పక్షుల కిలకిలరావాలతో పులకరించిన పాఖాల సరస్సు
x
photos Source: HyTiCoS : పాఖాల సరస్సులో వలస పక్షి విహారం

పక్షుల కిలకిలరావాలతో పులకరించిన పాఖాల సరస్సు

వాటర్‌బర్డ్ సెన్సస్–2026: 70 రకాల పక్షుల గుర్తింపు… జీవవైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనం


చుట్టూ పచ్చని అడవులు… గలగలలు మోగే మున్నేరు నది ప్రవాహం… బురద మైదానాలపై వాలస పక్షుల రెక్కల సందడి… వాటి కిలకిలరావాలతో పాఖాల సరస్సు ఓ సహజ సంగీత మందిరంలా మారింది. ప్రకృతి అందాలు, జీవవైవిధ్యం కలగలిసిన ఈ చారిత్రాత్మక జలాశయం నేడు పక్షిప్రేమికులు, పర్యావరణ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ సరస్సు మరోసారి తన జీవవైవిధ్య గొప్పతనాన్ని చాటుకుంది. తాజా వార్షిక వాటర్‌బర్డ్ సెన్సస్–2026లో ఈ సరస్సు, చుట్టుపక్కల ప్రాంతాల్లో 70 రకాల పక్షి జాతులు గుర్తించటం పర్యావరణ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరానికి 174 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నగరానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఖాల సరస్సు ప్రకృతి అందాలతో పాటు రమణీయతకు ఆలవాలంగా నిలిచింది.

photos Source: HyTiCoS : పాఖాల సరస్సులో వలస పక్షి విహారం

మున్నేరు నదిపై నిర్మించిన చెరువు

పాఖాల సరస్సు తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న ఒక చారిత్రాత్మక మానవ నిర్మిత అందాల జలాశయం. ఈ జలాశయాన్ని 1213లో కాకతీయ రాజవంశానికి చెందిన రాజు గణపతి దేవ నిర్మించారు. కాకతీయ పాలకులు కృష్ణా నదికి ఉపనది అయిన మున్నేరునది పై పెద్ద మట్టి కట్టను నిర్మించడం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్న పొలాలకు సాగునీటిని అందించడానికి నిర్మించిన పాఖాల సరస్సు శతాబ్దాలుగా ఈ ప్రాంత రైతులకు వరప్రదాయనిగా నిలిచింది.

సరస్సులో వార్షిక వాటర్‌బర్డ్ సెన్సస్

పాఖాల సరస్సులో వార్షిక వాటర్ బర్డ్ సెన్సస్ -2026 ను తాజాగా పక్షిప్రేమికులు చేశారు.తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అధికారులు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్లు,పక్షుల దృశ్య,శబ్ద గుర్తింపులో నైపుణ్యం ఉన్న ఐదుగురు అనుభవజ్ఞులైన ఫీల్డ్ బయాలజిస్టుల బృందం హైటికాస్ (HyTiCoS) సమన్వయకర్త డాక్టర్ వెంకట్ అనగంధుల నేతృత్వంలో నీటి పక్షుల గణన సాగింది. ఈ గణనలో పాఖాల సరస్సుతోపాటు చుట్టుపక్కల ఉన్న వివిధ రకాల పక్షులు, జంతుజాలం నమూనాలను నమోదు చేశారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్లు సరస్సు, దాని అనుబంధ తడి భూముల ఆవాసాల్లో వలస పక్షి జాతుల స్థితిని అంచనా వేయడానికి క్రమబద్ధమైన పక్షుల సర్వేను నిర్వహించారు. ఓపెన్ వాటర్, చిత్తడి అంచులు, బురద మైదానాలు, చుట్టూ అడవుల్లో ఇంటెన్సివ్ సర్వే చేశారు. లెన్స్ కెమెరాలు, బైనాక్యులర్లు, ఫీల్డ్ గైడ్‌లను ఉపయోగించి వివిధ రకాల వలస పక్షులను ప్రత్యక్షంగా గణించారు.

వన్యప్రాణుల అభయారణ్యం

పాఖాల సరస్సు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచినీటి, చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థగా ఉంది.ఈ పాఖాల సరస్సు పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం 1952వ సంవత్సరంలో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది.ఈ ప్రకటనతో విభిన్న వృక్షజాలం,పక్షులు, జంతుజాలానికి రక్షణను పెంచింది.ఈ సరస్సు వివిధ జాతుల అరుదైన వలస నీటి పక్షులు, క్షీరదాలు, సరీసృపాలు, జల జీవులతో గొప్ప జీవవైవిధ్యానికి నిలయంగా ఉంది. ఈ సరస్సు భూగర్భ జలాల రీఛార్జ్, మైక్రోక్లైమేట్ నియంత్రణ, కార్బన్ సీక్వెస్ట్రేషన్, పోషకాల సైక్లింగ్‌కు గణనీయంగా దోహదపడుతుందని హైటికాస్ (HyTiCoS) సమన్వయకర్త డాక్టర్ వెంకట్ అనగంధుల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ సరస్సు ముఖ్యమైన పర్యావరణ-పర్యాటక,పర్యావరణ విద్యకు గమ్యస్థానంగా కూడా ఉద్భవించిందన్నారు. ఇది భవిష్యత్ తరాలకు పర్యావరణ, సమతుల్య పరిరక్షణ, స్థిరమైన పర్యాటకం, సమర్థవంతమైన తడి భూముల పరిరక్షణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది.

