స్టెతస్కోపు సాక్షిగా...
x
Source: UN Crime Congress DOHA2015

స్టెతస్కోపు సాక్షిగా...

నేటి కవిత



- చిత్తలూరి



నేలింకా తడిగానే వుంది
అసలెప్పుడారింది గనక ?
ఈ దేశపు ఆడపిల్లల రక్తంతో
నేలింకా తడిగానే వుంది

కళ్లల్లో తడి లోపించిన
మానవ మృగాల సాక్షిగా
వాటి కోరల్లో
రక్తంతో తడిసిన దూదిపింజల్లా
ఆడపిల్లల మాంసపు ముద్దలు
వేలాడుతూనే వున్నాయి

వీరులకు,
ధైర్యంతో ముందడుగేసే శూరులకు
మానత్వం కలిగిన హృదయాలకు
దేశం గొడ్డుపోయింది
పిరికితనపు పెంటకుప్ప వెనుక
వెన్నెముకలు విరిగిపోయిన తరమొకటి
భయంతో ముడుచుకుని కూర్చుంది

డబ్బుకోసం పచ్చిమాంసాన్ని కూడా పీక్కుతినే
అధికారపు మాయా పరమపదసోపానంలో
కాటేసే పాములకే తప్ప
భరోసానిచ్చే నిచ్చెనలకు చోటెక్కడుంది?

సీతాకోక చిలుకల రెక్కల్ని కళ్లముందే
కత్తికో కండగా‌ నరుకుతున్నా
విరిసీ విరియని లేతకాడల్ని
కామపు రంపాలతో ముక్కలుగా కోస్తున్నా
గడ్డకట్టిన మంచు స్ఫటికపులాంటి నిస్తేజమొకటి
నిలువునా నీలి మబ్బయి
దేశమంతా కప్పబడిపోయింది

ఈ ఆకాశంలోని సగాలు
రక్తపు చినుకులై కురుస్తున్న విషాదానికి గుర్తుగా
నేలింకా తడిగానే వుంది

ఈ దేశానికి
ఊపిరిపోయాల్సిన స్టెతస్కోపొకటి
విరిగి ముక్కలై రక్తపుమడుగులో
తలవాల్చిన దైన్యం సాక్షిగా
కామంతో వెంటాడే కనుగుడ్లను పెకలించి
మృగాల దృష్టికోణాన్ని సరిచేయాలి
ఆడపిల్లల రక్తంతో తడిసిన నేలమీద
ఏ దేశమైనా సుభిక్షంగా మొలకెత్తదని గుర్తెరిగి
దేశమంతా పిచ్చికుక్కల్ని ఏరేసే
కొత్త చైతన్యమేదో రగిలించాలి




Read More
Next Story