దశరథుని యాగానికి కౌసల్యే దక్షిణ
కౌసల్యకు అన్యాయం జరిగిందా? ఆ అన్యాయం ఏమిటి? అదెలా జరిగింది? ఈ అంశాల మీద సాహిత్య విమర్శకుడు కల్లూరి భాస్కరం పరిశీలన
(రామాయణంలో నిరుత్తరకాండ-5)
రామాయణం, బాలకాండలో పదమూడు సర్గలుగా మనం ఎదురుచూస్తున్న కౌసల్య ప్రస్తావన ఎట్టకేలకు ఎక్కడ, ఏ సందర్భంలో వస్తుందనుకుంటున్నారు?
ఇదిగో, ఇక్కడ 14వ సర్గలో, అశ్వమేధయాగసందర్భంలో, 31వ శ్లోకంలో ఇలా వస్తుంది:
కౌసల్యా తం హయం తత్ర పరిచర్య సమంతతః
కృపాణైర్విశశాస ఏనం త్రిభిః పరమయా ముదా
కౌసల్య ఆ అశ్వానికి ప్రదక్షిణం చేసి దానిని మూడు కత్తులతో చంపిందట! ఇదీ కౌసల్య గురించి నేరుగా తొలి పరిచయం.
పుల్లెలవారు మూలంలో ఉన్న ‘పరమయా ముదా’ అనే మాటలకు ‘గొప్పదైన సంతోషంతో’ అని ప్రతిపదార్థంలో అర్థమిచ్చారు కానీ, తాత్పర్యంలో ఆ రెండు మాటలనూ ఎందుకో వదిలేశారు.
ఆపైన, ఈ శ్లోకానికి గోవిందరాజులు తన ‘భూషణ’ వ్యాఖ్యలో ఇచ్చిన వివరణను పుల్లెలవారు పొందుపరిచారు. “యజమాని భార్యలు (యజమాని అనే మాట యజ్ఞం చేసేవాడనే అర్థంలో పుట్టి, క్రమంగా ఇంటి పెద్దను సూచించే మాటగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది) బంగారు సూదులతో అశ్వాన్ని గుచ్చాలని శాస్త్రం చెబుతోంది కనుక; కౌసల్యే కాక, సుమిత్రా కైకేయిలు కూడా అంతకుముందే చంపిన అశ్వాన్ని బంగారు సూదులతో గుచ్చా”రని ఆ వివరణ చెబుతోంది.
అయితే, అప్పటికే ఆ అశ్వాన్ని చంపినట్టు మూలంలో ఉందా అంటే, లేదు. పై శ్లోకానికి ముందటి శ్లోకం(30వ శ్లోకం)- “మూడు వందల పశువులను, దశరథుని ఉత్తమాశ్వాన్ని యూపస్తంభాలకు కట్టా”రని మాత్రమే చెబుతోంది(పశూనాం త్రిశతం తత్ర యూపేషు నియతం తదా/అశ్వరత్నోత్తమం తస్య రాజ్ఞో దశరథస్యచ).
కనుక, మూలపాఠం ప్రకారం కౌసల్య మూడు కత్తులతో పొడిచి చంపినది, బతికి ఉన్న అశ్వాన్నే!
మూలంలోని ఆ వివరాన్ని గోవిందరాజుల వ్యాఖ్య సవరించడమే కాక; ‘కౌసల్యతోపాటు సుమిత్ర, కైకేయిలు కూడా బంగారు సూదులతో ఆ అశ్వాన్ని గుచ్చా’రని- కొత్తగా మరో వివరాన్ని చేర్చింది. ఇలాంటి మూలాతిక్రమణ, లేదా మూలాన్నే తిరగరాయడం, లేదా సవరించడం, లేదా మూలపాఠాన్నే పూర్తిగా మార్చివేయడం సాంప్రదాయికవ్యాఖ్యానాలలో చాలా పరిపాటిగా కనిపిస్తుంది. చదలవాడ సుందరరామశాస్త్రులవారి ఆంధ్రతాత్పర్యసహితంగా వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ 1954లో ప్రచురించిన బాలకాండలో, ‘కౌసల్యా తం హయం తత్ర..’ అన్న పై శ్లోకానికి ఇచ్చిన తాత్పర్యమే చూడండి. అది మూలశ్లోకాన్ని యథాతథంగా ఇస్తూనే, దానికి పూర్తి వ్యతిరేకార్థాన్ని ఎలాంటి సంకోచం లేకుండా ఇలా ఇస్తోంది: “దశరథుని భార్యలు ఆ గుర్రమునకు ప్రదక్షిణము చేసి మిక్కిలి సంతోషంబున బంగారపు సూదులచే కత్తి వాట్లు వేసిరి”.
