
మధ్యయుగాల రక్తపాతానికి మౌన సాక్షి కుతుబ్ మినార్
తిరుపతి నుంచి మా ఢిల్లీ యాత్ర-9
అనేక శిథిలాల మధ్య తలెత్తుకుని ఒంటరిగా నిలబడింది కుతుబ్ మినార్. తొమ్మిది శతాబ్దాల పైగా ఆకాశాన్ని తాకాలని ఆరాటపడుతోంది. అనేక మంది ప్రభువుల ఉథ్థానపతనాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడిపోయింది.
ఈ కుతుబ్ మినార్ ఎంతమంది సుల్తానులను చూసిందో!? ఎంతమంది చక్రవర్తులను చూసిందో!? ఎన్ని మతఘర్షణలను చూసిందో!? ఎంతకాలంగా ఈ మినార్ ఎన్నికల నియంతలను చూస్తోందో! అధికార మదోన్మత్తుల పదఘట్టనలో నలిగిపోయి, అన్యాయంగా ప్రాణాలను పోగొట్టుకున్న, ఎంత మంది నిర్భాగ్యుల ఆర్తనాదాలను విన్నదో! తన కళ్ళ ముందే జరిగిన లెక్కలేనన్ని రాజ్యాధికార కుట్రలూ కుతంత్రాలకు మౌన సాక్షిగా నిలబడిపోయింది కుతుబ్ మినార్!
‘‘ఫతేపూర్ సిక్రీ, ఎర్రకోటనూ చూడలేకపోయాం. కనీసం కుతుబ్ మినార్ నైనా చూద్దాం’’ అని వాకా ప్రసాద్, హరీష్, పరమేశ్వరరావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం కుతుబ్ మినార్ వైపు బయలుదేరాం. రంజాన్ సెలవు కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంది. టికెట్ల వద్దే చాలా పెద్ద క్యూ కనిపించింది. మనకు టికెట్లు దొరుకుతాయో లేదోనన్న సందేహం. పరమేశ్వరరావు, వాకా ప్రసాద్ కలిసి ఆన్ లైన్ లో సంపాదించిన టికెట్లతో కుతుబ్ మినార్ ఆవరణలోకి ప్రవేశించాం.
ఒంటి స్తంభం మేడలా కనిపిస్తున్న గుండ్రటి కుతుబ్ మినార్ కింద భాగంలో వెడల్పుగా, పైకి పోయిన కొద్దీ మొనతేలినట్టు సన్నగా ఉంది. కుతుబుద్దీన్ ఐబక్ దండయాత్రలు చేసి, విజయాలను సాధించి, ఇక్కడ తమ సామ్రాజ్యాన్ని స్థాపించి నందుకు విజయ చిహ్నంగా దీన్ని నిర్మించాడు. తమ విజయ చిహ్నం అందరికీ కనిపించడానికి 238 అడుగుల ఎత్తైన దీని నిర్మాణాన్ని చేపట్టాడు.
తమ విజయపరంపరల తరువాత తొలి ఢిల్లీ సుల్తానెత్ ను స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్ 1192లో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. విజయస్తంభంగానే కాకుండా, ప్రార్థనకు పిలుపివ్వడానికి అనుకూలంగా ఎత్తైన నిర్మాణాన్ని చేపట్టాడు. కుతుబుద్దీన్ ఐబక్ డిల్లీ సుల్తాన్ గా కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పాలించాడు. అనంతరం అధికారంలోకొచ్చిన అతని అల్లుడు ఇల్టూట్ మష్ 1199-1220 సంవత్సరాల మధ్య తొలి అంతస్తు పైన మరో మూడంతస్తులు నిర్మించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ చివరి అంతస్తును నిర్మించాడు. పైకి ఎక్కడానికి దీనికి మూడొందల తొంభైతొమ్మిది మెట్లు ఉన్నాయి. అయితే పైకి ఎక్కనివ్వడం లేదు.
