‘ప్రశ్నించే గొంతులు’ ప్రశ్నించిన దశాబ్దాల అంతరాత్మ
x

‘ప్రశ్నించే గొంతులు’ ప్రశ్నించిన దశాబ్దాల అంతరాత్మ

చిన్న నటుడు కాకపోయినా చిన్న నటుడిగా చూడబడుతున్న కాకరాలగారు చిన్న పాత్రలు ఉంటాయి కానీ చిన్న నటులు ఉండరు అంటారు.


ఈ పుస్తకం,రచయిత రాఘవగారి ఉద్దేశంతో మొదలవుతుంది.వి.వి,దిశ రాజశేఖర్ ముందు మాటలు ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి. మార్కిస్టు అవగాహన కలిగిన,రాజకీయ, సామాజిక,సాహిత్య,కళలలో ప్రసిద్ధి చెందిన పదిహేడు మందితో చేసిన 20 అపూర్వ ఇంటర్వ్యూలు.కొనుక్కుని,దాచుకొని,చదవదగ్గ చారిత్రిక పుస్తకం. సీనియర్ జర్నలిస్టు,మార్కిస్టు అవగాహన కలిగిన రాఘవగారు 30 ఏళ్ల క్రితం చేసిన 11 ఇంటర్వ్యూలు మొదటి భాగంగా,ఇటీవల చేసిన 9 ఇంటర్వ్యూలను రెండో భాగంగా పరిశీలిద్దాం.

11 ఇంటర్వ్యూలు 1995లో పీపుల్స్ వార్ పై నిషేధం ఎత్తివేయడం గురించినవి.ఈ భాగాన్ని చరిత్రగా తీసుకుందాం.

75సం.పైబడిన వారిని మానవతా దృష్టితో జైలు నుండి విడుదల చేస్తున్నానని ఎన్టీఆర్ ప్రకటించగా కొండపల్లి సీతారామయ్యగారు జైలు నుంచి విడుదలయ్యాడు.పెద్దపులి లాంటి కొండపల్లి పెద్దపులి లాగే, 79 సం.రాలు ఉన్న నన్ను విడుదల చేసినట్లే కామన్ సెన్స్ ఉంటే జైల్లో ఉన్న 300 మందిని వదిలి పెట్టాలి.జనాన్ని మోసగించడానికి,జనం తంతారనే భయం కొద్ది వార్ పై నిషేధo ఎత్తి వేశాడని నిషేధ వెత్తివేత లోని డొల్లతనాన్ని ఒక్క మాటలో చెప్పేస్తాడు.

పి.వి నరసింహారావు చేసిన(బాబ్రీ మసీద్ కూలగొట్టడం సహ)తప్పులన్నీ తన మెడకే చుట్టుకుని సొంత రాష్ట్రంలో అపోజిషన్ అర్హత కూడా లేకుండా పోయిందని,నెమలూరి భాస్క రావు ఆంధ్ర లిన్ పియావో అని, సత్యమూర్తి లిన్ పియావో,పోలీస్ ఏజెంట్ కాదని, ఆసమర్థుడు ఎప్పుడో జారిపోయాడు.హరిజణున్న విషయం ఇప్పుడు అవసరమైంది అంటూ వ్యక్తుల గురించి స్పష్టతను ఇస్తాడు.

ఉద్యమం నుండి వచ్చిన సత్యమూర్తి ఎంత సింపుల్ గా బ్రతికాడో రాఘవగారి మాటల్లో అర్థమవుతుంది.ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడమనే మహోన్నత సాంప్రదాయాన్ని పీపుల్స్ వార్ ఆవిష్కరించిందని,భూస్వామ్య వర్గ పొగరును అణిచిందని,రైతాంగం ఆత్మవిశ్వాసంతో బ్రతకడానికి పీపుల్స్ వార్ ప్రభావం ఎంతో ఉందంటూనే, రాజకీయ రంగంలో వైఫల్యం చెందింది అంటాడు.సత్యమూర్తి కవి, భావుకుడు ఎన్టీఆర్ పాలన గురించి "పరిపాలన లక్ష్మీ పార్వతీయం" అని ఒక్కమాటలో తేల్చేస్తాడు. కేఎస్, ఎస్ఎంలు పీఫుల్స్ వార్ మాజీ కార్యదర్శులు. ఇద్దరి ఇంటర్వ్యూలలో సారూప్యతలు,స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి.

పీపుల్స్ వార్, ఆర్ఎస్ఎస్,వీహెచ్పీలపై నిషేధం విధించిన తీరులో వర్గ,హిందుత్వ దృక్పథం ఉందని చరిత్రలోని ఉదాహరణలతో వి.వి చెప్తారు.ప్రజల ఆస్తులకు,పెట్టుబడిదారి ప్రభుత్వాల ఆస్తులకు తేడా ఉందని,విదేశీ వస్తు బహిష్కరణలో గాంధీజీ,వంతెనలు కూలగొట్టండని పెర్నాండెజ్, క్విట్ ఇండియాలో జయప్రకాష్ చేసింది ఏమిటని వి.విగారు ప్రశ్నిస్తారు.

