రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కులాధిపత్య రాజకీయాలు
x

రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కులాధిపత్య రాజకీయాలు

నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ పాలనా విధానంలో చాలా ఆధిపత్య ధోరణలు వచ్చాయి. రాజ్యాంగాన్ని తమకు, దేశ ప్రయోజనాలకు అనుకూలంగా మార్పులు చేస్తూ వచ్చారు.


(డాక్టర్‌ కత్తి పద్మారావు)

భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు, తరువాత కూడా కాంగ్రెస్‌ (Congress) పార్టీ అనేక రూపాలు ధరించింది. మొదట్లో అదొక సంఘంగా తరువాత ఒక సంస్ధగా, తరువాత ఒక ఉద్యమ శక్తిగా తరువాత పోరాట శక్తిగా పరిణామం చెందింది. రాజ్యాధికారానికి వచ్చిన తరువాత మొదట్లో బ్రాహ్మణాధిపత్యం అంతర్గతంగా, సామ్యవాదాన్ని బహిర్గతంగా ద్వైదీకృత భావజాలంతో అది నడిచింది.

జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, పరిపాలనా విధానంలో అనేక ఆధిపత్య ధోరణలు వచ్చాయి. రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా కొన్ని సార్లు దేశ ప్రయోజనాలకు అనుకూలంగా కొన్నిసార్లు మార్పులు చేస్తూ వచ్చారు. అయితే లాల్‌బహుదూర్‌ శాస్త్రి, ప్రధాన మంత్రిగా చరణ్‌సింగ్‌ ప్రధాన మంత్రిగా వి.పి.సింగ్‌ ప్రధాన మంత్రిగా, పి.వి.నరసింహరావు(PV Narsimha Rao) ప్రధాన మంత్రిగా, వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా వున్న కాలంలో తప్పక నెహ్రూ కుటుంబం కంటే మెరుగైన పాలన జరిగిందని చెప్పవచ్చు.

ప్రధానంగా నరేంద్ర మోడీ పరిపాలన వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రతిపక్షంగా గుణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. అందులో ప్రధానమైంది మల్లిఖర్జున్‌ఖర్గె (Mallikarjun Kharge) కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షత వహించిన తరువాత రాహూల్‌ గాంధీ (Rahul Gandhi) ఆ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ ఉద్యమ రూపం వచ్చింది. ముఖ్యంగా 2024 డిసెంబర్‌లో కర్నాటక(Karnataka)లో జరిగిన కాంగ్రెస్‌ పీనల్‌లో ఒక గుణాత్మకమైన పరిణామానికి కాంగ్రెస్‌ పార్టీ తెర లేపింది. అది ప్రధానంగా మూడవ సారి నరేంద్ర మోడీ (Modi) ప్రధాన మంత్రి అయ్యాక బి.జె.పి. స్వతంత్రమైన ప్రభుత్వాధికారాన్ని చేపట్టలేకపోయింది. దాంతో కాంగ్రెస్‌ స్వరం పెరిగింది.

అయితే బి.జె.పి. ఆలోచనలకు ప్రత్యామ్నాయంగా అంబేడ్కర్‌ (Ambedkar) రాజ్యాంగాన్ని పార్లమెంటులోను, రాజ్యసభలోను ప్రతిపక్ష సభ్యులు ధరించటం వల్ల అంబేడ్కర్‌కు భారత రాజ్యాంగానికి కూడా ఒక ప్రత్యేకమైన భావజాల వ్యక్తిత్వం ఏర్పడిరది. అది హిందూ మతోన్మాదానికి ప్రత్యామ్నాయంగా తన స్వరాన్నే యివ్వగలిగింది. అయితే శశిధరూర్‌, చిదంబరం, జైరామ్‌ రమేష్‌ మేథోత్రయంగా వున్నారు. ఇందులో శశిథరూర్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర మీద ఒక గ్రంథాన్ని కూడా రాశారు. చిదంబరం తన ఆర్ధిక వ్యాపార శాస్త్రంలో బాణీ మార్చారు. జైరామ్‌ రమేష్‌(Jairam Ramesh) రాహూల్‌ గాంధీకి భావజాలం కూర్చే వారుగా వున్నారు.

