
ఒరిస్సా ధౌలి శాంతి స్థూప సందర్శన
భువనేశ్వర్ నుంచి ధౌలి, పిపిలి మార్గంగా పూరి జగన్నాథ ఆలయ దర్శనం, రథయాత్ర విశేషాలు, చప్పన్ భోగ్ అనుభవాలు.
22. 01. 2026 రాత్రి పది గంటల ప్రాంతంలో విజయవాడలో దురంతో ఎక్స్ప్రెస్ ఎక్కాం వరంగల్ నుంచి వస్తున్న గోవర్ధన్ రెడ్డి యమునా దంపతులు, నేను భువనేశ్వర్ వెళ్లడానికి.
23 ఉదయాన్నే, దురంతో నత్త నడక నడుస్తుంది.ట్రైన్లో నుండి చూస్తుంటే జనవరికే పొలాలన్నీ ఎండిపోయి కనిగిరి,గిద్దలూరు పొలాలు గుర్తుకొచ్చాయి.వరిచేలు కోసి దుప్పలు కనపడుతున్నాయి.రెండవ పంట లేదట్టుంది. ఎట్టకేలకు 10 గంటలకు భువనేశ్వరలో దిగాం.స్టేషన్ కూడా బాగు చేస్తున్నారు కొద్దిగా గందరగోళంగా ఉంది.బయటికి రాగానే పవన్ కుమార్ (హేమిస్ మేనేజర్)స్వాగతం పలికేడు.నాకు పరిచయం లేదు కనుక మౌనంగా వారిని ఫాలో అయ్యాను.స్టేషన్ ముందు20 సీటర్స్ బస్సు.అందరూ సిద్ధంగా ఉన్నారు.బస్సు కొత్తగా దగదగలాడుతుంది.మేమే లేట్.ఎక్కగానే పూదోట శౌరి మేడంగారు గుర్తుపట్టారు.అందరికీ పరిచయం చేశారు.మొత్తం 14 మందిమి.
బస్ మహాజోరుగా పోతూ ధౌళి శాంతి స్తూపం దగ్గర ఆగింది.మిగిలిన బౌద్ధ స్తూపాల కన్నా ధౌలి శాంతి స్థూపం కొంత డిఫరెంట్ గా ఉంది.స్థూపం వలయాకారంలో, మొత్తం ధవళ వర్ణంలో భలే ఉంది.గోపురం నాలుగు వైపులా మెట్లు,నాలుగు వైపులా నాలుగు రకాల బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి.నాలుగువైపులా మెట్ల మొదలులో ఎత్తయిన స్తంభాలపై సింహాలు స్వాగతం చెప్తున్నట్లు ఉన్నాయి.నాలుగు వైపులా గోపురం పైన ఐదు స్తంభాలు,వాటిపై వివిధ చిహ్నాలున్నాయి.గోపురం పైన ఐదుగోడుకులు ఉన్నాయి.ఇవి బౌద్ధమతంలోని ఐదు సూత్రాలను సూచిస్తాయట.స్థూపం చుట్టూ జాతక కథలు చెప్పే బొమ్మలు ఉన్నాయి. భువనేశ్వర్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దయానది ఒడ్డున ఉన్న దౌళగిరి పర్వతంపై 1972 నిర్మించబడిన బౌద్ధ క్షేత్రం ఇది.
స్థూపం వెనుక శివాలయం
చరిత్రలో, క్రీస్తు పూర్వం 261లో కళింగయుద్ధం జరిగిన ప్రదేశం.కళింగ యుద్ధంలో జరిగిన సైనికుల మరణాలను చూచి చలించి పోయిన అశోక చక్రవర్తికి యుద్ధం అంటే విరక్తి కలిగి యుద్ధం చేయనని,బౌద్ధ మతాన్ని స్వీకరించినది ఈ దౌళగిరి ప్రదేశంలోనేనట.ప్రదేశం అంతా అశోకుని కాలము నాటి శాసనాలు,రాళ్లు కనిపిస్తున్నాయి.
