మజ్జిగ మజా.. వేసవికి దడ!
x
మజ్జిగ ఉపయోగాలు బోలెడు..

మజ్జిగ మజా.. వేసవికి దడ!

ఎండలు మండుతున్నాయి. దావాద్రి ఎక్కువైంది. కూల్ డ్రింక్స్ రేట్లు పెరిగాయి. కొబ్బరి నీళ్లూ పిరమయ్యాయి. అందువల్ల మనకు అందుబాటులో ఉన్నవి మజ్జిగేమరి..


వేసవి వచ్చింది. ఎండలు ముదురుతున్నాయి. ఎల్ నినో ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుందని వాతారవణ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. అక్కడక్కడా వడగాడ్పులు వీస్తున్నాయి. దాహార్తి పెరుగుతోంది. దప్పిక తీరడానికి ప్రజలు రకరకాల ద్రవాలు వాడుతున్నారు. చాలా రకాల పానీయాలున్నా ఈ వేసవికి మన మజ్జిగను మించింది లేదంటున్నారు డాక్టర్లు. అత్యంత చౌకగా దొరికే పానీయాల్లో మజ్జిగ ఒకటి. దప్పిక తీరడంతో పాటు శరీరంలో తేమ శాతం తగ్గకుండా కూడా చూస్తుంది.

మజ్జిగ చేసే మేలు...

పెరుగు,నీళ్లు సమపాళ్లలో కలిపి చిలికితే చిటికెలో మజ్జిగ తయారవుతుంది. సులభంగా వంటబట్టే వ్యవహారం కూడా. రుచి లేందే ఏదీ ముట్టుకోని కాలం గనుక మీ మీ అభిరుచికి తగ్గట్టుగా మజ్జిగను తయారు చేసుకోవచ్చు. కొంచెం వగరు, కాస్తంత పులుపు ఉంటుంది గనుక సులభంగా జీర్ణం అవుతాయి. ఆకలిని పెంచుతుంది. కఫవాతాలను తరిమికొట్టవచ్చు. పొట్ట పేగుల్ని శుభ్రం చేయడంతో పాటు మూత్ర సంబంధిత వ్యాధుల్ని దూరం చేస్తుంది మజ్జిగ. డాక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు మజ్జిగ చేసే మేళ్లు గురించి వేనవేలు చెబుతారు గాని అవన్నీ ఎలా ఉన్నా మజ్జిగ ఈ మండు వేసవికి మంచి మందు అనడంలో సందేహం లేదు.
మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్‌ ఆ12, ప్రోటీన్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీమైక్రోబయల్‌ గుణాలు ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కూడా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీ శరీరానికి ఆరోగ్యకరమైన కండరాలు, చర్మం, ఎముకలను నిర్మించడానికి తోడ్పడుతుంది.

మజ్జిగ.. వాటి రకాలు...

మజ్జిగలో కూడా రకరకాలున్నాయి. పెరుగుకు నీళ్లు కలపకుండా కొందరు తయారు చేస్తుంటారు. దీన్ని ఆయుర్వేద భాషలో "గోళ " అంటారు. పెరుక్కి నాలుగోవ వంతు నీరు కలిపి చేసే మజ్జిగ "ఉదశ్విత". సగం నీళ్లు, సగం పెరుగు కలిపి చేసే మజ్జిగను "తక్రము". పెరుగుకు మూడు వంతులు నీరు కలిపి చేసే మజ్జిగ "కాలశేయ". ఈ భాష సామాన్యుడికి అవసరం లేకపోయినా ఏదో విధంగా మజ్జిగ తాగడం మంచిదనేది అందరికి తెలిసిన విషయం. దాన్ని పాటించడం ఉత్తమం. ఇప్పుడందరూ ఏదో ఒక డెయిరీ మజ్జిగను కొని తాగడమే అలవాటైంది. దప్పిక వేసిన ప్రతిసారి శీతలపానీయాల జోలికి పోయే కన్నా మజ్జిగకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. డీ హైడ్రేషన్ తగ్గుతుంది. వాంతులు, వికారాలు తగ్గుతాయి. కామెర్లు, కఫం, వాతాన్ని కూడా హరిస్తుంది. వెన్నశాతం ఎక్కువగా ఉండే మందజాతం మజ్జిగ ది అంత తొందరగా జీర్ణం కాదనే అభిప్రాయం ఉంది. కొంచెం పుల్లగా ఉండే మజ్జిగా శ్రేయస్కరమే. బాగా పులుపున్న మజ్జిగ వాడకం తెలుగురాష్ట్రాలలో తక్కువే. ఏ మజ్జిగానా ఆకలిని రగిలిస్తుందనేది సత్యం.

మన రోగాల్లో సగం మంచి నీటితో, మరికొన్ని మనకుసహజ సిద్ధంగా దొరికే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సుగంధ, వట్టివేళ్ల పానీయం వంటివాటితో తగ్గించుకోవచ్చు. ఇవన్నీ వేసవిలో మంచిందే. వడదెబ్బ నుంచి కోలుకోవాలన్నా మజ్జిగనే ఎక్కువగా తాగమని మన పూర్వీకులు చెప్పే మాట సత్యం.


Read More
Next Story