నల్ల చందమామ
x

నల్ల చందమామ

ఈ పొద్దుటి చిత్తలూరి కవిత నల్లటి బర్రె ఎంతటి సొగుసైనదో, లక్షణమైనదో,పూజనీయమైనదో, ఆరాధనీయమైనదో గొప్పగా చెబుతుంది.


-చిత్తలూరి


నేను బర్రెను ప్రేమిస్తాను

అమ్మ తరువాత అమ్మలాంటిది బర్రె
అమ్మయినా కొంత కాలం
పాలిచ్చి మరిపిస్తుంది కానీ
బర్రె నన్నిప్పటికీ పాలిచ్చి
పెంచుతూనే వుంది

అందుకే‌ నేను అమ్మలాగే
బర్రెను ఆరాధిస్తాను
మా‌ ఇంటి‌ముందు
నల్లని ద్రాక్షపందిరిలా అల్లుకున్న‌ బర్రె
మా జీవనానికెంత నీడనిస్తుందని

మా కుటుంబపు బతుకు పడవను
మా చిన్నా చితకా కష్టాల నదిని దాటించే
పాల చుక్కాని మా బర్రె
పాలు పట్టని తల్లులకు పాలవరాన్నిచ్చిన
మా పేదింటి గ్రామదేవత బర్రె
పాలు దొరకని బిడ్డలకు చనుబాలిచ్చి పెంచిన
మా పేదింటి ప్రేమమూర్తి బర్రె

కడుపులో ఆకలి‌పేగుల అరుపులు
కాచుకునేందుకు
తెలిసో తెలియకో కంచె దాటినపుడు
బర్రెను బర్రెలా కొట్టినా
కన్నీటిని కళ్లల్లోనే దాచుకుని
పొదుగులో పాలను కురిపించే
సహనమూర్తి మా బర్రె

మా అస్తిత్వం‌ బర్రె
మా సమస్తం బర్రె
ఇరవైనాలుగ్గంటలు
మాతోపాటు కలిసి తిరిగే
మా కుటుంబ సభ్యుడు బర్రె
మా‌ మూలవాసుల వారసత్వ సంపద
మా శ్రమజీవుల చీకటి కష్టాల్లో
వెన్నెల విరజిమ్మే నల్లచందమామ బర్రె

పట్టెడంత పచ్చగడ్డేస్తే చాలు
కడివెడంత కమ్మపాలిస్తూ
మా ఇంటిల్లిపాదిని
కంట్లో పెట్టుకుని కాపాడే
మా కన్నతల్లి బర్రె

అందుకే నేను బర్రెను ప్రేమిస్తాను
మా ఆరాధ్యదేవతలా
బర్రెను పూజిస్తాను



Read More
Next Story