ప్రఖ్యాత కన్నడ నవల ‘అరమనె’ ‘అంత:పురం’ గా తెలుగులో ప్రత్యక్షం
లోక సత్యమే కావ్య సత్యం కావాలి అని చెప్పే ధీమ్ తో కన్నడలో కుం. వీరభద్రప్ప రాసిన నవల ‘అరమనే’ తెలుగు అనువాదం ‘అంత:పురం’ ను పరిచయం చేస్తున్న మారుతి పౌరోహితం
కన్నడ నవలా సాహిత్య చరిత్రలో నవలకు నూతన నిర్వచనం ఇచ్చిన నవల “అరమనె”(అంతఃపురం). కుంబార్ వీరభద్రప్ప (కుంవీ) గారి అత్యున్నత సృజనాత్మతకు నిదర్శనంగా ఈ నవలను పేర్కొనవచ్చు. నవలారచనా పద్దతిలో కొత్తవొరవడులు సృష్టించిన నవల ఇది. 2007 సంవత్సరంలో ఈ నవలకు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు వచ్చింది. అయితే కుంబార్ వీరభద్రప్ప (Veerabhadrappa Kumbar) గారు ప్రసిద్ధ సాహితీవేత్త కల్బుర్గిని హత్యచేసిన అగంతుకులను అరెస్టు చేయడంలో నాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా నగదుతో పాటు అవార్డును వెనక్కు ఇచ్చివేశారు.
‘అరమనె’(Aramane) దళిత బహుజనుల సంస్కృతిని, వారి జీవితాల్లోని ఘర్షణన ను అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన నవల. ఇది ఒక గేయకావ్యమని చెప్పవచ్చు. బళ్ళారి (Bellary) ప్రాంతపు జనభాషను రచనలో ఉపయోగించారు రచయిత. బళ్ళారి పరిసర ప్రాంతాలలోని బహుముఖీయమైన భౌగోళిక, సాంస్కృతిక విషయాలను అద్భుతంగా ఈ నవలలో కుం.వీ. గారు చిత్రించారు. స్వాతంత్య్ర పూర్వం అనగా ఆంగ్లేయుల కాలంలోని భారతదేశ గ్రామీణ సాంఘిక పరిస్థితులను అవగాన చేసుకోడానికి ఈ నవల దోహదం చేస్తుంది.
అత్యద్భుతమైన పఠనీయత కూడా ఈ నవలకున్న గొప్ప లక్షణం. లోక సత్యమే కావ్య సత్యం కావాలనే విలువకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన నవల ఇది. ఒకానొక సందర్భంలో కుం.వీ. గారు ‘రాయడం తప్ప నేనేమీ చేయలేను. రాస్తూనే ఉంటాను’అని ప్రకటించారు. బహుశా ఆయన ఆర్.కే.నారాయణన్ మాదిరి రాయడాన్నే జీవితం చేసుకొన్నవారు.
“అరమనె”(అంతఃపురం) నవలలో ప్రధానమైనవిగా రెండు పాత్రలను పేర్కొనవచ్చు. ఒకటి నాటి బళ్ళారి కలెక్టర్ అయిన సర్ థామస్ మన్రో కాగా రెండోపాత్ర శాంభవి. గ్రామీణస్థాయిలో నాటి ఆచార సాంప్రదాయాల గురించి విస్తృతమైన పరిశోధన చేసి రాసిన నవల ఇది అని చదివినవారికి తెలుస్తుంది. బిసిలనాడు (Bissilunadu) (ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతం) అయిన బళ్ళారి ప్రాంతంలో బ్రిటీష్ అధికారిగా సర్ థామస్ మన్రో జనరంజకమైన పనులు ఎలా చేసారో ఈ నవల తెలుపుతుంది.
ఒకానొక సందర్భంలో ఒక దొంగ మన్రోకు తారసపడతాడు. అతడిచేత దొంగతనాలు మాన్పించుటకై అతడికి కొంత సాగుభూమిని ఇస్తాడు మన్రో. దాంతో అతడు దొంగతనం మానివేసి వ్యవసాయదారుడిగా మారతాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని పత్తికొండను మన్రో సందర్శించినపుడు అక్కడి ప్రజలు అతడికి తమ తాగునీటి ఇక్కట్ల గురించి విన్నవించుకొంటారు. ప్రజల నీటి కష్టాలు విని చలించిపోయిన మన్రో వెంటనే బావి తవ్వకానికి నిధులు మంజూరు చేస్తాడు. బావి తవ్వకం పూర్తి అవుతుంది. అయితే పత్తికొండ ప్రజలు మన్రో స్వయాన వచ్చి మొట్టమొదట బావినీరు వాడితే కాని తాము వాడమని భీస్మించుకు కూర్చోంటారు.
