
ప్రశ్నించే గొంతులు ఎపుడూ ఉంటాయి....
తిరుపతిలో ‘ప్రశ్నించే గొంతులు’ పుస్తకావిష్కరణ సభ
ప్రశ్నించే గొంతులంటే పోరాటం, త్యాగం, మానవ కళ్యాణమని, ఆకలి, పేదరికం , అసమానతలు ఉన్నంత కాలం ప్రశ్నించే గొంతులను ఎవరూ అడ్డుకోలేరని అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర నాయకులు సాకం నాగరాజ హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్ట్ రాఘవ రచించిన ‘ప్రశ్నించే గొంతులు’ పుస్తకాన్ని ఆదివారం ఉదయం తిరుపతిలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో ఆయన ఆవిష్కరించారు.
పౌరచైతన్య వేదిక, వేమన విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆవిష్కరణ సభలో సాకం నాగరాజ మాట్లాడుతూ, ‘‘ఈ ‘ప్రశ్నించే గొంతులు’ పుస్తకంలో మార్పుకోసం పోరుబాట పట్టిన 17 మంది ఇంటర్వ్యూలు న్నాయి. ప్రశ్నించే గొంతులు గతంలో ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఈ పుస్తకంలో ఉన్న కేవలం 17 మంది మాత్రమే ‘ప్రశ్నించేగొంతులు’ కావు. తుపాకీ పట్టిన విప్లవకారులు, కలం పట్టిన విప్లవ కారులు, మేధావులైన విప్లవకారులు ఈ పుస్తకంలో తారసపడతారు. గతంలో క్రీస్తు, బుద్ధుడు, స్పార్టకస్, అంబేద్కర్ , కందుకూరి, గురజాడ వంటి వారంతా కూడా ప్రశ్నించే గొంతులే. ప్రశ్నించే గొంతులవలనే మానవ సమాజం ప్రగతిని సాధించగలుగుతుంది.
‘ప్రశ్నించే గొంతులు’ పుస్తకం చాలా అర్ధవంతంగా తయారైంది. ఇదొక అసాధారణమైన పుస్తకం. సాయిబాబా, స్టాన్ స్వామీ వరవరరావు వంటి వారంతా ప్రశ్నించే గొంతులు. ఈ పుస్తకానికి వరవరరావు ముందుమాట రాయడం సంచలనం.
పౌరోహిత్య కుటుంబం నుంచి వచ్చిన కాకరాల ప్రశ్నించేగొంతయ్యారు. ఆయన భార్య సూర్యకాంతం, ఇద్దరుకుమార్తెలు కూడా ఆయన బాటలోనే నడిచారు. అత్తవారింటికి పంపించాల్సిన ఆడబిడ్డల్ని అడవిలోకి పంపించిన నిబద్ధతగల తల్లిదండులు వారు. తల్లి మరణిస్తే, ఆ బిడ్డలిద్దరూ తల్లిని చివరి చూపు కూడా చూడలేకపోయారు. ఇవ్వన్నీ అసాధారణ విషయాలు.
సభలో మాట్లాడుతున్న సాకం నాగరాజ
మరొక అసాధారణ విషయం, విప్లవ శక్తుల పైన గుండెల్లో ప్రేమ ఉండబట్టే రాఘవ ఈ ఇంటర్వ్యూలు చేయగలిగారు. ప్రవక్తలు గంటలతరబడి ప్రవచనాలు చెబుతారు. దాని వల్ల ప్రయోజనం లేదు. వారు వర్తమాన విషయాల గురించి ప్రవచనాలు చెప్పరు. పత్రికాపరంగా ఆర్.యం. ఉమామహేశ్వరరావు, వేదికపరంగా నాగార్జున, మేధోపరంగా రాఘవ ప్రశ్నించే గొంతులే’’ నని వ్యాఖ్యానించారు.
ఏం చేసినా ద్రోహమే : ఉమామహేశ్వరరావు
పోస్టర్ వేస్తే ద్రోహం, కార్టూన్ వేస్తే ద్రోహం, వ్యాసం రాస్తే ద్రోహం, కవిత్వం చెపితే ద్రోహంగా భావిస్తున్న నేటి రోజుల్లో ఉక్కపోతతో జీవిస్తున్నామని ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ ఆర్.యం.ఉమామహేశ్వరరావు అన్నారు. ‘ప్రశ్నించే గొంతులు’ పుస్తకాన్ని ఆయన సమీక్షిస్తూ ‘‘ప్రశ్నించే గొంతులు ఎక్కడెక్క ఉన్నారని ఆలోచిస్తే, ముంబయిలో, కదలడానికి వీలు లేని విధంగా చిన్న గదిలో ఆంక్షల మధ్య వరవరరావు ఉన్నారు. హరగోపాల్ చట్టపరమైన అంశాలను ఉల్లంఘిచకుండా మాట్లాడుతున్నారు.
