Why Nations Fail| స్వాతంత్య్రం వచ్చినా దేశాలు బాగుపడవు? ఎందుకు?
2024 ఆర్ధిక శాస్త్ర నోబెల్ బహుమతి పొందిన డేరన్ ఎజమోలు, జేమ్స్ ఎ రాబిన్ సన్ తో కలసి చేసిన గొప్ప పరిశోధన Why Nations Fail పుస్తక పరిచయం
నోబెల్ బహుమతుల ప్రదానం 1901 లోనే ప్రారంభమైనప్పటికీ 1969 నాటికి గాని అర్థశాస్త్ర విభాగాన్ని అవార్డుల జాబితాలో చేర్చలేదు. ఆలస్యంగానే అయినప్పటికీ ఒక్క అర్ధశాస్త్రానికి మాత్రమె హ్యుమానిటీస్ లో నోబెల్ బహుమతి హోదా దక్కడం నిజంగా గర్వించాల్సిన విషయం.
ఇది ఈ శాస్త్రాధ్యయనం పై రోజురోజుకీ పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజేస్తున్నది. ఈ విభాగంలో 1969 సంవత్సరంలో రాగ్నార్ ఫ్రిష్ , జాన్ టింబర్టన్ అనే అర్థశాస్త్ర వేత్తలు మొదట బహుమాన గ్రహితులుగా నిలవగా , 2024 సంవత్సరానికి గాను టర్కీస్ అమెరికన్ అర్థశాస్త్ర వేత్త డేరన్ ఏజమోలు ( Daron Acemoglu ఈ పేరును ఏజమోలు అని పలకాలి) , బ్రిటిష్- అమెరికన్ అర్థశాస్త్ర వేత్త జేమ్స్.ఏ. రాబిన్సన్ మరియు అమెరికన్ అర్థశాస్త్రవేత్త అయిన సైమన్ జాన్సన్ అనే ముగ్గురు విజేతలుగా నిలిచారు.
అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి (Nobel Prize) ప్రారంభమైన గడచిన 54 సంవత్సరాల లో 116 మంది నోబుల్ సాధించగా అందులో ఒక్క అమెరికా నుంచే 71 మంది అర్థశాస్త్రవేత్తలు ఉండడము ఆ దేశంలో అందుబాటులో ఉన్న పరిశోధన వనరులు , ఉన్నత విద్యాసంస్థలు అందించే ప్రోత్సాహము ఎంతటివో అర్థం చేసుకోవచ్చు. నిత్య చలన శీలమైన ఆర్థిక వ్యవస్థలలో చోటు చేసుకుంటున్న మార్పులపై నోబుల్ బహుమతి గ్రహీతలైన అర్థశాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వెలువరిస్తున్న అధ్యయనాలను అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల సిలబస్ ల లో పాఠ్యాంశాలుగా చేర్చి విద్యార్థులను ఉన్నతీకరించవలసిన అవసరాన్ని గుర్తించాల్సిన సందర్భం ఇది.
ముఖ్యంగా మన భారతదేశ ఉన్నత విద్యారంగానికి ఇది ఎక్కువగా వర్తించే అంశం. ఈ సందర్భంగా 2024 సంవత్సరానికి అర్థ శాస్త్రంలో ఎంపికైన నోబెల్ గ్రహీతలు వెలువరించిన పరిశోధనల గ్రంథం " వై నేషన్స్ ఫెయిల్ " (Why Nations Fail) లో గల ముఖ్యంశాలు ఏమిటన్న దానిని సంక్షిప్తంగా తెలియజేసే ప్రయత్నం ఈ వ్యాసం. డేరన్ ఎజమోలు , జేమ్స్.ఏ. రాబిన్సన్ తాము రచించిన " పై నేషన్స్ ఫెయిల్ " అనే పుస్తకానికి సైమన్ జాన్సన్ తో కలిసి 2024 సంవత్సరము అర్ధశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతిని స్వీకరించారు. వివిధ దేశాల సంపదల తులనాత్మక అధ్యయనములో వారు అందించిన సేవలకు ఈ బహుమతి లభించింది.
భిన్న ఆర్థిక వ్యవస్థల విస్తృత అధ్యయనాల ద్వారా అధిక సంపద , అధికారాలను సమీకరించుకోవడంలో ఎందుకు కొన్ని దేశాలు విజయం సాధించాయి మరికొన్ని దేశాలు వైఫల్యం చెందాయి అన్న అంశముపై " వై నేషన్స్ ఫెయిల్ " అనే ఈ గ్రంథము ఒక అంతర్దృష్టిని ఇస్తుంది.
సంస్థాగత అర్థశాస్త్రము , అభివృద్ధి అర్థశాస్త్రము మరియు ఆర్థిక శాస్త్ర చరిత్రను ఉపకరణాలుగా ఉపయోగించుకొని రచయితలు తమ పరిశోధనలు కొనసాగించారు. ఆర్థిక వృద్ధికి సంబంధించిన డేరన్ ఏజమోలు ఏళ్ల పాటు చేసి పరిశోధన , ఆఫ్రికా , లాటిన్ అమెరికా దేశాల ఆర్థిక వ్యవస్థలపై జేమ్స్ రాబిన్షన్ వెలువరించిన పరిశోధన , అధ్యయనాల మిశ్రమమే ఈ " వై నేషన్స్ ఫెయిల్ " గ్రంథం.
