NH-167: హైదరాబాద్–గోవా ప్రయాణానికి గేమ్‌చేంజర్
x

NH-167: హైదరాబాద్–గోవా ప్రయాణానికి గేమ్‌చేంజర్

హైదరాబాద్ నుంచి గోవా, మంత్రాలయం వరకు ప్రయాణాన్ని సులభం చేసే NH-167 విస్తరణ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు, రూట్, ప్రభావం.


గోవా వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారు, స్టూడెంట్స్ కూడా కొంచెం లాంగ్ లీవ్స్ దొరికితే గోవా ట్రిప్ ప్లాన్ చేస్తారు. అందులోనూ మంచి ట్రావెల్ థ్రిల్ కోసం చాలా మంది రోడ్ ట్రిప్ అంటారు. ఈ ట్రిప్.. ఊహల్లోనే ఉత్సాహంగా ఉంటుంది. వెళ్లేటప్పుడు మాత్రం ఆ రోడ్ ట్రిప్ ఒక అగ్నిపరీక్షలా, బోరింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉత్సాహాన్ని నీరుగార్చేస్తుంది. ట్రాఫిక్ జామ్‌లు, ఇరుకైన రోడ్లు, గంటల తరబడి స్లోగా సాగే ప్రయాణాలే దీనికి కారణం. కానీ ఆ దారి ఇప్పుడు పూర్తిగా మారబోతోంది. ఆ భయానక ప్రయాణాన్ని సుఖమయం చేసే కీలక మలుపే NH-167 విస్తరణ ప్రణాళిక. ఈ ఎక్స్‌పాన్షన్ ప్లాన్ తెలంగాణలో రహదారి మౌలిక సదుపాయాల మ్యాప్‌ను తిరగరాయే స్థాయికి చేరుకుంది.

హైదరాబాద్-గోవా వెళ్లాలంటే

ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ నుంచి గోవా, రాయచూర్, మంత్రాలయం వెళ్లే వారు జడ్చర్ల–మహబూబ్‌నగర్ మార్గంలో రెండు లేన్ల రహదారిపైనే ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ పెరగడంతో వాహనాల వేగం తగ్గుతోంది. రహదారి సామర్థ్యం పెరగకపోవడంతో భవిష్యత్ అవసరాలను ఈ మార్గం తట్టుకోలేదన్న అంచనాకు అధికారులు వచ్చారు.

ఈ రహదారికి ఎందకు అంత ప్రాధాన్యం

NH-167 దక్షిణ భారతదేశంలో కీలక జాతీయ రహదారుల్లో ఒకటి. ఇది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలను నేరుగా కలుపుతుంది. సుమారు 483 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి పాత రోడ్లను అప్‌గ్రేడ్ చేసి జాతీయ రహదారి ప్రమాణాలకు తీసుకువచ్చిన ఫలితం. NH-67కి సమాంతరంగా సాగుతూ సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలకు ప్రధాన ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేస్తోంది.

NH-167 రూట్ మ్యాప్ ఇలా

ఈ జాతీయ రహదారి NH-167 కర్ణాటకలోని బళ్లారి జిల్లా హగరి దగ్గర ప్రారంభమవుతుంది. అక్కడ NH-67తో అనుసంధానమై ఉంటుంది. అక్కడి నుంచి రాయచూర్ దిశగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అలూర్, ఆదోని, యెమ్మిగనూర్, మంత్రాలయం గుండా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత తెలంగాణలోకి ప్రవేశించి మక్తల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్ మీదుగా సాగి చివరగా సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ముగుస్తుంది. మొత్తం రూట్‌లో తెలంగాణ భాగమే ఎక్కువగా ఉంది.

NH-167 రూట్‌లో తగిలే ప్రధాన ఊర్లు

ఈ హైవే మూడు రాష్ట్రాల్లో అనేక పట్టణాలు, గ్రామాలను కలుపుతుంది.

  • కర్ణాటకలో హగరి నుంచి రాయచూర్ వరకు మార్గం సాగుతుంది.
  • ఆంధ్రప్రదేశ్‌లో అలూర్, ఆదోని, యెమ్మిగనూర్, మంత్రాలయం ఈ రూట్‌లో ఉన్నాయి.
  • తెలంగాణలో మక్తల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ కీలక కేంద్రాలుగా ఉన్నాయి.

ఈ ప్రాంతాలన్నీ వ్యవసాయం, వ్యాపారం, పుణ్యయాత్రలు, ప్రాంతీయ రవాణా పరంగా ప్రాధాన్యం కలిగినవే.