సభలో మాట్లాడుతున్న ఆర్. యం. ఉమామహేశ్వర రావు
ప్రశ్న ద్రోహంగా మారిన కాలంలో; 1995లో చేసిన తొమ్మిది ఇంటర్వ్యూలు ఇందులో ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలు ఇప్పుడు అవసరమా అన్న సందేహం కలుగుతుంది. నేను కూడా జర్నలిస్టునే. చాలా ఇంటర్వ్యూలు చేశాను. ఈ పుస్తకాన్ని చూశాక నేను చేసిన ఇంర్వ్యూలను పుస్తకంగా తేవచ్చుకదా అనిపించింది. ఎందుకంటే ఈ పుస్తకం భవిష్యత్తుపైన ఆశ పెంచుతుంది. జర్నలిస్టుగా ప్రశ్నలు వేయడం, విషయాలను అందరికీ తెలియచెప్పడం కోసం ఈ పుస్తకాన్ని వేశారు.
పీపుల్స్ వార్ పైన నిషేధం ఎత్తివేసినప్పటి ఈ ఇంటర్వ్యూలు ఆనాటి సమాజం ఎలా ఉందో తెలుసుకోవడానికి దోహదం చేస్తాయి. ఈ పుస్తకంలో గతకాలానికి సంబంధించిన విషయాలు వర్తమానంతో కూడా అనుసంధానమవుతాయి. ఈ పుస్తకంలోని వారంతా అర్బన్ నక్సలైట్లుగా ముద్రపడినవారే. ప్రశ్నించే ప్రతివారూ అర్బన్ నక్సలైట్లే అవుతారు. అలా అయితే మనమంతా కూడా అర్బన్ నక్సలైట్లుగా ముద్రపడినవారమే.
ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్ లపై నిషేధం విధించడాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలలో ఉన్న వారంతా ఖండించడం విశేషంగా నాకు కనిపించింది. నిషేధం అధికారికంగా ఉందా, అనధికారికంగా ఉందా అన్నది కాదు. గొంతు విప్పినప్పుడే నిషేధం కనిపిస్తుంది. అంత మటుకు నిషేధం కనిపంచదు. ఇప్పుడు విప్లవోద్యమానికి అడవి ఏమాత్రం రక్షిత ప్రదేశంగా లేదు. ఉద్యమ అవసరాన్ని బట్టి ఏది రక్షిత ప్రాంతమనే నిర్ణయం తీసుకోవాలి. మొండిగా నిలబడాలంటే నిలబడలేం. ఒంగినట్టు కనిపించాలి. ఒంగి కూడా గొంతు వినిపిస్తూనే ఉండాలి.’’ అని ఉమా మహేశ్వరరావు కోరారు.
వారెంటులు రాకపోతే చాలు : వాకా ప్రసాద్
సభకు అధ్యక్షత వహించిన పౌరచైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ మాట్లాడుతూ, ‘ప్రశ్నించే గొంతులు’ అవార్డులు వచ్చే పుస్తకం కాదని, అరెస్టు వారెంటులు రాకపోతే అదే గొప్పని వ్యాఖ్యానించారు. విప్లవోద్యమంతో మమేకమైన డాక్టర్ బాలాజీ, సమాజానికి వైద్యం చేయడం సాధ్యం కాదని తెలుసుకుని, మనుషులకు వైద్యం చేస్తున్నారని చమత్కరించారు.
వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున మాట్లాడుతూ, ‘‘ముప్ఫై ఏళ్ళ నాటి పరిస్థితిని నేటి పరిస్థితితో పోల్చి అంచనా వేయడానికి ఈ పుస్తకం ఉపయోగ పడుతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాం. మాట్లాడలేకపోతున్నాం.