అయితే వీరు ఈ సంవత్సరాన్ని అంబేడ్కర్‌ రాజ్యాంగవత్సరంగా ప్రకటించారు. అయితే ఆయా రాష్ట్రాల్లో కులాధిపత్య భావజాలం వున్న వారికి పార్టీకి నిధులు సమకూర్చే వారికి అధికారం అప్పజెప్పటం వల్ల వారు రాజ్యాంగంలోని సామాజిక న్యాయానికి దళిత బహుజన స్త్రీల అభివృద్ధికి పూర్తిగా అనుకూలంగా లేరు. ఈ సంక్షోభంలో కాంగ్రెస్‌ పార్టీ వుంది. ఒకపోతే బి.జె.పి. మరియు ఆయా ప్రాంతీయ పార్టీల రాష్ట్ర పాలకుల్లో ఎక్కువ మంది కుల, పెట్టుబడి దారీ సామ్రాజ్యవాద భావాలు ఉన్నవారే. యన్‌.డి.ఏ(NDA) భాగస్వామ్య పక్షాలుగా వున్న అగ్రకుల ఆధిపత్య పార్టీలు కేంద్ర భావజాలానే అమలు జరుపుతున్నాయి.

ఇకపోతే అగ్రకుల మేధావులు, తమ మేధస్సుతో కులాధిపత్య రాజ్యాధికారానికి కొమ్ముకాస్తున్నారు. దేశంలో అత్యున్నత పదవులు పొంది, దేశం మొత్తానికి కొన్ని అంశాల్లో ప్రాతినిధ్యం వహించిన కొందరు మేధావులు కూడా తమ చిన్న కులాలను జాతీయ, అంతర్జాతీయ విస్తృతికి పెంచాలనే భావనతో ఆయా వేదికల మీద కులాధిపత్య భావ జాలాన్ని ప్రచారం చేస్తున్నారు. భూములు, విద్య, వ్యాపారం, ప్రకృతి వనరులు అన్ని రాష్ట్రాల్లో ఐదు కులాలు చేతుల్లో గుత్తస్వామ్యంగా ఉండడానికి ఈ మేధావులు, తమ అంకెల సామర్ధ్యాన్ని అక్షర నైపుణ్యాన్ని ఉపయుక్తం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అంతర్గతంగా నిరాకరిస్తూ ఎవరికి వారు తమ కులాధిపత్య ప్రణాళికలు రూపొందించుకొను విస్తృతమైన సమాజంలో కూడా సంకుచిత సమాజాలను నడపగలుగుతున్నారు.

ఇకప్రపంచ వ్యాప్తంగా మన దేశం వెనకబడి వుండడానికి కారణం అంతర్గత కులాధిపత్య భావమని మనకు అర్ధం అవుతుంది. మరికొన్ని కులాల వారు ఆయా రాష్ట్రాలలో తమ కులాలు తమ వర్ణాల వారినే అత్యాధునిక ఉపాధి అవకాశాలను కొల్లగొట్టేవారిగా మార్చుకుంటున్నారు. మొత్తం దళిత బహుజన మైనార్టీలకు ఇండియాలో అత్యాధునిక విద్యా అవకాశాలను మృగ్యం చేయటం వలన మనం వాటిని అందుకోవటంలో వెనుబడిపోతున్నామని పరిశోధకులు, సామాజిక విద్యావేత్తలు చెబుతున్నారు. సర్కారీ బడిని కులాధిపత్య భావజాలంతోనే నిర్లక్ష్యం చేస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్ధం అవుతుంది. మన దేశం అత్యాధునిక విద్యను, అందుకోవడంలో మన రాష్ట్రాల నిర్లక్ష్యాన్ని ఆర్ధిక సామాజిక విశ్లేషకులు ఇలా విశ్లేషిస్తున్నారు. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, బిగ్‌డేటా ఎనలిటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వ్యాప్తితో అనేక రంగాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అవి ఉపాధి అవకాశాలెన్నింటినో మోసుకొస్తున్నాయి. వాటిని అందిపుచ్చుకునేలా యువతను తీర్చిదిద్దడంలో మన చదువులు పూర్తిగా తేలిపోతున్నాయి.