డేరన్ ఎజమోలు , జేమ్స్. ఏ. రాబిన్సన్ లు ప్రపంచ దేశాలలో కొన్ని ఆర్థిక వ్యవస్థలు సాధించిన విజయాలు , మరికొన్నింటి వైఫల్యాలపై ప్రభావం చూపించే విభిన్న కారకాలను విశ్లేషిస్తూ భౌగోళిక పరిస్థితులు , వాతావరణం , సంస్కృతి , మతము , జాతి మరియు పాలకుల అజ్ఞానము మొదలైన అంశాలు అభివృద్ధిపై పాక్షిక ప్రభావాన్ని చూపుతాయి తప్ప సంపూర్ణంగా ఒక దేశ ప్రగతిని ప్రభావితము చేసే కారకాలు కావని వాదిస్తారు. గరిష్ట స్థాయి ఆర్థిక శ్రేయస్సును సాధించుటలో భిన్న దేశాలలో చలామణిలో ఉన్న రాజకీయ , ఆర్థిక సంస్థలు పోషించే పాత్ర కీలకమవుతుందని వీరి పరిశోధనలు తేల్చి చెప్పిన సత్యం.
తమ పరిశోధనలకు ముందు అభివృద్ధికి సంబంధించి చలామణిలో ఉన్న విభిన్న వృద్ధి సిద్ధాంతాలను త్రోసి రాజని రచయితలు దేశ ఆర్థిక వృద్ధిలో సంస్థలు పోషించే నిర్ణాయక పాత్రను ముందుకు తెచ్చి చారిత్రిక ఆధారాలతో నిరూపణ చేయడం అభివృద్ధి అర్థశాస్త్ర అధ్యయనాలలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు.
జెఫ్రీ సాక్స్ , జారెన్ డైమండ్ ప్రతిపాదించిన భౌగోళిక సిద్ధాంతం గానీ , అభిజిత్ బెనర్జీ , ఎస్తర్ డఫ్లో (Esther duflo) రూపొందించిన కులీనుల అజ్ఞాన సిద్ధాంతము ( The Theory of the Ignorance of the Elite ) గాని , మాక్స్ వెబర్ (Max Weber) ముందుకు తెచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టుకపై ప్రొటెస్టెంట్ మత ప్రభావము ( protestant Ethic and the Spirit of Capitalism ) లాంటి సాంస్కృతిక సిద్ధాంతాలుగాని ప్రపంచ దేశాల ఆర్థిక అసమానతులకు గల కారణాలను వివరించేవే అయినప్పటికీ అవి ఏవీ సంపూర్ణమైన సిద్ధాంతాలుగా నిలబడజాలవని రచయితలు తమ గ్రంథము ద్వారా నిరూపించిన అంశం.
సమ్మిళిత సంస్థలు ( Inclusive Institutions ) ;
సమ్మిళిత సంస్థలు ఆర్థిక సంపద , ఆర్థిక ప్రగతి రథచక్రానికి ఇరుసు వంటివి సమ్మిళిత ఆర్థిక రాజకీయ సంస్థలని ఈ రచయితల ప్రధాన ప్రతిపాదన. సమ్మిళిత సంస్థలు అభివృద్ధి నిర్ణయాల రూపకల్పనలో ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని మరియు ప్రతిభ సృజన శక్తులపై ప్రోత్సాహకాలకు అవకాశం కల్పిస్తాయి. అంతేకాక ఇవి ప్రజలందరి ఆస్తి హక్కులకు కూడా రక్షణ కల్పిస్తాయి. ఆర్థిక కార్యకలాపాలు అన్నిటిలోనూ పౌరులందరూ భాగస్వాములై లాభాలు సంపాదించుకోవడానికి వీలు కల్పించేవి కూడా ఈ సమ్మిళిత సంస్థలు అని రచయితలు అంటారు. ఆ విధంగా ఆధునిక స్వేచ్ఛా ప్రజాస్వామ్యాలు రూపు దాల్చుటలో ఈ సమ్మిళిత సంస్థలే పునాదులు వేశాయని ఆర్థిక చరిత్ర అధ్యయనం, విస్తృత పరిశోధనల ద్వారా రచయితలు వెల్లడి చేశారు.
