
సుందరయ్యవిజ్ఞానకేంద్రం షోయబ్ హాల్ లో ఈ నెల 12 న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం.
పాలమూరుకు వెనుక దగా..ముందు దగా
జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందున జిల్లాకు మేలు జరుగుతుందా? : మేధావుల ప్రశ్న.
- ఎం. రాఘవాచారి
నోట్ల రద్దుపైన, గోదావరి - కృష్ణానదుల స్వాధీనానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, పట్టణ ఉపాధి హామీ, ఉద్యోగహక్కు చట్టాలు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీతో పాటు సంక్షేమ పథకాలకు చట్టబద్ధత కల్పిస్తూ వాటిని రాజ్యాంగబద్దం చేయాలని కోరుతూ పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సమావేశాలు జరిపాం. రాజధాని నగరానికి వచ్చి, మహబూబ్ నగర్ జిల్లా జలవనరుల సమస్యపై చర్చకు తీసుకురావడానికి అనేక సమావేశాలు నిర్వహించాం. ధర్నాలు, నిరాహార దీక్షలు కూడా జరిపాం. సమస్యల తీవ్రతకు బాధపడుతూ కూర్చోవటం తగదు. ప్రజల వాస్తవ సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలని మేం నమ్ముతున్నాం.
ప్రామాణికమైన జీవన రంగాల ప్రగతిలో తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడి వుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నివేదికలన్నీ చెబుతున్నాయి. ఇక్కడ కరువు, వలసలు రూపాన్ని మార్చుకుంటున్నా, అవి తీవ్రంగా కొనసాగుతున్నాయి. భూసంస్కరణలు అమలు జరగకపోవటం ఈ వైపరీత్యానికి ఒక కీలక కారణం కాగా, జల వనరుల కల్పన జరగక పోవటం, అవసరాలు తీర్చే అవకాశాల కల్పన జరగక పోవటం మరో ప్రధాన కారణాలు. ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు ఇలాంటి అధ్యయనాలకు ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వటంలేదు. అభివృద్ధి నినాదం మాటున, అభివృద్ధి పేరుతో అమలు చేసే విధానాల వల్ల జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి, జీవన విధ్వంసానికి లెక్కలేకుండా పోతున్నది. సమాజంలో పరివర్తనకు దోహదపడే మానవీయ ప్రజాస్వామిక విలువలు పెంపొందవలసి వుండగా, హింసాపూరిత ప్రతీకార విలువలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చారిత్రకంగా వెనుకబడిన వ్యక్తులు, కుటుంబాలు, ప్రాంతాలు సమాజాలు వెనుకబడే రీతిలో వివక్షకు గురవుతున్నాయి. సంకల్పిత, అసంకల్పిత చర్యలకు ఉమ్మడి మహబూబ్ నగర్ బలవుతూనే వుంది. అనేక అంశాలలో ఒక్క జలవనరుల కల్పనలోని వివక్షను దీర్ఘకాలంగా చర్చకు పెడుతున్నాం.
తెలంగాణకు కృష్ణానదిలో నీటి వాటా పంచాలి :
నదీజలాల పంపిణీకి సంబంధించిన బచావత్ ట్రిబ్యునల్ గడువు తరువాత బ్రిజేశ్ ట్రిబ్యునల్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా తెలంగాణ రాష్ట్రానికి నీరు పంచలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది ఏళ్ళు గడిచినా నీటి పంపిణీ జరగలేదు. నీటి పంపిణీ మీదే న్యాయం ఆధారపడినపుడు, పంపిణీ జరగనంతకాలం అన్యాయం జరుగుతున్నట్టేకదా ! వివాదం కోర్టులో వుండగా, కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితమై గోదావరి, కృష్ణానదులను ఏ రాజకీయ కారణాలు ప్రేరేపించినందు వల్ల తన స్వాధీనంలోకి తీసుకునే ఉత్తర్వులు విడుదల చేసిందో ఆలోచించాలి. నదుల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్వహణ తన చేతిలోకి తీసుకున్నది సత్వర పంపిణీ కోసమా, లేక దీర్ఘకాలం యధాతధ స్థితి కొనసాగించటానికా? యధాతధ స్థితికోసమే అయితే, నదీ జల పంపిణీకి సంబంధించినంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదనే అనుకోవాలి. నీటి పంపిణీ జరగకపోతే ఇప్పటికే నీటి అనుభవం వున్న ప్రాంతాలకు నష్టం లేదు. తెలంగాణలో వందశాతం పరీవాహక ప్రదేశంలో వుండి నీరందని మహబూబ్ నగర్ - రంగారెడ్డి జిల్లాలకు నష్టం. ఇది ఈ రెండు జిల్లాల సమస్య మాత్రమే కాదు. తెలంగాణ సమస్య రాజకీయంగా పరిష్కరించవలసిన సమస్య. మా సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని అడుగుతున్నాం.