చుట్టూ శిథిలా ల మధ్య ఒంట రి గా నిలబడి న కుతుబ్ మి నార్
కుతుబ్ మినార్ కాలగమనంలో అనేక ఒడిదుడుకులకు గురైంది. భూకంపం రావడంతో దెబ్బతిన్న ఈ మినార్ ను 1505లో సికిందర్ లోడీ బాగు చేయించాడు. మళ్ళీ 1803లో భూకంపం రావడంతో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ రాబర్ట్ స్మిత్ 1828లో దీనికి మరమ్మతులు చేయించాడు. అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఇలా మనముందు నిలుచున్న కుతుబ్ మినార్ నిర్మాణం వెనుక అనేక కుట్రలు కుతంత్రాలు, దారుణ మైన దాడులు, హత్యల చరిత్ర చాలా దాగుంది.
హిందూ కుష్ పర్వతాలకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని పర్షియన్లు హిందూస్థాన్ గా వ్యవహరించేవారు. పెద్దగా పంటలు పండని, కొండలు, గుట్టలతో నిండిన ఆప్ఘనిస్తాన్ ప్రాంత వాసులు ఈ హిందూకుష్ పర్వాతాల్లో ఉన్న ఖైబర్, బోలన్ కనుమల నుంచి హిందూస్థాన్ లోకి తరచూ రాకపోకలు సాగించేవారు. పచ్చని పంటలతో, ప్రవహిస్తున్న నదులతో ఉన్న ఈప్రాంతాన్ని వెండి, బంగారం, వజ్రవైడూర్యాలతో నిండిన ఖజానాగా తలపోశారు. ఈ సందపదంతా గుళ్ళూ, గోపురాల్లో తగిన భద్రత లేనిదిగా ఉందని వారు గుర్తించారు.
ఆఫ్ఘనిస్తాన్ లోని గజ్నీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ గజ్నీ ఈ ఖైబర్ కనుమల గుండా పదిహేడు సార్లు హిందూస్థాన్ లోకి ప్రవేశించి, దండయాత్రలు చేసి సంపదనంతా కొల్లగొట్టుకు పోయాడు. ముఖ్యంగా దేవాలయాలపైన దాడులు చేశాడు. గజనీ తొలి దాడి 1001 లో గాంధార ప్రాంతంపై చేసి, జయపాలుని ఓడించి, షరతుల మీద ఒదిలిపెట్టేశాడు. తరువాత 1002లో ఆనందపాలుని ఓడించడంతో గజినీకి అతను లొంగిపోయాడు.
గజినీ 1004లో పంజాబ్ లోని ముల్తాన్ పట్టణంపై రెండవ దాడి చేశాడు. ఈ సందర్భంగానే సూర్యదేవాలయం పైన దాడి చేశాడు. అక్కడి నుంచి ప్రతి ఏటా హిందూస్థాన్ కు వచ్చి దాడులు చేస్తూనే ఉన్నాడు. పదిహేడు సార్లు హిందూస్థాన్ పై దాడి చేసిన గజినీ 1030లో మరణించాడు. ఇదంతా ముస్లీం సాహిత్యం ద్వారా చరిత్రకు అందిన సమాచారం.
ఆఫ్ఘనిస్తాన్ లో గజినీ మరణంతో అధికారం కోసం వారసుల్లో ఘర్షణ మొదలవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ‘ఘోర్’ రాజధానిగా చేసుకుని పాలిస్తున్న మహ్మద్ ఘోరీకి ఆ రాజ్యాధికారం 1173లో హస్తగతమవువుతుంది. ఘోరీ తన రాజ్య విస్తరణలో భాగంగా హిదూస్థాన్ లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని 1175లో పంజాబ్ పైన దాడి చేసి జయంచంద్రుణ్ణి, పథ్వీరాజును యుద్ధంలో చంపేస్తాడు.
