‘నిశ్శబ్దంగా ఉండడం ప్రమాదకరం: ప్రొఫెసర్ హరగోపాల్
x
వనపర్తి ఒడిలో’ పుస్తకావిష్కణలో ప్రొఫెసర్ హరగోపాల్

‘నిశ్శబ్దంగా ఉండడం ప్రమాదకరం: ప్రొఫెసర్ హరగోపాల్

ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రాఘవ శర్మ రాసిన ‘వనపర్తి ఒడిలో’ పుస్తకాన్ని వనపర్తి కష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆడిటోరియంలో ప్రొ. హరగోపాల్ ఆవిష్కరించారు.


‘చరిత్రను వక్రీకరిస్తున్న ఈ రోజుల్లో, మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? మానవ సంబంధాలు అసలు ఎలా ఉండాలి? అన్న ప్రశ్నలకు ‘వనపర్తి ఒడిలో’ చదివితే సమాధానాలు దొరుకుతాయి. చరిత్ర మార్పునకు మనం ఏం చేయాలో ఈపుస్తకం మనల్ని ఆలోచింప చేస్తుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండడం చాలా ప్రమాద కరం. ’’ అని పౌరహక్కుల నాయకులు ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు.

తిరుపతికి చెందిన రాఘవ శర్మ రాసిన ‘వనపర్తి ఒడిలో’ పుస్తకాన్ని వనపర్తిలోని కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం హరగోపాల్ ఆవిష్కరించారు. తొలి కాపీని ఈ పుస్తకం రాఘవశర్మ చెల్లెలు డాక్టర్ ఏ. గాయత్రికి అందచేశారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ ‘‘ ఈ పుస్తకం రాఘవ శర్మ వ్యక్తిగత అనుభవంతో పాటు, సామాజిక బాధ్యతతో రాసింది. ఇది రాఘవ శర్మ అనుభవం మాత్రమే కాదు, మనందరి అనుభవం.




సామాజిక శాస్త్రవేత్తలు తేలికగా ఉన్న విషయాన్ని సంక్లిష్టం చేసి చెపుతారు. రాఘశర్మ జర్నలిస్టు కనుక, సంక్లిష్టంగా ఉన్న విషయాన్ని చాలా తేలికగా చేసి చెప్పారు.

ఆనాటి మానవ సంబంధాలు, జనజీవనం ఎలా ఉందో చెప్పడం, సమాజ అనుభవాన్ని మనందరి అనుభవంగా చెప్పడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. నేను థాయిలెండ్ వెళ్ళినప్పుడు ఒక కోటలోకి విద్యార్థులను తీసుకెళ్ళి చరిత్ర పాఠాలు చెప్పడం నేను కళ్ళారా చూశా. మనిషి గాఢంగా జీవించినప్పుడు అది వ్యక్తిత్వంలో భాగమవుతుంది. ‘వనపర్తి ఒడిలో’ అదే కనిపిస్తుంది. మనందరం కూడా అందులో జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజు కాలేజీలు పెట్టి ప్యాలెస్ లాంటి ఇళ్ళు కట్టుకుంటున్నారు. వనపర్తి మాజీ సంస్థానాదీశుడు రామేశ్వర్వరావు ఆ రోజుల్లో కాలేజీ కోసం తన ప్యాలెస్ నే ప్రభుత్వానికి ఇచ్చేశాడు.’’ అన్నారు ప్రేక్షకుల హర్షద్ధ్వానాల మధ్య.



వనపర్తి ఒడి లో ఆవిష్కరిస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్ , హరగోపాల్ కు ఎడమ వైపు డాక్టర్ జతిన్ కుమార్, వన మాల, డాక్టర్ గాయత్రి ,కే. వెంకటేశ్వర్లు, హరగోపాల్ కు కుడి వైపు న రాఘవ శర్మ, ఇక్బాల్, పాశం యాదగిరి తదితరులు.


‘ యజ్ఞం’ గుర్తుకు వస్తుంది : జతిన్

‘వనపర్తి ఒడిలో’ అనే వలను రాఘశ శర్మ విసిరారు. ఆ వలలో మనమందరం చిక్కుకున్నాం’’ అని సాహితీ వేత్త డాక్టర్ జతిన్ కుమార్ ‘వనపర్తి ఒడిలో’ పుస్తకాన్ని పరిచయం చేస్తూ చమత్కరించారు. ‘‘ఈ పుస్తకం చదువుతుంటే కాళీపట్నం రామారావుగారి ‘ యజ్ఞం’ కథ గుర్తు చేస్తుంది. రాఘవ శర్మ అనుభవాలు తన ఒక్కడి అనుభవాలు కావు, అవి మనందరి అనుభవాలు. సామాజిక సంబంధాలను వ్యక్తిగత అనుభవం నుంచి చరిత్ర చెప్పడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అమ్మ కొంగుపట్టుకుని తిరుగుతూ, అమ్మ వెంటే నడిచి రాసిన పుస్తకం ఇది’’ అని వ్యాఖ్యానించారు.