70 రకాల పక్షి జాతుల గుర్తింపు

పక్షుల సర్వే కాలంలో ఫీల్డ్ బృందం పాఖాల సరస్సు, చుట్టుపక్కల మొత్తం 70 పక్షి జాతులను నమోదు చేసింది. అవిఫౌనా బాతులు (అనాటిడే), సాండ్‌పైపర్లు (స్కోలోపాసిడే), ఫ్లైక్యాచర్లు (మస్సికాపిడే), లాప్‌వింగ్‌లు (చారాడ్రిడే), పోచార్డ్‌లు (ఐథిని), స్టిల్ట్‌లు (రికర్విరోస్ట్రిడే) పక్షులున్నాయి. గత ఏడాది రుతుపవన కాలంలో అనూహ్యంగా భారీ వర్షాలు కురవడం వల్ల సరస్సు నీటితో కళకళలాడుతుందని హైటీకాస్ వాలంటీర్లు ప్రేమావతి, కీర్తనలు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. బురద నేలలు, సరస్సు గట్టుపై చెట్లు, చుట్టూ అడవులు విస్తరించి ఉండటంతో పక్షుల ఆవాసాలకు, నివాసాలకు అనుకూలంగా ఉందని హైటికాస్ వాలంటీర్ నవనీత్ చెప్పారు.

పాఖాలలో ఎన్నెన్నో పక్షులు...

పాఖాల సరస్సులో వివిధ దేశాలకు చెందిన వలస పక్షులే కాకుండా 70 రకాల పక్షులున్నాయని పక్షి గణనలో పాల్గొన్న వాలంటీర్లు గుర్తించారు. ఈ సరస్సులో యాషీ క్రౌన్డ్ స్పారో లార్క్,యాషీ ప్రినియా,
గ్రీన్ బీ ఈటర్,ఏషియన్ ఓపెన్ బిల్,ఏషియన్ పామ్ స్విఫ్ట్,బార్న్ స్వాలో,బ్లాక్ డ్రోంగో,ఓరియంటల్ వైట్ ఐబిస్,బ్లాక్ రంప్డ్ ఫ్లేమ్‌బ్యాక్,బ్లాక్ వింగ్డ్ కైట్,బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్,బ్లూ ఫేస్డ్ మాల్కోహా,బ్రాంజ్డ్ వింగ్డ్ జాకానా,క్యాటిల్ ఎగ్రెట్,సినేరియస్ టిట్,సిట్రిన్ వాగ్‌టైల్,కామన్ హాక్ కోకిల,కామన్ హూపో,కామన్ కింగ్‌ఫిషర్,కామన్ మైనా,కామన్ టైలర్ బర్డ్,కాపర్‌స్మిత్ బార్బెట్,క్రెస్టెడ్ సర్పెంట్ ఈగిల్,ఈస్టర్న్ ఎల్లో వాగ్‌టైల్,గ్రేట్ కార్మోరెంట్,గ్రేట్ ఎగ్రెట్,గ్రీన్ శాండ్‌పైపర్,గ్రీనిష్ వార్బ్లర్,గ్రే బ్రెస్ట్డ్ ప్రినియా,గ్రే ఫ్రాంకోలిన్,గ్రే హెరాన్,ఇండియన్ కార్మోరెంట్,ఇండియన్ నైట్‌జార్,ఇండియన్ పాండ్ హెరాన్,ఇండియన్ సిల్వర్ బిల్,జంగిల్ ప్రినియా జాతుల పక్షుల దర్శనమిచ్చాయని హైటికాస్ కో ఫౌండర్ ఆసిఫ్ సిద్ధిఖీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పక్షి జాతుల్లో గణనీయమైన వైవిధ్యం

పాఖాల సరస్సులో జరిపిన పక్షుల సర్వేలో పక్షి జాతుల్లో గణనీయమైన వైవిధ్యం నమోదు అయిందని, వలస నీటి పక్షుల సంఖ్య సమృద్ధి తక్కువగా ఉందని హైటికాస్ (HyTiCoS) సమన్వయకర్త డాక్టర్ వెంకట్ అనగంధుల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాఖాల సరస్సు, చుట్టుపక్కల ఉన్న పక్షుల వైవిధ్యం, ఆవాస వినియోగంపై బలమైన బేస్‌లైన్ డేటాను రూపొందించడంలో ఈ సర్వే సహాయపడుతుందన్నారు.
పాఖాల సరస్సులో నమోదు అయిన పక్షి వైవిధ్యం ఈ ప్రాంతం జీవ వైభవానికి నిదర్శనం. ఈ డేటా భవిష్యత్‌లో తడి భూముల సంరక్షణకు, వలస పక్షుల ఆవాసాల పరిరక్షణకు కీలక మార్గదర్శకంగా నిలవనుంది.ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాదు, వాటిని కాపాడే బాధ్యతను గుర్తు చేసే గమ్యస్థానంగా పాఖాల సరస్సు మారుతోంది. స్థిరమైన పర్యాటక విధానాలతో ఈ జీవవైవిధ్య వారసత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది.
Read More
Next Story