ఘోరీ 1206లో ఢిల్లీకి తిరిగి వస్తాడు. జలంధర్ దగ్గర 1206లో నమాజు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని హత్య చేశారు. తాను బతికుండగానే హిదూస్థాన్ లో తన సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా చేసి, తన వారసులుగా తన నలుగురు బానిసలకు పంచేశాడు. అలా ఘోరీ బానిసైన కతుబుద్దీన్ ఐబక్ చేతికి ఢిల్లీ సింహాసనం అందుతుంది.
కుతుబ్ మినార్ ముందు ఎడమ నుంచి హరీష్, వా కా ప్రసాద్ పరమేశ్వర రావు, రాఘవ
అణచివేత, మత దురహంకారానికి మారు పేరుగా కతుబుద్దీన్ ఐబక్ పాలన సాగిస్తాడు. హిందూ-ముస్లీం కళారీతుల సమ్మేళనంగా కుతుబ్ మినార్ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ మొదలు పెట్టాడు. ఢిల్లీ సుల్తానెత్ ను కేవలం ఐదేళ్ళు మాత్రమే పాలించిన కుతుబుద్దీన్ ఐబక్, 1210లో గుర్రం మీద నుంచి జారిపడి మరణిస్తాడు. ‘‘నా దగ్గర బానిసలుగా ఉన్న వేలాది మంది నా కొడుకులే ’’ అంటాడు కుతుబుద్దీన్ ఐబక్.
కుతుబుద్దీన్ ఐబక్ మరణానంతరం అతని కుమారుడు ఆరాంషా గద్దెనెక్కిన ఏడాదికే అధికారాన్ని కోల్పోయాడు. దాంతో కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు ఇల్ టూట్ మష్ 1211లో ఢిల్లీ సుల్తానెత్ ను స్వాధీనం చేసుకున్నాడు. ఇల్ టూట్ మష్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాతికేళ్ళు పాలించాడు. చరిత్రలో ఇల్ టూట్ మష్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కుమారుల్లో ఏ ఒక్కరినీ తన వారసులుగా ప్రకటించకుండా, సమర్ధురాలైన తన కుమార్తె రజియాను తన వారసురాలిగా ప్రకటించాడు. దీంతో ఢిల్లీని పాలించిన తొలి సుల్తానెత్ గా రజియా చరిత్రలో నిలిచిపోయింది.
గజినీ హిందూస్తాన్ పై పదిహేడు సార్లు దాడులు చేసి, లెక్కలేనంత సంపదను దోచుకుపోయాడు. ఘోరీ కూడా దాడులుచేసినా, ఇక్కడే పరిపాలన సాగించాడు. ‘‘గజినీ ఘోరీ ఎవరైతేనేం ఒక్కక్కడూ మహాహంతకుడు ’’ అని శ్రీశ్రీ అన్నారంటే, వారు ఎంత రక్తం పారించారో మరి! ఇస్లాం లో విగ్రహారాధన లేదు. హిందూ దేవతా విగ్రహాలపైన వారికి గౌరవం ఉండే అవకాశమూ లేదు. కేవలం సంపద కోసమే గజినీ, ఘోరీలు దేవాలయాలపైన దాడులు చేశా రు. కశ్మీర్ ను పాలించిన హిందూ రాజైన శ్రీహర్షుడు కూడా తమ సామ్రాజ్యంలోనే ఉన్న హిందూ దేవాలయాలపైన దాడులు చేసి సంపదను కొల్లగొట్టాడు.
హిందూ రాజైనా, ముస్లిం రాజైనా సంపద కోసమే దాడులు చేశారు. దాడులు చేయడం అనేది పొరుగు రాజ్యాలపైనైనా, దేవాలయాలపైనైనా ఒకటే అని భావించారు. సంపదను దోచుకోవడానికే దాడులు చేయడం, అడ్డంగా వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా నరికేయడం అనేది మధ్యయుగాల పాలకుల, యుద్ధ వీరుల స్వభావం. మధ్యయుగాల చరిత్ర అధ్యయనంలో ఇది గమనించవలసిన ముఖ్య విషయం. దాడులను, దారుణమైన నరికి వేతలను ఆధునిక సమాజం అంగీకరించలేదు కానీ, మధ్యయుగాల్లో ఉన్న అమానవీయ లక్షణంగానే దీన్ని అర్థం చేసుకోవాలి.
