నువ్వే నా వర్షం
x

'నువ్వే నా వర్షం'

నేటి మేటి కవిత : ‘నీ లోలోపలి ఎడారిని వసంతాలుగా మార్చేస్తుంది’


వర్షం, వొట్టి వర్షమే ఎందుకు అవుతుంది?

ఆకాశం భూమి మీద చూపించే
ప్రేమ అవుతుంది.
భూమి గుండెల్లోకి
ఇంకిపోవడం అవుతుంది.
ఎండిన విత్తనాన్ని
మొలకెత్తించడం అవుతుంది.
భూమిని
సముద్రం చేయడం అవుతుంది
రైతుని ప్రేమించడం అవుతుంది.
అడవుల్ని చిగుర్చడం అవుతుంది.
**
వర్షం తోటని మోహించడం అవుతుంది.
వర్షం నీ దేహాన్నే తడుపుతుందా..
నీ ఆత్మని ముంచిపడేస్తుంది.
నిన్ను నీకు పట్టిస్తుంది.
నీ లోలోపలి ఎడారిని
వసంతాలుగా మార్చే స్తుంది.
*
నీ డాబా మీద కురిసే వర్షం
నీతో మాట్లాడుతుంది.
ఇంటిలోపల దీపమన్నా
వెలిగించుకోని నిన్ను మందలిస్తుంది.
**
వర్షానికి మైదానాలు,
అడవులతో పాటు
నీ చిన్న బాల్కనీ కూడా కావాలి.
ఏకాంతంలో నువ్వు వినే గజల్ ని
తను కూడా వింటూ
నీలో కరిగిపోవాలి.
అందుకే వర్షాన్ని
నీకిష్టమైన పాటలతో
ఆహ్వానించు నీ లోకి.
***
వర్షం ఒక్కోసారి
వెన్నెలను తాగి నీపై కురుస్తుంది.
వర్షం అప్పుడు
నీ ప్రేయసి అవుతుంది.
వర్షం ఇంకోసారి
గోరువెచ్చని ఎండని కప్పుకుని
చలికి వణికే నీ ఎద మీద వాలిపోతుంది
అప్పుడూ వర్షం నీ ప్రేయసే!
***
వర్షానికి తాను వాగుగా మారినప్పుడు
కాగితపు పడవలు వదలడానికి
పిల్లలు కావాలి.
తనలోకి మునకలు వేస్తూ.. గంతులు వేసే
పిల్లల పసిపాదాలు కావాలి.
వర్షం అప్పుడు పసిదై పోతుంది...
బాల్య వర్షమై పోతుంది!
పిల్లల కోసం మేఘాలు
ఏడేడు లోకాలు దాటుకుంటూ అయినా
హడావుడిగా తరలి వస్తాయి..
కొంచెం ఎక్కువగా కరుగుతాయి.
వర్షం ఒక శైశవ రాగం పాడుతూ
వాగులూ వంకలై పరిగెడుతుంది.
పిల్లల్ని తనతో లాక్కుపోతుంది.
***
వర్షానికి గజల్ తో పాటు
వేడి వేడి చాయ్ కూడా కావాలి.
వర్షానికి నీ టీ కప్పులో
చాయ్ గా మారడమెలాగో కూడా తెలుసు.
నీ గొంతులోకి వెచ్చగా
దిగిపోవడమూ వర్షానికి ఇ ష్టమే.
***
వర్షం ఒక ఎదురు చూపు
ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు
తడుముకునే మార్మిక స్పర్శ.
వర్షం పర్వతాల్లో ఉడికే
లావాకి ఇచ్చే ఒక తడి ముద్దు!
***
వర్షం నిన్ను శుద్ధి చేసే మేఘపు కన్నీరు!
వర్షమొక ప్రేమ కవిత్వం,
వియోగ రాగం
వర్షం, విరహాన్న కాగిపోయే నీ దేహంతో,
పరవశంతో చేసే మోహ సంయోగం!
వర్షం నీ ఏకాంతం.
వర్షం నీ ప్రియుడు.
వర్షం నీ అనాది ప్రియురాలు!
వెళ్ళు నిలువెల్లా తడిసిపో. వెళ్ళు!
చినుకులై రాలే వాన పదాలని ఏరుకుని,
ఆమె కోసం కవిత్వం రాయి.
వర్షం తడిపిన నీ తోటలో
ఆమె పేరుని విత్తనాలుగా నాటుకో!
ఆమె పూలుగా పూసిన తోట పరిమళాలను
శ్వాసిస్తూ బతుకు పో !
**
వర్షం నీ బాల్యం, వర్షం నీ ఊరు!
వర్షం నీకు స్నానం చేయించే అమ్మ.
వర్షం నీ పొలం!
నువ్వు తినే అన్నం ముద్ద!
**
వర్షం నీ ప్రేయసికోసం
నువ్వు రహస్యంగా దాచుకున్న
పెదవుల చాటు ముద్దు!
వర్షం నువ్వు చేతులు చాచి
హత్తుకోవాలనుకున్న
నీ తొలి ప్రేమ.
వర్షం నీ యుగాల స్వప్నం.
వర్షం తడి తెలియని దాహం!
ఎంతకీ కురియని వర్షం,
యుగాలుగా కరుణించని
కోటానుకోట్ల ప్రియుల కరడు గట్టిన కఠిన ప్రేయసి.
***
చూడటు!
ఎన్నటికీ చెప్పలేని ప్రేమని భారంగా మోస్తున్నట్లు
వర్షాన్ని దాచుకున్న నీలి మేఘమొకటి
దిక్కు లేకుండా దిగులుగా తిరుగుతున్నది
వెళ్ళటు..
ఒక మేఘమల్హర్ రాగమందుకో
కరగదా మేఘం?
కురవదా వర్షం?
చూడు,
మేఘం తాను కురవాల్సిన మనిషి తావుని
ఒక జీవిత కాలం ఆలస్యంగా
కనుక్కున్నందుకు దుఃఖిస్తూ వర్షిస్తుంది
***
ఇంతకీ,
వర్షం మేఘపు అధరామృతం కాదా?
వర్షం నిన్ను
నిలువెల్లా హత్తుకోవాలన్న
మోహపు కౌగిలి కాదా?
చాలిక అలా ఎండిపోకు!
ఒక్కసారి వర్షంలోకి రా
వర్ష గానంలో నృత్యం చేయి!
నీ చెవి దగ్గర..
నువ్వే నా వర్షం..
నువ్వు నా నిషిద్ధాకర్షణ .,
అని వర్షం చెప్పే రహస్య ప్రేమలేఖని విను!
లేకపోతే,
వర్షం వెలిసి పోయాక,
వర్షం నిన్ను వదిలి వెళ్ళిపోయాక
నువ్వు ఖాళీ అయిపోతావు..
దిగులు పడి పోతావు చూడూ...
అప్పటి శూన్యం...
నిశ్శబ్దం నీ కళ్ళ నుంచి
నిరవధిక వర్షమై కురుస్తుంది!
అందుకే,.
రా వర్షమై!
రా వర్షంలోకి !
వర్షం నిన్నేం చేస్తుందో చూడప్పుడు!


Read More
Next Story