గోదావరి - కృష్ణా అనుసంధానం ఆపాలి :
నదుల అనుసంధానం ప్రతిపాదనను కేంద్రం పదేపదే ముందుకు తీసుకువస్తున్నది. ఆంధ్రప్రదేశ్ దీనిని వ్యతిరేకించటంలేదు. గత తెలంగాణ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించకపోగా, కృష్ణానదినీరు తరలించుకు పొమ్మనే మార్గం మాత్రం చూపింది. తెలంగాణ నీటి హక్కులను హరించటానికే గోదావరి, కృష్ణా, కావేరీ అనుసంధానం ప్రతిపాదన. దిగువ నుంచి నీటిని తరలించుకుపోయిన తరువాత తెలంగాణకు దక్కేదేమీవుండదు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి నుంచి మూడువందల టి.ఎం.సి.ల నీరు ఎనభైవేల కోట్ల వ్యయంతో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల ద్వారా తరలిస్తానని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి అంగుళం, భూమికి నీరిస్తానని ఒక పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ, దానికి ‘ఆంధ్రకు జలహారతి’ అని పేరు పెట్టారు. “ఎగువన తెలంగాణ వారికి శక్తి ఉంటే నీళ్ళు తీసుకుంటారు”. తెలంగాణ సమాజం, రాజకీయశక్తులు ప్రతిస్పందించలేదు. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అని మనం గుర్తిస్తున్నామా ! నదుల అనుసంధానం నదీ వ్యవస్థలతో చెలగాటమని, పర్యావరణ విధ్వంసమని ఆ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను దోపిడీ రాజకీయ వర్గాలు ఖాతరు చేయటం లేదు. ఈ చర్య కృష్ణా తీరంలో, గోదావరి ఎగువ ప్రాంతాలలో నష్టపోతున్న తెలంగాణ నీటి సమస్య మాత్రమే కాదు. ఈ దేశపు సమస్య. పెట్టుబడి ప్రమేయం, సాంకేతిక శక్తీ పెరిగినందు వల్ల, రాష్ట్రాల, గ్రామాల రాజకీయ శక్తిని నిర్వీర్యం చేసినందువల్ల తీవ్ర విఘాతం ఏర్పడింది. ఇది తెలంగాణ రాజకీయార్థిక స్థితిగతులను ప్రభావితం చేసే దెబ్బ. సమాజమే ఈ దెబ్బనుంచి భవిష్యత్తును కాపాడాలి.
రౌండ్ టేబుల్ సమావేశంలో రాఘవాచారి గారి కీలకోపన్యాసం
పాలమూరు- డిండి ప్రతిపాదన రద్దు చేయాలి.
పాలమూరు - రంగారెడ్డి లిప్టును రెండు భాగాలుగా చేపట్టి అమలు చేయాలి.
