ఇథనాల్ ప్లాంట్ అంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?
x

ఇథనాల్ ప్లాంట్ అంటే ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?

ఏడాదిగా 54 గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.ఆందోళన చేస్తున్నారు. ధర్నా చేస్తున్నారు. పోలీసుల లాఠీ దెబ్బలు తింటున్నారు...


రెండు తెలుగు రాష్ట్రాలను ఒక భూతం ఆవహించింది. అదిపర్యావరణాన్నే కాదు, మనుషుల ప్రాణాలను కూడా కబళిస్తోంది. ఆ భూతం పేరు ‘ఇథనాల్’ (ఇత్తనాలు). ఈ ఇథనాల్ భూతాన్ని తరిమేయడానికి మేధావులే కాదు, రైతులు, సాధారణ ప్రజలు కూడా నడుం బిగించారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుత నారాయణ్ పేట జిల్లా చిత్తనూరులో నిర్మించిన ఇథనాల్ ఫ్యాక్టరీ విడుదల చేసే కాలుష్యానికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఆ అనుభవంతో నిర్మల్ జిల్లా గుండంపల్లి గ్రామ సమీపంలో నిర్మించదలచిన ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, అనంతపురం, ఖమ్మం జిల్లాల్లోనూ నిర్మించదలచిన ఇలాంటి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు.

భయపెడుతున్న ఇథనాల్ ప్లాంట్ ఇదే

నారాయణ్ పేట్ జిల్లా చిత్తనూర్ లో పండ్ల రసాల ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి 20.5 ఎకరాల అసైండ్ భూములను ఆక్రమించారు. ఈ భూములన్నీ ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందినవి. ఎక్లనూర్-చిత్తనూరు, జిన్నారం-లంకాల మధ్య ఉండే రెండు నక్షబాటలను కూడా ఆక్రమించారు. సరళీకరణ ఆర్థిక విధానంలో భాగంగా ఈ విధ్వంసం జరుగుతోంది. ఆహార ధాన్యాన్ని సైతం ఇందనంగా ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించారు. ‘జూరాల ఆర్గానిక్ ఫార్మ్ మరియు ఇండస్ట్రీస్’ పేరుతో ఈ ఫ్యాక్టరీ పెట్టే టప్పుడు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతిని పొందారు. గత ఏడాది ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రజలు భయపడినట్టుగానే జరిగింది.

ఇథనాల్ కాలుష్యా నికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలు


ఇథనాల్ ముప్పు


ఇథనాల్ ఫ్యాక్టరీ విషరసాయ నాలను అక్కడికి సమీపంలోని మన్నె వాగుతో పాటు పొలాల్లో, పొలంగట్లపైన, రోడ్ల పక్కన పారబోశారు. మన్నె వాగు కలుషితమైపోయింది. ఈ వాగులోని లక్షలాది చేపపిల్లలు చనిపోయాయి. ఈ వాగులో నీళ్ళు తాగిన పశువులు, వన్యప్రాణులు కూడా చనిపోయాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తిరుగాడే జింకలు అనేకం మరణించాయి. ఆ నీళ్ళలో స్నానం చేసిన చరణ్ అనే బాలుడి ఒంటి నిండా దద్దుర్లు ఏర్పడి నెలరోజుల పాటు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు.
ఇథనాల్ వల్ల మానవాళికి ముప్పు ఏర్పడుతోంది. శరీరాన్ని నియంత్రించే మెదడు పనితీరుపైన ప్రభావం కలగచేస్తుందని ‘సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబి) పరిశోధనలో వెల్లడైంది. ఇథనాల్ వల్ల మెదడు స్పందించే గుణాన్ని కోల్పోతుంది. దీని వల్ల జీవ క్రియ మందగిస్తుంది.
ఇథనాల్ వ్యర్థాల విడుదల వల్ల మన్నె వాగుతో పాటు ఊకచెట్టి వాగు, రామన్ పాడుడ్యాం, కష్ణానది జలాలు కలుషితం అవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 54 గ్రామాల్లో తాగు నీరు, సాగు నీరు కలుషితమయ్యాయి. ఈ ఫ్యాక్టరీకి 25 కిటోమీటర్ల పరిధిలోని ప్రజలు ఈ కాలుష్యానికి గురవుతున్నారు.