తమ సిద్ధాంత నిరూపణకై ఈ రచయితలు అనేక ఆధునిక దేశాలు , సమాజాలనే కాక ప్రస్తుతం ఉనికిలో లేని దేశాలు , సమాజాలలో జరిగిన ఆర్థిక అభివృద్ధిని కూడా విశ్లేషిస్తారు. బ్రిటిష్ సామ్రాజ్యము , అమెరికా , ఫ్రాన్స్ , వెనిస్ రిపబ్లిక్ , రోమన్ రిపబ్లిక్ , పవిత్ర రోమన్ సామ్రాజ్యము , ఆస్ట్రియా- హంగేరీ , రష్యా సామ్రాజ్యము , యూఎస్ఎస్ఆర్ , ఆధునిక రష్యా , స్పెయిన్ , అర్జెంటీనా , వెనుజులా , గ్వాటమాల , కొలంబియా , మెడికో , పెరు , బ్రెజిల్ , వలస పాలనలోని కరేబియన్ ప్రాంతము , మాయ నాగరికత , నటుషియా సంస్కృతి , ఒట్టోమన్ సామ్రాజ్యము , ఆధునిక టర్కీ , జపాన్ , ఉత్తర కొరియా , దక్షిణ కొరియా , మింగు మరియు క్విన్ సామ్రాజ్యాలు , ఆధునిక చైనా , ఇండోనేషియా , ఆస్ట్రేలియా , సోమాలియా , ఆఫ్ఘనిస్తాన్ , అకుం సామ్రాజ్యము , ఆధునిక ఇథియోపియా , దక్షిణాఫ్రికా , జింబాబ్వే , బోట్స్ వాన , కాంగో సామ్రాజ్యము , క్యూబా , ఆధునిక ఘనా , సియెరా లియోన్ , ఆధునిక ఈజిప్టు మరియు ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాల ఆర్థిక నమూనాల తులనాత్మక అధ్యయనాలు ద్వారా డేరన్ ఏజమోలు , జేమ్స్.ఏ. రాబిన్సన్ లు తమ సిద్ధాంత నిరూపణ చేస్తారు.
బహుళ రాజకీయ సంస్థల వలన సమాజంలోని అన్ని వర్గాల వారు దేశ పాలన యంత్రాంగంలో విస్తృత భాగస్వాములు కాగలరు. పైన తెలిపిన ఉదాహరణని గమనించినట్లయితే తన పరిశోధనకు గాను పేటెంట్ పొందిన వ్యక్తి ఇక్కడ తన పేటెంట్ పై లభించే ఆదాయాన్ని కోల్పోవచ్చునేమో గాని ఆ పేటెంట్ పై మెరుగైన పరిశోధన గావించిన ఇతరులంతా ప్రయోజనము పొందుతారు.
అసమ్మిళిత సంస్థలు ( Extractive Institutions )
అసమ్మిళిత సంస్థలు అమలులో గల దేశాలలో ఆర్థిక వృద్ధి క్రమాన్ని చూసినప్పుడు అధిక సంఖ్యాక పౌరులు తమ స్వీయ శ్రమల ద్వారా ఉత్పన్న మయ్యే ఆదాయ పంపిణీ చక్రం నుండి దూరంగా నెట్టి వేయబడి ఉండడాన్ని గమనిస్తాం. ఆల్ఫ సంఖ్యాక వర్గమైన కులీనులను మినహాయిస్తే ఈ సంస్థలో మిగిలిన అన్ని వర్గాల ప్రజలకు సంపద పంపిణీలో సమాన వాటాను ఇవ్వవు. అంతేగాక అధిక సంఖ్యక వర్గాల ఆస్తులు బదలాయింపు చేసుకొని కులీన వర్గాలు లాభం పొందే విధంగా తలుపులు బార్ల తెరిచి ఉంచుతాయి.
సంగ్రహంగా సుస్తిరాభివృద్ధికి సమ్మిళిత ఆర్థిక రాజకీయ సంస్థలు ఆవశ్యం. ఇవి అన్ని వర్గాల ప్రజలను ఆర్థిక రాజకీయ జీవనంలో భాగస్వాములను చేస్తాయి. నవ కల్పనలను , నూతన పరిశోధనలను ప్రోత్సహిస్తూ అందరికీ అవకాశాలను సృష్టిస్తాయి.
రాజకీయసాంకేతిక పరమైన పరిశోధనలు , నవ కల్పనలు ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తాయి. దీనికి భిన్నంగా నియంతృత్వ వ్యవస్థలు మార్పుని అడ్డుకుంటాయి. ఇది ఆర్థిక పతనానికి దారి తీస్తుంది. సంస్థలకు దీర్ఘకాలంలో పాతుకపోయే స్వభావం ఉన్నందున అసమ్మిళిత సంస్థలు చలామణిలో గల దేశాలు తరచూ అవినీతి , పేదరిక వలయములో చిక్కుకుంటాయి. ఎందుకంటే తమ అధికారము తగ్గిపోతుంది అనే భయంతో కులీన వర్గం సంస్కరణలను వ్యతిరేకిస్తారు.
అందుకు భౌగోళిక పరిస్థితులు , సంస్కృతులు ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే కారకాలు అయినప్పటికీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థ విజయము వైఫల్యాలను నిర్ణయించుటలో ఇవి ప్రధాన కారకాల కాలేవని , సమ్మిళిత ఆర్థిక రాజకీయ సంపూర్ణంగా దోహదం చేసే కారకాలు అవుతాయని డేరన్ ఏజమోలు , జేమ్స్ ఏ. రాబిన్సన్ లు తమ " వై నేషన్స్ ఫెయిల్ గ్రంథంలో ” వివరించారు..