మహబూబ్ నగర్ ప్రజలు రైతాంగం పోరాడి సాధించుకున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ ఎస్ ప్రభుత్వం అనేక విధాలుగా నష్ట పరిచింది. కృష్ణానదిలో జూరాల ఎగువన తొలి వరద నీరు తీసుకోవటానికి టీఆర్ ఎస్ ఏర్పాటుకు ముందే చర్చలో వుండి, షాద్ నగర్ ఎత్తిపోతల పేరున ప్రచారంలో వుండి, తరువాత రోజుల్లో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంగా ప్రాచుర్యం పొంది అనేక ఉద్యమాలతో సాధించుకున్న పథకం ఈ నాటికీ పూర్తి కాలేదంటే ఆ ప్రభుత్వానిదే బాధ్యత. తెలంగాణలో కృష్ణానది మీద తొలి, స్వతంత్ర ప్రాజెక్టు జూరాలను వదిలి అనేక వివాదాలున్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టు శ్రీశైలంలోకి మార్చారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకపు వ్యవస్థలను, ఆయకట్టును ధ్వంసం చేశారు. మూడేళ్ళ లోపు నిర్మిస్తామని నమ్మబలికి నిధులను, నిర్వహణను కాళేశ్వరం మీద కేంద్రీకరించారు. పడమట మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి భూముల కోసం చేపట్టవలసిన పథకాన్ని దిగువన నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోకి మార్చినందువల్ల జరిగిన నష్ట నివారణ కోసం పథకాన్ని రెండు భాగాలుగా విభజించి చేపట్టాలని కోరుతూ ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదు. పైగా ఏనాడూ ప్రతిపాదనలో, చర్చలో లేని పాలమూరు-డిండి అనే ప్రతిపాదనను ఏకంగా అమలు కోసం ముందుకు తెచ్చారు.
మహబూబ్ నగర్ ప్రజలు ఆగ్రహంతో 14 నియోజక వర్గాలలో అనేక పోరాటాలు చేశారు. సమావేశాలు జరిపారు. వీటిలో కాంగ్రెస్ తో పాటు వామపక్ష పార్టీలు కూడా క్రియాశీలంగా పాల్గొన్నాయి. అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అనివార్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు లెటర్ హెడ్ పై సంతకాలు చేసి ముఖ్యమంత్రికి లేఖరాశారు.
ఇంతకాలం నీరందని మహబూబ్ నగర్- రంగారెడ్డి జిల్లా రైతాంగానికి పాలమూరు డిండి వల్ల అన్యాయం. ఎత్తి పోతల పథకానికి ఉద్దేశించిన నీటిని తరలిస్తుంది, ఇతర పథకాల కింద రూపొందిన ఆయకట్టును ముంచి, ఇదివరకే నిర్వాసితులై, అరకొర భూములు దున్నుకు బతికే రైతాంగాన్ని మరోసారి నిర్వాసితుల్ని చేస్తుంది. వీటన్నింటినీ మించి రైతుల మధ్య నీటి తగాదాలను, వైరుధ్యాలను తీవ్రం చేస్తుందని జిల్లా ప్రజలు, రైతాంగం చేసిన చర్చను ఆ లేఖలో వివరించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ సంస్థ ఒక రౌండుటేబుల్ సమావేశం జరిపి పాలమూరు - రంగారెడ్డి పథకపు నీటిని ఈ జిల్లాలకు కాక మరే జిల్లాలకు తరలించకూడదని తీర్మానం చేసి ప్రభుత్వానికి వివరంగా లేఖ రాశారు. అసెంబ్లీలో అప్పటి కాంగ్రెస్ ప్రతినిధి ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి ఈ పథకం ఉండదని ప్రకటించారు.
అప్పటికి ఆగిన పాలమూరు- డిండి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ముందుకు తెచ్చింది. తామే తీవ్రంగా వ్యతిరేకించి పోరాడిన పథకాన్ని తిరిగి తీసుకురావటం అంటే ఆ పార్టీ అప్పటి పోరాటం మోసం మాత్రమేనా? అనేక విషయాలలో హామీలు నమ్మి గెలిపించిన ప్రజలను ఇట్లా మోసగించడం తగునా? ఈ ప్రతిపాదన రాగానే సీనియర్ ఇంజనీర్లు మరోసారి ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు లేఖ ఇచ్చి, జరుగబోయే నష్టం వివరించారు. మాజీ కాంగ్రెస్ ఎం.పి. జితేందర్రెడ్డి గత చరిత్రను గుర్తుచేస్తూ తానూ ఒక లేఖ రాశారు. అందరూ మాతో గొంతు కలపాలని, పాలమూరు - డిండి ప్రతిపాదన, ఆలోచన అన్యాయమని రద్దు చేయించాలని కోరుతున్నాము. ఇది తేలిక సమస్యకాదు. దీన్ని తీవ్రమైనదిగా పరిగణించాలి. చాలా మంది వివిధ సందర్భాలలో చర్చిస్తున్నట్టు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వెల్లువలో పార్టీలలో, సంఘాలలో, చివరికి ప్రజాస్వామిక వాదులలో న్యాయభావన కూడా కొట్టుకుపోతున్నదా? అదే జరిగితే- పంపిణీకి, పున:పంపిణీకి, న్యాయభావనకు నష్టం జరుగుతుంది. అది పీడిత ప్రజలకు తోడ్పాటును చర్చస్థాయిలో కూడా రద్దు చేస్తుంది. వ్యక్తి వివేచనా స్థాయిని భంగపరుస్తుంది.
