అక్టోబర్, నువ్వు ఆత్మల నెలవి!
x
Mexican Mundo festival. Image courtesy: Poet Geethanjali

అక్టోబర్, నువ్వు ఆత్మల నెలవి!

నేటి మేటి కవిత


అక్టోబర్! గాంధీని కన్నావు సరే !

కానీ ఒక్క పైకులపువాడి హింసని మాత్రమే భరించడానికి
ఒక్క చెంపనే కాదు
మొత్తం దేహాన్నే బలి ఇమ్మన్నాడు చూడు!
తన నిగ్రహం పనిచేస్తాయో లేదో
తెలుసుకోవడానికి ఆడపిల్లలని
నగ్నం చేసి పక్కన పడుకోబెట్టుకున్నపుడైనా,
భగత్సింగ్ ఉరిని ఆపగలి గీ దాక్కున్నపుడైనా,
కులాన్నిబట్టి పనులు అన్నప్పుడైనా,
భార్యను కొట్టినప్పుడైనా,
ఓహ్, కనీసం అప్పుడైనా అక్టోబర్!
అప్పుడే, అతనేంటో తెలిసిపోయాకయినా
మళ్ళీ వెనక్కి నీ గర్భంలోకి తీసేసుకోవాల్సింది!
*.
ప్రపంచమంతా
వృద్ధుల దినోత్సవం అంటూ
పండుగ చేస్తున్నావు కానీ అక్టోబర్ నాకిది చెప్పు!
దయలేని పిల్లల దినోత్సవం
జరపకుండా ఏం చేస్తున్నావు?
*
అక్టోబర్ 15,
నువ్వు గర్భాల్లోనే త్రిశూలాలో,
సర్జికల్ కత్తులో పిండాలని చంపుతున్నప్పుడు
గర్భస్థ శిశు మరణాల
జ్ఞాపక దినోత్సవంగా ఉంటావు కదా?
అప్రసవ శిశు హత్యలు ఆపడానికి
పురుషాయుధాల్ని ఎందుకు విరిచి
పడేయలేక పోయావు చెప్పు?
**
ప్రపంచ ప్రమాణాల దినోత్సవం కూడా నీదే!
ప్రేమికులు,అమ్మనాన్నలు,పిల్లలు,
మొత్తానికి మనుషులు
ఒకరికొకరికీ చేసుకున్న బాసల దినాన
బాసలు తప్పినతనపు కన్నీళ్ళు
ఎక్కడ దాచుకోవాలో చెప్పావా కనీసం?
*
ప్రపంచ తపాలా దినాన్ని పండగలా చేస్తావు కానీ,
తను రాయలేని,
ఎన్నటికీ పోస్ట్ చేయలేని ఉత్తరాన్ని
గుండెల్లో మోసుకుంటూ భారంగా వీధుల్లో ,
పాడలేని పాటలా తిరగడం
పాపం ఆ పోస్ట్ మేన్ కి ఎంత కష్టం చెప్పు?
*
అక్టోబర్!
అంతర్జాతీయ కాఫీ సంబరం కూడా నువ్వే చేయాలా?
సూర్యోదయాలలో మొదటి గుక్క కాఫీని
ప్రియురాలి జ్ఞాపకంతో
కన్నీటిమయం చేయడం కూడా నీవంతే కదా?
*
అక్టోబర్,
నీలోని ప్రకృతిని ఎంతగా మార్చేస్తావు ?
ఓక్ , మేపుల్ చెట్ల ఆకులు ఎర్రగా పసుపుగా,
ఆకుపచ్చని నునుపుగా మెరుస్తున్నాయి నీలో!
వేసవంతా విరబూసిన
మల్లె మొక్కల కొమ్మల బెరళ్ళు
మరింత మొర టుగా మారుతున్నాయి.
మల్లెల్ని పూసే వేసవి, చలి కాలంలో
వేడిని ఒంపలేక విఫలమై వెచ్చగా
ఏ రహస్యమైన తోటలోనో,
పొదల్లోని ఎండుటాకుల్లోనో దాక్కుంటుంది.
ఇక నీ చలి కౌగిలింతలని తట్టుకోలేక
వెచ్చని మోహపు దుప్పట్లలో
ప్రేయసీ ప్రియుళ్లు అల్లుకుపోతున్నారు.
