మనుషులు వెళ్ళిపోయాక!
x

మనుషులు వెళ్ళిపోయాక!

నేటి మేటి కవిత...


మనుషులు ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ,

ఇల్లు మౌనంగా చూస్తూ ఉండిపోతుంది.

వాళ్ళు వస్తువులు సర్దుకుంటున్నప్పుడు,

వాళ్ళంటే మమకారం తీరని ఇల్లు,

దిగులుగా

వాళ్ళు తనని కూడా

తీసుకెళితే బాగుండుననుకుంటుంది.

**

వెళ్ళిపోయే తల్లి

కొంగు చివర్లు పట్టుకుని

పోవద్దంటూ పసిపాపలా

వేలాడుతుంది ఇల్లు !

ఇల్లంతా ఖాళీ చేసి

వాకిలి వైపుగా నడిచి వెళ్ళిపోయే వాళ్ళ

పాదాల నిష్క్రమణ ధ్వనులు దూరమయ్యే కొద్దీ,

మెల్లిగా వినిపించడం మానేసిన

పాట కొసలు పట్టుకున్నట్లుగా,

వీడలేనితనంతో

ఇల్లు కూడా గుమ్మం దాకా వెళ్ళిపోతుంది.

*

రంగుల కలల్ని,

కమ్మటి నిద్రనీ

కానుకగా ఇచ్చిన పడక గది,

అమ్మలా అన్నం పెట్టిన వంటగది

నన్నెలా వదిలేస్తావన్నట్లు

నిర్ఘాంతపోతూ

శూన్యపు చూపులతో నిగ్గదీస్తాయి.

ఇల్లు..

తలుపు చాటున నిలబడి

కదలబారి పోతున్న మనుషుల నీడల వైపు,

వాకిలి దిక్కు దీనంగా చూస్తుంది!

**

ఇల్లెలా ఉందో అని

ఒక్కసారి కూడా ఆలోచించని

మనుషులు మాత్రం

పాత చొక్కా విడిచినట్లే

ఇల్లుని విడిచి వెళ్ళిపోతారు.

సూర్య చంద్రుల్ని

వెన్నెలాకాశాల్ని ఇచ్చిన కిటికీని మూసేసి,

అమావాస్యని మోసుకెళ్లే మనుషుల్ని చూస్తూ

ఇల్లు జాలి పడుతుంది!

***

వెళ్ళిపోతున్న మనుషుల కోసం

పెరటి తోటలో రహస్యంగా

విరబూసిన గులాబీ ఒకటి,

ముఖానికి చివరి చూపులాంటి రంగేసుకుని

రెక్కల కళ్లేసుకుని నిశబ్దంగా చూస్తుంది.

వాదా చేసుకోకపోయినా మళ్ళీ కలుద్దామన్నట్లే

నిష్క్రమణ పరిమళాలతో

తల ఊపుతూ వీడ్కోలు చెబుతుంది!

*

మనుషులు వెళ్ళిపోయాక

ఇల్లు ఖాళీ వాసన వేస్తుంది.

బహుశా.,ఎడారి వాసన

ఒంటరి వాసన!

విరహంలో కారిన కన్నీటి వాసన!

**

మళ్ళీ

తనని ప్రేమించే మనుషులు

వచ్చి సర్దుకునేదాకా..

ఇల్లోక నిరీక్షణ గుడారం అయిపోతుంది.

చంద్రుడి దీపాన్ని వెలిగించుకుని..

తనలోకి నడిచివచ్చే పాదాల కోసం

పూలు చల్లి, నిదుర మరిచిన కనులతో..

పాటనొకటి గొంతులో దాచుకుని,

ఇల్లు వెన్నెలై ఎదురు చూస్తుంది.

***

మనుషులు వెళ్ళిపోయాక

ఇల్లు దిగులు గుండెతో

ముడుచుకుపోయి తలుపేసుకుంటుంది!

Read More
Next Story