హరప్పాలో సహాయ సహకారాల కొత్త శకం
ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 15. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి
“మహారుద్ర మహారాజా..మీ విజ్ఞానం మన ప్రజలను ఐక్యం చేసింది,” కృతజ్ఞత ఉట్టిపడే స్వరంతో అన్నాడు ఇంద్రసేనుడు. “ఆర్యులమైన మేము మీ వివేకం, అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి వుంది.”
“ సహాయ సహకారాల కొత్త శకం ఇది,” అని నాగశౌర్య ఆశావాదం వ్యక్తం చేశాడు. “ కలిసికట్టుగా మనం మానవసంబంధాలకు అత్యంత గౌరవమిచ్చే ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించగలం.”
“ నిజమే,” అన్నాడు ఇంద్రసేనుడు. “మన మధ్య విభేదాలకు అతీతంగా దృష్టి పెట్టి మనుషులుగా మన వాస్తవ సామర్థ్యాన్ని నిరూపించిన శక్తి మనది.”
“మనం ఒకరి నుంచి మరొకరం చాలా నేర్చుకోవాల్సి వుంది..” అన్నాడు మహారుద్ర మహారాజు. “మన ఐక్యత మరింత బలోపేతం అయేలా మన భావాల, సాంప్రదాయాల వినిమయం కొనసాగిద్దాం..”
“ ఒప్పుకుంటున్నాను, “ అన్నాడు ఇంద్రసేనుడు.” ఈ సహాయ సహకారాల కొత్త శకం లోకి మనల్ని ఒక్క తాటి పైకి తెచ్చిన రాముడి కథ ప్రాశస్త్యాన్ని మనం విస్మరించకూడదు.”
“ఔను సుమా,” అన్నాడు నాగశౌర్య. “రాముడి వారసత్వం ఎల్లకాలం నిలిచి వుంటుంది ; మన ఉమ్మడి సాంస్కృతిక పరంపరని , ప్రతికూలతల నడుమ సైతం ఒక్కటి కాగలిగిన మన సత్తాని అది గుర్తుకి తెస్తుంటుంది”.
ఒకరోజు ఇంద్రసేనుడు ఒక విషయం చెప్పదలిచి మహారుద్ర రాజు వద్దకు వచ్చాడు. “మహారాజా, నాది తొందరపాటు కాదనుకుంటాను, కానీ, నాదొక ఆలోచన..అది మన ప్రజలకు గొప్ప మేలు చేసేదని నా నమ్మకం.”
మహారుద్ర సాలోచనగా చూశాడు. “ ఏమిటది, చెప్పు ఇంద్రసేనా ?”
“ మన ప్రజల సంక్షేమం కోసం, భావి యుద్ధాల్లో మన విజయం కోసం కూడా..మనం ఒక యాగం చేస్తే బాగుంటుందని నా ఆలోచన..” చెప్పాడు ఇంద్రసేనుడు.
అది విని సాలోచనగా భ్రుకుటి ముడిచాడు మహారుద్ర. ఆ సలహాకి ఇంద్రసేనుడికి కృతజ్ఞత చెప్పిఆ విషయమై తప్పక ఆలోచిస్తానని మాట ఇచ్చాడు.
కొన్ని వారాలు గడిచాయి, మహారుద్ర ప్రతిస్పందన కోసం ఇంద్రసేనుడు ఓపికగా ఎదురు చూశాడు. తుదకు, మరోసారి మాట్లాడాలని మహారాజు అతనికి కబురు పంపాడు.
“ఇంద్రసేనా, నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచించాను.. యాగం చేయడానికి సమ్మతించాలని నిర్ణయించాను..” అన్నాడు మహారుద్ర. అతని మదిలో చాలా ఆలోచనలు సాగినాయి. “ యాగం మన ప్రజల నడుమ మైత్రీ బంధాన్నిమరింత బలోపేతం చేయగలదు. జరగ బోయే యుద్ధాల్లో ఆర్యులు మనకి విజయం అందిస్తారు.”
ఇంద్రసేనుడి ముఖం ఆనందంతో వెలిగింది. “ధన్యవాదాలు మహారాజా ! అందుకు వెంటనే ఏర్పాట్లు జరిగేలా చూస్తాను.”
ఇంద్రసేనుడి పర్యవేక్షణలో యాగానికి కావాల్సిన ఏర్పాట్లు చకచకా సాగినాయి. ఆ నాలుగైదు రోజులు మహారుద్ర రకరకాల ఆలోచనలతో క్రతువు కోసం సంసిద్దుడైనాడు.
యాగం రోజు సమీపించింది, నగరమంతటా ఆనందోత్సాహాలు ఉరకలు వేశాయి. ఆ క్రతువు విజయాన్ని, వైభవాన్ని తెచ్చి పెడుతుందని ప్రజలు విని వున్నారు, అందుకని వారు ఆత్రుతగా ఎదురు చూశారు.
