నెత్తుటి వాక్యం
x
అమ్మా! భయమేస్తుందమ్మా ! Image courtesy: United Nations

నెత్తుటి వాక్యం

ఒక యుద్ధ కవిత: మందరపు హైమవతి


అమ్మా! భయమేస్తుందమ్మా !

పొగ మేఘాలు అలముకొన్న
ఈ కారు నల్లని ఆకాశాన్ని చూస్తుంటే
రాత్రనక పగలనక
ఠారెత్తించే బాంబుల మోతకు
మాటిమాటికి ఉలికి పడుతుంది నా గుండె
ఇదివరకల్లా నీ మెడలో నా మెడవంచి
హాయిగా పడుకునేదాన్ని కదా నిశ్చింతగా
అసలీ యుద్ధం ఎందుకు చేస్తారో
నీకైనా తెలుసా అమ్మా!
అలెగ్జాండర్ అశోకుడినుంచి నేటి అగ్రరాజ్యాధిపతి వరకు యుద్ధం ఒక తీరని పిపాస కురుక్షేత్రం కళింగం వియత్నం ఇరాన్ ఏదైతేనేం
సంగ్రామ భేరీ మోగని దేశం ఎక్కడ?
ప్రపంచంలో ప్రవహించే నదుల కన్నా రక్తనదులే ఎక్కువ
సామ్రాజ్య విస్తరణ కోసమో
చమురు నిక్షేపాల కోసమో ఆధిపత్యం కోసమో అహంకార తృప్తి కోసమో నిధుల కోసమో విరామచిహ్నం లేని యుధ్ధం

పావురం పావురం పై కాలు దువ్వదు
సింహం సింహంపై పంజా విసరదు
లేడి లేడిపై కొమ్ము విసరదు
మరెందుకమ్మా! అన్నీ తెలిసిన మనిషి తోటిమనిషిపై ఆగ్రహం కత్తులు ఝళిపిస్తాడు
చూస్తుండగానే కన్నకొడుకు కన్నుమూసిన విషాదం
క్షిపణుల వర్షానికి బలైన కట్టుకున్న మగడు
చెట్టుకొకరు పుట్టకొకరు
చెల్లాచెదరై పోగా
స్మశాన పర్వంలో ఇక చివరికి మిగిలేది ఏది ?
యుద్ధం పుస్తకానికి
ప్రథమాధ్యాయమే కానీ చివరి అధ్యాయం చిరునామా తెలియదు

యుద్ధానికి కూడా ఓ నీతి
ఆ నీతిని విస్మరించి
బడులు గుడులు మసీదుల పై ఆసుపత్రులపై దాడులు
ప్రాణానికి రక్షణ ఎక్కడ

కాలి కింద నేల ఎప్పుడు కదులుతుందో
ఏ బాంబు ఎప్పుడు మీద పడుతుందో
ఏ ప్రాణ పావురం
ఎప్పుడు నెత్తుటి వాక్యంగా మారుతుందో
ఈ పీడ కలల రాత్రి
ఎప్పుడు తెల్లవారుతుందో
నువ్వైనా చెప్పమ్మా
నీకు తెలిస్తే!



Read More
Next Story