నేను, పాలెం ఓరియంటల్ కాలేజీని...
ఒకపుడు ఇక్కడొక ఓరియంటల్ కాలేజీ ఉండేది. దాన్ని గుర్తు చేస్తూ పాలెం విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు ఆ మధ్య వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా వేదనావలోకనం
-ఎం రాఘవాచారి
నాకు మిక్కిలి ప్రేమాస్పదులైన మీ అందరితో మాట్లాడాలని, నా మనసు మీ ముందు విప్పుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా మీరు కుదురుగా లేరు. ఏవో ఏవేవో పనులు మిమ్ములను నడిపిస్తున్నాయి. ఆ మధ్యలో నేను దూరితే మీరు మనసుపెడతారో విసుక్కుంటారో ఎట్లా నా అంతరంగంలోకి చూస్తారో తెలియదు. నాకు మీరు అర్థమవుతుంటారు. సందడి సందడిగా జరిగే అనేక కార్యక్రమాలలో, సదస్సులలో, పండిత చర్చలలో మీరు చర్చలో సంవాదంలో భాగమవుతుంటే, కవి సభలలో గానం చేస్తుంటే, అనేక సన్మానాలలో మీరు గౌరవాలు పురస్కారాలు అందుకుంటుంటే నేను సంబరపడతాను.
అవధానాలు అంకెకు మిక్కిలిగా నిర్వహిస్తూ మీరు క్రీడలాడుతుంటే మీ మురిపెం చూసి మీ కీర్తి లాలస మీ మధ్య మీకు పోటీ చూసి కొండొకచో మీ మధ్య వైరుధ్యాలు చూసి విచారపడతాను. బళ్ళలో, కాలేజీలలో మిమ్మల్ని మీరు మరిచిపోయి మీ విద్యార్థుల కంటి మెరుపులో కలిసిపోయి పాఠాలు చెబుతూ చెబుతూ వారికి నా పేరు వినిపించినపుడు, మీ జీవితంలో, మీ జ్ఞానంలో నన్ను భాగం చేసుకుని నా ప్రస్తావన తెస్తున్నపుడు నేనెంత మురిసిపోతానో మీకు తెలియదు. ఇంతకీ నేనెవరినో మీకు తెలిసిందా నేను మీ పాలెం ఓరియంటల్ కాలేజీని. నన్ను ఏర్పాటు చేసి నా వికాసానికి కష్టపడి ఎంతో గర్వంగా నన్ను గూర్చి ఎవరికి చెప్పినా ‘శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజీ’ అని పూర్తిగా చెప్పేవారు సుబ్బయ్య గారు. ఆయన ఇపుడు లేరు.
నా ఒడిలో తిరిగి పెరిగిన మీకే చెప్పాలని కాదు యావత్తు తెలుగు ప్రజలకు నన్ను నేను చెప్పుకోవాలనుకున్నాను. నాకు దాపురించిన కష్టం అలాంటిది. గోపిచంద్ గారి రచన ‘తుమ్మచెట్టు స్వగతం’ చదివే వుంటారు. నాకూ అలాంటి ముప్పు వచ్చింది. నా కష్టం నేను మాట్లాడితే మాత్రమే తీరేది కాదు. మీరందరూ మాట్లాడాల. అందరితో మాట్లాడిరచాలి. మాటకున్న శక్తి మీకు తెలియనిది కాదు. నా చుట్టూ అందరూ తెలుగులోనే మాట్లాడుతుంటారు.
తెలుగు భాష మాట్లాడే జనాభా హిందీ తరువాత ఇదే అంటారు. అంటూనే పరభాషా వ్యామోహంలో తెలుగు భాషను చంపేయాలన్నంత కసిగా మాట్లాడుతుంటారు. భాష గొంతుక నులిమేయాలని మాట్లాడేవాళ్ళు నా ప్రాణం తీయటాన్ని అడ్డుకుంటారా అని అనుమానపడతాను. ఇంతలోనే రేపటి మీది విశ్వాసం నన్ను కదిలిస్తుంది. నాకు దు:ఖం వుంది కానీ నిరాశ లేదు. ఎందుకంటే నాకు చరిత్ర కూడా తెలుసు.