కాలుష్యం గురించి ఉన్నతాధికారులకు వినతి పత్రం అందిస్తున్న చిత్తూనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక కమిటి ప్రతినిధులు


ఇథనాల్ దేనికి వాడతారు?


ఇథనాల్ ను మద్యం, పర్ఫ్యూమ్, ప్లాస్టిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. పెట్రోల్ లో ఇథనాల్ కలిపి వాడడం వల్ల ఇందన ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోల్ లో ఇథనాల్ ను 20 శాతం కలిపి 2025 నాటికి వాడాలని, ఫలితంగా పెట్రో కంపెనీలకు లాభాలు చేకూరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫలితంగా ఒక్క తెలంగాణాలోనే 15 ఇథనాల్ కంపెనీలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఊపందుకున్న ఆందోళన

ఇథనాల్ దుష్పలితాలను చవి చూసిన మేధావులు, రైతులు, సాధారణ ప్రజలు ఈ ఇథనాల్ కంపెనీ మూసివేయాలని ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కంటే ముందు పద్నాలుగు సంఘాలతో కలిసి ఏర్పడిన 'చిత్తనూర్ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ'ని ఏర్పాటు చేసి పర్యావరణ అధికారులకు, జిల్లా అధికారులకు వినతులు సమర్పించారు. ఈపోరాటంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ బాబూరావు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం. రాఘవాచారి తదితర మేధావులు పాలుపంచుకున్నారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, మానవహక్కుల ఫోరం, పౌరహక్కుల సంఘం ప్రతినిధులు తరుచూ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ఉద్యమానికి తమ మద్దతు తెలిపారు. రౌండ్ టేబుల్ సమావేశాలూ నిర్వహించారు. రెండు సంవత్సరాలుగా అధికారులను నిలదీస్తూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. కాలుష్య నియంత్రణ మండలి టాస్క్ ఫోర్స్ గతనెల 4వ తేదీన సమావేశమై, ఇథనాల్ ఫ్యాక్టరీ పైన చర్యతీసుకోవాలని ఆదేశించింది. కానీ ఫలితం లేదు.
గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన రోడ్డు పక్క పారపోయడానికి తీసుకెళుతున్న ఇథనాల్ కాలుష్య రసాయన ట్యాంకర్ ను ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో చిత్తనూరు, ఎక్లాన్ పూర్, జిన్నారం తదితర గ్రామాల ప్రజలు ఎక్లాన్ పూర్ గేటు వద్ద 16 గంటల పాటు ధర్నాకు దిగారు. ట్యాంకర్ ను పరిశీలించడానికి తహసీల్దార్ అయిదుగురు రైతులను తీసుకుని వెళ్ళారు.

పోలీసుల లాఠీ చార్జి, కేసులు

ఆ మర్నాడు అక్టోబర్ 22 వ తేదీన ధర్నా చేస్తున్న ప్రజలపైన పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. తహసిల్దార్ అక్కడే ఉన్నా, ఆమె అనుమతి తీసుకోకుండానే పోలీసులు లాఠీ చార్జ్ కు దిగారు. ఈ లాఠీ చార్జిలో చాలా మందికి తలలు పగిలాయి. పోలీసులు ఇళ్ళలోకి చొరబడి 78 మంది రైతులను అరెస్ట్ చేశారు. చాలా మంది గ్రామాలను వదిలేసి పట్టణాల్లో తలదాచుకున్నారు. ఇలా ప్రజలు భౌతిక, మానసిక హింసకు గురయ్యారు. ఎనభై సంవత్సరాల ఖాసీం గాయడి ఆస్పత్రి లో రెండు నెలలుగా చికిత్స పొందాడు. తరువాత కూతురు ఇంట్లో గత నెల 27వ తేదీన మృతి చెందాడు. ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు లాఠీ చార్జ్ వల్ల ఒక నిండుప్రాణం బలయ్యింది.
అరెస్టయిన వారిలో 30 మందికి మాత్రమే బెయిల్ మంజూరైంది. కొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నా పోలీసులు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. బెయిల్ మంజూరు సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కాకుండా మీరెందుకు అక్కడికెళ్ళారని పోలీసులను జిల్లా జడ్జి ప్రశ్నించగా, దానికి పోలీసుల నుంచి సమాధానం రాలేదు.


