
ఆ టీచర్ ఆదివాసీ చీకటి బతుకుల్లో వెలుగు కిరణం
ఆదివాసీల కష్టాలు ఈ టీచర్ ని ఫుల్ టైం సంఘ సేవకుడిగా మార్చాయి.
-రామగిరి ఏకాంబరం
కొన్నిసార్లు జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న సంఘటనలే మన జీవిత గమనాన్ని మార్చివేస్తాయి. కొత్త ఆలోచనల వైపు దారులు వేస్తాయి. అలా జరిగిన ఒక చిన్న సంఘటనే తోలెం శ్రీనివాసరావు గారి జీవితాన్ని గిరిజన గుడేలా వైపు మళ్ళించేలా చేసింది. స్వచ్ఛంద సేవలో అంకితభావంతో ముందుకు సాగుతూ, నిస్వార్థంగా సహాయం అందించే వ్యక్తుల సంఖ్య అరుదుగా ఉంటుంది. అలాంటి కొద్దిమందిలో ఒకరు తోలెం శ్రీనివాసరావు. ఆదివాసి సామాజిక వర్గానికి చెందిన ఆయన, తన జీవితాన్ని పేదలకు, నిరుపేద వికలాంగులకు, గిరిజన విద్యార్థులకు అంకితం చేశారు.
కష్టాల కడలిలో జీవిత ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దేవనగరం గ్రామంలో 1980, జూలై 10న జన్మించిన తోలెం శ్రీనివాసరావు తన చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. విద్యాభ్యాసం నడుమ అనేక ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో బీఈడీ మదర్ మేరీ కాలేజీలో చేసి తర్వాత భద్రాచలం కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పీజీ పూర్తి చేశారు.
శ్రీనివాస రావు
ఉపాధ్యాయుడిగా మొదలైన ప్రస్థానం
2015లో తిర్లపురం గ్రామంలోని ఎన్సీఎల్పీ (నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్) బాల వెలుగు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి మారుమూల గ్రామాల్లో విద్యా సేవలను అందిస్తూ, వందల మంది విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు. అత్యంత వెనుకబడిన గిరిజన గ్రామాలకు విద్యా సేవలు అందాలనే లక్ష్యంతో, తోలెం శ్రీనివాసరావు గారు టేకులగూడెం, తెర్లాపురం గ్రామాలకు రోజూ నడుచుకుంటూ వెళ్లి విద్యాబోధన చేసేవారు. ఈ రెండు గ్రామాలు పూర్తిగా అటవీ ప్రాంతాల్లో ఉండటంతో, రవాణా సౌకర్యాలు లేవు. ప్రాథమిక వసతులు దూరంగా ఉన్నా 5 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లి, అక్కడి గిరిజన విద్యార్థులకు భోదించేవారు. విద్యార్ధుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు తన సౌకర్యాలను పక్కన పెట్టి, నడుస్తూ వెళ్లేవాడు. ఇది వూరిలో, అక్కడి విద్యార్థుల్లో చెరగని ముద్రవేసింది.
జీవితాన్నే మార్చేసిన సంఘటన
తోలెం శ్రీనివాసరావు జీవితంలో ఒక సంఘటన ఆయనను సమాజ సేవ మార్గంలో నడిపించింది. ఆయన ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తోన్న సమయంలో, ఒక గిరిజన బాలుడు పాము కాటుకు గురై తన కాలును పూర్తిగా కోల్పోయాడు. ఆ బాలుడు ఎటువంటి సహాయ సహకారాలు లేక తన బాధను తట్టుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. అది చూసి కలత చెందిన శ్రీనివాసరావు అప్పుడు ఆయన తనకున్న పరిచయాలను ఉపయోగించి, హైదరాబాదులోని నరేంద్ర గారి సహాయంతో విజయవాడలో ఆ బాలుడికి ఉచితంగా కృత్రిమ కాలు అమర్చించేలా ఏర్పాట్లు చేశారు. ఆ బాలుడు తిరిగి నడవడం ప్రారంభించినప్పుడు, అతని ముఖంలో కనిపించిన ఆనందం, ధైర్యం శ్రీనివాసరావు గారికి మరువలేని అనుభూతిని మిగిల్చింది. ఈ అనుభవం ఆయనలో మానవతా దృక్పథాన్ని మరింత బలపరిచింది. నిరాశతో జీవితం కొనసాగిస్తున్న ఎంతో మంది వికలాంగులకు కొత్త జీవితాన్ని అందించాలనే సంకల్పంతో ఆయన తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించారు. అప్పటి నుంచి కృత్రిమ అవయవాల సహాయం అందించేందుకు శ్రీనివాసరావు గారు తన జీవితాన్ని అంకితం చేశారు
స్వచ్ఛంద సంస్థ స్థాపన – "మహర్షి స్వచ్ఛంద సేవా సంస్థ"
నిరుపేదలకు, వికలాంగులకు సహాయం చేయడానికి ఆయన మహర్షి పేరుతో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఆయన గిరిజన గ్రామాల్లో బోరు పంపుల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, వృద్ధులకు దుప్పట్లు, దోమతెరలు పంపిణీ, నిరుపేద విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవే కాకుండా రోబోటిక్ రిహాబిలిటేషన్ సెంటర్ సహకారంతో అనేక మంది వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందిస్తున్నారు. వీటితో పాటు శ్రీనివాసరావుగారు తన పరిచయాలను ఉపయోగించుకొని, అనేక మందికి వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు. ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న కరోనా సమయంలో దాదాపు 20 గ్రామాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే కృష్ణాపురం గ్రామానికి చెందిన శ్రీ విహార్ అనే చిన్నారి అగ్ని ప్రమాదంలో కాలిపోయి తీవ్ర గాయాలపాలైనప్పుడు, హైదరాబాద్‌లో ఉచిత శస్త్రచికిత్స జరిపించేందుకు సహాయం అందించారు.