నా పుట్టుక ఎలా జరిగిందో నా కన్న తండ్రి సుబ్బయ్య గారికే కాదు ఆయనకు తోడున్న పాలెం ప్రజలకు మాత్రమే కాదు మీలో కొందరికి కూడా తెలుసును. 1950లో ఆయన చొరవ చేసి ఒక ఉన్నత పాఠశాల ప్రారంభించారు. ఆ వెనువెంటనే శ్రీ వేకంటేశ్వర ఆలయమూ ఏర్పరచారు. ఆ గుడి బడి కోసమే. బడిలో చదువు పూర్తి చేసుకున్న పిల్లల కోసం 1960లలో ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ప్రారంభించారు. 1964లో నా ఏర్పాటు సంకల్పించారు. ఆయన సంకల్పానికి ఆచరణకు ఎడం వుండేది కాదు. ఎవరు ఏ ఉపకారం చేయగలరో అందరినీ ఆ కృషిలో భాగం చేసేవారు. బడికి, కాలేజీకి పిల్లల సమీకరణ, పిల్లలందరికీ వసతి కోసం హాస్టల్ ఏర్పాటు అదొక ఉద్యమం. ఆయన, ఆనాటి పాలెం విద్యా సంస్థల నిర్మాణ కృషిలో పాల్గొన్నవారు
నిద్రాహారాలు మాని కష్టపడేవారు. పిల్లలు బయట కనబడితే చేరదీసి స్నేహంగా మాట్లాడిరచి కర్తవ్యబోధ చేసి బడికి, కాలేజీకి పంపించేవారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తమ సర్వశక్తులు పిల్లల కోసమే ఒడ్డాలని, తాను విద్యా సంస్థల కోసం, మీ కోసం కష్టపడతానని చెప్పేవారు. అధికారులను రాజకీయ వేత్తలను ఆహ్వానించి పాలెం ప్రగతిలో భాగం చేసేవారు. పల్లెకు సేవ చేయటం అప్పుడు మంచి మర్యాదగా వుండేది. ఇప్పుడు పల్లె చేదయింది. ఆనాటి వారి సంకల్పం అందుకు వారు పడిన శ్రమ నాకు తెలుసు. ఆ శ్రమ నా కళ్ళ ముందు కనిపిస్తూనే వుంటుంది. పూర్తిగా మనసు మీదికి తీసుకున్నపుడు పాలెం నిర్మాణమైన చరిత్ర నన్ను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాలంలో ప్రతికూలత మొదలైన తరువాత ఒక్కొక్క పతనము నన్ను దు:ఖితం చేస్తున్నాయి.
మీకు తెలుసునా.? పాలెం సుబ్బయ్య గారు 23 ఏప్రిల్ 1926లో పుట్టారు. ఆరవై ఏండ్లు బతికి సరిగ్గా 23 జూన్ 1986లో చనిపోయారు. 1950లో అంటే తన ఇరవై అయిదేండ్ల వయసులో అందరి చదువుల కోసం బడి ప్రారంభించారు. ఎంత ప్రేమ, ఎంత వ్యగ్రత వుంటే అది సాధ్యం. ఆయన బతికి నన్నాళ్ళు వెనుదిరిగి చూడకుండా విద్యా సేవలో బతికారు. మీరు ఆయనను మరిచి పోయారని కాదు. నిండు మనసుతో ఆయనకు నమస్కరించటం నాకు తెలుస్తూనే వుంది. ఒక సత్కార్యానికి మొక్కటం మంచిదే కానీ అంతకన్నా ఆ సత్యార్యాన్ని కొనసాగించటం, మరొక సత్యార్యాన్ని ప్రారంభించి అహం లేకుండా నిర్వహించటం కదా చేయవలసింది. ఇలా ఆలోచించినప్పుడు నా కష్టం మీకు చెప్పాలనిపిస్తుంది. అప్పుడు కదా మీలో ఎవరైనా సుబ్బయ్య గారు ఆదర్శంగా కష్టపడగలిగేది.
