నాన్న చెట్టు  (కవిత)
x

నాన్న చెట్టు (కవిత)

నాన్న మీద మరొక కవిత. నాన్న అనే మాటలో దాక్కున్న భవిష్యత్తుని ముందుచూపుని చెప్పే కవిత.




నాన్నచెట్టు


డా.గూటం స్వామి



నాకు ఊహ తెలిసినప్పటి నుండి
నాన్న ఏదో ఒకపని చేస్తూనే ఉండేవారు!
మట్టితో స్నేహం చేస్తూ
బోలెడంత ఫలసాయం తెచ్చేవారు!
మా కడుపులు నింపడానికి
అహర్నిశలు తాపత్రయం పడేవారు!

నేను లేకపోయినా
నాబిడ్డలకు ఉపయోగ పడాలని కాబోలు
ఇంటిముందు జాంచెట్టు నాటారు!
మా ఇంటికి ఎవరొచ్చినా
ముందు దాని దర్శనం చేసుకోవలసిందే!

నాన్నచెట్టు
నా కదలికలను పసిగడుతున్నట్టుంటుంది!
నేను బయటకు వెళ్తున్నప్పుడు
ఆకులు గాలికి కదులుతుంటే
నాన్న నాకు జాగ్రత్తగా వెళ్ళరా అని చెబుతున్నట్టు
ఇంటికి వచ్చాక నవ్వుతూ ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది!

మా నాన్న ఎప్పుడూ
మొలకెత్తే విత్తులా ఉండేవాడు!
ఇంటిచుట్టూ ఏదోఒక చెట్టు నాటి
అందరికీ ఆదర్శమయ్యేవాడు!
కూరగాయలు పండిస్తూ
ఆనందపడేవాడు!
ఎప్పుడూ మట్టితో స్నేహం చేసే నాన్న
పనిలో ఆయన్ను మించినవాడు లేడనిపించేవాడు!

ఇప్పటికి జాంచెట్టు
పోటాపోటీగా కాయలు కాస్తూ
మమ్మల్ని మురిపిస్తుంటుంది
పక్షుల ఆకలి తీరుస్తుంటుంది!

ఇప్పుడు నాన్నలేడు గాని
నాన్న నాటిన జాంచెట్టు ఉంది!
నాన్న రూపంలో ఉన్న జాంచెట్టు
నన్ను రోజూ పలకరిస్తున్నట్టు ఉంటుంది!

ఇప్పటికీ
బయటకు వెళ్ళేటప్పుడు
ఒక జాంకాయ కోసుకుని బ్యాగ్ లో వేసుకుంటా
బండి ఎక్కేముందు నాన్నచెట్టు కు దండం పెట్టుకుని సాగిపోతా!!



Read More
Next Story