గురువుల్లో మార్పు అనివార్యంగా...
MONDAY POEM : డా.గూటం స్వామి
వెనకటిలా
వ్వవహరిద్దామంటే కుదరదు!
చదువులో వెనకబడ్డారని
గోడకుర్చీలు వేయించడాలు
గుంజీలు తీయించడాలు
కోదండం వేయించడాలు
బడికి ఆలస్యంగా వస్తే మందలించడాలు
మార్కులు తక్కువగా వస్తే
కసురుకోవడాలు,బెత్తం వాడటాలు
ప్రేమల్లో మునిగి తేలుతున్నారని
కారాలు మిరియాలు నూరడాలు
ప్రక్కన పెట్టేయండి!
అవన్నీ చూసుకోవడానికి రక్షకభటులున్నారు!
మీరెందుకు బీపీలు తెచ్చుకోవడాలు?
కాలం మారింది!
వెనకటిలా వ్యవహరిద్దామంటే
అది అయ్యేపని కాదు!
బడిలో ఉన్నంతసేపు
గుడ్డి చెవిటి మూగ వాళ్ళల్లా నటించడం
ఫేషియల్ హాజరు సరైన సమయానికి వేసేయడం
యాప్స్ జాగ్రత్తగా ఉపయోగించడం
లెసన్ ప్లాన్స్,డైరీ,నోడ్స్ లు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవడం
వచ్చారా!వెళ్ళారా!...అది చాలదంటారా!
చదువు కుంటామనే వాళ్ళకు
చదువు చెబితే సురక్షితం!
అక్కర్లేని వాళ్ళకు కలిపి అన్నపెడితే
తపుక్కున ఊయకుండా ఎలా ఉంటారు?
ప్రాణం పోతే ఎవరిస్తారు?
విద్యార్థుల చేతిలో దెబ్బలుతిన్న గురువుగా ఎలా బ్రతుకుతారు?
గురువుల చేతిలో బెత్తం తీసేసినప్పుడే
శిష్యుల్లో భయభక్తులు పోయాయి!
బడులపై రాజకీయ రాబందులు వాలినప్పుడే
తల్లిదండ్రుల ఆలోచనలు మారిపోయాయి!
దండం దశగుణం భవేత్ అనే సామెత
పాత చింతకాయ పచ్చడి!
బ్రతికుంటే బలుసాకు తినొచ్చు
కాలాన్ని బట్టి మీరు మారవలసిందే తప్పేముంది!!
(ఇటీవల గురువులపై జరుగుతున్న హత్యలు దౌర్జన్యాలు చూసి బాధతో)
-డా.గూటం స్వామి