ఇప్పుడు పల్లె చేదయింది అని కదా అన్నాను. ఇప్పుడు పదవి మరీ మోజయింది. నా కళ్ళ ఎదుటే పదవులు ఇవ్వగల
హోదాలున్న వాళ్ళు సుబ్బయ్య గారిని పదవులు తీసుకొమ్మని అడిగేవారు. ఆయన సున్నితంగా తిరస్కరించి నాకు కాదు మా పాలెం గ్రామానికి ఏమైనా చేయమని కోరేవారు. మీరు పాలెం తిరగండి. అక్కడి నేలను, గాలినీ పలకరించండి. కాస్త ప్రేమగా కడుపు లోపలి బాధ చెప్పుకుంటే వినే హృదయంతో పలకరించండి. ఇప్పుడెందరో నాయకులు. స్వార్థం నిండిన వాళ్ళు. సమస్తాన్ని ప్రేమను, సహృదయతను కూడా అంగడి సరుకు చేస్తు ఆ క్రమంలో సంపాదించుకునే వాళ్ళు మాత్రమే. పాలెంలో ఆయన ప్రారంభించిన బడి వుంది. 35కి 30 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక పిల్లలెట్లా చేరుతారు? రేకుల కప్పుతో కట్టిన ఆ బడి చెక్కు చెదరలేదు. 1962లో నిర్మాణం ప్రారంభించి కట్టిన కాలేజీ బాగుంది. ఇప్పటి భవనాలు ఎవరి స్వార్థానికి, ఎవరెవరి కమీషన్లకు కూలిపోతున్నాయో మీకు తెలియదా?
మళ్ళీ నా ముచ్చటకు వస్తాను. తొలుత నన్ను ఉన్నత పాఠశాల గదుల్లోనే సాయంత్రపు కళాశాలగా నిర్వహించేవారు. వేళ్ళ మీది అంకెలతో మొదలై నా ఉనికి తెలిసిన కొద్దీ వందలలో పిల్లలు చేరటం మొదలైంది. మహబూబ్‌నగర్ పల్లెల నుండే కాదు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ వేరు వేరు జిల్లాల నుండి నిరుపేదలు వచ్చిచేరేవారు. వారి పలకరింపులు, స్నేహాలు, చిన్న చిన్న తగవులు చదువులు భాషా సౌందర్యమంతా అనుభవానికి వచ్చేది. పాలెం ఒక కళానిలయం అనిపించేది. భిన్న ఆలోచనల సంఘర్షణ దేశమంతటా చెలరేగుతుండిన ఆ కాలంలో పాలెం అనేక పరిమితుల నడుమ చదువులలో మాత్రమే తలమునకలయ్యేది. సుబ్బయ్య గారు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఈ విషయంలో ఒక జట్టుగా పనిచేసే వారు. చాలా చేశారు గానీ, ఎందుకో నాకూ నిలువనీడ అవసరం అనుకోలేదు. ఉన్న భవనాలలోనే సర్దుబాటు చేస్తూ వచ్చారు.