NH-167 విస్తరణ ప్రాజెక్ట్

ప్రయాణికులకు కష్టాలు కలుగుతున్న పరిస్థితుల్లో మహబూబ్‌నగర్ నుంచి గుడెబెల్లూరు వరకు NH-167ను నాలుగు లేన్లుగా విస్తరించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఆమోదం తెలిపింది. విస్తరణ దూరం సుమారు 80 కిలోమీటర్లు. ఈ విస్తరకు అంచనా వేసిన వ్యయం రూ.2,662 కోట్లు. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్–పనాజీ కారిడార్‌లో భాగంగా భారతమాలా పరియోజన కింద చేపడుతున్నారు. పనులు హైబ్రిడ్ అన్యుటీ మోడల్‌లో అమలుకానున్నాయి. ఈ మార్గం తెలంగాణలో మారికల్, మక్తల్ ప్రాంతాలను దాటి కర్ణాటకలోని దేవసుగూరు వరకు సాగుతుంది. అక్కడి నుంచి రాయచూర్ దిశగా కనెక్టివిటీ మెరుగవుతుంది.

ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన పర్యావరణ, అటవీ, రైల్వే అనుమతులు ఇప్పటికే లభించాయి. భూసేకరణ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది. ఈ రహదారి మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 34 గ్రామాల గుండా సాగుతుంది. రహదారి వెడల్పును 30 మీటర్ల నుంచి సుమారు 60 మీటర్లకు పెంచే ప్రణాళిక అమలులో ఉంది.

బైపాస్ రోడ్లు, భవిష్యత్ పనులు

NH-167 విస్తరణలో భాగంగా మహబూబ్‌నగర్, మారికల్, మక్తల్, మాగనూర్ ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు. దీని వల్ల పట్టణాల్లో ట్రాఫిక్ భారం తగ్గుతుంది. దీర్ఘదూర వాహనాలు పట్టణాల వెలుపల నుంచే వెళ్లే అవకాశం కలుగుతుంది. కల్వకుర్తి–కొల్లాపూర్ జంక్షన్ వంటి బాటిల్‌నెక్ ప్రాంతాల్లో జంక్షన్ అభివృద్ధి పనులు కూడా చేపట్టనున్నారు.

నాలుగు లేన్ల రహదారి పూర్తయితే ప్రయాణ వేగం గణనీయంగా పెరుగుతుంది. హైదరాబాద్, వరంగల్ నుంచి గోవా, మంత్రాలయం, రాయచూర్ వెళ్లే సమయం స్పష్టంగా తగ్గుతుంది. ఇంధన వినియోగం తగ్గడంతో ప్రయాణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రహదారి భద్రత ప్రమాణాలు మెరుగుపడతాయి.

ఈ ఊర్లు, ప్రాంతాలకు మేలు?

ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలో మహబూబ్‌నగర్, మక్తల్, మారికల్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్ వంటి పట్టణాలు ప్రత్యక్షంగా లాభపడతాయి. కర్ణాటకలో రాయచూర్ పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఆదోని, యెమ్మిగనూర్, మంత్రాలయం వంటి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది. మూడు రాష్ట్రాల్లో వందల గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది.

NH-167 అభివృద్ధితో లాజిస్టిక్స్ రెవల్యూషన్ వస్తుంది. పెట్రోల్ బంకులు రిటైల్ వ్యాపారాలు, ఫుడ్ ఇండస్ట్రీ కూడా వేగంగా పుంజుకుంటుంది. మహబూబ్‌నగర్, జడ్చర్ల పరిసరాల్లో భూములపై డిమాండ్ పెరిగింది. కనెక్టివిటీ మెరుగుదలతో విద్య, వైద్యం, వాణిజ్య మౌలిక సదుపాయాలు విస్తరిస్తున్నాయి.

మంత్రాలయానికి రూట్ క్లియర్

ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇంతకాలం తెలంగాణ నుంచి మంత్రాలయానికి వెళ్లాలి అనుకునే భక్తులు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉండేది. రెండు లైన్ల రహదారే కావడంతో.. కాస్తంత ట్రాఫిక్ పెరిగినా ప్రయాణ సమయం గంటలు పెరిగేది. కానీ ఇప్పుడు NH-167 ప్రాజెక్ట్ ద్వారా వారి ఇక్కట్లు తప్పుతాయి. భక్తులకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారతాయి. మంత్రాలయానికి వెళ్లే రోడ్డు ప్రయాణం ఇక పరీక్షగా కాకుండా సులభమైన యాత్రగా మారే అవకాశం ఈ ప్రాజెక్ట్ ఇస్తోంది. అదే విధంగా గోవా పర్యాటకానికి వెళ్లే వారికి కూడా ఇదే కీలక రహదారి. ఈ విస్తరణతో భక్తులు, పర్యాటకులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.

NH-167 విస్తరణ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నుంచి గోవా వరకు ప్రయాణ స్వరూపమే మారనుంది. మూడు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ బలపడుతుంది. రవాణా, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు ఇది కొత్త దిశ చూపించనుంది.

Read More
Next Story