నేటి విద్యాసంబంధమైన(అకడమిక్) ప్రమాణాలతో చూసినప్పుడు ఇలాంటి వ్యాఖ్యానపద్ధతి ఆమోదయోగ్యమైన నమూనా కాదని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఆధునికులే కాక; విద్యాసంబంధంగా ఆధునిక క్రమశిక్షణలో పనిచేసే విశ్వవిద్యాలయాలలో ఆచార్యపదవిని నిర్వహించినవారు. అలాంటివారు కూడా పైన చెప్పిన మూలాతిక్రమణకు మౌనసమ్మతి తెలపడం ఆశ్చర్యంగానే ఉంటుంది. అంతేకాదు, మూలంలో చెప్పిన కొన్ని వివరాలను వదలివేయడం, లేనివి చేర్చడం వారి బాలానందినీవ్యాఖ్యలో కూడా కనిపిస్తుంది.
గోవిందరాజులు తదితర వ్యాఖ్యాతల విషయంలో ఒక సమర్థనకు అవకాశం లేకపోలేదు. ఎలాగంటే, వాల్మీకి రామాయణానికే దేశవ్యాప్తంగా భిన్నభిన్న ప్రతులు వ్యాప్తిలో ఉన్నాయి. వ్యాఖ్యాతలు వాటిలో ఏదో ఒకదానిని అనుసరించి ఉండవచ్చు. అయితే, ఆ సమాచారాన్ని ఇవ్వడం కూడా వ్యాఖ్యాతల బాధ్యతే.
ఆ తర్వాతి శ్లోకం(32) కౌసల్య గురించి ఇలా చెబుతోంది:
పతత్రిణా తదా సార్థం సుస్థితేన చ చేతసా
అవసద్రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా
కౌసల్య స్థిరమైన చిత్తంతో, ధర్మాచరణపట్ల శ్రద్ధతో గుర్రంతోపాటు ఒక రాత్రి నివసించిందని- దీనికి పుల్లెలవారి ప్రతిపదార్థవివరణ. తాత్పర్యంలో మాత్రం, “కౌసల్య...ఒక రాత్రి ఆ ఆశ్వసమీపంలో(‘అశ్వంతోపాటు’-అని మూలం)శాస్త్రోక్త రీతిని నివసించి”నట్టు చెప్పారు. ‘శాస్త్రోక్తరీతిని...’ అనే మాట మూలంలో లేదు. పట్టమహిషి అశ్వంపక్కన శయనించి దుప్పటి కప్పుకుని లైంగికక్రియను అభినయిస్తుందనీ, ఇది సౌభాగ్యతంత్రాల(fertility rites)లో భాగమనే వివరణ కూడా ప్రచారంలో ఉంది. బహుశా అశ్వమేధానికీ, పుత్రసంతానానికీ ఉన్న సంబంధం ఇదే కావచ్చు. అయితే, పుల్లెలవారు వాటి జోలికి వెళ్లలేదు.
అదలా ఉంచితే, ఇన్ని సర్గలూ, ఇన్ని వందల శ్లోకాల తర్వాత ఇప్పటికైనా కౌసల్య ప్రస్తావన నేరుగా వచ్చిందనుకుంటే; ఇంతలోనే ఆమెను దశరథుడు హోతకు దక్షిణగా ఇచ్చేయబోతున్నాడు. ఆ తర్వాతి శ్లోకం(33) అదే చెబుతుంది:
హోతాధ్వర్యు స్తథోద్గాతా హస్తేన సమయోజయన్
మహిష్యా పరివృత్త్యాచ వావాతాం చ తథాపరాం
హోత, అధ్వర్యుడు, ఉద్గాత అనే ఋత్విక్కులు వరుసగా పట్టమహిషిని, పరివృత్తిని, వావాతను గ్రహించారని పుల్లెలవారు ఈ శ్లోకానికి ఇచ్చిన తాత్పర్యం. ఇందులో కూడా మూలంలో ఉన్న ‘హస్తేన సమయోజయన్’ అనే మాటలకు ‘హస్తముతో కూర్చిరి’ అని ప్రతిపదార్థంలో అర్థమిచ్చారు కానీ, తాత్పర్యంలో మాత్రం ‘హస్తముతో’ అనే మాటను వదిలేశారు. స్పష్టత నివ్వాల్సిన తాత్పర్యంలోనే ఆ మేరకు అస్పష్టత అడుగుపెట్టింది. దశరథునికి చెందిన ముగ్గురు స్త్రీలను ఋత్విక్కులు ముగ్గురూ తమ చేతులతో అందుకున్నారని చెప్పడం ఇక్కడ సందర్భోచితంగా ఉంటుంది. అంటే, ఒకవిధంగా అది పాణిగ్రహణమే.