శాంతిస్తూపాన్ని ఇక్కడ నిర్మించడానికి కూడా ఓ చరిత్ర ఉంది.700సం. క్రితం జపాన్ కు చెందిన మహాబిక్షు నిచిరెన్ బుద్ధుని నిర్యాణం తర్వాత 2500సం.లకు బౌద్ధమతం దాని జన్మభూమికి తిరిగి వస్తుందని ప్రవచించారట.ఆ ప్రవచనం ప్రకారము నిచెరన్ శాఖకు మూలపీఠమైన మౌంట్ మిండ్రా నుండి ఫుజి గురూజీ 1930లో భారతదేశానికి వచ్చారు.గాంధీజీకి మద్దతుగా 'వార్ధ' ఆశ్రమంలోనే ఉండిపోయి,స్వాతంత్య్రం ,అహింస కోసం 'నా-ము-Myo-హో- రెన్- గే- క్యో' మంత్రాన్ని (గాంధీజీ కూడా)జపించేవారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత 1969లో మొదటి 'రాజ్ గిర్' శాంతిస్తూపo ప్రారంభోత్సవ సందర్భంగా అప్పటి బీహార్ గవర్నర్ నిత్యానంద కనుoగో తన స్వస్థలమైన ఒడిశాలో మరో శాంతి స్థూపాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు.ఫుజి గురూజీని ఒడిస్సాకుఆహ్వానించారు.గురూజీ, అతని శిష్యుల ఖర్చుతో, ప్రజల శ్రమతో రెండేళ్లలో ఈ స్థూపం పూర్తి అయినది.
పూరి జగన్నాథ్ ఆలయం.
'దయా' నదిలో నీళ్ళు లేవు,కాని చుట్టూ పచ్చటి చెట్లు,చల్లని వాతావరణం ఉంది.దూరంగా అపార్ట్మెంట్ లతో కూడిన ఊరు కనిపిస్తుంది. అశోకుని కాలంనాటి రాతి ఏనుగు ఆకారంలో శిలాశాసనం ఉందట.రైలు లేటు కావటంతో దీనిని చూడలేకపోయాము(చూడటం నేను మర్చిపోయాను అని చెప్పాలి)
ఇక్కడ మరో ప్రత్యేకత,ఈ శాంతి స్థూపం వెనకవైపు గోపురాకారంలో తెల్లని శివాలయం, లోపల శివలింగం,దుర్గాదేవి, దేవాలయ గోడలో ఒకవైపు అమ్మవారు,ఇంకొక వైపు గణపతి,వెనకవైపునలక్ష్మి నారాయణ ఉన్నారు. పరమత సహనానికి ఇది నిదర్శనము.దక్షిణాది దేవాలయాలతో పోల్చితే ఇది పెద్దదేం కాదు.
ఇక్కడ నుండి బయలుదేరి పన్నెండు కి.మీ దూరంలో ఉన్న పిపిలి(Pipli) గ్రామంకు వెళ్ళాం. రంగురంగుల అప్లిక్యూ (Applique) హస్తకళా పనులకు ప్రసిద్ధి చెందిన ఒక చారిత్రిక పట్టణం. పట్టణం కాదు ఒక మోస్తర పెద్ద గ్రామం.వివిధ వస్త్రాలను,కలపను కత్తిరించి ఆకర్షణీయమైన నమూనాలతో,అద్దాలతో అలంకరించే కళకు ఈ ఊరు నిలయం.వస్త్రంతో తాయారు చేసిన దీపాలు బ్యాగులు గొడుగులు, చెక్కతో తయారు చేసిన బొమ్మలు, వస్త్రాలపై డిజైన్ కళాత్మకంగా బాగున్నాయి.తయారు చేసే దగ్గరకు వెళ్ళాం కాని, శుక్రవారం సెలవట.ఇదంతా ముస్లిం వాళ్లు తయారు చేస్తారట.ఆ ఇల్లు కూడా మొక్కలు చెట్లు పిట్టల అరుపులతో అందరికీ చాలా నచ్చింది.ఆ లేడీస్ తో ఫోటోలు తీసుకున్నాం.ఇక్కడ తిరుగుతుంటే చీరాల,ఈపురుపాలెం సందుల్లో తిరిగినట్లుగా ఉంది.మెయిన్ రోడ్ మాత్రమే బాగుంది.గ్రామంలో రోడ్లు పెద్దగా లేవు.సందులు గొందులుగా ఉన్నా నీట్ గానే ఉంది.మన 10 ఇటుకలంతా పెద్ద,ఎర్రని ఇటుకలతో గోడలు ఉన్నాయిఆంధ్రాలో ఓ మధ్య,పేద వర్గాలు నివచ్చించే గ్రామంలానే ఉంది. అందరూ గీచి గీచి బేరాలాడి షాపింగులు చేశాo.
