వరి పొలమంతా ఆక్రమించిన త్రివిక్రముడు రైతు
తిరుప్పావై 3వ పద్యం విశేషాలు: ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
లోకాలు నడిపించే నారాయణుడు యాచకుడుగా జన్మిస్తాడా? పొట్టివాని రూపం ఎవరైనా ధరించడానికి ఇష్టపడతారా?
జీవులు కలువపూలు, లక్ష్మీనారాయణులే తుమ్మెదలు. శరీరమనే క్షేత్రంలో జీవుడనే విత్తనాన్ని పరమాత్ముడు నాటుతాడు. ఆత్మసస్యం ఫలించాలంటే ఈతి బాధలు ఉండరాదు. నెలమూడు వానలు కురియాలి అని ‘‘ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి...’’ గోదాదేవి (ఆండాళ్) తమిళ పాశురంలో సారాంశాన్ని వివరిస్తున్నారు.
బలి అన్యాయంగా ఆక్రమించిన దేవతల రాజ్యాన్ని ఇప్పించడానికి వామనుడై వచ్చాడు. మూడడుగుల నేల ఇస్తానంటే పొంగిపోయి పెరిగిపోయినాడు. రెండుడుగులతోనే లోకాలు కొలిచినాడు. పురుషోత్తముడు. భక్తులకోసం వామనుడైన పరంధాముడెంత ఉత్తముడని గోపికలు పరవశిస్తున్నారు. లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు ఉన్నారు. ఇతరులను సొంతలాభం కోసం హింసించే వారు అధములు, ఇతరులతో పాటుమనమూ బాగుండాలనుకునే వాడు మధ్యముడు. తన ప్రాణాలను లెక్కించకుండా పరోపకారం చేసేవాడు ఉత్తముడు. దీనమైన హీనమైన రూపునైనా సరే ధరించి భక్తులను కాపాడే హరి ఉత్తముడు, పురుషోత్తముడు.
వరిపైరు త్రివిక్రముడు రైతు
ముల్లోకాలను నిండా ఆక్రమించిన త్రివిక్రముడివలె వరిపైరు పొలమంతా విస్తరించితే చోటు లోక చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఉత్తముడు గురువే. మూడడుగుల నేల ఇవ్వడానికి సిధ్దంగా కాగానే వామనుడు త్రివిక్రముడైనట్టు, మూడు రహస్యములు తెలుసుకోవడానికి శిష్యుడు అంగీకరించగానే గురువు విజృంభించి సందేహాలను నివృత్తి చేయడానికి యథార్థ రూపాన్ని చూపుతాడట. జీవుడనే విత్తనమును శరీరమనే క్షేత్రమున పరమాత్మ నాటుతాడు. ఆత్మసస్యము ఫలించుటకు ఈతి బాధలు ఉండకూడదు.
ఈతి బాధలు ఆరు: అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, దుష్టులైన రాజులు. ఆత్మవిషయంలో కూడా ఈతిబాధలు ఆరు. 1. దేహాత్మబుధ్ధి, 2. నేను స్వతంత్రుడనే బుద్ధి, 3. పరమాత్మ కాక ఇతరులకు చెందినవాడననే బుద్ధి, 4. తన్నుతానే రక్షించుకోగలననే బుద్ధి, 5. శరీరబంధువులే బంధువులనే బుద్ధి, 6. శబ్దాది విషయములను అనుభవించాలనే బుద్ధి. నెలమూడు వానలంటే 1. పరమాత్మకే తప్ప ఇతరులకు చెందిన వాడను గాను అనే బుధ్ధి, 2. పరమాత్మయే తప్ప ఇతరము ఉపాయమే కాదనే బుద్ధి. 3. పరమాత్మానుభవము తప్పఇతరమగునది నాకు రుచింపదనే బుద్ధి.
శరీరమే క్షేత్రము, దాని అడుగున జలమే పరమాత్మ, చేపలంటే భగవద్ధ్యానముతో మాత్రమే జీవించగలిగే భక్తులు. ఈ నీటిలో కలువపూలంటే జీవుల హృదయాలు, అందులో తుమ్మదలంటే లక్ష్మీనారాయణులు, జీవుల పరిపాలన విషయంలోనే వారికి కలహాలు అని కందాడై రామానుజాచార్యులు చాలా అందంగా అని తిరుప్పావైలో మూడో పాశురంలో వివరించారు.
రాముడి ప్రతిన
ప్రాణాలనూ, నిన్నూ, లక్ష్మణుడినైనా వదులుకుంటాను గాని, (మునులను రాక్షసపీడనుంచి విముక్తం చేస్తానని) చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చకుండా వదలను అని శ్రీ రాముడు సీతతో అంటాడు. ఉత్తమలక్షణం అది.