చలికి మంచు ముద్దలైన ఇళ్ళు,
వాకిళ్ళల్లో బోన్ ఫైర్ ల వేడిలో
మంచును కాలుస్తున్నాయి!
**
శరదృతువప్పటి ఆకులు
రంగులు మారి రాలిపోయే కాలంలో,
మనుషులు కూడా తమ రంగు రంగుల ముఖాలను
ఊలు మాస్కుల్లో దాచుకుంటున్నారు.
కొత్తగా ప్రేమలో పడే వాళ్లు
రాలే ఆకుల చప్పుళ్లలో కూడా
ప్రేమ రహాస్యాలు వెతుక్కుంటున్నారు.
ఒకరినొకరు మౌనంగా పిలుచుకుంటున్నారు.
*.
ఎక్కడో ధ్వంసమైన మనిషోకడు
స్వెట్టర్ కూడా వేసుకోకుండా తనని తాను
చలికి బలి చేసుకుంటూ,
నిర్లిప్తంగా వెన్నెలచీకట్లో కూర్చుని
వయొలిన్ వాయిస్తూ ఉంటాడు.
వినిపించాలనుకున్న మనుషులు వినేదాకా!
*
దీపాలను మోసుకొచ్చే కార్తీక మాసానినివి నువ్వు!
తెల్లారు ఝామున వెలిగే దీపాలు
చలికి దేహాలు వణుకుతున్నట్లే
చీకటిని వెలిగిస్తాయి.
ఎక్కడనుంచి అంత వెన్నెల కుమ్మరించే
నిండు చంద్రుణ్ణి నీ ఆకాశంలోకి తెచ్చుకుంటావో కానీ,
కార్తీక ఉపవాసాలుండే స్త్రీలందరూ,
పూర్వీకులను మనసులో శపిస్తూ
వెన్నెలని మొదటి ఆకలి గుక్కగా తాగేస్తారు.
*
అక్టోబర్ లో ప్రేమలో పడ్డ ప్రేమికులు,
వణికించే చలి రాత్రులలో చుక్కల్ని చూస్తూ,
రాలే ఆకుల శబ్దాల్ని వింటూ,
ఇక ఎప్పటికీ ఒకరినొకరు చేరుకోలేక
నిస్సహాయంగా దుఃఖాన్ని దాచుకున్న
ప్రేమ సంకేతాలను
ఆత్మైకంగా పంపించుకుంటూ ఉంటారు !
**
చలికాలపు నిప్పుల కుంపటి మీద
కాలే మక్క జొన్న కంకల కమ్మని వాసనలని,
ఉడుకుతున్న యాపిల్ ,గుమ్మడి పండ్ల
బిస్కట్ల సువాసనలను
ఆవిర్లు కక్కే కాఫీ కెటిల్స్ వెదజల్లే పరిమళాలను
ఎంత గమ్మత్తుగా
గాలిలొ నింపి శ్వాసకు మత్తుగా అందిస్తావో కదా?
*
అక్టోబర్, నువ్వొక్క చలి కాలానివే కాదు!
ప్రేమికులను వియోగ దుఃఖంలో దహించేసే
మండే కాలానివి కూడా బహుశా!
మనుషుల మీద, నీ కాలంలో
వికసించే చామంతులు,
పొద్దు తిరుగుడు పూవుల మీద
నీ ప్రేమ, మంచులా శీతలమైందే కాదు!
అత్యంత పరిమళ భరితమైంది కూడా!
ఏ మధువు తాగిస్తావో కానీ
ఆ మత్తులోనే వాళ్ళకి
రాత్రుళ్ళు మైకం కమ్ముతూ ఉంటుంది.
వాళ్ళు ఒకరిలోకి ఒకరు
ప్రేమతో ఇంకిపోతూ ఉంటారు!
వాళ్ళ లోపలికి నువ్వు వాగ్దానం చేసిన కలలు,
రెప్పలు తోసుకొని పోతూ ఉంటాయి!
*
కొన్ని నగరాలు, దేశాలు అంటే ఎంత ప్రేమ నీకు?
పంటలు ఇంటికి నడిచొచ్చే కాలంలో,
వాకిళ్ళ తలుపులకి ధాన్యపు కొమ్మలతో,
పూవులతో అందమైన ఎండుటా కులతో ,
అందంగా మిగల పండిన
