నువ్వు నన్ను మరచిపోతే...
x
source: goffjamesart

నువ్వు నన్ను మరచిపోతే...

నేటి మేటి అనువాద కవిత. చెంగల్వరామలక్ష్మి



-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి.


నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను

ఇది ఎలాగో నీకు తెలుసు
నేను నా కిటికీ దగ్గర అపుడపుడే ప్రవేశిస్తున్న శిశిరపు ఎరుపు కొమ్మ వద్ద ప్రకాశవంతమైన చంద్రుని చూస్తున్నట్లయితే

నిప్పు దగ్గర స్పృశించలేని బూడిద ను తాకుతుంటే
లేదా
ముడతలు పడ్డ చెట్టు దుంగను
నిమిరినప్పుడు
ప్రతిదీ నన్ను నీ దగ్గరకు చేరుస్తుంది.
సుగంధాలు,కాంతి, లోహాలు, చిరు నావలు, ఆ తెరచాప, అవన్నీ అక్కడ ఉన్నట్లుగా
నా కోసమే ఎదురుచూస్తున్న ద్వీపాలకు నన్ను చేర వేస్తాయి.

సరే.... ఇప్పుడు
కొద్ది కొద్దిగా నువ్వు నన్ను ప్రేమించటం ఆపివేస్తే
నేనూ అంతే!
హఠాత్తుగా
నువ్వు నన్ను మరచిపోయి, నా కోసం ఎదురు చూడక పోతే
నేనూ అప్పటికి నిన్ను మరచిపోయి ఉంటాను
పతాకాల గాలి జీవిత మార్గం ద్వారా దాటిపోవటం
నీకు సుదీర్ఘంగా, పిచ్చిగా
అనిపిస్తే
నువ్వు నా మూలాలున్న
నా హృదయ తీరాన నన్ను వదిలివేయటానికి నిర్ణయించుకుంటే
గుర్తుంచుకో!
అదే రోజున, అదే గంటలో
నేను బాహువులనెత్తి నా మూలాలున్న వేరే లోకాన్ని వెతుకుతూ పయనమవుతా!

కానీ,
ప్రతిరోజు, ప్రతిగంట
స్వచ్ఛ భావన తో
నువ్వు నా కోసమే అనుకుంటే,
ప్రతిరోజు ఒక కుసుమం
నన్ను వెతుకుతూ నీ అధరాన్ని చేరితే
ఓహ్... నా ప్రేమ... ఓహ్ నా స్వంతమే
నాలోని ప్రేమజ్వాల మళ్ళీ రగిలితే
నాలో ఏదీ ఆరిపోవటం, మర్చిపోవటం లేదని!
ఓ ప్రియా!నా ప్రేమ నీ ప్రేమకు ఆధారం
జీవితాంతం నన్ను వీడక అది నీ చేతుల్లోనే ఉంటుంది!


Source :If you forget

By Pablo Neruda


(డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గురజాడ రచనలపై పరిశోధన చేసారు. 'చెంగల్వ పూలు 'అనే కథా సంపుటాన్ని, 'గురజాడ అప్పారావు ', జాషువా జీవితం --సాహిత్యం ', అనే పుస్తకాలను ప్రచురించారు.ప్రస్తుతం సాహిత్య వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కథలు, కవితలు వివిధ పత్రికలలో రాస్తున్నారు.)





Read More
Next Story