యజ్ఞంలో ఋగ్వేద సంబంధమైన తంతు నడిపే ఋత్విక్కును ‘హోత’ అనీ, యజుర్వేద సంబంధమైన తంతు నడిపే ఋత్విక్కును ‘అధ్వర్యు’డనీ, సామవేద సంబంధమైన తంతు నడిపే ఋత్విక్కును ‘ఉద్గాత’ అనీ అంటారని నిఘంటు వివరణ. ఇక, పుల్లెలవారు పై శ్లోకానికి ఇచ్చిన వివరణ ప్రకారం, ‘మహిషి’ అంటే రాజుతోపాటు రాజ్యాభిషేకం పొందిన భార్య, పట్టమహిషి; ప్రస్తుతసందర్భంలో కౌసల్య. ‘పరివృత్తి’ అంటే రాజుగారి ఉపేక్షితభార్య; అంటే అనాదరణకు గురైన భార్య అని నిఘంటు ప్రకారం అర్థం చెప్పుకోవాలి. వేరే అర్థం ఉన్నట్టు పుల్లెలవారు చెప్పలేదు. ‘వావాత’ అంటే భోగినీస్త్రీ (ఉంపుడుగత్తె).
అంటే ఏమిటన్నమాట! దశరథుడు సాక్షాత్తూ తన పట్టమహిషిని, అవతారపురుషుడైన రాముడికి కాబోయే తల్లిని, రాజమాతను హోతకు దక్షిణగా ఇచ్చేశాడు! ఆ ఇవ్వడం కూడా తను అనాదరించే భార్యతోనూ, తన భోగస్త్రీతోనూ కలిపి! ఈ సందర్భంలో పుల్లెలవారు ఉదహరించిన శాస్త్రవిధి ప్రకారం, రాజుకు చెందిన ‘పాలాకలి’ అనే నాలుగో స్త్రీని కూడా ‘బ్రహ్మ’ అనే మరో ఋత్విక్కుకు దక్షిణగా ఇవ్వాలి. పాలాకలి అంటే రాజుగారికి పాత్రప్రద, అంటే పాత్రను చేతికిచ్చేదనుకోవాలి. పై శ్లోకంలో బ్రహ్మ అనే ఋత్విక్కునూ, పాలాకలినీ చెప్పకపోయినా చెప్పినట్టే గ్రహించాలన్న గోవిందరాజుల వివరణను కూడా పుల్లెలవారు ఉటంకించారు.
తాము దక్షిణగా తీసుకున్న స్త్రీలను, వారికి బదులుగా మరొక వస్తువేదైనా తీసుకుని ఋత్విక్కులు తిరిగి యజమానికి ఇచ్చేస్తారని కూడా గోవిందరాజుల వివరణ చెబుతోంది. అయితే, మూలంలో మాత్రం అలా తిరిగి ఇచ్చినట్టు లేదు. ఆ తర్వాత జరిగినదానినిబట్టి అదే జరిగి ఉంటుందని మనం ఊహించుకోవాలి. యాగం పూర్తైన తర్వాత దశరథుడు తన రాజ్యంలో తూర్పుదిక్కున ఉన్న దేశాన్ని హోతకు, పశ్చిమదేశాన్ని అధ్వర్యునికీ, దక్షిణదేశాన్ని బ్రహ్మకు, ఉత్తరదేశాన్ని ఉద్గాతకు దానం చేసేశాడు. అప్పుడు వారు, “ఎప్పుడూ స్వాధ్యాయంలోనూ, అధ్యయనంలోనూ(నిఘంటువు ప్రకారం, ఈ రెండు మాటలకూ స్థూలంగా వేదాధ్యయనమని అర్థం)ఉండే మాకు భూమితో పనిలేదు. దానికి బదులుగా శ్రేష్ఠమైన మాణిక్యాన్ని కానీ, బంగారాన్ని కానీ, గోవులను కానీ,,,ఏది లభ్యమైతే దానిని ఇ”మ్మని అడిగారు. అప్పుడు దశరథుడు వాళ్ళకు పదిలక్షల గోవులను, వందకోట్ల బంగారు నాణేలను, నాలుగు వందల కోట్ల వెండినాణేలను ఇచ్చాడు. వారు ఆ ధనం మొత్తాన్ని ఋష్యశృంగునికీ, వసిష్ఠుడికీ ఇచ్చి, ఆ తర్వాత (వారి ఆమోదంతో) అందరూ న్యాయంగా పంచుకున్నారు.
కౌసల్యతో సహా ఆ ముగ్గురినీ ఇలాగే ఋత్విక్కులు యజమానికి తిరిగి ఇచ్చివేసే ఉండచ్చు. కానీ వారు దక్షిణగా, లేదా దానంగా ఇవ్వడానికి పనికొచ్చే ‘వస్తువులు’గా మారడమే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం. అది వారి అస్వతంత్రతనే కాదు; వారున్న వ్యవస్థాస్వరూపాన్ని, దాని వెనుక ఉన్న భావజాలాన్ని కూడా చెబుతుంది.