అందుకే గ్లోబుల్‌ టాలెంట్‌ కాంపిటేటివ్‌నెస్‌ ఇండెక్స్‌ (జీటీసీఐ)లో 134 దేశాల సరసన ఇండియాకు 103వ ర్యాంకు దక్కింది. సాటి బ్రిక్స్‌ రాజ్యాలు ` చైనా(40వ ర్యాంకు), రష్యా(52), దక్షిణాఫ్రికా(68), బ్రెజిల్‌ (69)తో పోల్చినా, జీటీసీఐలో భారతావని బాగా వెనకబడిరది. పాఠశాల దశ నుంచే సాంకేతిక విద్యాబోధనకు ప్రాధాన్యమిస్తున్న పలు దేశాలు`రేపటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సత్తాను తమ విద్యార్ధులకు అలవరుస్తున్నాయి. మన దగ్గరేమో ముఖ్యంగా సర్కారీ బడులు కంప్యూటర్లకే మొహం వాస్తున్నాయి. ఆర్ధిక సహకార, అభివృద్ధి సంస్ధ (ఓఈసీడీ) నివేదిక ప్రకారం ` ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిన్‌లాండ్‌లలో 90శాతానికి పైగా పిల్లలు విద్యాభ్యాసం కోసం డిజిటల్‌ ఉపకరణాలను వినియోగిస్తున్నారు. పాఠశాలలకు ప్రత్యేక సాంకేతిక ప్రణాళికను సిద్ధం చేసిన పోర్చుగల్‌ 2000`2008 మధ్యలోనే తరగతి గదుల్లో కంప్యూటర్‌, ఇంటరాక్టివ్‌ బోర్డులను ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయుల డిజిటల్‌ నైపుణ్యాలను పెంచడంపై అపరిమిత శ్రద్ధ వహిస్తున్న జర్మనీ ` సాంకేతికత ద్వారా పాఠ్యాంశాలను పిల్లలకు సుబోధకం చేస్తోంది. కంప్యూటర్‌ కోడిరగ్‌ను పాఠశాలలకు చేర్చిన అమెరికా ఆధునిక ప్రపంచంలో నెగ్గుకొచ్చే ప్రజ్ఞను నవతరానికి చిన్నప్పటి నుంచే అందిస్తోంది.

మన దేశంలోనేమో 10.17 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కంప్యూటర్లు, అంతర్జాల సదుపాయం కలిగిన బడుల సంఖ్య అయిదు లక్షల కంటే తక్కువే. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, రaార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లోని సర్కారీ పాఠశాలల్లోనైతే డిజిటల్‌ బోధనా వసతులు మరీ అధ్వానంగా ఉన్నాయి. రాజ్యాంగంలోని 14.15.16 అధికరణల్లో సమానత్వపు హక్కు, చట్టం ముందు అందరూ సమానులే అనే హక్కు స్పష్టంగా వున్నాయి. ముఖ్యంగా అధికరణం 15 కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశం కారణాలుగా వివక్షతకు తావులేదు అని చెప్పబడిరది.

ఈ విషయాన్ని అంబేడ్కర్‌ చాలా స్పష్టంగా రాజ్యాంగ సభల చర్చల్లో చెప్పారు. అయితే రాజ్యాంగాన్ని చేతబట్టుకొన్న రాహూల్‌ గాంధీ తమ పార్టీల పాలనలో వున్న తెలంగాణా ప్రభుత్వంలోగాని, కర్నాటక ప్రభుత్వంలోని దళిత, బహుజన వర్గాల విద్యా వ్యవస్ధల పటిష్టానికి బడ్జెట్‌ కేటాయింపులను పెంచారా? గురుకుల పాఠశాలల్లో బాలికల ఆరోగ్యస్ధితి అధ్వాన్నమయినపుడు రాహూల్‌ గాంధీగాని, ప్రియాంక గాంధీ గాని సందర్శించారా? మెరుగు పరచడానికి ఏమైన ప్రయత్నం చేశారా అనే ప్రశ్న మన ముందు ఇప్పుడు వుంది. అలాగే తెలుగు దేశం ప్రభుత్వంలో మద్యపానం విపరీతంగా పెరిగింది. విధవరాండ్ర సంఖ్య పెరుగుతుంది. అమ్మఒడికి ఎసరు పెట్టి ప్రాథమిక విద్యకు గొడ్డలివేటు వేస్తున్నారు. ఇప్పటికే అమలు అవుతున్న ఇంగ్లీషు విద్యను తొలగించే జి.ఓ.లు ఇస్తున్నారు.

