
నల్ల కోటు వెనుక.... నలిగిపోతున్న బతుకులు....
జూనియర్ న్యాయవాదుల ఆర్థిక సంక్షోభం విశ్లేషణ
భారత న్యాయవ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు మనం ఎక్కువగా జడ్జిలను, కోర్టులను, తీర్పులను మాత్రమే చర్చిస్తాము. కానీ ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన స్థంభం — న్యాయవాదులు, ముఖ్యంగా యువ న్యాయవాదులు — ఎదుర్కొంటున్న సంక్షోభం మాత్రం ఎక్కువగా చర్చకు రాదు. న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర అనివార్యం. కానీ అదే వృత్తిలోకి అడుగుపెట్టిన వేలాది యువకులు మొదటి దశలోనే తీవ్రమైన ఆర్థిక, సామాజిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా కోర్టుల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండటం భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభానికి సంకేతం. తీర్పుల కోసం దశాబ్దాల నిరీక్షణ, విచారణ పూర్తికాకుండానే జైళ్లలో సంవత్సరాలు గడుపుతున్న ఖైదీలు, ఈ పరిస్థితికి ప్రధాన కారణం జడ్జిల కొరత. ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 20–21 మంది జడ్జిలే ఉండటం, హైకోర్టుల్లో సుమారు 30% ఖాళీలు ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ఒక్క జడ్జి వద్ద వేల కేసులు ఉండడం వల్ల వేగవంతమైన న్యాయం అందించడం అసాధ్యంగా మారుతోంది.
అయితే ఇక్కడ ఒక తీవ్రమైన విరుద్ధం కనిపిస్తుంది. ఒకవైపు కోట్లలో కేసులు పెండింగ్‌లో ఉండగా, మరోవైపు న్యాయవాద వృత్తిలోకి వచ్చిన వేలాది యువకులు పని లేక ఆర్థికంగా వెనుకబడుతున్నారు. అనుభవం ఉన్న కొద్దిమంది సీనియర్‌ల వద్దే కేసులు కేంద్రీకృతమవుతుండగా, కొత్తవారికి అవకాశాలు దాదాపు దొరకడం లేదు.ఖాళీలు ఉన్నప్పటికీ వేగంగా నియామకాలు జరగకపోవడం, ప్రతిభ ఉన్న యువ న్యాయవాదులకు అవకాశాలు అందకపోవడం వ్యవస్థపై మరింత అనుమానాలను కలిగిస్తోంది.కేసులు పెరుగుతున్న దేశంలో జడ్జిల కొరత ఉండటం మాత్రమే కాదు—అవకాశాలు లేక యువ న్యాయవాదులు వెనుక బడటం కూడ న్యాయవ్యవస్థకు ప్రమాద సంకేతం.
ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు :
ఎంతో కష్టపడి ఎల్‌ఎల్‌బీ (LLB) పూర్తి చేసి, సమాజంలో మార్పు తెస్తామన్న ఆశతో కోర్టు గడప తొక్కిన యువ న్యాయవాదుల పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా ఉంది. ఈ వృత్తిలోకి వచ్చే యువ న్యాయవాదుల వాస్తవ పరిస్థితి బయటపెట్టడం వ్యవస్థలోని అసమానతలను విశ్లేషించడం సంస్కరణల మార్గాన్ని సూచించడమే ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం...
గుత్తాధిపత్యం (Monopoly):
క్లయింట్లు ఎక్కువగా పేరున్న సీనియర్ల దగ్గరికే వెళ్తారు. దీనివల్ల ప్రతిభ ఉన్నా కొత్తవారికి కేసులు రావు.చాలా మంది క్లయింట్లు న్యాయవాది యొక్క ప్రతిభ కంటే, వారి "పేరు" మరియు "వయస్సు"ను చూసి కేసు ఇస్తారు. 80% కేసులు కేవలం 20% మంది పేరున్న సీనియర్ల దగ్గరే ఉంటాయి.కొత్తగా వచ్చిన లాయర్లకు కనీసం కోర్టులో వాదించే అవకాశం (Right to Audience) కూడా త్వరగా రాదు. చాలా మంది సీనియర్ల దగ్గర జూనియర్లు ఉచితంగా లేదా చాలా తక్కువ మొత్తానికి పనిచేయాల్సి వస్తోంది. ఇది వారిని ఆర్థికంగా కుంగదీస్తోంది.ఇల్లు గడవక, అటు చదువుకున్న వృత్తిని వదలలేక, ఇటు కూలి పనికి వెళ్లలేక ఎంతో మంది మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.ఇచ్చినా అవి కుటుంబ పోషణకు సరిపోవు.