సామూహిక గుమ్మడి పండ్ల పండుగలతో*
,రైతుల సంతోషాల కేరింతలతో,పాటలతో,
నృత్యాలతో పంటల దండను చుట్టి ఆహ్వానిస్తావా?
కానీ అక్టోబర్ నువ్వే మరో ప్రాంతంలో,
ఇంత నిర్దయపు వరదని
గర్భంలో దాచుకున్నావని తెలీలేదు!
అరేబియా ఉప్పొంగుతే అందమైన
"మోంథా థాయ్ పుష్పాన్ని" నామకరణం చేసి
లోకం మీదికి పంపావు.
పొలాల్లో కొట్టుకుపోయిన చేతికందిన పంట
రైతులగుండెల్లో మండించిన మంటలను ,
దుఃఖాక్రందనల పెనుకేకలను విన్నావా అసలు?
*
అసలు నీలో ఎంత వింతను నింపుకున్నావు అక్టోబర్ ?
వేసవి పంటలకు వీడ్కోలు చెబుతూ
కత్తి లాంటి చలికాలం లోకి
మనుషులు ప్రయాణం చేస్తున్నప్పుడు ,
పురాతన హాలోవీన్
సెల్టిక్ పండుగను నీ వెంటే తెస్తావు.
సమాధుల నుంచి మృతుల్ని లేపి
లోక సంచారం చేయిస్తావు.
వాళ్ళతో సంభాషిస్తావు.
తియ్యని కాండీలతో పిల్లల్నినాహ్వానిస్తునే,
ఆత్మలైన పూర్వీకులకు
ఇష్టమైన హాట్ చాక్లెట్ కాఫీ అందిస్తావు!
ఆత్మలతో మనుషులు చేసే వాదోప వాదాలను,
పశ్చాత్తాప ప్రకటనలని,
రంగస్థల పాత్రల సంభాషణలని
ఆశ్చర్య చకితవై వింటూ
ఒక తమాషాలాగ చూస్తూ
చలి చలిగా నవ్వుకుంటావు.
వేషాలు వేసుకుని
తలుపులు తట్టే మనుషుల్ని చూస్తూ
కొన్నిసార్లు కోపమైన
చలి మంటగా రగిలిపోతుంటావు.
*
ఇక ప్రశ్నించే ఆత్మల్ని భరించలేక తరిమేయడానికి
చిత్ర విచిత్ర వేషాలు వేస్తుంటావు.
మంత్రాలేవో చదువుతూ నైవేద్యాలు పెట్టిస్తావు.
జాక్ -వో లాంతర్లను దారి దీపాలుగా వెలిగిస్తావు.
హాలోవీన్ పండగ రోజు
ఆత్మల నెలగా మారిపోయి
తీరని దుఃఖంతో కల్లోల పడిపోతుంటావు.
మనుషుల్ని చూసి పారిపోయే
ఆత్మలకి నిర్వేదంగా
వాళ్ళ సమాధుల దారి చూపిస్తూ
ముందుకు నడుస్తుంటావు!
*
నువ్వు వీడ్కోలు చెబుతూన్నావనుకుంటావు
కానీ అక్టోబర్ ,
హాలోవీన్ వేషాల్లో
తమ అంతర్లోకాల్లో దాచుకున్న రంగుల్ని
బట్ట బయలు చేసుకున్న మనుషుల మధ్యకి,
సమాధులనుంచి ఆత్మల్ని తవ్వి తీసి వదిలాక ,
వాటిని మళ్ళీ స్మశానాల్లోకి, అడవుల్లో అనాథల్లా
పడి ఉన్న దెయ్యాల ఇళ్ళ వైపుకి
తరమడానికి నువ్వొక భీకరమైన,
కర్ణ కఠోరమైన వణికించే శీతల రాగాన్ని
ఎత్తుకుని దయలేని మనుషులకోసం
నిర్విరామంగా పాడుతూనే ఉంటావు!
ఆఖరికి నువ్వలా ప్రేమగా,క్రోధంగా
నీ ఆత్మనే పోగొట్టుకుంటూ
భగ్న హృదయంతో ముగుస్తావు!


(*Mexican Mundo Festival, The US. Feature Image) 

Read More
Next Story