భగవంతునికన్న అతని నామం మిన్న
క్షత్రియవంశంలో జన్మించినా గొల్లవాడిగా పెరగడానికి జంకని వాడు శ్రీకృష్ణుడు. జాతిని వదులుకున్నాడు. శ్రీ కృష్ణుడెంత ఉత్తముడు. ఆ పురుషోత్తముని నామాలను కీర్తిస్తూ వ్రతం మొదలు పెట్టారు. గోవింద నామం జపిస్తే ద్రౌపదికి వస్త్రధార లభించింది. రామనామంతో హనుమ సులభంగా సముద్రాన్ని దాటాడు. అదే రాముడు వంతెన నిర్మిస్తే తప్ప దాటలేకపోయాడు. ఉత్తముని నామాలను కీర్తించామన్నారే గాని ఉత్తముని కీర్తించామనలేదు. నామాలకు ఆ నామపు భగవానునికన్న మహిమాతిశయం ఉంటుంది. భగవన్నామాన్ని కీర్తించడానికి ఏ యోగ్యతలూ లేవు. గంగాస్నానం చేయడానికి ముందు చిన్న చెరువులో స్నానం చేయాలంటారా ఎవరైనా? తిరునామ కీర్తన చేత అన్ని యోగ్యతలూ లభిస్తున్నాయి. భగవత్తత్వము బంగారుముద్ద అయితే, భగవన్నామము ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న స్వర్ణాభరణము.
వ్రతం పేర మార్గశీర్షమాసంలో ఉదయాన స్నానం చేస్తే చాలు దేశం సుభిక్షంగా ఉంటుందంటున్నారు గోపికలు. శ్రీ కృష్ణుడే వారికి ఫలము. మరే ఫలమూ ఆశించడం లేదు. శ్రీకృష్ణ విరహతాపాన్ని తరించడానికి స్నానం చేస్తారు. స్వామి నామాలు చెప్పడానికి ఇదివరకున్న ఆంక్షలు లేవు. పురుషోత్తముని నామకీర్తన చేస్తే, ఇక ఈతి బాధలుండవు. వ్యాధులు దుర్భిక్షాలు రావు. అమంగళాలు తొలగిపోతాయి. పరమాత్మ అనుగ్రహిస్తాడు. అప్పుడు అపరిమితమైన ఫలితాలు ఫలాలు లభిస్తాయి.
ఆళవందార్ భట్టర్ (రామానుజుని గురువైన యామునాచార్యుడు) వంటి పరమభక్తులకు పద్మాలను చూస్తే భగవానుని చరణాలు గుర్తుకొస్తాయట. కనుక ఆ పద్మాలకు ప్రణమిల్లుతూ ఉంటాడు. మరో కోణంలో మారీచుడికి ప్రతి వృక్షంలో రాముడే కనిపిస్తాడట. పొలాల్లో నీరు సమృద్ధిగా ఉంటే కలువలు నిండా పూస్తాయి. కలువల్లో తుమ్మెదలు చేరుతాయి. మకరందం తాగుతాయి, మత్తుతో తూగుతాయి. పుష్పమే శయ్య. రాకుమారులు తూగుటుయ్యాలలో ఊగినట్టు తుమ్మెదలు కలువల ఉయ్యాలలో ఊగుతున్నాయి. నిద్రిస్తున్నాయి. పాడిపంటలే సంపద. క్షేత్రం, గ్రామం సమృద్ధిచెందుతాయి. పశువులు ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్నాయి. పొదుగులు నిండుగా ఉన్నాయి. సమృద్ధిగా పాలిస్తాయి. సమర్థులకు మాత్రమే ఆ పొదుగులు పిండడం సాధ్యం. భయపడరాదు. పాలు వస్తూనే ఉంటాయి కనుక చాలాసేపవుతుంది. నిండైన పొదుగులు కనుక రెండు చేతులతో పట్టుకోవాలి. గోకులంలో పశువులు బలంగా ఉన్నాయి కనుక గోపాలకులు కూడా బలంగా ఉండాల్సిందే. ఒక్కసారి పిండకపోయినా పాలు ఉప్పొంగుతాయి. అడగకుండానే పాలు కురుస్తాయి, కడవలు నిండుతాయి. అడగని వారిదే లోపం. శ్రీకృష్ణుని హస్తం తాకి ఆతని వేణుగానామృతం చెవులతో తాగి పెరిగిన పశువులు అవి. ఆ కృష్ణుని ఔదార్యం ఆవులకూ వచ్చింది. చిన్న పిల్లలనుకూడా దరిచేర్చుకుంటాయి. ఆదరిస్తాయి. తరగని సంపద, పాలూ పెరుగూ, పొలమూ పంటా, అంతులేనివి. సర్వేశ్వరుని అనుగ్రహంతో లభించిన ఆ సంపద అక్షీణమైనది.
అర్థిస్తే కాదనడు నారాయణుడు. రాముడైనా, వామనుడైనా, కృష్ణుడైనా ఔదార్యంతో రక్షిస్తాడనే నిర్భరహృదయంతో గోపాల గోపికలు నిశ్చింతగా ఉన్నారు.
తిరుప్పావై 3వ పాశురం (పద్యం) తెలుగుభావార్థ గీతిక
మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు
అంతలోనె ఆకాశానికెదిగి లోకాలనెల్ల పాదాల కొలిచినాడు
నోముస్నానాల పునీతమై త్రివిక్రముని నోరార వేడుదాము
నెలమూడు వానల, వెన్నెల సోనల వ్రేపల్లె సస్యశ్యామలంబు
ఎదిగిన పైరుల నిండిన జలాల త్రుళ్లి పడు మీన సంచయంబు
తెలుపుకలువపూల తెలవారుదాక నిదిరుంచు తుమ్మెదలు
కృష్ణువేణువు తాకి సేపులెగసి గోవులిచ్చును క్షీర కుంభవృష్ఠి
సిరిసంపదలకేమి కొదవ రారండి సిరినోము జేయ సీమంతులార.