జ్వాలాముఖిగారు మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగంలో చాటుమాటుగా ముస్లిం వ్యతిరేకత ఉందని,బాబ్రీ మసీద్ కూల్చి వేసినప్పుడు హైదరాబాద్ నగరమంతా రాత్రిపూట అరుపులు,కేకలను కేసెట్ల ద్వారా నెల రోజులు వినిపించినప్పుడు, ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం హిందూ మతోన్మాదంతో వ్యవహరించాయని,ఫ్యూడల్ స్వభావం పోలీస్ యంత్రాంగంలో ఉందంటారు.రేఖా మాత్రంగా జ్వాలగారి మాటలలో పీపుల్స్ వార్ వ్యతిరేకత కనిపిస్తుంది.

ప్రభుత్వ, పోలీస్ యంత్రాంగంలో 90% భూస్వామ్యవర్గాల నుండి వచ్చినవారే కావడంతో ఆర్ఎస్ఎస్,విశ్వహిందూ పరిషత్ పట్ల మెతక వైఖరి ఉందంటారు ఎం.టి.ఖాన్ గారు. పంచాయితీ,పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎన్టీఆర్ నిషేధం ఎత్తివేశారు అంటారు.

గద్దర్ ప్రతి విషయాన్ని పాటలోనే వివరిస్తారు.సిపిఐ,సిపిఎం(కార్యకర్తలుకాదు) నాయకులు ఎన్టీఆర్ తోక పట్టుకుని పోయినోళ్లే. ఎర్రజెండాను తీసుకెళ్లి ఏట్లో పారేసిండ్రు అంటూ ఆయుధాలు పట్టుకొని అడవుల్లో పోరాడే 'వార్' దళాలను సమర్థిస్తూ,మాకు రాజ్యం ఇవ్వండి దేనిమీద హింస జరగనివ్వమoటాడు.

కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం మంచిదని, ఎన్టీఆర్,పీపుల్స్ వార్ యెడల మెతక వైఖరి అనుసరిస్తున్నారనే బాధ(సి పి.యమ్) కొరటాల సత్యనారాయణగారి ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపిస్తుంది.కొరటాలగారు వ్యక్తి హింస మార్క్సిజం కాదంటాడు.అయితే రాఘవగారు వదలకుండా మీవాళ్ళు కూడా ప్రత్యర్థులను చంపుతున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తే చివరికి నాకు తెలీయదు అని చెప్పడం భలే విడ్డూరంగా అనిపించింది.

వార్ పై నిషేధం ఎత్తివేయటంలో సిపిఐ కార్యదర్శి దాసరి నాగభూషణ్ రావుగారికి కొరటాలగారి లాగే కాంగ్రెస్-తెలుగుదేశం కు తేడా కనిపించింది.దాదాపు జవాబులన్నీ పేలవంగానే అనిపించాయి

డివి కృష్ణారెడ్డి, ప్రజాపoధా- పీపుల్స్ వార్ కు కొన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఐక్యత వైపుగా సాగుతామని,ఉన్నవన్నీ దోపిడి ప్రభుత్వాలేనని, వాళ్లు మాటలకు కట్టుబడి ఉంటారని భావించడం లేదని బలంగా చెప్తారు.

ఒకనాడు రాజ్యానికి వ్యతిరేకంగా ఆయుధం పట్టిన దాశరధి రంగాచార్యగారు, ఇప్పుడు, ఆయుధం ఎప్పుడూ శాంతి నెలకొల్ప లేదు,ఆయుధం నిర్జీవం,ప్రజల మాత్రమే జీవం అంటున్నారు.తెలంగాణ గురించి రెండుసార్లు జరిగినవి ఉద్యమాలు కావు.రెండూ రెండు కల్లోలాలు అంటారు.చిన్న జీయర్ ఏం చేశాడని టీటీడీ కోటి రూపాయలు ఇచ్చింది.వేదాలను టీటీడీ రక్షించటం ఏమిటి? గ్రంథస్థంకాని వేదాలను వేల సంవత్సరాలుగా ఎవరు రక్షించారు అని బండను పేటిల్ మనీ పగలగొట్టినట్లు చెప్పడం భలే ఉంది.