ప్రభుత్వాల విధాన నిర్ణయాలు ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని, చైతన్యాన్ని పెంచేవిగా ఉండాలి. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రగతికి సంబంధించి అనేక విషయాలలో చాలా నష్టం చేసే విధాన నిర్ణయాలనే ప్రభుత్వాలు ముందుకు తెస్తున్నాయి. పార్టీలుగా వైరుధ్యాలు కనిపిస్తున్నా, అధికారం చేపడుతున్న వేర్వేరు పార్టీలు ఒకే అభివృద్ధి నమూనాను, ప్రజావ్యతిరేక విధ్వంసకర నమూనాను దూకుడుగా అమలు చేస్తున్నాయి. ట్రిపుల్ ఆర్, ఫార్మా, ఇథనాల్, లిక్కర్, విద్య, వైద్యం తదితర అన్ని విషయాలలో ఒకే నమూనాను ముందుకు తెస్తున్నాయి. ప్రభుత్వం, బ్యూరాక్రాట్లు కార్పోరేట్ల ప్రయోజనాలను మించి ఆలోచించలేకపోతున్నారు. రైతాంగం, ప్రజలు నిరంతరం తమ మనుగడ కోసం భూములను, పర్యావరణాన్ని కాపాడుకునే పోరాటాలలో తలమునకలవుతూ హింసకు గురికావలసి వస్తున్నది.
గత ప్రభుత్వం 14 నియోజక వర్గాల మహబూబ్ నగర్ ను పాలనా సౌలభ్యం పేరుతో పిచ్చివాడి చేతిలో పగిటిన అద్దంలా ముక్కలు చేసి ఏడు జిల్లాలలోకి సర్దుబాటు చేసింది. ఇది ప్రజల మధ్య సంబంధాలను దెబ్బతీయటానికి, అణిచివేయటానికి పనికి వచ్చిందే తప్ప, ప్రజలకు న్యాయం చేయటానికి పనికి రాలేదు. జలవనరుల సమస్యలోనించి ఈ పరిస్థితిని మీ దృష్టికి తీసుకువస్తాం.
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో:
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలను గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలుగా ఏర్పరిచారు. అంతే కాక కల్వకుర్తి నియోజక వర్గంలో సగం ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాలో కలిపి ఉమ్మడి అస్తిత్వాన్ని దెబ్బతీశారు. ఆర్డీఎస్, జూరాల నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఈ ప్రాంతంలోనే వున్నాయి. శ్రీశైలం ముంపుతో పాటు, ఇతర పథకాల ముంపు కూడా ఈ ప్రాంతంలోనే వుంది. ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా, భవిష్యత్తు పట్ల బాధ్యత లేకుండా పనులన్నీ అసంపూర్తిగా, అరకొరగా నడిపి నెట్టుకు వస్తున్న పరిస్థితి చూస్తాం. ఆర్డీఎస్, జూరాల, భీమా1, నికరజలాలు గానీ, నెట్టెంపాడు, కల్వకుర్తి, వరద జలాలు గానీ ప్రభుత్వాలు ప్రకటించిన స్థాయిలో ఏనాడూ నీరు తీసుకుని నిర్వహించలేకపోయాయి. జిల్లా సాగునీటి పథకాల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ వివక్ష ఉండిందో, తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఆ వివక్ష కొనసాగుతూనే వుంది. ఈ పార్లమెంటు నియోజకవర్గమంతటికీ నీరివ్వటానికి దిగువ చర్యలు చేపట్టాలి.
1. ఆర్డీఎస్ ను సుంకేశులవలె ఆధునీకరించి 15.9 టి.ఎం.సిల నికర జలాలను తెలంగాణ సరిహద్దునుంచి సాధించాలి.
