
ఉండీ,లేనట్లు అతడూ,ఆమె!
కొత్త సంవత్సరపు ప్రేమ కవిత: గీతాంజలి
నది చంద్రుణ్ణి తప్పించుకోవడానికి
పారిపోతూనే ఉంటుంది.
చంద్రుడెక్కడ వదులుతాడు?
నదికి వెన్నెల మధువును తాపి, మైకంలో ముంచి,
నది మీదా, లోపలా తేలుతూ మునకలేస్తూ
నదిని వెంటాడుతూనే ఉంటాడు
ఆఖరికి చంద్రుణ్ణి మరిచిపోవడానికి
నది ఎండి ఎడారవుతుంది
చంద్రుడు నదిలో ఆత్మహత్య చేసుకుంటాడు!
*
అప్పటిదాకా
ఉన్నదేదో ముగుస్తూ ఉన్నప్పుడు అనిపిస్తుంది చూడు!
వేల యుగాలుగా దాగిన లావా
ఏదో ఉడుకుడికి పోతున్నట్లు
సముద్రం ఎండిపోతున్నట్లు
ఎడారి సంద్రమై పోతున్నట్లు!
**
ఆమె అంటూ ఉంటుంది అతనితో,
వర్షమై వస్తాను నీ దగ్గరికి,
ఇంట్లోకెళ్లి దాక్కోకు అని.
అతను లోపలి వర్షాన్ని
మోస్తున్న సంగతి ఆమెకేం తెలుసు?
*
ఆమెను తలుచుకుంటూ
అతనాశ్చర్యపోతూ ఉంటాడు.
ఎలా మిగిలిపోయావిలా నాలో అని అడుగుతాడు!
నువ్వు వినా నాకు వేరే తావు లేదు
అంటుంది ఆమె దీనంగా!
*
వాదా చేసినట్లు
అతడామెకి చందమామని తెంపిచ్చే కాలానికి
ఆకాశమే మాయమైంది!
కానీ ఆమె చంద్రుణ్ణి కాదు
అతడు మాత్రమే కావాలనుకుంది!
*
ఇంతకీ..ఈ ప్రేమ కవితలో,
ఆమె ఉంది,అతను లేడు!
అతను ఉన్నాడు, ఆమె లేదు!
ఇద్దరూ ఒకరికొకరు
ఉండీ లేరు!
Next Story