కుతుబ్ మినార్ కు రెండింతల పెద్ద మినార్ నిర్మించా లని ప్రారంభించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆపి వేసిన అసంపూర్ణ నిర్మాణం
కుడివైపు నుంచి కూడా చూసుకుంటూ వద్దాం అన్నారు వాకా ప్రసాద్. కుతుబ్ మినార్ కట్టడం పూర్తి అయిం తరువాత, ఆ ఆవరణలోనే దానికి రెండింతలు పెద్దదైన మినార్ ను కట్టాలని అల్లాఉద్దీన్ ఖిల్జీ భావించాడు. మినార్ నిర్మాణం మొదల పెట్టాడు. అతను మరణించడంతో 24.5 మీటర్ల ఎత్తులో మినార్ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయింది. ముందు రాళ్ళతో, వాటి మధ్యలో గానుగ సున్నం వేసి కట్టుకుంటూ వచ్చారు. ఈ అసంపూర్ణ నిర్మాణం అంతా ఎగుడుదిగుడుగా ఉంది. నిర్మాణం పూర్తి అయింతరువాత దాని చుట్టూ చెక్కిన రాళ్ళను అతికించుకుంటూ వస్తారు. ఈ అసంపూర్ణ మినార్ ను చూస్తే కుతుబ్ మినార్ ను ఎలా నిర్మించారో అర్థమవుతుంది.
ఖ్వాతుల్ ఇస్లాం మసీదు
శిథిలావస్థలో ఉన్న మస్జీద్ వద్దకు వచ్చాం. దీని పేరు ఖ్వాతుల్ ఇస్లాం మస్జీద్. అంటే శక్తివంతమైన ఇస్లాం అని అర్థం. భారతదేశంలో విస్తరించిన తొలి మసీదుగా ఇది ప్రసిద్ధి చెందింది. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో దీని నిర్మాణాన్ని 1193లో ప్రారంభించి, 1198 నాటికి పూర్తి చేశారు. దాని ముందు ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఇల్టూట్ మష్, అల్లా ఉద్దీన్ ఖిల్జీల కాలంలో దీన్ని విస్తరింపచేశారు. దీని గోడలపైన అరబిక్ భాషలో ఖురాన్ సూక్తులను చెక్కారు. దీన్ని ఇండో ఇస్లామిక్ వాస్తు శైలిలో నిర్మించారు.
ఇల్తుత్ మిష్ గుమ్మటం
ఆ పక్కనే ఇల్టూట్ మష్ గుమ్మటం కనిపించింది. కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు ఇల్టూట్ మష్ 1235లో నిర్మించిన ఈ గుమ్మటం భారత-ఇస్లామిక్ వాస్తు శైలిలో ఉంది. ఈ నిర్మాణం మధ్యలో గుమ్మటం లోపలి భాగం కనిపిస్తుంది. గోడలకు నగిషీలు చెక్కారు. దాని నలువైపులా అర్ధచంద్రాకారంలో ఉన్న ద్వారాలకూ నగిషీలున్నాయి. మొత్త ఎర్రని రాతితో నిర్మించారు. గుమ్మటం లోపల భాగాన్ని కూడా ఎర్ర రాతితో ఎంత అందంగా నిర్మించారో! తొలుత నిర్మించిన గుమ్మటం పడిపోవడంతో, దీన్ని ఫిరోజ్ షా తుగ్లక్(1351-88) పునర్నిర్మించాడంటారు. అది కూడా నిలబడలేదంటారు. మధ్య భాగంలో పాలరాళ్ళతో నిర్మించారు. ఇది ప్రార్థన కోసం ఉపయోగించుకున్నట్టుంది.
బ్రిటన్ దేశస్తుల తో..