ఈ సందర్భంలో రాంభట్ల కృష్ణమూర్తి గారు తన ‘సొంతకథ’లో చెప్పిన కొన్ని ఆసక్తికరవిషయాలను ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుంది. ‘రుణానుబంధరూపేణ పశుపత్నిసుతాలయా’ అనే నానుడిని మనం వింటూ ఉంటాం. పశువు, పత్ని, కొడుకులు, ఇల్లు అనే నాలుగూ గతజన్మరుణానుబంధంగా సంక్రమిస్తాయనే వేదాంతార్థంలో దీనిని అన్వయించడం పరిపాటి. కానీ రాంభట్లగారు ధర్మశాస్త్రాలను అనుసరించి చెప్పిన ప్రకారం, ఈ నాలుగూ అప్పు తీసుకున్నప్పుడు హామీగా ఉంచడానికి అర్హమైనవి మాత్రమే. ఎందుకంటే, ఈ నాలుగూ యజమానికి వ్యక్తిగత ఆస్తి; ఈ ఆస్తిని అమ్మవచ్చు, తాకట్టు పెట్టవచ్చు.
పూర్వమీమాంసాశాస్త్రంలో గురు-శిష్యుల మధ్య జరిగిన ఒక సంభాషణను రాంభట్ల ఉటంకించారు. రాజు యజ్ఞం చేసినప్పుడు ఏయే దానాలివ్వవచ్చునని శిష్యుడు గురువును అడుగుతాడు. అప్పుడు గురువు పైన చెప్పిన నాలుగింటితోపాటు ‘ఆస్తరణా’లను కూడా చేర్చి చెబుతాడు. ఆస్తరణాలంటే ఫర్నిచర్(గృహోపకరణసామగ్రి). అప్పుడు శిష్యుడు భూముల సంగతేమిటని అడుగుతాడు. భూమి రాజుగారి వ్యక్తిగత ఆస్తి కాదుకనుక దానిని దానం చేసే హక్కు రాజుకు లేదని గురువు అంటాడు. ఈ సంగతిని ప్రముఖకమ్యూనిస్టు నాయకుడు శ్రీపాద అమృతడాంగే పార్లమెంటులో కూడా ప్రస్తావించారని రాంభట్ల అంటారు. ఆయన మాటలను మాత్రమే ప్రమాణంగా తీసుకుని ఈ ప్రస్తావన. ఒకవేళ శాస్త్రాలలో ఇందుకు భిన్నంగా ఉన్నట్టు తేలితే సవరించుకోవచ్చు.
మళ్ళీ కౌసల్య దగ్గరకు వద్దాం. పట్టమహిషి, రామాయణకథానాయకుని తల్లి అయిన ఆమెను ఇన్ని సర్గలూ, ఇన్ని వందల శ్లోకాలూ గడిచిన తర్వాత ప్రవేశపెట్టడమే ఒక ఆశ్చర్యమనుకుంటే; అశ్వహంతకురాలిగా ఆమె పరిచయం కావాల్సి రావడం ఇంకో ఆశ్చర్యం; అంతలోనే ఆమెను దక్షిణగానో, లేదా దానంగానో ఇచ్చే వస్తువుగా మార్చివేసి; రాజుగారి ఉపేక్షితపత్ని పక్కనా , భోగస్త్రీ పక్కనా నిలబెట్టి అన్యాక్రాంతం చేయడం అన్నింటినీ మించిన ఆశ్చర్యం!
ఇవి కాక, 14వ సర్గ చివరిలో మరో ఆశ్చర్యం కూడా ఎదురవుతుంది. పుత్రసంతానం కోసమని చెప్పి దాదాపు మూడేళ్లపాటు అన్ని మంతనాలూ జరిపి. అన్ని సన్నాహాలూ చేసి, అంత ఖర్చూ పెట్టి అశ్వమేధయాగం చేసిన దశరథుడు మళ్ళీ మొదటికి వస్తాడు. “ఓ మహామునీ, నా వంశవృద్ధికి హేతువైన కర్మను చేయ”మని ఋష్యశృంగుని అడుగుతాడు(తతోZబ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్తదా/కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత-శ్లో.56)
“ఓ రాజా! అట్లాగే చేయిస్తాను. నీకు వంశోద్ధారకులైన నలుగురు కుమారులు కలుగుతారు” అని ఋష్యశృంగుడు అంటాడు.
ఋష్యశృంగుని గురించిన విషయాలతోపాటు, అతను చేయబోయే కర్మ గురించి తర్వాత...