దౌలి శాంతి స్థూపం మీద బుద్ధుని జాతక కథల చిత్రాలు
1.30కి పిపిలి టు పూరి.పొలాలు వరికోతలయ్యి ఎండిన బీళ్ళులా ఉన్నాయి. అక్కడక్కడ అరటి కొబ్బరి తోటలు కనిపిస్తున్నాయి. హోటల్ కి వెళ్లి రెడీ అయ్యి జగన్నాథ టెంపుల్కు వెళ్ళాం.
జగన్నాథ దేవాలయం గురించి కొద్దిగా:- ఒడిశాలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో ప్రముఖమైన హిందూ దేవాలయం.11,12 శతాబ్దాలలో కళిoగ శైలిలో అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించబడినది. జగన్నాథుడు (జగo+నాధుడు) (విష్ణుమూర్తి అవతారంలో) అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు సుభద్ర లు పూజలందుకుంటున్నారు.ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం సుభద్ర పూజలందుకోవడం. విగ్రహాలు ప్రత్యేకమైన (వేప) చెక్కతో చేయబడి ఉంటాయి.చెక్కతో చేయడానికి కూడా ఓ చరిత్ర ఉంది. చరిత్ర జోలికి వెళ్లడం లేదు.ఈ జగన్నాథుడు కూడా గిరిజనుల నీలి మేఘశ్యామ దేవుడిగా గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. తరువాత రాజుల కుట్రలతో రాజుల దేవుడైనాడు. విగ్రహాలకు చేతులు పూర్తిగా ఉండవు. చతుర్థ భువనాలను చూడటానికా అన్నట్లు పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి.విగ్రహాలను కూడా 8, 12 సం.రాలకు మార్చి కొత్త విగ్రహాలను పెడతారట.
ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఏ గుడిలోనూ మూల విగ్రహాలను ఊరేగింపుకు తీసుకురారు. ఇక్కడ మూల విగ్రహాలను ప్రతి సంవత్సరము రథయాత్రలో ఊరేగిస్తారు.ముందు బలరాముడు మధ్యలో సుభద్ర తర్వాత జగన్నాథ రధాలు ఉంటాయి.ఈ రథాలు కొలతలు,లెక్కల ప్రకారం (జగన్నాథ రథం 45 అడుగుల పొడవు 16 చక్రాలు. బలబద్రుడి రథం 44 అడుగులు 14 చక్రాలు. సుభద్ర రథం 43 అడుగులు 12 చక్రాలు) ప్రతి సంవత్సరము కొత్తగా తయారు చేస్తారట.ఈ రథయాత్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినదట.
ధౌళి శాంతి స్థూప చరిత్ర ను తెలిపే బోర్డ్
ఒరిస్సా టూరు అనగానే పైన రెంట్ కుండే బాబు గుడిపై జెండా అపసవ్య దిశలో ఎగురుతోందని,ఏ ఆధారం లేకుండానే పైకి ఎక్కి జెండా ప్రతిరోజు ఎగరవేస్తారని,ఎంతమంది వచ్చినా ప్రసాదం పెడతారని,గుడి నీడ పడదని,గుడిలో ఏ శబ్దము వినిపించదని, విమానాలు ఎగరవని చెప్పేడు.
ఫోన్లు,ఎలక్ట్రానిక్ వాచీలు లాంటివన్నీ ఓ షాపు దగ్గర పెట్టి దర్శనానికి వెళ్ళాము.24,25,26 సెలవులు.అక్కడ ఏదో పండగ కూడా ఆట. విపరీతమైన జనం.తిరుపతిలోలా నిర్వహణ ఓ క్రమ పద్ధతిలో లేదు.కనీసం మంచినీటి సరఫరా కూడా లేదు.గంటలు గంటలు క్యూలలో నిలిపివేత. ఒక్కొక్కసారి వందల మందిని క్యూలో నుండి వదలడం.