ఒక ఏడాదిగా కొనసాగుతున్న ఆందోళన


లాఠీ చార్జి చేసిన తరువాతనే తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పందించింది. చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ బాధిత రైతులపై లాఠీ చార్జ్ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ, దీనిపైన విచారణ జరిపి బాధ్యుల పైన చర్య తీసుకోవాలని తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ నారాయణ్ పూర్ కలెక్టర్ కు, ఎస్పీకి మెమో ఇచ్చారు. ఈ కంపెనీ యజమాని పార్థ సారథిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు పంపించింది. మరో భాగస్వామి కిష్ణన్న గారి లక్ష్మగౌడ్ కి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టు ఇచ్చినా ఓడిపోయారు. నారాయణ పేట పరిధిలోని ఎమ్మెల్యేలంతా కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఇథనాల్ కంపెనీ మూసివేతకు ఎన్నికల ముందు హామీ ఇచ్చినా, ఆ దిశగా ఇప్పటి వరకు అంగుళం కూడా కదలలేదు.


ఇతర జిల్లాల్లో

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో గుండంపల్లి గ్రామం వద్ద 4 లక్షల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని నిర్మించ డానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆందోళన చేస్తున్న రైతులకు బేడీలు వేసి తీసుకెళ్ళారు.
ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లు తుందో చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ కాలుష్య పోరాట కమిటీ నాయకులు గ్రామ గ్రామాన తిరిగి ప్రచారం చేస్తున్నారు. పదకొండురోజులలో 54 గ్రామాలు తిరిగి అన్ని మండల కేంద్రాల్లో సదస్సులు, ధర్నాలు చేపట్టారు. మానవాళి భవిష్యత్తు కోసం, ప్రకృతిని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ ఆందోళన చేపట్టినట్టు పోరాట నాయకులు చెపుతున్నారు.

చంద్రగిరి సమీపంలో ..

ఇథనాల్ ఫ్యాక్టరీ లాగానే తిరుపతి సమీపం లోని చంద్రగిరి వద్ద sistyne ప్యాక్టరీ ని మూడు దశాబ్దాల క్రితం నెల కొలిపారు. వెంట్రుకల నుంచి L sistyne, C sistyne అన్న రసాయనాలను ఉత్పత్తి చేసే వారు.ఈ రసాయనాలను దగ్గు మందుల తయారీ లో ఉపయోగిస్తారు.
ఆ ప్యాక్టరీ వ్యర్తాలను నేలలోకి విడుదల చేయడం వల్ల మూడు కిలోమీటర్ల పరిధిలో ని పంటలన్నీ దెబ్బ తిన్నాయి. నిజానికి ఈ వ్యర్తాలను పెద్ద పెద్ద సిమెంట్ తొట్ల లో మూడు నెలలు నిల్వ చేసి , తరువాత భూమి లోకి వదిలి నా నష్టం జరగదు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం తో చాలా నష్టం జరిగి పోయింది.
రైతులు ఆందోళన చేయడం తో ఆ ఫ్యాక్టరీ ని మూసివేశారు. రైతుల పంట నష్టాన్ని ఎవరు పూడ్చు తారు!? ఎలాపూడ్చు తారు!?


Read More
Next Story