MUMBAI Dogs ఎయిర్ పోర్టులో భావోద్వేగాలకు కుక్కలతో చెక్!
x
At MIAL terminal -2 Dog team

MUMBAI Dogs ఎయిర్ పోర్టులో భావోద్వేగాలకు కుక్కలతో చెక్!

పిల్లలో, తల్లిదండ్రులో, ప్రేమికులో, అయినవాళ్లో, అత్యంత సన్నిహితులో, ఆత్మీయులో దూరం అవుతున్నప్పుడు మనసు వికలం కావడం సహజం. ఆ బాధ నుంచి ఉపశమనం కోసమే ఈ డాగ్స్..


"నాన్న, జాగ్రత్త. ఏ మాత్రం ఇబ్బంది పడకు, అమ్మ జాగ్రత్త.. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే కాల్ చేయండి. ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు నేను వీడియో కాల్ చేస్తుంటాను లే" అని కళ్ల నీళ్లు వత్తుకున్నాడు డేవిడ్ జార్జ్, అనసూయ దంపతుల ఏకైక కుమారుడు సంజీవ్. ఉన్నత చదువుల కోసం విదేశాలకు బయలుదేరిన తమ బిడ్డకు వీడ్కోలు పలికేందుకు ముంబై విమానాశ్రయానికి వచ్చిన ఆ తల్లిదండ్రులు- తమ కుమారుడు దూరమవుతున్నాడనే ఆవేదన ఉన్నా వాళ్లు కంట్రోల్ చేసుకున్నారు. తల్లిదండ్రుల్ని వదిలి వెళుతున్న కుమారుడు మాత్రం కన్నీరు ఆపుకోలేక పోయాడు. భళ్లుమన్నాడు. కన్నీరు పెట్టుకుంటూనే తన బ్యాగేజీతో సెక్యూరిటీ చెక్ దాటి వెళ్లాడు. ఇక, ఇప్పుడు తల్లిదండ్రుల వంతైంది. అప్పటిదాకా ఆపుతున్న మనసులోని వేదన ఒక్కసారిగా బయటపడింది. వాళ్లూ చలించిపోవాల్సి వచ్చింది..

ముంబై విమానాశ్రయంలో డాగ్స్ తో ఆటాడుకుంటున్న చిన్నారులు (ఫోటో-Instagram)

ఇలాంటి భావోద్వేగ దృశ్యాలు ప్రతి ఎయిర్ పోర్టులో మనం నిత్యం చూసేవే. పిల్లలో, తల్లిదండ్రులో, ప్రేమికులో, అయినవాళ్లో, అత్యంత సన్నిహితులో, ఆత్మీయులో దూరం అవుతున్నప్పుడు మనసు వికలం కావడం సహజం. ఇలాంటి మనో భావోద్వేగాలను కంట్రోల్ చేసేందుకు, ఆ బాధను మరిపించేందుకు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఎఎల్) అధికారులు ఓ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఫాఫెక్ట్ (Pawfect). టెర్మినల్ 2లో ప్రవేశపెట్టారు. దేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఏకైక ఎయిర్ పోర్ట్ ఇదే (MIAL).
ఏమిటీ ఈ పాఫెక్ట్...
ఇదో డాగ్ స్క్వాడ్. ఇందులో 9 రకాల కుక్కలు ఉంటాయి. గోల్డెన్ రిట్రీవర్, మాల్టీస్, హస్కీ, షిహ్ త్జు, లాసా అప్సో, లాబ్రడార్ వంటి తొమ్మిది శిక్షణ పొందిన కుక్కలు ఈ టీమ్ లో ఉంటాయి. ఒక్కో కుక్కకు ఒక్కో పేరు పెట్టారు. టెర్మినల్-2లో ఈ పెంపుడు జంతువులు అందుబాటులో ఉంటాయి. టెర్మినల్-2 ఇంటర్నేషనల్ విమాన రాకపోకల ప్రాంతం. టెర్మినల్-3. డొమెస్టిక్ అంటే దేశీయ విమానాల రాకపోకల ఏరియా.