క్యూలో ఉన్నంతసేపు నా చూపు అంతా జండాల పైనే ఉంది.గుడి పైన జెండా కాకుండా, క్యూల సమీపంలో మరొక నాలుగు జెండాలు ఉన్నాయి.అన్ని జెండాలు సవ్య దిశలోనే ఎగురుతున్నాయి.నాకు భక్తి లేదు కాబట్టి అలా కనిపిస్తున్నాయేమోనని పక్కనున్న వారిని అడిగాను.వారు తలలు ఎగరేసారు కాని ఏమీ చెప్పలేదు.పోతున్న కొద్ది ఒరిస్సా హోంగార్డు కనిపిస్తే అడిగాం,అవి ఆపసవ్య దిశలో వీస్తాయా అని.కొన్ని సందర్భాల్లో వీస్తాయని చెప్పాడు.
గుడి నీడ పడుతుందా లేదా పరిశీలించాను. క్యూలో చాలా దూరంలో ఉన్నందున కనిపించలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత వేలమంది గోల తప్ప ఏమీ వినిపించలేదు.గుడిలో ఉన్న నాలుగు ఐదు గంటలు విమానాలు ఏమీ పోలేదు.విమానాలు వెళ్ళకూడదు అని నిబంధన ఉండవచ్చు.బహుశా దగ్గరలో ఎయిర్పోర్ట్ లేదేమో?
వదిలినప్పుడల్లా మేమే చివర ఉంటున్నాం. మా దర్శనం కాకుండానే ఎనక బ్యాచ్ ని వదిలేశారు. దానితో విపరీతమైన ఒత్తిడి. తోపులాట. అక్కడున్న గార్డులు లాఠీలు కాదు కానీ పుస్తకము లాంటి ఎదో వస్తువుతో బాదేస్తున్నారు మగవారిని. పూజారులు పళ్లెంలో 500 పెడితే బాగా దర్శనం చేయిస్తున్నారు.పెట్టనివారిని నెట్టేస్తున్నారు.నాకు మాత్రం బాగానే దర్శనం అయింది.ఈ తోపులాటలో ఇద్దరు ముగ్గురుగా విడిపోయాం.మా మేనేజర్లు 'HEMIS' ప్లే కార్డ్స్ పట్టుకుని ఊపుతూ అందరిని ఓచోట చేర్చారు.
ఎవరు చెప్పని విషయం గుడిలో మా టూర్ మేట్ 'శాంతి' గోపురం పై జెండా దగ్గర ఉన్న చక్రం మనం ఎటువైపు తిరిగితే(ఉత్తర దక్షిణ తూర్పు పడమరలుగా)అటువైపు తిరిగినట్లు కనిపిస్తుందని చెప్పింది.గుడిలో ఉన్నoతసేపు జెండాలతో పాటు ఆ చక్రాన్ని పరిశీలిస్తూనే ఉన్నాను.గుడిలో తేడా తెలియలేదు.గుడి బయట కొచ్చిన తరువాత,ఆటో ఎక్కి వచ్చేటప్పుడు చూస్తే శాంతి చెప్పినట్లుగానే కనిపించింది.ఇలా కనిపించడం చాలా అద్భుతంగా అనిపించింది.
అలానే గోపురంపై జెండా ఎగర వేయటానికి గోపురందాకా,గోపురం పక్కన గోపురం ఉంది.దాని ద్వారా గోపురంపై ఉన్న వృత్తాకారం పైకి వెళ్లి జెండా ఎగరవేయడానికి గొలుసులు ఉన్నాయి.ఆ గొలుసుల సహాయంతో (ప్రాక్టీస్ ఉన్నవారు)పైకి వెళ్లి జెండా ఎగరవేస్తున్నారు(మరొక చోట వివరిస్తాను). ఒరిస్సాలో దాదాపు గుడిలన్నీ గోపురాకారాలతో కూడిన గోపుర నిర్మాణాలు.అద్భుతమైన శిల్ప సంపద ఉంది.
