
‘ఇక్కత్’ రంగుల వెనక చీకటి జీవితాలు
పోచంపల్లి చేనేత కళాకారులు వైద్యసేవలు అందుబాటులో లేవు
యాదాద్రి–భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి ప్రపంచవ్యాప్తంగా ఇక్కత్ చీరల కోసం ప్రసిద్ధి. ఈ చీరల రంగులు, డిజైన్లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. కానీ ఆ రంగుల వెనుక ఉన్న నేత కార్మికుల జీవితాలు మాత్రం అంత రంగులమయం కాదు. రంగుల వెనక విషాదం ఉంది.
. “మా జీవితాలు ఇక్కత్ చీరలంత రంగులమయంగా ఉండవు. మా నైపుణ్యత, శ్రమతో పాటు , మా ఆరోగ్యాలను పణంగా పెట్టి ఇక్కత్ వస్త్రాలను తయారు చేస్తాం,” అని పోచంపల్లి చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ చీరెలు నేసేందుకు వాడే రంగల వల్ల అనేక రకాల జబ్బులు (Occupational Hazards) వస్తున్నాయి. అయితే వీళ్లకి వైద్య సదుపాయాలు అందుబాటు లేవు.
పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చర్మవ్యాధి నిపుణులు, నేత్ర వైద్యులు వంటి స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని దశాబ్దాలుగా వారు ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. పోచంపల్లి ఇక్కట్ చేనేత కళాకారుల జీవితాలలోకి తొంగి చూస్తే రంగుల ప్రపంచం వెనుక వారి వ్యధలు కథలు కథలుగా కనిపిస్తాయి.పోచంపల్లిలో సుమారు 600 కుటుంబాలు సంప్రదాయ మగ్గాలపై ఇక్కత్ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నాయి. టై–అండ్–డై ప్రక్రియలు, గంటల తరబడి మగ్గం పై పనిచేయటం వల్ల చేనేత కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కండరాల నొప్పులు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు వారి దైనందిన జీవితంలో భాగమైపోయాయి.
ఇక్కత్ చీర తయారీలో కీలకమైన టై–అండ్–డై (Tie and dye) ప్రక్రియలో సింథటిక్ రంగులు, అధిక గాఢత కలిగిన ఎసిటిక్ ఆమ్లం వంటి రసాయనాలను నూలుకు అద్దటం కోసం వీరు ఎలాంటి గౌసులు లేకుండా వీరు పనిచేసాయాల్సి ఉంటుంది.. ఈ రసాయనాలతో నేరుగా పని చేయడం వల్ల చర్మ సమస్యలు పెరుగుతున్నాయని నేత కార్మికులు చెబుతున్నారు. చేతులకు గౌసులు ధరించి పని చేసినట్లయితే నూలుకు రంగులు సరిగ్గా అంటుకోవని ఇక్కడి చేనేత కార్మికులు తెలిపారు.
మాస్టర్ వీవర్ అంకం నవీన్ మాట్లాడుతూ స్థానిక పిహెచ్‌సీలో స్పెషలిస్ట్ వైద్యుల కోసం కోసం పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించామని చెప్పారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
, “బ్లీచింగ్ పౌడర్‌తో చేతులు కడిగినా, తినేటప్పుడు కూడా రసాయనాల వాసన వస్తూనే ఉంటుంది. చర్మ వ్యాధితో పాటు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాను,” 10 సంవత్సరాలుగా టై ఇక్కట్ చీరలు నేస్తున్న గోషికా రమేష్ తన అనుభవాన్ని చెప్పుకుంటూ అన్నారు.
మరో నేత కార్మికుడు గుర్రం శ్రీనివాస్ గత ఐదేళ్లుగా శ్వాసకోశ సమస్యలకు చికిత్స పొందుతున్నానని చెప్పారు. “డాక్టర్లు దుమ్ము దూరంగా ఉండాలని చెప్పారు. కానీ నేతగా పనిచేస్తూ అది ఎలా సాధ్యం?” అని ఆయన ప్రశ్నించారు.
15 సంవత్సరాలుగా పిట్ లూమ్‌పై పనిచేస్తున్న చిలువేరు సోమయ్య కూడా తన కంటి చూపు తగ్గిందని, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వేధిస్తోందని తెలిపారు.
పద్మశాలి యువజన సంఘం నాయకుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సంప్రదాయ నేత కార్మికులకు లభించే సంక్షేమ పథకాలు పరిమితంగానే ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా వృత్తిపరమైన వ్యాధులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందడం లేదని ఆయన చెప్పారు. పోచంపల్లి పిహెచ్‌సీలో స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక వైద్య సేవలను ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
సీనియర్ వైద్యుడు డాక్టర్ కె . రామ చారి ప్రకారం, గంటల తరబడి మగ్గంపై పని చేయడం వల్ల కండరాల నొప్పులు, బెణుకులు, కండరాల క్షీణత వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎక్కువసేపు కూర్చోవడం, శబ్దం, రసాయన రంగులు మరియు నూలు దుమ్ము వల్ల శ్వాసకోశ, చర్మ మరియు కంటి సమస్యలు కూడా పెరుగుతాయి.
మందులు కొంతవరకు లక్షణాలను తగ్గించగలిగినా, రక్షణ చర్యలు లేకుండా ఈ పరిస్థితుల్లో పనిచేయడం కొనసాగితే సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రపంచానికి రంగుల చీరలు అందించే పోచంపల్లి నేత కార్మికులు ఇప్పుడు ఒకే ఆశతో ఎదురుచూస్తున్నారు—తమ ఆరోగ్యాన్ని కాపాడే వైద్య సేవలు అందాలని. వారి చీరలు ఎంత అందంగా ఉన్నాయో, వారి జీవితాలు కూడా అంతే సురక్షితంగా మారాలని వారు కోరుకుంటున్నారు.

