
తల్లీ ! తెలంగాణ తల్లీ !!
నేడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తున్న సందర్భంగా జూకంటి జగన్నాథం కవిత
---జూకంటి జగన్నాథం
అమ్మా! నిన్ను తలువని యాల్ల లేదు
తల్లీ! నిన్ను యాది చేయని రోజు లేదు
నీ పేరు చెప్పి కాయలు అమ్ముకున్నరు
నిన్ను నిట్ట నిలువునా దోచుకున్నడెరు
చప్పుడు కాకుండా దాచుకున్నదెవరు
అమ్మా! నిన్ను మరువని క్షణం లేదు
తల్లీ! నిన్ను విడువని నిమిషం లేదు
సచ్చినోడొకరు బతికినోడు ఇంకొకరు
ఎక్కిన నిచ్చెనను తన్నినోడు ఎవరు
నోరు మురికి మోరి అయ్యింది
నాలిక తాటి మట్ట అయ్యింది
చంద్రబింబం నీ ముఖాన్ని వేలెత్తి చూపెస్తే
మూర్ఖులు వేలువైపు చూసిండ్రు
పదేళ్ల తెలంగాణ పంటను
మిడతల దండోలె మునుం పట్టి మేసిండ్రు
నీ మాట వింటే పాటల ఊటలు జాలువారుతయ్
నీ ముచ్చట్లు పెడితేనే సామెతలు శాస్త్రాలైతయ్
కుడుం అంటే పండుగ అనుకునేటోల్లం
నడువ్ అంటే పద అంటూ నడిచేటోల్లం
అమ్మా! నిన్ను యాది చేయని దినం లేదు
తల్లీ ! నిన్ను తలువని గడియ లేదు
త్యాగం మీ ఇంటి పేరు
గోత్రం నీ అమరత్వం
Next Story