“ఆయన ఆదివాసీ సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని పినపాక మండలం మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, అభిప్రాయ పడ్డారు. “ఆదివాసీ గూడాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైను, యాక్సిడెంట్ జరిగినా లేదాఅంగవైకల్యంతో వికలాంగత్వంతో బాధపడుతున్న శ్రీనివాసరావు వైద్య సహాయాన్ని అందిస్తారు. ఆయనే స్వయంగా బాధితులను విజయవాడకు తీసుకెళ్లి వైద్యం చేయించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకుంటారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను అమర్చించి, మళ్లీ వారి జీవితాల్లో ఆశలు నింపే ప్రయత్నం చేస్తున్నారు.” అని గాంధీ అన్నారు.
*గుమ్మడి గాంధీ, మాజీ ఎంపీపీ, పినపాక మండలం
శ్రీనివాసరావు గారు పేదల సమస్యలను అర్థం చేసుకొని, వారికి అవసరమైన సహాయాన్ని సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తారని సింగిరెడ్డి పల్లి పోస్టు మాస్టర్ సర్వేశ్వరరావు అన్నారు. “కాలి గాయాలు, దృష్టి లోపం, ఆరోగ్య పరమైన ఇతర ఇబ్బందులు ఉన్నవారికి ప్రభుత్వ పథకాల ద్వారా, అలాగే స్వచ్ఛంద దాతల సహాయంతో ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు,” అని సర్వేశ్వరరావు అన్నారు.
సర్వేశ్వరరావు, నేను సింగిరెడ్డిపల్లి పోస్టుమాస్టర్
“నా జీవిత ప్రయాణంలో నాపై గొప్ప ప్రభావం చూపిన వ్యక్తుల్లో ఒకరు తోలెం శ్రీనివాసరావు ఒకరు అని,” పినపాక మండల ఆదివాసి జేఏసీ కన్వీనర్ సోలం అశోక్ రావు అన్నారు.
సోలం అశోక్ రావు
ఆదివాసి జెఏసి పినపాక మండల కన్వీనర్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుడు
శ్రీనివాసరావు ఎన్నిరకాలు పేదలను ఆదివాసీలను ఆదుకుంటాడో లెక్క లేదు. చత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వలస వచ్చిన ఆదివాసులు, అతి మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారికి శ్రీనివాసరావే అండ. ప్రమాదాల్లో కాలును కోల్పోయి నడవలేని వికలాంగులకు విదేశాల్లోని ప్రవాస భారతీయుల సహకారంతో ‘రోబోటిక్ లెగ్స్’ ఉచితంగా అందజేయడం ఆయన చేసిన గొప్ప సేవ. నిరుపేదలకు ఈ రోబోటిక్ లెగ్స్ అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన కృషి ఎంతో ప్రశంసనీయం,” అని అశోక్ రావు అన్నారు.
ప్రభుత్వ గుర్తింపు–అందుకున్న అవార్డులు
శ్రీనివాసరావు చేసిన సేవలకు గుర్తింపుగా 2020లో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ చేతులమీదుగా జనవరిలో ప్రసంశ పత్రం లభించింది. అలాగే పినపాక మండల విద్యా అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక సన్మానం అందుకున్నారు. ఇంకా ఇయన చేస్తున్న సేవకు గాను అనేక అవార్డులు కూడా లభించాయి.
ఇది కూడా చదవండి
అది దారిద్య్రం కాదు, ప్రకృతి అందించిన అరుదైన పోషకాహారం.
అక్కడి ఆదివాసీలకు చీమలే పరమాన్నం!