఇటుక తయారిదారి పేర్లు కనిపిస్తున్నాయి. ఏది ఏమైతేనేమి బుద్ధుడు తిరిగిన ప్రాంతాన్ని కళ్ళారా చూశాం అన్న ఆనందంలో అందరం తేలిపోయాము.

లుంబిని లో కలుద్దాం.

Read More
Next Story