ప్రకృతి ప్రశ్నిస్తుంది!
x
ఢిల్లీలో రైతుల ఆందోళన

ప్రకృతి ప్రశ్నిస్తుంది!

రైతులు మళ్లీ ఢిల్లీని చుట్టుముట్టారు. రైతుల ఆందోళనలకు స్పందించి దేశవ్యాప్తంగా కవులు, కళాకారులు కవితలు, కళారూపాలకు ప్రాణం పోస్తున్నారు. అందులో ఇదొకటి..


పేదల సమస్యలే మన దేశ వ్యవసాయ రంగ సంక్షోభంలోని కీలకాంశం. దాన్ని స్వామినాథన్ కమిషన్ ఎత్తి చూపింది. అయినా పాలక వర్గాలు ఈ భూమి సమస్యని వదిలేశాయి. వ్యవసాయంలో పెట్టుబడిదారీ అభివృద్ధి పేరిట సమర్థించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మళ్లీ ఢిల్లీని చుట్టుముట్టారు. రైతుల ఆందోళనలకు స్పందించి దేశవ్యాప్తంగా కవులు, కళాకారులు కవితలు, కళారూపాలకు ప్రాణం పోస్తున్నారు. అందులో ఇదొకటి. కట్టెకోల రాసిన ఈ కవిత చాలా స్పూర్తిదాయకంగా, ఆలోచింపజేసేదిగా ఉంది.

....ప్రకృతి ప్రశ్నిస్తుంది!

(కట్టెకోల చిన్న నరసయ్య)

అధికారానికి అహంకారం అడ్డుపడ్డది

గిట్టుబాటు ధర అమలు చేసేందుకు

పెట్టుబడి కట్టుబాటు తప్పింది

చిత్రం ఏమిటంటే

రోజు అన్నం తింటున్న చేతులే

అన్నదాత చేతులకు బేడీలేస్తున్నయి

సరిహద్దు దేశంలో శత్రువులు కానే కారు

లోకానికి బుక్కెడన్నం పెట్టే వారే

అయినా ఎందుకో వారిపై నిర్బంధం

దేశ రాజధానిలోని

వీధులన్నీ తలలు దించుకున్నయి

వచ్చీపోయే వాహనాలు

ఒక్కసారిగా అవాక్కైపోయాయి

గాలిలో ఎగురుతున్న విమానాలు

రాజ్యం గాలి దుమారాన్ని

ప్రపంచానికి చేరవేస్తున్నయి

భూతల్లిని నమ్ముకున్న వాళ్లు

రాజధాని వీధుల్లో

పాలకులను పదేపదే ప్రశ్నిస్తున్నరు

మట్టిని పిసకాల్సిన చేతులు

పిడికిలెత్తి నినందిస్తున్నయి

నాగేటి సాళ్ళ వెంట నడవాల్సిన కాళ్లు

సిమెంట్ రోడ్లపై కదం తొక్కుతున్నయి

పొలాలను దున్నాల్సిన హలాలు

గళమెత్తి గర్జిస్తున్నయి

పంట సిరులను మోసుకెళ్లాల్సిన ట్రాక్టర్లు

రైతులతో కవాతు చేస్తున్నయి

పంట పొలాల వైపు వెళ్లిన మేఘాలు

అన్నదాతల కోసం ఆరా తీస్తున్నయి

రైతులు ఏమయ్యారని

ఉరుముల మెరుపులు

ప్రకృతిని నిలదీస్తున్నయి

దేశ చరిత్రలోనే విచిత్రమైన పరిస్థితి

సాయం చేసే వ్యవసాయం

దేశం నడిబొడ్డున రోడ్డెక్కింది

ఇప్పుడు రైతులకు పాలకులకు

మధ్యన వారధి స్వామినాథనే

ఆ నాథుడిని నీవే కదా

భారతరత్న పురస్కారంతో గౌరవించింది

రాజ్యాన్నేలే ఓ స్వామీ

నీవు సత్కరించిన స్వామినాథన్ సిఫార్సులనే

అన్నదాతలు అమలు చేయమంటున్నరు

ప్రకృతి ప్రశ్నిస్తుంది రాజ్యం వికృత చేష్టలను

(ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా...)

Read More
Next Story