విషయం తెలిసిన మన్రో వెంటనే తనపైన ప్రజలకున్న ప్రేమకు చలించిపోయి పత్తికొండకు వచ్చి ఆ బావి నీటిని ఉపయోగించడం ద్వారా ప్రజలపై తనకు గల ప్రేమను చాటుకొంటాడు. ఇప్పటికీ అబావి పత్తికొండలో ఉంది. దానిని మన్రో బావి అంటారు. బళ్ళారి, కర్నాటక సరిహద్దున ఉండే ఆంధ్రా ప్రాంతాలలో పేదప్రజలు తమపిల్లల నామకరణాలకు మన్రోను ఆహ్వానించేవారు. అతడు ఆ ఆహ్వానాలను మన్నించి వచ్చేవాడు. ఈ ప్రాంతాలలోని మగపిల్లలకు మన్రోలప్ప అనీ, ఆడ పిల్లలకు మన్రోలమ్మ అనీ ముస్లింలు అయితే మన్రోసాహెబ్ అనీ పేర్లు పెట్టుకొనేవారు. ఈ పేర్ల అవశేషాలు ఇప్పటికీ ఈ ప్రాంతంలో మనకు తారస పడతాయి.
ఈ నవలలో అధికారధర్మం మరియు విశ్వాసాల ధర్మం గురించి చెప్పబడ్డాయి. అధికార ధర్మంకు సర్ థామస్ మన్రో ప్రతినిధీ అయితే విశ్వాసధర్మానికి శాంభవి అనేపాత్రను ప్రతినిధిగా భావించవచ్చు. బిసిలనాడు (ఎండప్రాంతం)గా పిలువబడే బళ్ళారి ప్రాంతంలో మన్రో అనేక బావులు త్రవ్వించాడు. చెరువులను పునరుద్దరించాడు. విస్తృతంగా చెట్లు నాటించాడు. ఇప్పటికీ చాలాప్రాంతాల్లో ఇతను నాటించిన చింతతోపులను చూడవచ్చు.
ఓబయ్య అనే వ్యక్తికి శాంభవిమాత పూనకం వస్తూంటుంది. శాంభవిమాతను శరీరంలో ఆవాహన చేసికొనిన ఓబయ్య ధర్మ ఆచరణ ద్వారా జనకల్యాణం కోసం పాటుబడతాడు. మట్టి మనుషులు అధికారంలోకి రావాలనేది శాంభవి ఆకాంక్ష. ధర్మం అనేది సామాన్య జన సంక్షేమంకోసం ఉండాలని ఈ పాత్ర ద్వారా కుం.వీ. ఘాడంగా విశ్వసిస్తారు. జనంతో ఉన్నవాడే దేవుడు అంటాడు అతను. ఈ నవలలో ఈ ప్రాంతంలోని అనేక గ్రామదేవతల స్థల పురాణాలు ప్రస్తావించబడ్డాయి.
ఒక రకంగా ద్రావిడ సంస్కృతీ ప్రతినిధులు అయిన గ్రామ దేవతల గురించి ఈ నవలలో అనేక ప్రస్తావనలు ఉండడాన్ని బట్టి ఇది బహుజనుల, సామాన్యుల చరిత అని చెప్పవచ్చు. ఈ గ్రామ దేవత (Village Goddess) లకు గొప్ప గొప్ప నిర్మాణములతో కూడిన దేవాలయాలు ఉండవు. చెట్లు, కొండలలో ఉండే చిన్నచిన్న గుహలు ఈ దేవతలకు ఆవాసాలుగా ఉంటాయి. రచయిత సమాజంలో సామాన్య ప్రజల పక్షాన ఉండే దృష్టికోణాన్ని కలిగి ఉన్నాడని ఈ నవల మనకు తెలుపుతుంది.
కుం.వీ. వర్తమానంలో నిలబడి గతానికి చెందిన శూద్ర చరిత్రను వ్యాఖ్యానించాడని ఈ నవల చదివిన వారికి అర్థం అవుతుంది. ద్రావిడ సంస్కృతిని సమర్థవంతంగా సామాన్యుల భాషలో అత్యంత ప్రతిభావంతంగా, ఆసక్తికరంగా నవలలో చిత్రీకరించారు. రంగనాథ రామచంద్రరావు (Ranganath Ramachandrarao) గారు ‘అంతఃపురం’ పేరుతో ఈ నవలను తెలుగులోకి అనువాదము చేయగా కేంద్రసాహిత్య అకాడమీ దానిని ప్రచురించింది. భారతీయ గ్రామీణ సమాజ పరిణామ క్రమాన్ని, బహుజనుల చరిత్రను అర్థం చేసికోవడానికి ఈ నవల మనకు చక్కగా ఉపయోగపడుతుంది. నవలను అద్భుతంగా తీర్చి దిద్దిన కుం.వీ. గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
(*మారుతి పౌరోహితం కర్నూలు జిల్లా వాసి. పునరపి” కథతో 2016 లో కథా రచయితగా సాహిత్య జీవితం ప్రారంభించారు. ఇప్పటివరకు పదిహేను కథలు వ్రాశారు . ఊరిమర్లు అనే ఒక కథా సంపుటి , ప్రణయ హంపీ అనే ఒక నవల వ్రాశారు. రాయలసీమ ఆస్థిత్వ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ ఉంటారు.)