ఈ ఆరు దశాబ్దాల కాలంలో గత రెండు దశాబ్దాలుగా నాకు కష్టాలు మొదలయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నా ఉనికిని అవసరాన్ని కొంత వరకు అర్థం చేసుకున్నా ‘ఎంట్రన్స్’ అనే తొలి తరగతి తీసివేసి పదో తరగతి పూర్తి చేయలేని పేద పిల్లల ప్రవేశాన్ని తీసేసింది. దీనికి తోడ్పాటునిస్తు ప్రభుత్వం తెలుగు కళాశాలలో చదువుకున్న వారు ఉపాధ్యాయ శిక్షణ పొందే అవకాశాలు తీసేసింది. ప్రమోషన్ల కోసం మాత్రమే ఐచ్ఛికంగా తెలుగు పేపర్లు రాసుకున్న వారికి మొదటి నుండి తెలుగే చదువుకున్న వారితో సమానంగా పదోన్నతులు కల్పించే విధాన నిర్ణయాలు తీసుకుంది. విద్యలో తెలుగు ప్రాధాన్యతను చంపేస్తూ వచ్చింది. ఇంకోవైపు మార్కుల వేటలో ప్రైవేటు కాలేజీలు తెలుగు కాకుండా సంస్కృతం చెప్పిస్తే ఆమోదం తెల్పింది. ఇలా తెలుగురాని, హిందీ రాని, ఇంగ్లీషు రాని, సంస్కృతం రాని ఒక కొత్తతరం ఇవాళ తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో తయారైంది. తల్లికీ బిడ్డకూ ఉండే సంబంధం లాంటి మాతృభాషా సంబంధాన్ని, బొడ్డు పేగు సంబంధాన్ని కోసేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం జరుగుతుంటే, అంతటా ‘తెలంగానం’ మోగుతుంటే ఆ ఉద్యమంలో నా బిడ్డల ఉత్సాహోద్రేకాలు చూసి, తొలి ఉద్యమం కాలం నుండి కొనసాగుతూ వచ్చిన ఆచరణ చూసి తెలంగాణ రాష్ట్రంలో నా భవిష్యత్తును బాగుచేస్తారనుకున్నాను. మహబూబ్‌నగర్‌లో విశ్వవిద్యాలయం కోసం పోరాడుతుంటే, స్థానికంగా ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయంలో వారికి నా భవిష్యత్తు అవసరం బోధపడుతుందనుకున్నాను. ఊహా శబలత మాతృభాషాధ్యయనంలో పెరుగుతుందని గుర్తిస్తారనుకున్నాను. ప్రపంచీకరణ ఉచ్చులో చిక్కుకున్న సచివాలయ స్థాయి బ్యూరోక్రసీకి నా అవసరం వివరించి నన్ను కాపాడతారనుకున్నాను. నా కోసం కష్టపడుతూ నన్ను కాపాడుతూ వచ్చిన అధ్యాపకుల వినతులు వింటారనుకున్నాను.
సుబ్బయ్య గారి మనసు, జీవితకాలపు శ్రమ తెలిసిన స్థానిక రాజకీయ నాయకులు కాస్త శ్రద్ధ పెడతారనుకున్నాను. అధికారులకు, రాజకీయ బేహారులకు చివరికి విజ్ఞానశాస్త్రాలలో, సామాజిక శాస్త్రాలలో తలలు పండిన వాళ్ళకు ఎవరికీ మాతృభాష ప్రాధాన్యత పట్టలేదు. పట్టుబట్టి 2020 నాటికి నా ఉనికిని సైన్స్ కాలేజీలోకి మర్జ్ చేశారు. మర్జ్ చేశారా, మర్డర్ చేశారా అదేమి చైతన్యమో నాకు అర్థం కాలేదు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలుగు భాషణంలో, భాషలో పట్టుగల వాడన్నారు. చాలా చదువుకున్నాడన్నారు. ఆయన భాషణం కూడా జనరంజకంగా పద్య భూషణమై వుండేది. ఏమి వుంటే ఏం లాభం. ఆయన చేతులతోనే నన్ను చిదిమేశారు. అంగాంగము ఛిద్రం చేసి నన్ను డిఫంక్టుగా ప్రకటించి పాలెం నుండి తరలించారు. ఆయన ఎవరో విద్యుత్తు శాఖామంత్రి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. కాంతి మంత్రి పాలెం గ్రామానికి చీకట్లు మిగిల్చాడు. అయినా ముఖ్యమంత్రికి ఇంగితం వుండాలి కదా. ఇక్కడ నిలిచి చదువులు చెప్పి నా ఘనతను నిలబెట్టిన అధ్యాపకులు చాలా మంది జీవితాల నుంచి వెళ్లిపోయారు. బతికున్న వాళ్ళు నా కోసం ఆరాటపడ్డా వినిపించుకునే వారు లేరు.
