
ఊబర్ క్యాబ్ నడిపే ఈ ‘అమ్మ’ ముగ్గురు పిల్లల ఒంటరి తల్లి
హైదరాబాద్‌లో క్యాబ్ రైడ్ ఒక మహిళా డ్రైవర్ జీవిత కథగా మారింది. ఒంటరి తల్లిగా ముగ్గురు పిల్లల కోసం నందినీ చేస్తున్న పోరాటం స్ఫూర్తినిచ్చింది.
హైదరాబాద్‌లో ఒక రోజు. ఒక సాధారణ క్యాబ్ బుకింగ్. కానీ ఆ ప్రయాణం చివరకు ఒక చిన్న స్ఫూర్తి కథగా మారింది. యూనియన్ బడ్జెట్ చర్చల కోసం ఒక స్టూడియో నుంచి మరో స్టూడియోకు వెళ్లాల్సి వచ్చింది. సురేష్ కోచట్టిల్ ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. ఇద్దరు డ్రైవర్లు బుకింగ్ తీసుకుని రద్దు చేశారు.
మూడో డ్రైవర్ ఆటోమేటిక్‌గా కేటాయించబడింది. మొబైల్ స్క్రీన్‌పై డ్రైవర్ పేరు కనిపించింది. అది మహిళ పేరు. కొద్దిసేపటికి క్యాబ్ వచ్చింది. డ్రైవర్ నిజంగానే ఒక మహిళ. ఆమె పేరు నందినీ. ప్రయాణం మొదలైంది. మాటలు సాగాయి. నందినీ గత ఏడాది నుంచి ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పింది.
ఆమె విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ముగ్గురు పిల్లల తల్లి. ఒంటరిగా జీవితం ముందుకు నడిపిస్తోంది. ప్రతి రోజు స్టీరింగ్ పట్టుకుని నగర వీధుల్లో తిరుగుతూ పిల్లలకు మంచి చదువు ఇవ్వాలనే ఒక్క లక్ష్యంతో కష్టపడుతోంది. ఈ కథ తనను ఆలోచింపజేసిందని కోచట్టిల్ తన పోస్టులో పేర్కొన్నారు. మహిళా సాధికారత అనేది పెద్ద మాటల్లో కాదు, ఇలాంటి నిశ్శబ్ద పోరాటాల్లో కనిపిస్తుందని తెలిపారు.
హైదరాబాద్ ట్రాఫిక్ మధ్య నందినీ లాంటి మహిళలు తమ జీవితాలను తామే నడిపిస్తున్నారు. కొన్ని ప్రయాణాలు గమ్యం చేరుస్తాయి. కొన్ని ప్రయాణాలు కథలను మిగిల్చిపోతాయి.

