మాట్లాడు, డిసెంబర్!
x

మాట్లాడు, డిసెంబర్!

గాజా కోసం గీతాంజలి న్యూ ఇయర్ కవిత




డిసెంబర్, వెళ్ళిపోతున్నావు సరే...కానీ ...

గాజా గాయం లా సలుపుతున్నావు !

అందరిలా నా డిసెంబర్ నీకు అల్విదా చెప్పలేను !

ముందు నాకో విషయం చెప్పు ...

డిసెంబర్ నెల ఏమైనా యుద్ధం ముగియబోతున్నదా ?

సమాధుల్లోంచి పిల్లల శవాలు ప్రాణాలు పోసుకుని ...

అమ్మల వొళ్ళో గారాలు పోతూ దూరిపోతారా?

కనీసం పుస్తకాలు పట్టుకొని బడికి వెళతారా పిల్లలు?

గాజా వీధుల్లో అడుక్కోకుండా..దాతల బండ్ల వెనకాల

బిక్షా పాత్రలతో పరిగెత్తకుండా...

పొయ్యి మీద అమ్మ కాల్చిన రొట్టె తింటారా?

శిథిలాల్లో తెగిపడిన తమ వాళ్ల రక్త శిక్త దేహపు తునకలు కాకుండా

కళ కళ లాడే సజీవమైన మనుషుల్ని చూస్తారా?

చెప్పు, డిసెంబర్?

........

పిల్లలు ఆసుపత్రుల్లో వొళ్ళంతా సూదులు గుచ్చిన ...

కాలి పోయి బొబ్బలెక్కివిల విలల్లాడుతూ కాకుండా...

ఇంట్లో వెచ్చటి రజాయి కింద నొప్పి లేకుండా నిద్ర పోతారా?

పిల్లలు నిద్రలో బాంబుల శబ్దానికి కాకుండా

కౌగలించుకున్న అమ్మల హృదయ స్పందన వింటూ లేస్తారా?

పిల్లల ఆకాశంలో యుధ్ధ విమానాలు కాకుండా

చందమామలు,నక్షత్రాలు మాత్రమే ఉంటాయా?

పిల్లలు ప్రాణాలను కాపాడుకోవడం కోసం భయంతో ఏడుస్తూ కాకుండా ...

పార్కుల్లో ఆడుకోవడం కోసం నవ్వుతూ త్రుళ్ళుతూ పరిగెడతారా?

పిల్లలు కొన ఊపిరితో శిథిలాల మధ్య కాకుండా

నాన్న కౌగిట్లో భద్రంగా ఉంటారా...చెప్పు డిసెంబర్?

గాజాలో పిల్లలు ఏడుస్తూ,నీరసంగా,ఆకలితో,

చిరిగిన బట్టలతో వలసలు పోకుండా

తమ ఇళ్ళల్లోనే సురక్షితంగా ఉంటారా..?

చెప్పు డిసెంబర్...

లోకమంతా

కొత్త సంవత్సరపు శుభాకాంక్షల పండుగ చేసుకుంటున్న ఈ క్షణం

గాజాలో ఎన్ని బాంబులు పేలాయో..

ఎంతమంది ఊపిరిపోయిందో కదా..

చెప్పు డిసెంబర్..గాజాలో ఏం చేయబోతావు?

పాత హత్యలు,మారణ కాండలు,

ఆకలి చావులు బాంబులవర్షాలు,వరదలు,వలసలు..

దహించిపడేసే అగ్ని కీలలు

శవాల గుట్టల మధ్య శత్రువుల విజయోత్సవ ఉన్మాద నృత్యాలు ..పాటలు

మరోపక్క పిల్లల కోసం తల్లులు,

అమ్మల కోసం పిల్లలు వెతుకులాటలు, గొంతులు చిట్లే రోదనలు..

వీధుల్లో వణుకుతున్న రక్తసిక్త దేహాలు

ఇవేవీ లేకుండా చెప్పు, డిసెంబర్...

అందమైన గాజాలో ఒక మామూలు వెచ్చని ఉదయాలని...

చల్లని రాత్రుళ్ళని.. పూలు పూసి నవ్వే తోటలను..

కేరింతలతో బడికి వెళ్ళే పిల్లల వీధులని...

సాయంత్రపు నమాజు అజాతో పులకరించి పోయే మస్జిద్ గల్లీలను..

అమ్మల వంటలతో ఘుమాయించిపోయే వంటిళ్లను?

చెప్పు, డిసెంబర్…

మాట్లాడు డిసెంబర్ …

ఈ గాజాకి వాదా చేయగలవా చెప్పు ?

నిశ్శబ్దంగా వెళ్లిపోవడం కాదు...

వాదా చేసి వెళ్ళు .గాయం…గాయం అయిన ..

శవాలు తిరిగే శ్మశాన గాజాను కాదు!

అందమైన..సజీవమైన మనుషులు పూలలా వికసించిన గాజాని!

సౌందర్య భరితమైన గజల్ లాంటి గాజాని...


Read More
Next Story