ప్రపంచీకరణ అంగట్లో నిలిచి అమ్మా అమ్మా అని మొత్తుకునే దైన్యమైంది నాది. చివరికి నా పరిస్థితి ఎంతకు తెచ్చి నన్ను దెబ్బతీశారంటే ఎవ్వరు రిటైరైనా మరొకరిని నియమించలేదు. కాంట్రాక్టు పేరుతో నియమించిన వారిని సాగనంపి ఒకరూ అరా వున్న రెగ్యులర్ అధ్యాపకులను బదిలీలు చేశారు. పంతుళ్ళు లేరని పిల్లలు చేరకపోతే పిల్లలు లేరని డీఫంక్ట్ కాలేజీ అని నా నొసట రాసి తరలించారు. ఎంత కుట్ర ఎంత దుర్మార్గం నేనెంత ఆగ్రహంతో ఉన్నానో తెలుసా? గెస్ట్ లెక్చరర్‌లతో నెట్టుకురావడం ఏమిటి? గెస్ట్ మంత్రులుంటారా?
సుబ్బయ్య గారు తాను ఏర్పరచిన ఏ విద్యాసంస్థలో కూడా తాను చదువుకోలేదు. ఆయన పెద్దగా చదువుకున్నవాడు కూడా కాదు. ప్రభుత్వానికి అర్జీలు కూడా ఇతరులతో రాయించేవాడు. తప్పులు లేని తెలుగురాసేవాళ్ళు, తెలుగును మరింత వికసితం చేసేవాళ్ళు ప్రతి పల్లెకు అవసరం కదా అని ఆయన ఓరియంటల్ కాలేజీ ఏర్పాటుచేశాడు. దాన్ని సంపద్వంతమైన, సిరులు కలిగిన తెలంగాణ రాష్ట్రం చంపేసింది. కఠినంగా చెప్పాలంటే ప్రభుత్వం తనను తాను చంపేసుకుంది. ఇంగ్లీషు వాడు తన భాషకు ప్రపంచాన్ని ఎందుకు కట్టేశాడు? హిందీ వాడు దేశం హిందీ మాత్రమే ఉపయోగించాలని ఎందుకు ఆవేశపడుతున్నాడు? తెలుగు వాడికి ఏమైంది? పొరుగు రాష్ట్రాలను చూసి కూడా నేర్చుకోలేని దౌర్భాగ్యం ఏమిటి?
తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టా రాజ్యంగా ఏలిన ముఖ్యమంత్రిని ప్రజలు ఇంటికి పంపించారని వింటున్నాను. ఆరు దశాబ్దాల తరువాత మహబూబ్‌నగర్ నించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చాడని వింటున్నాను. నా కోసం మాత్రమే కాదు. తెలుగు భాష కోసం, ప్రతి బడిలో కాలేజీలో తెలుగే చదువుకున్న ఆసక్తిపరుడైన తెలుగు బోధకుడి కోసం తెలంగాణ అంతటా ఓరియంటల్ కాలేజీలు పెట్టమని చెప్పండి. తెలుగు సమాజానికి బిడ్డకు తల్లిలాగా తెలుగు నేర్పిన నన్ను బతికించమని చెప్పండి. ఒక్కొక్కరు కాదు అందరూ చెప్పండి. ‘‘నలుగురు కూర్చుని నవ్వే వేళల, నా పేరొకపరి తలవండి’’ మరో అడుగు ముందుకు వేసి మీరు
ఉద్యమిస్తే నాకు సంతోషం. సుబ్బయ్య గారికి నివాళి.
(*ఎం.రాఘవా చారి,కన్వీనర్, పాలమూరు అధ్యయన వేదిక)