దళారీ వ్యవస్థ:
ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు మేధావులు దళారులుగా, బ్రోకర్లుగా మారాల్సి రావడం ఈ వృత్తికే అవమానం. ఇది వ్యక్తిగత తప్పు కాదు, వ్యవస్థ కల్పించిన అశక్తత. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు న్యాయవాదులు కోర్టుల బయట రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్దనో, లేదా పోలీసు స్టేషన్ల దగ్గరో 'మిడిల్ మెన్'గా మారాల్సి వస్తోంది. ఇది వృత్తిపరమైన విలువలని (Professional Ethics) దెబ్బతీస్తోంది. సొంతంగా ఆఫీసు పెట్టుకోవాలన్నా, కనీస ఖర్చులకు కూడా వెనకాడాల్సిన పరిస్థితి.చదువు పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలుపెట్టిన మొదటి 5 నుండి 10 ఏళ్లు అత్యంత కీలకం. ఈ సమయంలో, కనీస ఆదాయం సున్నా, కావున కొంత మంది జూనియర్లు కనీసం రవాణా ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు.
వలసలు: ఆర్థికంగా తట్టుకోలేక చాలా మంది ప్రతిభావంతులు న్యాయవృత్తిని వదిలేసి ప్రైవేట్ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డులుగానో, లేదా చిన్న చిన్న సేల్స్ ఉద్యోగాల్లోకో వెళ్ళిపోతున్నారు. ఇది సమాజానికి పెద్ద నష్టం.
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు :
ఈ పరిస్థితి మారాలంటే కేవలం ఓదార్పు సరిపోదు, బలమైన చట్టపరమైన మార్పులు రావాలి: జూనియర్ న్యాయవాదులకు కనీసం మొదటి 3 ఏళ్ల పాటు ప్రభుత్వం లేదా బార్ కౌన్సిల్ ద్వారా ఒక నిర్ణీత 'స్టైపెండ్' అందించాలి. (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో 'xxx లా నేస్తం' వంటి పథకాలు ఉన్నాయి, వీటిని దేశవ్యాప్తం చేయాలి). ప్రభుత్వ లీగల్ ఎయిడ్ (న్యాయ సహాయం) కేసుల్లో సీనియర్లతో పాటు జూనియర్లకు కూడా తప్పనిసరిగా అవకాశం కల్పించి, ఫీజులు చెల్లించాలి.లీగల్ ఇన్సూరెన్స్ వైద్య బీమా లాగా, సామాన్యులకు 'లీగల్ ఇన్సూరెన్స్' ఉంటే, వారు జూనియర్ లాయర్లను కూడా సంప్రదించే అవకాశం పెరుగుతుంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత:
ప్రభుత్వ రంగ సంస్థల్లో లీగల్ అడ్వైజర్లుగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి.అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయవాదుల ఆర్థిక మరియు సామాజిక భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. వ్యవస్థ మారే వరకు వేచి చూడకుండా, నేటి తరం న్యాయవాదులు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవచ్చు.
స్పెషలైజేషన్:
సివిల్, క్రిమినల్ అని పాత పద్ధతుల్లోనే కాకుండా.. సైబర్ క్రైమ్, మేధో సంపత్తి హక్కులు (IPR), లేదా కార్పొరేట్ లా వంటి కొత్త రంగాల్లో పట్టు సాధిస్తే అవకాశాలు త్వరగా వస్తాయి. జూనియర్లు అందరూ కలిసి ఒక 'లా ఫర్మ్' లాగా ఏర్పడి, ఖర్చులను పంచుకుంటూ ప్రాక్టీస్ చేయడం ఒక మంచి పద్ధతి. సోషల్ మీడియా మరియు లీగల్ వెబ్‌సైట్ల ద్వారా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్రజలకు చేరువవ్వడం. ప్రస్తుతం ఆన్‌లైన్ లీగల్ సర్వీసెస్ పెరుగుతున్నాయి. కొత్త తరం న్యాయవాదులు టెక్నాలజీని వాడుకుని 'లీగల్ కన్సల్టెన్సీ' వైపు దృష్టి సారించాలి.
మధ్యవర్తిత్వం :
కేవలం కోర్టులకే పరిమితం కాకుండా, 'ఆర్బిట్రేషన్' మరియు 'మీడియేషన్' సెంటర్ల ద్వారా కేసులను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంచుకోవడం.
చివరగా, ఏ వృత్తిలోనైనా ప్రారంభంలో కష్టాలు ఉంటాయి, కానీ న్యాయవాద వృత్తిలో ఆ కష్టాలు ఒక మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. వ్యవస్థలో మార్పు రానంత వరకు ప్రతిభ ఉన్న యువత ఈ రంగం నుండి దూరం అయ్యే ప్రమాదం ఉంది. న్యాయవాది అనేవాడు సమాజానికి ఒక మేధావి (Social Engineer). ఆ మేధావి ఆకలితో అలమటించడం లేదా దళారీగా మారడం అనేది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. బార్ అసోసియేషన్లు కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా, జూనియర్ల సంక్షేమం కోసం ఒక 'నిధి' (Welfare Fund) ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువ న్యాయవాదులను కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే.
Next Story