గుండె నెత్తురులో ముంచి రాశారు : పాశం యాదగిరి

‘‘ ‘వనపర్తి ఒడిలో’ చదువుతుంటే నేనే రాశాననిపిస్తుంది. హైదరాబాదు గురించి కూడా ఇలా రాయాలనిపిస్తుంది. కలాన్ని గుండె నెత్తురులో ముంచి రాశారని పిస్తుంది.‘‘ అని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి తన ఆప్తవాక్యాల్లో అన్నారు. ‘‘ ఎవరైనా ‘వనపర్తి ఒడిలో’ లాగా సినిమా తీస్తే బాగుంటుంది. ప్రతి ఊరి గురించి రాయాలి. ప్రభుత్వమే ఆ పని చేయించాలి. ప్రకృతిని నాశనం చేయడమే అభివృద్ధి చేయడం అనుకుంటున్నారు. వనపర్తి ప్యాలెస్, గుండు బావి భవిష్యత్తులో ఉంటాయో, ఉండవో తెలియడం లేదు.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


హరగోపాల్ జీవిత చరిత్ర రాయాలి : రాఘవాచారి

బాల్యంలో తాము జీవించిన ప్రాంతం పరాయి ప్రాంతం అయిపోతే, ఆ ప్రాంతాన్ని ఇంత గాఢంగా ప్రేమిస్తారా !? బడి, బాల్యం, అమ్మ గుర్తుకొస్తే నిజంగా దు:ఖం వస్తుంది అని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం. రాఘవాచారి ఆప్తవాక్యాల్లో అన్నారు. ‘వనపర్తి ఒడిలో’ ని తీసుకు రావడాన్ని పాలమూరు అధ్యయన వేదిక సభ్యుడిగా గర్వపడుతున్నానని ప్రకటించారు. ‘‘సహజంగా ఎవరైనా తమ అనుభవాలు రాసేటప్పుడు స్వోత్కర్షలుంటాయి. రాఘవశర్మ ‘వనపర్తి ఒఢిలో’ రాసేటప్పుడు తను అనుభవిస్తూ రాశారే తప్ప తనను గురించి తాను చెప్పుకోలేదు. యాభై ఏళ్ళ నాటి విషయాలు చెప్పడం చాలా అపురూపం.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘డాక్టర్ బాలకృష్ణయ్య ఏ అధికారంపై నయితే పోరాడారో, ఆ అధికారం పార్టీగా ఏర్పడి, అది అధికారం చేపట్టాక అందులో చేరిపోయారు. తెలంగాణా ఉద్యమంలో పోరాడిన వారు కూడా టీఆర్ ఎస్ అధికారం చేపట్టాక కూడా అదే జరిగింది. హరగోపాల్ గారు కూడా తన జీవిత చరిత్ర రాయాలని ఈ వేదిక పైనుంచి కోరుతున్నాను’’ అని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తన ఆప్తవాక్యాలలో కోరారు.

‘సాక్షి’ విశ్రాంత డెప్యూటీ ఎడిటర్ వేణుగాపాల్, ‘దిశ’ న్యూస్ ఎడిటర్ రాజశేఖర రాజు, వనమాల, జర్నలిస్టు సి.సి.రెడ్డి, జనజ్వాల, సయ్యద్ జమీల్, రాధ, ప్రభాకర్, సత్యనారాయణ రెడ్డి, కుమార స్వామి రెడ్డి తదితరులు ఆప్తవాక్యాలు పలికారు.

శిథిల సౌందర్యం : రాఘవ శర్మ

‘‘ఈ వేదిక చారిత్రాత్మకమైంది. నాతోటి పిల్లలంతా తొలి సారిగా ఇక్కడనుంచే సినిమాలు, నాటకాలు చూసి, ఉపన్యాసాలు విని, మానసిక వికాసాన్ని పొందారు. ఇదొక శిథిల సౌంర్యం. ఏమీ ఎరగనట్టు తెల్లముఖం వేసుకుని చూస్తున్నట్టుండే ఈ ప్యాలెస్ తన పొట్టలో ఎంతో చరిత్రను దాచుకుందో. రాజరిక ధర్పానికి ప్రతీకగా ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య భావనలను చేతులు చాచి ఆహ్వానించింది. రోజు సూర్యోదయం కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. మీ అందరి అభిమానాన్ని, ఆప్యాయతలను మూటగట్టుకుని చంకలో పెట్టుకుని వెళుతున్నాను. ఇప్పటి వరకు మీరు వినిపించిన ప్రేమగానాన్ని మోసుకువెళుతున్నాను’’ అని ‘వనపర్తి ఒడిలో’ రచయిత రాఘవ వర్మ తన స్పందనను తెలియచేశారు.


సభకు హాజరైన సాహిత్యాభి మానులు


సత్తార్ ఎంతో శ్రావ్యంగా పాడిన ‘ఆ చల్లని సముద్ర గర్భం’ పాటతో ప్రారంభమైన ఈ సభకు పాలమూరు అధ్యయన వేదిక స్థానిక బాధ్యులు కె. వెంకటేశ్వర్లు, ఎండి ఇక్బాల్ పాషా సంయుక్తంగా అధ్యక్ష వహించారు. ఈ పుస్తకావిష్కరణ సభకు కె.సి. వెంకటేశ్వర్లు ఆహ్వానం పలకగా, ఐ. నారాయణ వందన సమర్పణ చేశారు.



Read More
Next Story