అయోధ్య రాముడికి హైదరాబాద్‌ ‘తలుపు’ల సేవ
x
అయోధ్య రామమందిర నమూనా

అయోధ్య రాముడికి హైదరాబాద్‌ ‘తలుపు’ల సేవ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ఆలయ ద్వారాలను తయారుచేస్తున్నదెవరు? వాటి తయారీకి ఏ టేకు వాడుతున్నారు?


అయోధ్య రామమందిర నిర్మాణం చకచకా జరుగుతోంది. జనవరి 22వ తేదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఆలయ చరిత్రలో హైదరాబాద్‌ పేరు నిలిచిపోయి విశేషమొకటి ఉంది. గర్భగుడి ద్వారంతో పాటు ఇతర ద్వారాలను హైదరాబాద్‌కు చెందిన ‘అనురాధ టింబర్స్‌ ఇంటర్నేషనల్‌’ తయారు చేస్తోంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా మొత్తం 118 తలుపులను సిద్ధం చేస్తున్నారు.

ఆలయ ద్వారాల తయారీ కాంట్రాక్టు గురించి సీహెచ్‌. శరత్‌బాబు ‘‘ది ఫెడరల్‌’’కు తెలిపారు.

‘‘1920లో మా తాత చదలవాడ లక్ష్మయ్య అనురాధ టింబర్స్‌ను స్థాపించారు. మూడు తరాల నుంచి చేస్తున్న మా వ్యాపారానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. గతంలో సౌదీ, రష్యాలోని వ్యాపారవేత్తల కోసం విలాసవంతమైన పడవలను తయారుచేసిచ్చాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, యాదాద్రి, రామేశ్వరం ఆలయాల తలుపులను కూడా మేమే తయారుచేశాం.

అయోధ్య రామమందిర ద్వారాల తయారీ కాంట్రాక్టుకు దేశంలోని అత్యుత్తమ సంస్థలతో పాటు మాకూ ఆహ్వానం అందింది. వెళ్లి పాల్గొన్నాం. మా కళాకారుల నైపుణ్యం ప్యానెల్‌ సభ్యులను ఆకట్టుకుంది. దాంతో ద్వారాల తయారీ కాంట్రాక్టు మాకు వచ్చింది.’’

- చదలవాడ శరత్‌ బాబు, మేనేజింగ్‌ డైరెక్టర్‌,

అనురాధ టింబర్స్‌ ఇంటర్నేషనల్‌, హైదరాబాద్‌.



క్లిష్టమైన డిజైన్లు..తక్కువ సమయం..

‘‘అయోధ్యలోని ఒక వర్క్‌షాప్‌లో మా దగ్గరి నుంచి వెళ్లిన 50 మంది హస్తకళాకారులు ఆలయ తలుపులను తయారుచేస్తున్నారు. నగరానికి చెందిన మరో 50 మంది వారికి సహకారం అందిస్తున్నారు. సాధారణంగా చాలా క్లిష్టమైన డిజైన్లతో కూడిన తలుపులు తయారీకి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. అయితే సమయం తక్కువగా ఉండడంతో వాటిని మూడు నెలల్లోనే తయారు చేశాం. రాత్రి, పగలు పనిచేస్తూ ఇంకొన్నింటిని సిద్ధం చేస్తున్నాం. డోర్లు, డోర్‌ ఫ్రేమ్‌ల తయారీ కాంట్రాక్ట్‌తో పాటు, టేకు నాణ్యతను చూసే బాధ్యతను కూడా మాకు అప్పగించారు.’’

సంప్రదాయ పద్ధతిలో..

‘‘ద్వారాల తయారీకి మేము నాణ్యమైన టేకును ఉపయోగిస్తున్నాం. 100 దుంగల్లో నాణ్యత గల 20 దుంగలను మాత్రమే ఎంపిక చేసుకున్నాం. కీలలు, స్టీల్‌ జోలికి వెళ్లకుండానే సంప్రదాయ పద్ధతుల్లో డోర్‌ ఫ్రేములు, డోర్లు తయారు చేస్తున్నాం. దీని వల్ల అవి వెయ్యేళ్ల వరకు మన్నుతాయి. కొన్నింటిని ఇప్పటికే పూర్తిచేశాం. మరికొన్ని తయారీ ఇంకాస్త సమయం పడుతుంది.’’

నగర శైలి డిజైన్‌తో..

‘‘భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబించేలా వందల ఏళ్ల క్రితం నాటి నగర శైలి డిజైన్‌తో తలుపులు చేయమన్నారు. ఈ తరహా డిజైన్‌ ఉత్తర భారత దేశ ఆలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 8 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 5 ఇంచుల మందంతో గర్భగుడి తలుపులు చేయమన్నారు. వెడల్పులో కాస్త వ్యత్యాసంతో మరికొన్ని తలుపులు చేయమన్నారు. మహారాష్ట్ర అడవుల్లో లభించే నాణ్యమైన బల్‌హర్ష టేక్‌ను ఉపయోగిస్తున్నాం.’’

లక్ష్మీనరసింహుడి దయతో..

‘‘యాదాద్రిలో వెయ్యేళ్ల క్రితం నాటి దుంగను తీసుకుని ఆదిశేషశయన శ్రీమహావిష్ణు రూపాన్ని చెక్కాం. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో మాకు ఈ అవకాశం దక్కింది.’’



నమూనా తయారీకి 5 నెలలు..

అనురాధ టింబర్స్‌ ఇంటర్నేషనల్‌ తయారుచేసిన అయోధ్య రామమందిర నమూనా ఇది. బూర్మా టేకుతో తయారు చేసిన ఈ నమూనాను ఏప్రిల్‌ 2021లో ఆలయంలో లోపల సందర్శనార్థం ఉంచారు. 3 అంతస్థులు, 320 స్తంభాలున్న ఈ నమూనా తయారీకి 5 నెలల సమయం పట్టింది.


Read More
Next Story