ఇమిగ్రేషన్ ఏరియాలో ఈ కుక్కల్ని ఉంచుతారు. పెంపుడు జంతువులంటే ఇష్టపడని వారుండరు. మనసులోని బాధను మరిపించడానికి పెంపుడు జంతువులు బాగా తోడ్పడతాయన్నది మానసిక శాస్త్రవేత్తల మాట. వీటితో ఆడుకుంటూ మనసులోని బాధను మరచిపోవొచ్చు. విమానం ఎక్కిన తర్వాత ఏదో ఒక కాలక్షేపం ఉండనే ఉంటుంది కనుక ఆ లోపు ఈ డాగ్స్ స్క్వాడ్ తో ఆడుకోవచ్చు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ డాగ్స్ స్క్వాడ్ ఉంటుంది. ప్రయాణీకులు బాగా రద్దీగా ఉండే మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య ఇవి ఉంటాయి.
వాస్తవానికి ఇది కొత్త స్కీమ్ కాదు. గతంలో కూడా ఉండేది. బాగా పాపులర్ కూడా అయింది. జనాదరణ పొందిన ఈ కార్యక్రమాన్ని కరోనా-19 మహమ్మారి ప్రబలిన సమయంలో ఉపసంహరించారు. ఇప్పుడు తిరిగి ప్రారంభించారు.
ప్రయాణీకుల్లో ఆందోళనను తగ్గించడం, విమానాశ్రయంలో ప్రయాణీకులను ఉల్లాసంగా ఉంచేలా చూడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ పెంపుడు కుక్కలలో బెల్లా (గోల్డెన్ రిట్రీవర్) ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్. సామాన్య ప్రయాణీకుల మొదలు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సైతం బాగా ఆడుకునేలా తర్ఫీదు ఇచ్చారు ఈ గోల్డెన్ రిట్రీవర్ కి.
మనుషుల మూడ్ కి తగ్గట్టుగా నడుచుకునేలా కుక్కలకు శిక్షణ..
ఏ మనిషి ఏ తరహా మూడులో ఉన్నాడో పసిగట్టి వాళ్ల దగ్గరకు వెళ్లి మచ్చిక చేసుకునేలా ఈ కుక్కలకు తర్ఫీదు ఇచ్చారు. ప్రయాణాల్లో చాలామందికి ఓ రకమైన ఆతృత, కనిపించని టెన్షన్ ఉంటుంది. అది తగ్గించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముంబై విమానాశ్రయాన్ని ఇప్పుడు అదానీ ఏయిర్పోర్ట్ హోల్డింగ్స్ (AAHL) నిర్వహిస్తోంది. ఈ డాగ్స్ స్క్వాడ్ నిర్వహణ బాధ్యతను కూడా ఏయిర్ పోర్ట్ అధికారులే చూస్తున్నారు.
ఇప్పటి వరకు దొంగల్ని, అనుమానితుల్ని, ఏదైనా నేరం జరిగినపుడు ఆనవాళ్లు కనిపెట్టేందుకు డాగ్స్ ను వదిలేవాళ్లు. ఇప్పుడు మనుషుల మానసికస్థితిని పసిగట్టేందుకు కూడా ఏయిర్ పోర్టులో ఈ కుక్కల్ని వదులుతారు. ఇవి ప్రయాణీకులు కూర్చున్న చోటుకు వెళ్లి వాసన చూస్తూ తచ్చాడుతుంటాయి. ఏదైనా పెంపుడు జంతువు కనబడడంతోనే స్పందించడం మానవ స్వభావం. అలా ఈ కుక్కలు దగ్గరికి వచ్చినపుడు వాటిని ముద్దు చేయడం, కాసేపు ఆడుకోవడం చేస్తే వత్తిడితో పాటు మనసులోని బాధ కూడా తగ్గుతుంది. ఓ రకమైన రిలాక్స్ మూడ్ లోకి ప్రయాణీకులు వస్తుంటారు.

ముంబై విమానాశ్రయంలో డాగ్స్ స్క్వాడ్స్ (ఫోటో-Instagram)

ఈ సీన్ ను తోటి ప్రయాణీకులో, పెంపుడు జంతువులంటే ఆసక్తి ఉండే వాళ్లో చూసినపుడు వాళ్లు కూడా మాటా మాటా కలపడం, "మా ఇంట్లో కూడా అచ్చం ఇలాంటి బుజ్జి ముఖందే ఉందని" గోముగా చెప్పుకోవడం చేస్తుంటారు. ఒక్కసారి మాటల్లో పడితే మనసులోని బాధ మాయమవుతుంది. విమానాల కోసం ఎదురుచూసేటపుడు ఇలాంటివి గొప్ప రిలీఫ్ ఇస్తాయి. పెంపుడు జంతువుల్ని ముద్దు చేయడం, మచ్చిచేసుకోవడం పెద్ద కళ.

ఇంటర్నేషనల్ విమానాలు వెళ్లిపోయాక ఈ కుక్కల్ని దేశీయ విమాన సర్వీసుల కోసం ప్రయాణీకులు ఎదురుచూసే ప్రాంతంలో వదులుతారు. నిర్దిష వేళల్లో మాత్రమే ఈ డాగ్స్ స్క్వాడ్స్ తిరుగుతుంటాయి. కుక్కలు అందించే ఈ సేవకు ఎటువంటి ఫీజు లేదు. ఉచితమే.
ఈసారి మీరు ముంబై వెళ్లినపుడు ఈ డాగ్స్ స్క్వాడ్ తో కాసేపు కాలక్షేపం చేసిరండి.
Read More
Next Story