కుల వివక్షను స్పష్టంగా అమలు జరుపుతూ అమరావతిని కులాధిపత్య, ఆర్ధిక కేంద్రంగా మలుసున్నా అంతర్గతంగా తెలుగు దేశానికి సపోర్టు చేస్తూ నరేంద్రమోడీ గారిని మాత్రం విమర్శిస్తున్నాయి. ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం, బి.జె.పి., సి.పి.యం పార్టీల కార్యదర్శులందరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారవ్వడం దళిత, బహుజన మైనార్టీ వర్గాలకు పెద్ద ఎత్తున సామాజిక ఆర్ధిక విద్యా నిరాకరణ జరుగుతుందని చెప్పక తప్పదు. నిజానికి ఈ ఆధిపత్య కులాల యొక్క మేథావులు అనేక పేరులతో సంస్ధలు పెట్టి, తమ కులాల సమీకరణని ఆర్ధిక సామాజిక, రాజకీయ సమీకరణలోను ఆధిపత్యాలను వ్యూహాత్మకంగా పెంచుకుని బహుజన దళిత మైనార్టీల సంబంధించిన ప్రభుత్వ వ్యవస్ధలను సంస్ధలను నిర్వీర్యం చేస్తున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాలను బహుజన దళిత మేధావులు గ్రహిస్తున్నారు. రాజ్యాంగాన్ని కొందరు ద్వేషిస్తూ కనిపించినా, ఇద్దరి ప్రవర్తనలో దగ్గర దగ్గర పోలికలున్నాయని ఆశక్తికర అంశం. నిజానికి వామపక్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం మీద కాని, దళిత బహుజనుల ఆధునిక సాంకేతిక విద్యా ప్రమాణాల పెంపు విషయంపై కానీ ఎందుకు పోరాటం చేయడంలేదు. ముఖ్యంగా తెలంగాణా ప్రభుత్వం అంబేడ్కర్‌ స్మృతివనాన్ని పరిపాలనకు వచ్చిన పదినెలలైనా ఎందుకు పట్టించుకోలేదు ఆశ్చర్యం రెడ్డి, వెలమ తగాదా రాజకీయంగానే అక్కడ నడుస్తుంది.

నిజానికి బి.జె.పి. ఒక ప్రక్క కొంత ప్రజాస్వామికంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా డా॥బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆలోచనలకు వ్యతిరేకంగా వారి శ్రేణులు ప్రవర్తిస్తున్నాయని వారికి స్పష్టంగా తెలుసు. ఇప్పటికీ బి.జె.పి. పరిపాలనలో వున్న ఉత్తర ప్రదేశాల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూనే వుంది. అస్పృశ్యత నిరక్షరాస్యులు బి.జె.పి. పరిపాలనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అన్నీ రాష్ట్రాలలో అగ్రకులాధిపత్య కార్పోరేట్‌ బానిసత్వ లక్షణాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. మరోపక్క ఆదివాసీల మీద వారి సంపదను దోచుకోవడానికి జరుగుతున్న విదానాలు సామాజిక ఆర్ధిక వేత్తలు ఆందోళనలు చెందుతున్నారు.

చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో విస్తారమైన ఖనిజ సంపద ఉంది. అక్కడ ఇనుము, బొగ్గు, గ్రానైట్‌, సున్నపురాయి, యురేనియం వంటి విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఖనిజ సంపదను బహుళజాతి గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. వీరికి మావోయిస్టుల మద్దతు ఉంది. అభివృద్ధి పేరుతో జరిగే ఖనిజ తవ్వకాలతో పర్యావరణ విధ్వంసం, అటవీ విధ్వంసం జరుగుతోంది. పరిశ్రమల స్ధాపన వత్త గిరిజనుల అవాసాలు ఛిద్రమవుతున్నాయి. గిరిజనులు పునరావాసం పట్ల శ్రద్ధ చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఆదివాసులు జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా మైనింగ్‌ చర్యలు కొనసాగుతున్నాయి. కాబట్టి కార్పోరేట్‌ సంస్ధల దోపిడీని అనుమతించబోమని అదివాసులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. ఎలాగైనా ఖనిజాలను కార్పొరేట్లకు దోచిపెట్టాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందుకే గిరిజనుల కట్టబెట్టడానికి ఉద్యమిస్తున్న గిరిజనులపై పారా మిలిటరీ బలగాలను పంపుతుంది. సల్వాజుడుం, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌, ఆరపరేషన్‌ కగార్‌ పేర్లతో అమాయక గిరిజనుల ప్రాణాలు తీస్తోంది. అయినా ఆదివాసుల ఆందోళన ఆగడం లేదు. నిజానికి భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో వున్న ఇండియా కూటమి గాని యన్‌.డి.ఎ.లో వున్న పార్టీలు గాని ఇతర ప్రాంతీయ పార్టీలు గాని, దళిత బహుజనుల విద్య, ఆర్ధిక వ్యవస్ధల అభివృద్ధి అంబేడ్కర్‌ రాజ్యాంగ స్పూర్తితో నడిచినట్లైతే భారతదేశం అన్ని సూచనల్లోను మొదటి పది స్ధానాలను ఒకటిగా ఆవిర్భవించగలదు. రాజ్యాంగాన్ని ధరించడం కాదు. రాజ్యాంగాన్ని అనుసరించడం ముఖ్యం. రాజ్యాంగ స్పూర్తే భారతదేశ పునఃరుజ్జీవనానికి మార్గం.

(డాక్టర్‌ కత్తి పద్మారావు,/లుంబిని వనం,

అంబేద్కర్‌ రీసెర్చ్‌ సెంటర్‌, పొన్నూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌)

Read More
Next Story