విష జ్వరాల తిరన్నాళ్ళు....
x

విష జ్వరాల తిరన్నాళ్ళు....

నేటి మేటి కవిత



బోనాల పండుగ పోయినా

ఒళ్ళు బోనం కుండలో ఉడుకుతునట్లేవుంది

ఊరు ఊరంతా నీరసం దాపురించి

ముడకస పంటుంది

విష జ్వరాల తిరన్నాళ్ళు తండ్రీ

హాస్పటళ్ళ కిటికీలకు సెలెన్ బాటిళ్లయి వేలాడుతున్నారు..

కళ్ళు లొట్టలుపోయి

మనుషులు సగమైతున్నారు

కళతప్పుతున్నారు..

కనపడకుండా పోతున్నారు.

వానలు పడితే అలుగులు దుంకి

పంటలు పండుతాయి అనుకుంటుంటే

రోగాలు పుట్లు పుట్లు పుడుతున్నాయి

ఏ ల్యాబుల్లోకి నెట్టి ఈ రోగాలను

రోగులుగా చేద్దును..

ఏ ప్రభుత్వము పట్టించుకుంటుంది తండ్రీ ?..

ఏ పరిశోధకుడు సీజనల్ జబ్బుల మీద

నాలుగు పేజీల వ్యాసం రాస్తాడు.

కాలమేమి బాలేదు నాయినా..

విషాదాన్ని కంకుతుంది!.

ఒడ్డు దొరకని మనిషితీరుగా అల్లాడుతున్నది

దరి దారి అంతుబట్టక కదులుతుంది

కీళ్ళకి కీళ్ళు నొప్పులతో ములుగుతున్నాయి

ఎముకలను సుత్తెతోని ఎవరో కొడుతున్న బాధ

అడుగుతీసి అడుగువేయలేక

కాలం పూట పూటకు టాబ్లెట్స్ కరిగించుకుంటుంది.

కాలమేమి బాలేదు తండ్రీ

భయంకరమైన ఊహాలవైపు మొగ్గుతోంది

లేత ఆకుల్ని తుంచి భయపెడుతున్నది

పచ్చగా ఇరుగురెయ్యాల్సిన చెట్లు

మాడిపోతునట్టుంది

ఎవరు పట్టించుకుంటారు ప్రభూ..

ఏ అవగాహనా రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కాబడవు

ఏ శుభ్రత గురించి రెండు మాటలు వినపడవు

మురుగునీరు పారుతున్న ముఖం తిప్పుకుని పోతాం

కుళ్ళిన చెత్త వాసనకొడుతున్న

ముక్కుమూసుకొని దాటేస్తాం..

ఎట్లాంటి కాలమిది

నిద్రపోతే మేల్కొలేని కాలం

మెలుకువతో నిద్రపోలేనికాలం

గాలం కొండికి చిక్కుకొని బయటపడలేక కొట్టుకుంటునట్టుంది

నొప్పుల పాటల వ్యాల్యూమ్ సెకను సెకనుకు పెరుగుతున్న కాలమిది.

- పేర్ల రాము

Read More
Next Story