కుతుబ్ మినార్ చూట్టానికి చాలా మంది విదేశీయలు వచ్చారు. ఇల్టూట్ మష్ గుమ్మటంలో నలుగురు బ్రిటిష్ జాతీయులు కనిపించారు. వారిలో సన్నగా బలంగా ఉన్న ఒకతన్ని చూసి వాకా ప్రసాద్ ‘‘యువార్ లుకింగ్ లైక్ హాలీఉడ్ హీరో’’ అన్నారు. అతను చాలా మురిసిపోయాడు. ‘‘హీ ఈజ్ సేయింగ్ దట్ ఐయామ్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. సీ హౌ యామై. ఐయామ్ నాట్ హావింగ్ స్టమక్ లైక్ హిమ్’’ అంటూ వేలాడుతున్న వాకా ప్రసాద్ పొట్టను తడిమాడు. బ్రిటిష్ జాతీయులతో పాటు మేమూ నవ్వుకున్నాం. తాము చాలా ప్రాంతాలు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. మాతో ఫొటో తీయించుకున్నారు.
నాలుగో శతాబ్దం నాటి విష్ణు ఆలయం ముందు ఉన్న సూర్య స్తంభం
కుతుబ్ బినార్ పక్కనే శిథిలమైన ఒక హిందూ దేవాలయం ఉంది. ఆ ఆలయాన్ని నాలుగవ శతాబ్దం నాటి గుప్తుల కాలంలో నిర్మించారు. ఆలయం మధ్యలో సూర్యస్తూపం ఉంది. ఇక్కడ బ్రాహ్మీలిపిలో రాసి ఉంది. ఇనుముతో నిర్మించిన స్తంభం ఇప్పటికీ చెక్కుచెదరకుండా 7.20 మీటర్ల పొడవుంది. ఇది 93 సెంటీమీటర్లు భూమిలోకి పాతి ఉంది. పదహారు వందల సంవత్సరాల నుంచి ఉన్నా, ఇది ఏమాత్రం తుప్పు పట్టకుండా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందంటే, నాలుగవ శతాబ్దంలో ఎంత బలమైన ఇనుముతో చేశారో మరి!
ఈ ఇనుప స్తంభం చుట్టూ ఉన్న ఆలయం శిథిలమైంది. కుతుబ్ మినార్ ప్రాంతంలో ఉండే 27 హిందూ, జైన దేవాలయాలను కుతుబుద్దీన్ ఐబక్ ధ్వంసం చేసి, కుతుబ్ మినార్ ను నిర్మించాడనే వాదన ఉంది. కుతుబుద్దీన్ ఐబక్ నిజంగా ధ్వంసం చేసినట్టయితే, మధ్యలో ఉండే శిథిలమైన విష్ణువు ఆలయం, ఆలయం మధ్యలో సూర్యస్తంభం ఇంకా ఎందుకు ఉంది? కాలగమనంలో శిథిలమై ఉండవచ్చు.
కతుబుద్దీన్ ఐబక్ ధ్వంసం చేసిన 27 జైన, హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలని కొందరు కోర్టులో కేసు వేశారు. ‘‘పురావస్తు పరిరక్షణ చట్టం ప్రకారం కుతుబ్ మినార్ ను పరిరక్షించాలి. ఈ ప్రాంగణంలో ధ్వంసమైన దేవాలయాలను పునర్నించడం సాధ్యం కాదు’’ అని భారత పురావస్తు శాఖ కోర్టుకు స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలను విన్న తరువాత ‘‘గతంలో జరిగిన లోపాలను చూసి వర్తమానంలో, భవిష్యత్తులో నెలకొనే శాంతిని నాశనం చేయకూడదు’’ అని సివిల్ కోర్టు జడ్జి నేహా శర్మ పిటిషనర్ ను మందలించారు.