కొన్ని వందల మంది జైళ్ళలో మగ్గుతున్నారు. బైటికి రాలేకపోతున్నారు. వేలాది మందిని గ్యాస్ ఛాంబర్ లోకి తోసేసి, గ్యాస్ వదిలాక వారు ఏమైనారో తెలుసు. ఈ పరిస్థితుల్లో ‘ప్రశ్నించే గొంతులు’ ఆలోచింపచేసే పుస్తకం.’’ అన్నారు.
సభకు హాజరైన సాహితీవేత్తలు, పురప్రజలు.
‘ప్రశ్నించే గొంతులు’ రచయిత రాఘవ తన స్పందనను తెలియచేస్తూ, ‘‘మొదుగు పూలు విప్లవానికి సంకేతం కనుక, ఈపుస్తకానికి ‘మోదుగు పూల ముచ్చట్లు’ అని పేరు పెడదామనుకున్నాం. కానీ ముందు మాట రాసిన వరవరరావు ఈ పుస్తకానికి ఆ పేరు వప్పదని, ‘ప్రశ్నించే గొంతులు’ అని పేరు పెట్టమని చెప్పడంతో ఆ పేరే పెట్టాను. ఈ పుస్తకానికి వరవరరావు చేతే ఎందుకు ముందు మాట రాయించానంటే, 30 ఏళ్ళ క్రితం పీపుల్స్ వార్ పైన ఎన్టీయార్ తాత్కాలికంగా నిషేధం ఎత్తివేసినప్పుడు నేను ఇంటర్వ్యూలు చేసిన 9 మందిలో ప్రస్తుతం ఒక్క వరవరరావు మాత్రమే ఉన్నారు. దాదాపు అర్ధ శతాబ్దం పైగా ప్రతి ఉద్యమంతో మమేకమై, తన గొంతులో ఆ ఉద్యమ స్వరాన్ని వినిపించారు కనుక వారి చేతే ముందుమాట రాయించడం సబబని అనుకున్నాను.
ఈ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఒక్కొక్కరితో ఒక్కో రకమైన అనుభవం ఏర్పడింది. కొండపల్లి సీతారామయ్య, జ్వాలాముఖి వంటి వారు యుద్ధభూమిలో ఉన్నట్టు చాలా ఉద్వేగంగా మాట్లాడారు. గద్దర్ తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, నేను వేసిన ప్రతి ప్రశ్నకు ఆయన పాటతోనే సమాధానం చెప్పారు. అయిదు దశాబ్దాల పౌరహక్కుల ఉద్యమం గురించి హరగోపాల్ గారు సుదీర్ఘంగా వివరించారు. అలాగే ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితుల గురించి వరంగల్ నుంచి జ్యోతి రాణిగారు అయిదు గంటలపాటు ఏక బిగిన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవ్వన్నీ చాలా విలువైనవి. తన ఇద్దరు ఆడ బిడ్డలు విప్లవోద్యమంలోకి వెళుతుంటే కాకరాల కర్తవ్యబోధ చేసినవిధానం కంటతడిపెట్టిస్తుంది.’’ అని వివరించారు.
సభలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రశ్న వేయడానికి చాలా మందికి భయమని, ‘ప్రశ్నించే గొంతులు’ ద్వారా అనేక మంది గొంతులను రచయిత ప్రపంచానికి తెలిపారని అన్నారు. సిటీకేబుల్ జనరల్ మేనేజర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రశ్నించడానికి సాహసం కావాలని, ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పడానికి భయమేస్తుందని అన్నారు. ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, తాను ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణని, తరిమెల నాగిరెడ్డి ఇంటర్వ్యూ చదివాక పూర్తగా మారిపోయానని చెప్పారు. అలా ఈ ప్రశ్నించే గొంతులు చాలా మందిని ఆలోచింపచేస్తుందని అన్నారు.
డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ, ప్రశ్నిస్తే నిరాశ నిస్పృహ పోతాయని అన్నారు. ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్న సమయంలో ‘ప్రశ్నించే గొంతులు’ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కాళయ్యతోపాటు రచయితలు జిల్లేళ్ళ బాలాజీ, మూరిశెట్టి గోవిందు, తదితరులు కూడా ప్రసంగించారు. రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్, ఇంజినీరింగ్ కాలేజి రిటైర్ఢ్ ప్రొఫెసర్ కేశవరావు, సీనియర్ జర్నలిస్టులు శ్రీధర్, చంద్రశేఖర్ తదితరులు, పుర ప్రముఖులు, సాహితీ వేత్తలు సభలో పాల్గొన్నారు.