ఎవరు ఏమనుకున్నా సరే! క్యూలోనుండి బయటకు వచ్చి అందినంతవరకు ఆ శిల్ప సంపదను తాకి ఆనందం పొంది,ఓహో! నా దేశ శిల్ప సంపదా!నిన్ను అణువు అణువు సృజించి ఆనందం పొందలేకపోతున్నాను.మన్నించు, మన్నించు మరొకసారి వస్తాను.నిన్ను చూడాలని ఏన్ని సంవత్సరాలుగా కలలు కన్నాను.నిన్ను చూడటం కోసమే నా శక్తికి మించి వచ్చాను అనుకున్నాను.ఇవన్నీ చూడాలంటే ఓ రోజంతా పడుతుంది.అది కూడా భక్తులు తక్కువగా (సెలవులు,పండగ రోజులు కాకుండా) ఉండే రోజుల్లో వెళ్లాలి.
హేమీస్ మేనేజర్ పవన్ కుమార్ డిసెంబర్ లోనే "చప్పన్ భోగ్" ప్రసాదం గురించి ఊరించాడు. డిసెంబర్ నుంచే నేను కళ్ళతో ఆస్వాదిస్తూ ఆ 'రుచుల' కోసం లొట్టలేయసాగాను.అలాగే మా వాళ్ళు కూడా అనుకుంటా.
"చప్పన్ భోగ్" అనేది పూరీలోని బలభద్ర సుభద్ర శ్రీకృష్ణులకు రోజువారీగా అందించే 56రకాల ప్రసాదాలు పలహారాలు. శ్రీకృష్ణుడు బాల్యంలో రోజుకు 8 పూటలా భోజనం చేసేవాడట.గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఏడు రోజులపాటు భారీ వర్షాల నుండి బృందావనవాసులను రక్షించి 56 పూటల భోజనాన్ని కోల్పోయాడట.ఈ కోల్పోయిన (7×8) భోజనానికి ప్రాయశ్చిత్తంగా భక్తులు ప్రతిరోజు భోగ్ ను సమర్పిస్తారట.
తయారు చేసే వంటగది "రోసాఘర" ప్రపంచంలోనే అతి పెద్ద వంటశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిందిట.సంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యిలుపై మట్టి కుండలు ఒకదానిపై ఒకటి ఏడు కుండలు పెట్టి చేస్తారట.మొదట పైకుండలోనించి కింది కుండలోకి ఉడుకుతూ వస్తాయట.పాపం!మా పవన్ కుమారు ఇవన్నీ చూపించాలి అనుకున్నాడు, కాని భక్తుల రద్దీతో వీలుకాలేదు.మా సుజాత మేడంగారు కూడా ఈ వంటగదిని చూసానని ఊరించారు.
అయితే అక్కడ ఎలాంటి ప్రసాదాలు భక్తులకు అందించలేదు.తిరుపతిలో లడ్డూలను కొనుక్కున్నట్లు కొనుక్కోవాలి.తిరుపతిలో లడ్డూలు దేవస్థానం వారు అమ్ముతారు.గుడి ఆవరణలో, గ్రూపులు గ్రూపులుగా ఒక్కొక్క గ్రూపులో ఇద్దరు ముగ్గురు మట్టి కుండలలో పెట్టి ప్రసాదాలు అమ్ముతున్నారు.ప్రసాదాలు అంటే (ఇస్తరి 100 రు) అన్నం, పప్పు నాలుగు రకాలు.గుడిలో నుండి బయటకు వచ్చేసరికి మా అందరికీ ఆకళ్ళు.మేం కూడా అది కొనుక్కుని తిన్నాం.ఇది ఓ పెద్ద వ్యాపారంలా ఉంది.ఏదైతేనేం చాలామందికి జీవనోపాధి కలిగిస్తుందని,భక్తుల ఆకలి తీరుతుందని సంతోషించాను.
రాజేంథ హోటల్లో,హేమీస్ వారు రూములు బుక్ చేశారు. సముద్రపు ఒడ్డున హోటల్ బలే ఉంది.