తుదకు ఆ రోజు రానే వచ్చింది, అన్ని జీవన రంగాల ప్రజలు నగర కూడలి వద్ద గుమి గూడారు. చుట్టూ పూజారులు, ఇతర రాజోద్యోగులతో రాజు మహారుద్ర, ఇంద్రసేనుడు ముందు వరుసలో నిలబడ్డారు.
భారీ ఏర్పాట్లతో,శాస్త్రోక్త పద్ధతిలో యాగం అట్టహాసంగా నిర్వహించబడింది. ఒక పెద్ద బలిపీఠాన్నినిర్మించి పూలు, అగరొత్తులు, పవిత్ర చిహ్నాలతో అలంకరించారు.
రాజు మహారుద్ర, ఇంద్రసేనుడు, ఆర్య పూజారులు తమతమ సాంప్రదాయిక దుస్తులు ధరించి జంధ్యాలు వేసుకున్నారు, తలలపై రత్నాలు పొదిగిన కిరీటాలు పెట్టుకున్నారు.
నగరం మీద సూర్యుడు ఉదయిస్తుండగా పవిత్ర మంత్రోచ్చాటనతో, హోమాగ్ని ప్రజ్వలనంతో యాగం ప్రారంభమైంది. లయబద్ధంగా హెచ్చే, తగ్గే స్వరాలతో ఆర్య పూజారులు మంత్రోచ్చాటనకి నేతృత్వం వహించారు :
“అగ్ని మిమిలే పురోహితం..
యజ్ఞస్య దేవా రిత్విజం..
హోత్రం రత్న ధేతం..
(దేవ పూజారి, బలి దేవత, హవిస్సు స్వీకర్త అయిన అగ్ని..)”
“విశ్వామిత్ర ఆయుష్ తే...
అగ్ని శ్రీతే కురు ప్రచేతః...
విశ్వ దేవా ఆస్య విశితి..
(విశ్వామిత్రుడు నీకు దీర్ఘాయుష్షు ప్రసాదించు గాక..అగ్ని నీ బుద్ధిని శుద్ధ పరచు గాక..సకల దేవతలు ఈ బలిలో నివసింతురు గాక..)”
నెయ్యి, ధాన్యం, సుగంధ ఓషధి ద్రవ్యాలను రాజు మహారుద్ర, పూజారులు అగ్నిలోకి హవిస్సుని వదిలారు, మంటల్లో కాలిన ద్రవ్యాలు తీయని పరిమళాన్నివెదజల్లాయి.
నిస్వార్థ విజ్ఞాన సముపార్జనకి, అహం త్యజించడానికి సంకేతంగా బలిపశువుల్ని వధిస్తుండగా యాగం కొనసాగింది. పూజారులు స్తోత్రాలు చదివారు, ప్రార్థనాగీతాలు పాడారు ; బలి వేదిక చుట్టూ గుమిగూడిన ప్రజలు విభ్రమంతో నోరెళ్ళబెట్టి జరిగే తంతుని భక్తీ ప్రపత్తులతో వీక్షించారు.
యాగం తుది ఘట్టానికి చేరుతుండగా, పవిత్ర జలాలతో నిండిన బంగారు పాత్రలోంచి రాజు మహారుద్ర, ఇంద్రసేనుడు సంయుక్తంగా యజ్ఞగుండం లోతుల్లోకి చివరి హవిస్సు వదిలారు.
‘ఓం శాంతి, శాంతి, శాంతి..ఓం..’ పూజారులు ఉచ్చరిస్తుండగా ప్రజలు కేరింతలతో చప్పట్లు కొట్టారు; తమ ఐక్యత, సహకారం దేవుళ్ళ ఆశీర్వాద ముద్ర పొందాయని వాళ్ళు విశ్వసించారు.
తత్ఫలితంగా, ఇరు సమాజాల నడుమ ఒక చైతన్యశీలమైన సాంస్కృతిక వినిమయం వర్ధిల్లింది. తమతమ విజ్ఞానాలను, ఆలోచనలను సమ్మిళితం చేస్తూ హరప్పనులు, ఆర్యులు కొత్త గ్రంథాల రచనలో సహశ్రమించారు. హరప్పన్ కళాకారులు, ఆర్యవృత్తి నిపుణులు కలిసి పనిచేసి ఉభయ సంస్కృతుల విశిష్టతని ప్రతిబింబించే కళాకృతులు రూపొందించారు.
కానీ, ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటుండగా, కాలం కెరటాలు అనూహ్యమైన దిశ వేపు మలుపు తిరుగుతాయని సూచించే సన్నని సణుగుడు ఆ నోటా ఈ నోటా వినవచ్చింది. హరప్పనులు వర్తమానంలో జీవించారు, మున్ముందు వారి జీవితం తల్లకిందులవుతుందన్నసంగతి వారికి తెలియదు.