2. జూరాల ప్రాజెక్టు ఇసుక మేటతో నిండిపోతూ, నీటి అవసరాలు తీర్చలేక పోతున్నందువల్ల, ఈ ప్రాజెక్టుకు ఇదివరలో కేటాయింపులున్న 17.84 టి.ఎం.సి నికర జలాల వినియోగ రక్షణకు చర్యలు తీసుకోవాలి.
3. ర్యాలంపాడు రిజర్వాయర్ను నాలుగు టి.ఎం.సి నీరు నిలిపే విధంగా పటిష్టపరిచి చిన్నోనిపల్లి రిజర్వాయర్ తో సంబంధం లేకుండానే నెట్టెంపాడు 22 టి.ఎం.సి సాగునీరు తీసుకోవాలి. అందుకు గట్టు మండల బీడు భూముల సాగు నీటికోసం గట్టు ఎత్తిపోతలను స్వతంత్రంగా చేపట్టాలి.
4. కర్ణాటక ప్రాంతానికి నీరివ్వటానికి 30 టి.ఎం.సిల భారీ రిజర్వాయర్ నిర్మించాలనే ఆలోచన, ప్రతిపాదన మానుకోవాలి. ఆ స్థాయి భూముల ముంపు ఆపాలి. నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలను ఆ ప్రాంతానికి సాగునీరు ఇచ్చే స్థాయిలో సమన్వయంతో నడపాలి.
5. కల్వకుర్తి ఎత్తిపోతలను 45 టి.ఎం.సి. వరద జలాల అంచనాతో చేపట్టినప్పటికీ పథకం పనులేవీ ఆస్థాయితో జరగలేదు.
6. దీనిపై రిజర్వాయర్లు లేవు. అందువల్ల పాలమూరు-రంగారెడ్డి పథకంతో సమన్వయపరచి నిర్వహించాలి. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు భాగాలుగా విభజించాలి. శ్రీశైలం నుండి తీసుకుంటున్న భాగాన్ని కుల్వకుర్తి పథకంతో సమన్వయం చేయాలి. పాలమూరు రంగారెడ్డి పథకంలో చివరిది అత్యంత ఎత్తున ఉన్నది అయిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం వెంటనే చేపట్టాలి. అక్కడి దాకా నీరు చేరే చర్యలు చేపట్టాలి.
7. ప్రస్తుత పథకాలతో నీరివ్వలేని అచ్చంపేట కొల్లాపూర్ నియోజక వర్గాల ఎగువ ప్రాంతంలోని అమ్రాబాద్, బల్మూరు, లింగాల తదితర మండలాల భూములకు నీరివ్వటానికి చంద్రసాగర్, తమ్మన్పేట రిజర్వాయర్ల ద్వారా భూముల ముంపులేకుండా నీరిచ్చే చర్యలు తీసుకోవాలి. లేక అచ్చంపేట లిఫ్టులో రుసుల్ చెరువును రిజర్వాయర్ గా అభివృద్ధి చేసి నీరివ్వాలి. ఉమామహేశ్వరం పేరుతో మరొక రిజర్వాయర్ నిర్మించవద్దు నిర్వాసితత్వం పెంచవద్దు.
8. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సాగునీటి భద్రత కోసం వెల్టూరు - గొందిమల్ల బ్యారేజీ నిర్మించాలి.
9. గోపల్టిన్నె రిజర్వాయర్ స్థాయిపెంచి జూరాల కాలువతో వరదరోజులలో నీరు నింపే చర్యలు చేపట్టాలి. గ్రావిటీ కాలువతో నిండే రిజర్వాయర్ కు ఎత్తిపోతల నీరు మళ్ళించకూడదు.
10. మార్కండేయ ఎత్తిపోతలను వెంటనే పూర్తి చేయాలి.
ఈ చర్యలతో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మాత్రమే కాక తూర్పు రంగారెడ్డి జిల్లా సాగునీటి అవసరాలు
కూడా తీరుతాయి.
మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో
మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలుగా విభజించి షాదర్ నగర్ నియోజక వర్గాన్ని పూర్తిగా, కొడంగల్ నియోజక వర్గంలోని చాలా ప్రాంతాన్ని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో కలిపేశారు. పూర్వ జిల్లా ఉనికి ఏడు జిల్లాలుగా చెదిరిపోయింది. ఇట్లా చెదరగొట్టిన చర్యను అభివృద్ధిగా, పాలనా సౌలభ్యానికి చేపట్టిన చర్యగా చెప్పుకున్నారు. అభివృద్ధి మాట ఏమో కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా అది తమ బాధ అనుకునే పరిస్థితిలో మార్పు వచ్చింది. అసలు సమస్యలు కూడా తెలియని స్థితి వచ్చింది. సంబంధాల విచ్ఛిన్నం జరిగింది.
ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో భీమా 2, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలు మాత్రమే వున్నాయి. ఇవి కేవలం 14 టి.ఎం.సి.ల నికర జలాల పథకాలు. ఈ పథకాలలో కూడా నీరు తీసుకునేస్థాయి, నిలువ చేసుకునే స్థాయి చాలా తక్కువ. ఇక్కడ 95 శాతానికి పైగా వర్షం మీద, పాత చెరువుల మీద భూగర్భ జలాల మీద ఆధారపడి చేసే సేద్యమే. ఈ నియోజక వర్గంలోని ప్రజల మంచితనం వల్ల గత ప్రభుత్వాల దుర్మార్గం బయటికి రాలేదు. కోయిల్సాగర్, భీమా2 నీరు సరిగా అందటం లేదని నిలదీసే పోరాటాలు కూడా అంతగా లేవు. ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవు లేక అణిచివేస్తాయి.
భీమా ౧, భీమా 2 లోని నీటిని కొంత కొంత తగ్గించి ఒక టి.ఎం.సి. నీరు 15 వేల ఎకరాలకు బిందు సేద్యంతో ఇవ్వవచ్చునని లెక్కలు చేసి 2014లో 69 జీవో ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి అనే భారీ ఎత్తిపోతల పథకం ఈ ప్రాంతంలో చేపడతాం కనుక 69 జీవో అమలు కుదరదని తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం వారు దీనిని పక్కన పడేశారు. చేపడతామని చెప్పిన ఆ భారీ పథకాన్ని ఏకపక్షంగా జూరాల నుండి శ్రీశైలానికి మార్చారు. ప్రత్యామ్నాయం చూపలేదు, కనీసం ఆలోచించలేదు. గత్యంతరం లేక ప్రజలు 69 జీవో అమలుకు అనేక పోరాటాలు చేశారు. పదేళ్ల కాలం గడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పార్లమెంటు ఎన్నికల ముందు నారాయణపేట- కోడంగల్ ఎత్తిపోతల పేరుతో 69 జీవోను కొత్త నెంబరుతో ప్రవేశపెట్టారు. ఇది కొద్దిపాటి పాత చెరువులు నింపగలదు గానీ ఇక్కడి భూములకు కనీసస్థాయిలో కూడా నీరు ఇవ్వజాలదు. సరైన ప్రత్యామ్నాయాలు మాత్రమే ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధి రైతాంగాన్ని కాపాడగలవు.
1. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకపు నీరు ప్రతిపాదించిన విధంగా 50 వేల ఎకరాలకు ఇవ్వటానికి అవసరమైన చర్యలు
తీసుకోవాలి. (ప్రస్తుతం 12 వేల ఎకరాలకు కూడా ఇవ్వటం లేదు)
2. భీమా1 ఎత్తిపోతల పథకంలో 11 టి.ఎం.సీల పూర్తి నీరు తీసుకునే చర్యలు చేపట్టాలి.
3. పాలమూరు - రంగారెడ్డి పథకాన్ని రెండుగా విభజించగా వచ్చే సగం నీటిని జూరాల ప్రాజెక్టులోపల వీలైనంత ఎత్తులో కృష్ణా, భీమా, సగం నుంచి చేపట్టి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గమంతటికీ సాగునీరివ్వాలి. ప్రస్తుతం ప్రకటించిన నారాయణపేట కొడంగల్ పథకాన్ని - పేరు ఏదైనప్పటికి - ఇలా నిర్మించి నిర్వహించినా రైతాంగానికి న్యాయం జరుగుతుంది. సరైన నీటి కేటాయింపులు, తగిన ప్లానింగ్ లేకుండా చేపట్టే చర్యలు భ్రమలు కల్పించటానికే తప్ప, న్యాయం చేయడానికి పనికిరావు.
4. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జరిగిన నష్టం కేవలం నష్టంకాదు. ద్రోహం అని చెప్పాలి. ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం పథకంగా ప్రకటించి గోదావరి నీరు చేవెళ్ళ దాకా రాకుండా అడ్డుకున్నారు. పాలమూరు- రంగారెడ్డి పథకంలో చివరిదైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను అందరికందరూ ఎన్నికల హామీగా మిగిలించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బి. ఆర్.ఎస్. దారిలోనే రెండవ దశలో అంటున్నది. ఇది కూడా రంగారెడ్డి జిల్లాకు జరిగిన తీవ్ర అన్యాయం. పాలమూరు - రంగారెడ్డి పథకం రెండు భాగాలను, మల్లన్నసాగర్ లేదా బస్వాపూర్ నుంచి గోదావరి నీటిని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కు తీసుకురావాలి. తెలంగాణలో సముద్రమట్టానికి అత్యంత ఎత్తునవున్న ఈ ఈ ప్రాంతాన్ని అసలైన గోదావరి- కృష్ణ సంగమంగా అభివృద్ధి పరిస్తే ఇన్నాళ్ళ తెలంగాణ నీటి కష్టాలు ఒక సవ్యమైన పరిష్కారానికి చేరుతాయి. ఇది గత రెండు దశాబ్దాలుగా చర్చలో వున్న పరిష్కారమే.
5. కాకరవాణి వాగు నీటిని పూర్తి స్థాయిలో స్థానికంగా వినియోగంలోకి తేవాలి.
ఎక్కడ కురిసిన వాన నీటిని అక్కడ నిలిపి భూగర్భ జల పరిరక్షణ చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ నీరు ఎత్తిపోసుకునే అవసరం తగ్గే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో ఆ చివరన అధిక వర్షపాతం వుండి ఆదిలాబాదు, ఈ చివరన తక్కువ వర్షపాతం వుండి మహబూబ్ నగర్ కరువు జిల్లాలుగానే వున్నాయి. ఇది పాలకులు చూపిన వివక్ష ఫలితం లేక పాలకుల బాధ్యతా రాహిత్యమే కానీ ప్రకృతి వైఫల్యం కాదు. చుట్టూ నదులుండి నీరు లేదంటే పాలకులను, ప్రభుత్వాలను ఏమనాలి. నీటి ప్రాధాన్యతను ఆంధ్రప్రాంత పాలకవర్గం, అక్కడి ప్రజలు గుర్తించినట్టుగా, తెలంగాణ పాలక వర్గం ప్రజలు గుర్తించటం లేదు.
మనం సాగునీరు కావాలనగానే అధి భూములున్నవారి సమస్య అంటారు. ఎకరా భూమి మాత్రమే వున్న పేదలు భూస్వాములు కాదు గదా. మరికొందరు ఎత్తిపోతల పథకాల నిర్మాణం నిర్వహణ ఆర్థికంగా భారం అంటారు. రైతుకు ప్రత్యామ్నాయ పని గురించి ఆలోచించరు. పారిశ్రామిక కాలుష్యానికి దోహదపడే పెట్టుబడి వర్గాలకు లక్షల కోట్ల ప్రజాధనం దోచిపెడుతుంటే నిలువరించే ఉద్యమాలకు సహకరించరు. ఇంకొందరు రైతుకు సాగునీరు అందిస్తే అందరూ వరే వేస్తారు పంటల వైవిధ్యం దెబ్బతింటుంది అంటారు. ఈ వాదనలన్నీ కరువు ప్రాంత రైతాంగం మీద ఎక్కుపెడుతున్నామని ఆలోచించరు. ప్రజలు ఇతర ప్రాంత రైతాంగంతో పోల్చుకుని అడిగే చైతన్యంలోకి వచ్చి అడుగుతున్నారని, ఎంతకాలం ఏమీ అడగకుండా ఉండలేరని అనుకోరు.
