ఇలా మిగిలాం !!!
x

ఇలా మిగిలాం !!!

నేటి మేటి కవిత



- రమణా చారి

అన్నీ వదిలేశాం
హాయిగా బ్రతికేస్తున్నాం

సంపాద వేటలోపడి
అబద్దాల కథలు అల్లుతూ
రంగుల ప్రపంచంలో
కాలం గడిపేస్తున్నాం

గారడీ మాటలతో
మందిని మోసం చేస్తూ
గొప్పగా ఊహించుకుంటూ
పైశాచికానందం పొందుతాం

ఊహాల తీరాల్లో
విహారిస్తుంటాం
ఆలోచనలన్నీ కళ్ల‌లోనే
కలలుగా కంటాం

కొయ్యగుఱ్ఱం మీద
కాలాన్ని మించిన వేగంతో
పరుగులు తీస్తుంటాం
కదలకుండా పడుంటాం

భయపెట్టే ఘటన జరగ్గానే
గుండెల్లో గుబులు పుట్టి
ఏమీ తెలియనట్టు
ఎక్కడో దాసుకుంటాం
కరుకు బూట్లచప్పుళ్లు
కవాతు చేస్తున్నప్పుడు
ఆకుపచ్చని అడివి
రక్తంతో ఎరుపెక్కినప్పుడు

కళ్లకు కమ్మిన తెరలను
తొలగించు కొమ్మని
అమరుడు గర్జిస్తున్నాడు
మనమూ మనుషులమేనని
గుర్తు చేస్తున్నాడు

డెఫ్ అండ్ డం లా కొంచెం సేపు
నటిస్తే సరిపోతుందనుకుంటాం
కాకిలా చిరకాలం
బ్రతికేయొచ్చనే పేరాశ







Read More
Next Story