ఇంటర్‌ ఫెయిలైన వారికి సైకియాట్రిస్ట్ అలర్ట్.
x

ఇంటర్‌ ఫెయిలైన వారికి సైకియాట్రిస్ట్ అలర్ట్.

ఆత్మహత్యలు వద్దు – జీవితం ఎంతో విలువైనది: డాక్టర్ బి కేశవులు సలహా


తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు నేడు అనగా ఏప్రిల్ 22 న విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. అంటే మొత్తం ఫ‌స్టియ‌ర్ ప‌రీక్షల‌కు 4,88,430 మంది హాజ‌రు కాగా.. వారిలో 3,22,191 మంది పాసైయ్యారు.

ఇక సెకండియ‌ర్‌ ఫలితాల్లో 65.65 శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. సెకండియ‌ర్ ప‌రీక్షల‌కు 5,08,582 మంది హాజ‌రైతే వీరిలో 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో మరియు సెకండియర్ లో దాదాపుగా 35% పైగా మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయినట్లు తెలుస్తుంది.

పరీక్షల ఫలితాల అనంతరం కొందరు విద్యార్థులు తీవ్ర మనోవేదనకు లోనవుతూ ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది 2024లో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి సంవత్సరం సగటున 12,000 పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఈ గణాంకాలు మన మనసును కలచివేస్తున్నా, సమాజం పెద్దగా స్పందించడం లేదు. ఒక్క పరీక్షలో మార్కులు తక్కువ వచ్చినందుకే పసిపిల్లలు ప్రాణాలను త్యజించుకుంటున్నారంటే మనం ఎంత అసంపూర్ణమైన విద్యావ్యవస్థలో బతుకుతున్నామో తెలుసుకోవచ్చు. కానీ విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న ఒత్తిడిని తల్లిదండ్రులు, గురువులతో పంచుకోకుండా చివరి నిర్ణయానికి వెళ్తున్నారు.

గతం లాగా ఈ సంవత్సరం అటువంటి ప్రయత్నాలు లేకుండా ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు అలర్ట్ గా " బతికి సాధించండి " అని భావనతో "ది ఫెడరల్ తెలంగాణ" అందిస్తున్న ప్రత్యేక కథనం....

ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు :
1. ఫలితాలపై అపారమైన ఒత్తిడి.
– మార్కులు జీవితాన్ని నిర్ణయిస్తాయన్న అపోహ.
– తల్లిదండ్రుల నుంచి వచ్చే అంచనాలు.
2. పారిశ్రామిక విద్యావ్యవస్థ.
– కేవలం ర్యాంకులు, మార్కుల మీదే దృష్టి.
– తెలివిని కాకుండా కఠిన పరిశ్రమను కొలమానం చేయడం.
3. కౌన్సిలింగ్ మద్దతుల లేకపోవడం.
– స్కూల్ లెవల్లో మానసిక ఆరోగ్యం గురించి చర్చే లేదు.
– పరీక్షల తర్వాత విద్యార్థుల మనోభావాలపై ఆసక్తి లేదు.
4. సమాజపు శాపించటం.
– ఫెయిలైన విద్యార్థిని చిన్నచూపు.
– పనికి రాని వాడుగా ముద్ర.
ప్రాణం కన్నా పరీక్షలు ముఖ్యం కాదు:
జీవితం ఒక్క పరీక్ష కాదు. ఓ ఫలితం రావడం వల్ల మన లక్ష్యాలు నాశనం కావు. కానీ, దీనిని పిల్లలు అర్థం చేసుకునే స్థితిలో లేరు. అందుకే విద్యార్థులకు చిన్న వయస్సులోనే విజయ, పరాజయాల మధ్య తేడా తెలియదు. "ఫెయిలైతే జీవితమే ఫెయిలవుతుంది" అన్న భావన వారికి నాటిపోతుంది. ఇది సమాజం సృష్టించిన అబద్ధం.ఫలితాలు విద్యార్థుల విలువను నిర్దేశించవు , విద్యార్థులు ఓ ప్రయత్నం ఫెయిలైనా – మరో గొప్ప జీవితం గెలవొచ్చు, ఆత్మహత్యలు మాత్రం సమస్యకు పరిష్కారం కావు – ఒక్క పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదు. కానీ ఒక క్షణ కాల నిర్ణయం – ప్రాణం త్యాగం – సమాజాన్ని, కుటుంబాన్ని శాశ్వతంగా గాయపరుస్తుంది. ఈ దేశానికి విద్యార్థుల మేధస్సు, శక్తి, కళలు కావాలి. ఓటమి ఒక ఆగిపోయిన ఘడియ మాత్రమే – జీవితం ఇంకా నడుస్తోంది. నడిపే ధైర్యం విద్యార్థుల్లో ఉంది ! జీవితం విలువైనది – ఆత్మహత్య అర్థరహితం! సహనం ఉంటే సమయం మారుతుంది – ప్రాణం మిగిలితే అవకాశాలు ఉంటాయి, ఓర్పుతో ముందుకెళ్లండి

విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:
1. ఫలితం ఒక అడుగు మాత్రమే: ఇది మీ జీవితాన్ని నిర్ణయించేది కాదు. ఓ పరీక్షలో ఫెయిలవ్వడం అంటే మీరు జీవితం మొత్తంలో ఫెయిలవ్వడమనే కాదు. ఇంకా అసలైన్ జీవితం ముందు ఉంటుంది.
2. తల్లిదండ్రుల మద్దతు తీసుకోండి: మీ భావోద్వేగాలను మీ ఇంట్లో వాళ్లతో పంచుకోండి. వారు మీ బలంగా ఉంటారు. మంచి చెడు కైనా తల్లిదండ్రులే మీకు శాశ్వత శ్రేయోభిలాషులు.
3. మరల ప్రయత్నించండి: ఒక ప్రయత్నం విఫలమైతే మరొకటి చేయొచ్చు. జీవితంలో అవకాశాలు అనేకం ఉన్నాయి. గొప్ప వాళ్లంతా మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయిన వారే నన్న విషయం మరవద్దు.
4. స్నేహితుల సహాయం తీసుకోండి: ఒంటరిగా భావించినప్పుడు మీ స్నేహితులతో మాట్లాడండి. చిన్న మాట కూడా మీ మనోస్థితిని మార్చగలదు.
5. ఆత్మహత్యకు ప్రత్యామ్నాయం ఉంది: సమస్యకు సమాధానాలు ఎన్నో ఉంటాయి. ఆత్మహత్య మాత్రం ఏ సమస్యకు ఎప్పటికీ కూడ శాశ్వత పరిష్కారం కానే కాదు.
6. భవిష్యత్తుకి ఓకే చెప్పండి : సమస్య ఉందా? – మాట్లాడండి. మనస్సు తెరవండి. మీరు ఒంటరిగా లేరు. మీకు ఎందరో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మరవొద్దు. –
7. జీవితం ఒక్క పరీక్ష కాదు: ఓ ఫలితం రావడం వల్ల మన లక్ష్యాలు నాశనం కావు. కానీ, దీనిని పిల్లలు అర్థం చేసుకునే స్థితిలో లేరు. కావున పెద్దల మాటలు విని స్పూర్తి పొందండి. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి మొదట మెట్టు అనే విషయం మరవద్దు.
తల్లిదండ్రులకు సూచనలు:
ఫలితాలపై ఒత్తిడి తక్కువ చేయండి. మీ పిల్లల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించండి.వారు ఎమోషనల్‌గా ఎలా స్పందిస్తున్నారో గమనించండి. తప్పులను శిక్షించకండి – అర్థం చేసుకోండి. వారు చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. వారిలో నమ్మకం పెంచండి. వారితో కలిసి మాట్లాడండి. వారు ఫలితాలపై నిరాశ చెందితే, మానసికంగా అండగా ఉండండి. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి.పరీక్షల ముందు, తర్వాత మానసిక ఒత్తిడి తట్టుకునే విధానాలు నేర్పించండి.
ప్రత్యామ్నాయ మార్గాలు:
జీవితం ఒక పరీక్ష కాదు – అది ఒక అవకాశాల పల్లకీ. ఓ ఫలితం ఆశించినట్టుగా రాకపోవచ్చు – కానీ జీవితం ముందుకే పోతుంది. ప్రతి నిదానానికి ఒక పరిష్కారం ఉంటుంది. అందుకే... ఓటమికి కాదు... ఓపికకి ఓటు వేయండి. జీవితం కోసం మార్పు, ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక మద్దతు పథకాలు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని విద్యావ్యవస్థలో భాగం చేయాలి, గేమ్స్, యోగా, మైండ్‌ఫుల్‌నెస్, ఆర్ట్ అనే వాటికి ప్రాధాన్యం, విజయం కన్నా ఆరోగ్యకరమైన ప్రయత్నం అనే అభిప్రాయం నాటాలి, ప్రతి స్కూల్, జూనియర్ కాలేజ్‌లో మానసిక కౌన్సిలింగ్ కేంద్రాలు ఉండాలి. ఫలితాల తర్వాత హెల్ప్‌లైన్ నెంబర్లు, వీటితో విద్యార్థులకు సహాయం, తల్లిదండ్రులకు అవగాహన సెషన్లు, వారి పాత్రను గుర్తు చేయాలి, కోచింగ్ సెంటర్లపై నియంత్రణ, ఫలితాలు పేరుతో ఒత్తిడి పెట్టే ప్రకటనలపై నిషేధం విధించాలి.



Read More
Next Story