తిరుపతి మావోగా పిలవబడే త్రిపురనేని మధుసూదనరావు,పీపుల్స్ వార్ వ్యవసాయక విప్లవం కోసం కృషి చేస్తుంది.డబ్ల్యూటీవో ఒప్పందాలను ప్రభుత్వం అంగీకరించేటప్పుడు వ్యవసాయ విప్లవం కోసం పనిచేసే పీపుల్స్ వారితో చర్చించవలసి ఉంది.సోషలిజాన్ని తెమ్మని వార్ ప్రభుత్వాన్ని అడగడంలేదు.చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగేటట్టు చూడమంటుంది.ప్రభుత్వం జరగకుండా అవరోదం కలిగిస్తుంది.చర్చలు జరిపే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదoటున్నారు.

ఇదంతా మొదటి భాగంగా తీసుకుంటే రెండవ భాగంలో

పౌరహక్కుల ఉద్యమానికి బాలగోపాల్ ఒక ఊపు తీసుకొచ్చారని హరగోపాల్ గారు అంటారు.భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలంటే దేశద్రోహనేరం,ప్రివెంటివ్ డిటెన్షన్,ఉపా లాంటి చట్టాలను తీసేయాలని, నెహ్రూ కాలంలోనే హక్కులు కుంచించడం మొదలైందని హరగోపాల్ గారు చాల విషయాలు వివరిస్తారు.

రంగనాయకమ్మగారు అనగానే పాత తరానికి బలిపీఠం,మహిళలకు జానకి విముక్తి, నాస్తికులకు రామాయణ విషవృక్షం కమ్యూనిస్టులకు మార్క్స్ పెట్టుబడి గుర్తుకు వస్తాయి.రామాయణ విషవృక్షంలో శూర్పణఖ లక్ష్మణనీతో జరిపే అద్భుత సంభాషణ గుర్తుకువస్తుంది.రామాయణ విషవృక్షం, ఇదండీ భారతం, క్యాపిటల్ ఎందుకు రాయాల్సి వచ్చిందో కూలంకుషంగా వివరిస్తారు.ఏ మత గ్రంథమైనా ప్రజల ప్రయోజనాల దృష్టిలో చూస్తే విషవృక్షమే అవుతుంది అంటారు.

వకుళాభరణం రామకృష్ణగారు,సమాజం సమగ్రంగా అన్ని కోణాల్లో అభివృద్ధి సాధించే వరకు కులం, మతం, ప్రాంతం, స్త్రీ పురుష సంక్లిష్టత,సంక్షోభాలు ఉంటాయి అంటున్నారు.

ఆర్థిక శాస్త్రవేత్త,ప్రొఫెసర్ జ్యోతిరాణి గారు,అత్యంత ఖరీదైన ఎన్నికలు, గౌరవప్రదమైన ఉపాధితోనే ప్రగతి, వెలిగిపోతున్నది దేశం కాదు కార్పొరేట్ శక్తులు అని మూడు భాగాలుగా 23 పేజీలలో ఇచ్చిన ఇంటర్వ్యూ తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉంది.జ్యోతి రాణిగారు వ్యవసాయం,ఉపాధి పథకాలు,అమృత రైల్వే స్టేషన్లు, విద్య, వైద్యం గ్లోబలైజేషన్,కార్పోరేట్ శక్తులు మొ. అంశాలన్నింటినీ చర్చించారు.మేక్ ఇన్ ఇండియా,స్టార్టప్ ఇండియా,స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్ని పద డాంబికాలే అంటారు.

250 సినిమాల్లో నటించిన కాకరాలగారు గరికపాటి రాజారావుగారు లేకపోతే నేను లేను అంటారు.1955 ఎన్నికల్లో శ్రీశ్రీగారిని నార్ల వెంకటేశ్వర్రావు నాయకత్వంలో పత్రికా సంపాదకులంతా వ్యతిరేకిస్తే నార్ల చిరంజీవిగారు ఒక్కరే శ్రీ శ్రీ వైపు నిలబడ్డారని నాటి పరిస్థితుల గురించి వివరిస్తారు.చిన్న నటుడు కాకపోయినా చిన్న నటుడిగా చూడబడుతున్న కాకరాలగారు చిన్న పాత్రలు ఉంటాయి కానీ చిన్న నటులు ఉండరు అంటారు.కదిలించిన నక్సల్ బరి ఉద్యమం,1969లో విశాఖ జైలు నుంచి తప్పించుకున్న వారికి 15 రోజులు షెల్టర్ ఇవ్వటం,పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు జైలుకు తీసుకు రావడం, ఇద్దరు కూతుళ్ళ ఉద్యమ పయనం గురించి హృద్యంగా చెబుతారు.

ఈ పుస్తకంలో చదువుతున్న ప్రతి వాక్యము వెలిగెత్తి చాటాలనిపిస్తుంది.సాధ్యం కాదు.మీరు చదివి అనుభవించాల్సినదే.చరిత్ర అంటే ఈ మాటలే కదా. ఖరీదు 200. 186 పేజీల ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవుతారని నా ఆకాంక్ష. చదువుతారు కదూ!

Read More
Next Story