అధికారం కోసం అర్రులుసాచే పార్టీలు ఎన్నికలముందు హామీలు ఇవ్వటం మీద చూపిన శ్రద్ధ, అధికారం చేపట్టిన తరువాత అమలు మీద చూపటం లేదు. ఇది మన స్వానుభవం. ఎన్నికల్లో గెలిచే దాకా పార్టీలు ప్రజల మధ్య మాట్లాడుతుండగా ఎన్నికల తరువాత కార్పోరేట్లు, వివిధ రంగాల మాఫియాలు ప్రభుత్వాలను తమకు అనుకూలంగా నడుపుకుంటున్నాయి. ప్రాబల్య ప్రాంతాలు కూడా లోపాయకారిగా ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నాయి. వెనుకకు నెట్టిన ప్రాంతాల బాగుకోసం ప్రత్యేక చర్యలు అవసరం. సాగునీటి సమస్యను హేతుబద్దంగా పరిష్కరించటం కోసం ప్రత్యేక చర్యలు అవసరం.
ఈ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గోదావరి - కృష్ణా నదుల స్వాధీన ఉత్తర్వుల రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి.
తెలంగాణ రాష్ట్రానికి సాధించిన నీటిని రాష్ట్రంలోపల న్యాయమైన ప్రాతిపదికలతో పునః పంపిణీ చేసి వినియోగంలోకి తేవాలి.
వర్షాభావ పరిస్థితులలో పంపిణీ లెక్కల ప్రకారం నీరు తీసుకోవచ్చును కానీ అధికనీటి లభ్యత వున్నపుడు అధిక నీరు తీసుకునేవిధంగా, అన్ని మండలలాలో మీడియం, మైనర్ రిజర్వాయర్లలో నీటి నిలువ చేసి పంపిణీ జరిపే విధంగా చర్యలు చేపట్టాలి.
నీటి లభ్యత కోసం సాగు, నిర్వహణ పరమైన సమస్యల దృష్ట్యా పంటల వైవిధ్యం కాపాడటం కోసంసాగునిర్వహణకు వ్యవసాయాధికారులను, నీటి నిర్వహణకు లష్కర్లను నిర్వాసితులను నియమించటం ద్వారా వారికి న్యాయం చేయాలి.
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీటి వనరుల కల్పనలో న్యాయం కోసం నిపుణులైన ఇంజనీర్లతో ఒక కమిటీవేసి అధ్యయనం చేయించాలి. ఆ నివేదిక అమలు కోసం కాలపరిమితితో అవసరమైన చర్యలు చేపట్టాలి.
చివరగా ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. ఇప్పుడు తెలంగాణలోనైనా, ఇతర ప్రాంతాలలోనైనా మహబూబ్ నగర్ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మహబూబ్ నగర్ కు మేలు జరుగుతుంది అంటున్నారు. కానీ ఏడాదిపాలన అనుభవం గతానికి కొనసాగింపుగానే వుంది. ఈ ఏడాది కాలంగా సాగునీటి పథకాల తీరు తెన్నులపై అధ్యయనం కోసం నిపుణులైన ఇంజనీర్లతో ఒక కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నాం. కేబినెట్ మీటింగ్ లో జనవరి 4న కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అదే మీటింగ్ లో ప్రజలు వ్యతిరేకిస్తున్న పాలమూరు- డిండిని ఆమోదిస్తు కూడా తీర్మానించారు. దీనికి నిరసనగా మేం జనవరి 5 నాడు నల్ల బ్యాడ్జీలతో ప్రదర్శన చేశాం. ఉద్యమంలో భాగంగానే ఈ సమావేశం జరుపుతున్నాం.
మహబూబ్ నగర్ ప్రాంతం శాశ్వత వెనుకబాటు తనంలో మిగిలి పోకుండా బాగుపడాలని కోరుకునే వారు కూడా తమ తమ జీవన రంగాలలో తులనాత్మక పరిశీలనతో ప్రభుత్వంపై అవసరమైన వత్తిడి నిర్మించి న్యాయం సాధించే కృషిలో వుండాలని కోరుతూ చాలా శ్రమ తీసుకుని ఈ సమావేశంలో పాల్గన్నందుకు అభినందనలు తెలుపుతు ఈ పత్రాన్ని చర్చించాలని, తక్షణం అవసరమైన, సమిష్టి ఉద్యమ నిర్వహణకు అచరణీయమైన సూచనలు చేయాలని కోరుతున్నాము.
(ఎం. రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్)
Next Story