హిందూ, ముస్లిం పేరుతో అనైక్యంగా ఉన్న మత రాజకీయ పరిస్థితులను అర్థంచేసుకోవడానికి సందర్శకులకు మరో చారిత్రక నిర్మాణంకంటే కుతుబ్ మినార్ సందర్శన బాగా ఉపయోగపడుతుంది.’’ అని ఢిల్లీ యూనివర్సిటీ చరిత్ర అధ్యాపకులు ప్రొఫెసర్ కుమార్ అంటారు.
వారణాసిలో జ్ఞానవాపి మసీదు వివాదం, మథురలో శ్రీకృష్ణుడి ఆలయానికి, షాహీ ఈద్గా మసీదుకు మధ్య వివాదం, తాజ్ మహల్ లో మూసివేసిన 22 గదులను తెరవాలని, ఇది తేజోమహల్ అని లేపిన వివాదం ఏమ్ చెపుతాయి? బాబ్రీ మసీదు కింద రామాలయం ఉందని, పదహారవ శతాబ్దం నాటి పురాతన నిర్మాణాన్ని కూలగొట్టడం వల్ల ఏం జరిగింది? గుజరాత్ లో మత ఘర్షణలు చెలరేగి, మారణహోమం జరిగింది. వేల సంఖ్యలో ఇరు మతాలకు చెందిన ప్రజలు దారుణమైన హింసకు, హత్యలకు గురయ్యారు. మరణించిన వారిలో అల్ప సంఖ్యాకులై న ముస్లింలు చాలా ఎక్కువ
మన ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండా చరిత్రలో చాల సంఘటనలు జరిగిపోయాయి. ముఖ్యంగా మధ్యయుగాల్లో రాజ్యాల కోసం దారుణమైన నరమేధం జరిగింది. వాటిని తిరగతోడడం విజ్ఞత కాదు. చరిత్రను గతకాలపు చరిత్ర గానే చూద్దాం. చరిత్ర నుంచి గుణ పాఠాలను నేర్చుకుందాం. వాటిని తవ్వి తీస్తే పీనుగుల గుట్టలే తప్ప మనకు మిగిలేది ఏమీ ఉండదు. మనం ఆధునిక సమాజంలో ఉన్నాం. ఆధునిక ప్రజాస్వామిక దృష్టితోనే ఆలోచిద్దాం. కులమతాల విభేదాలు, ఆర్థిక అసమానతలు లేని సమసమాజాన్ని ఆకాంక్షిద్దాం. మనుషులందరూ సమానమనే భావనను వ్యాపింప చేద్దాం.
కుతుబ్ మినార్ చూడాలని నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. తొమ్మిదేళ్ళక్రితం చైనా వెళ్ళడానికి ఢిల్లీలో దిగినప్పుడు, దూరం నుంచే కుతుబ్ మినార్ ను చూశాను. యాభై ఏళ్ళక్రితం బాపట్లలో డిగ్రీ చదువుతున్నప్పుడు, కుతుబ్ మినార్ గురించి మా హిస్టరీ లెక్చరర్ రాధాకృష్ణ గారు చెపుతున్న పాఠాలు ఇప్పటికీ లీలగా గుర్తుండిపొయాయి. కుతుబ్ మినార్ ను చూడాలన్న కల ఇప్పటికిలా నెరవేరింది.
ఎడమ వైపు రాఘవ, మధ్య లో డ్రైవర్ కిషన్, కుడి వైపు పరమేశ్వర రావు
కుతుబ్ మినార్ సందర్శనతో మా ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ చారిత్రక కట్టడాన్ని వీడుతుంటే గుండె బరువెక్కింది. ఢిల్లీ వీధులను చూసుకుంటూ రైల్వే స్టేషన్ కు బయలుదేరాం. మేం స్టేషన్ లోకి వెళుతుంటే, మాతోనే మూడు రోజులు గడిపిన డ్రైవర్ కిషన్ మాకు వీడ్కోలు చెప్పాడు. కిషన్ కు చాలా పొలం ఉంది. ఒక ఒక పక్క వ్యవసాయం చేస్తూ, అదే రైతు మరొక పక్క డ్రైవర్ గా చేస్తుండడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
(సమాప్తం)