మార్కుల మోజు.. పేద కుటుంబాలకు బూజు..
x
Graphics- Shanmukha Subrahmanyam P (The Federal)

మార్కుల మోజు.. పేద కుటుంబాలకు బూజు..

విద్యా వ్యవస్థలో పెరుగుతున్న ప్రైవేట్లు: అవకాశమా? అనివార్యమా?


మనం ఇప్పుడు ఎక్కడ చూసినా "ఇక్కడ ట్యూషన్లు చెప్పబడును", "ట్యూషన్లు కావాల్నా, పలానా నెంబర్ల"ను సంప్రదించండనే బోర్డులు, ప్రకటనలు కనిపిస్తుంటాయి. చివరకు అపార్ట్మెంట్ల గోడలపైనా, లిఫ్ట్ గేట్లపైనా ఈ తరహా స్టిక్కర్లు దర్శనం ఇస్తుంటాయి.

జాతీయ నమూనా సర్వే ప్రకారం కూడా ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే ప్రతి నలుగురిలో ఒక విద్యార్థి ఇప్పుడు ప్రైవేట్ కోచింగ్‌కు వెళ్తున్నారు. పట్టణ–గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ఈ కల్చర్ పెరిగింది.
పేద వర్గాల పిల్లలు ప్రత్యేకించి సర్కారు పాఠశాలలకు వెళ్లే పిల్లల కుటుంబాలు సగటున గ్రామీణ ప్రాంతాల కంటే రెండింతలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి. ఆ ఖర్చు వేలల్లోనే ఉంటోంది. నిజానికిది పేదలకు, రోజువారీ కూలీపనులు చేసుకొని బతుకీడ్చే వర్గాలకు చాలా భారమనే చెప్పాలి. మార్కుల వేట, ప్రైవేట్ పాఠశాలల ప్రాధాన్యం, మధ్య తరగతి ఆకాంక్షలు ఈ ధోరణికి ప్రేరణగా నిలుస్తున్నాయి.
గతంలో ట్యూషన్లు ఓ ఆప్షన్ గా ఉండేది ఇప్పుడు అవసరంగా మారిపోయాయి. ఇది విద్యా సమానత్వంపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోంది.
జాతీయ నమూనా సర్వే (NSSO) తాజా డేటా (80వ రౌండ్, ఏప్రిల్–జూన్ 2025) భారత విద్యా రంగంలోని ఓ సరికొత్త వాస్తవాన్ని ఎత్తిచూపింది.
ట్యూషన్ల కోసం ఎంతెంత ఖర్చు చేస్తున్నారంటే..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలో 27 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో 30.7%, గ్రామీణ ప్రాంతాలలో 25.5% మంది ప్రైవేట్‌ కోచింగ్‌పై ఆధారపడ్డారు. దేశంలో సగటున ఒక్కో విద్యార్థి ట్యూషన్స్ కోసం రూ.2,409 వెచ్చిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్‌ కోసం సగటు ఖర్చు రూ.1,793 కాగా, పట్టణాల్లో రూ.3,988 అవుతున్నట్టు అంచనా. ఇంటర్‌ స్థాయిలో పట్టణ కుటుంబాలు కోచింగ్‌ కోసం ఒక్కో విద్యార్థికి రూ.9,950 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.4,548.
పట్టణాల్లో ప్రైవేట్‌ విద్యకు..
గ్రామీణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. 33.9% మంది ప్రైవేట్, ఇతర సంస్థలలో చదువుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 30.1% మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 70% మంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. మొత్తంగా దేశ సగటు చూస్తే.. అడ్మిషన్లలో 55.9% వాటా ప్రభుత్వ పాఠశాలలదేనని సర్వే పేర్కొంది.
పట్టణ ప్రాంతాల్లో అధికం
ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. కానీ, ట్యూషన్లు, ర వాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రైవేటులో అయితే వీటికి ఫీజు, యూనిఫాం వంటివి అదనంగా చేరతాయి. దీంతో ప్రతి విద్యా ర్థికి అవుతున్న వార్షిక వ్యయం రూ.23,470గా సర్వే అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.8,382గా ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లో అయితే.. పట్టణ ప్రాంత విద్యార్థికి రూ.4,128, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,639 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల విషయంలో ఇది.. పట్టణప్రాంతాల్లో రూ.31,782, గ్రామీణ ప్రాంతాల్లో 19,554గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఫీజుల కోసం చేస్తున్న సగటు వార్షిక వ్యయం రూ.15,143 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,979.
ఈ లెక్కలు కూడా తక్కువేనా?
వాస్తవానికిది చాలా తక్కువనే చెప్పాలంటున్నారు విద్యారంగ ప్రముఖులు. "నిజానికి జాతీయ సర్వే చెబుతున్న లెక్కలు వాస్తవం కన్నా తక్కువనే చెప్పాలి. నెలకు రూ.1000కి తక్కువ కాకుండా ఖర్చు పెడుతున్న వారే ఎక్కువ. సబ్జెక్టుల వారీగా ట్యూషన్ల కల్చర్ పెరిగింది. సర్కారీ స్కూళ్లలో చదివే విద్యార్థులు సైతం తాము ఏ సబ్జెక్టులో వెనకబడ్డామని భావిస్తున్నారో వాటికి ట్యూషన్లు పెట్టుకుంటున్నారు. కనీసం రూ.10వేలకు తక్కువ కాకుండా ఆ యా సబ్జెక్టుల టీచర్లు వసూలు చేస్తున్న మాట నిజం" అన్నారు గుంటూరు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలు హెడ్మాస్టర్ గా పని చేసి రిటైర్ అయిన కె.శౌరయ్య.
ప్రభుత్వం కొంతకాలం ప్రైవేట్లపై నిషేధం విధించి, స్కూళ్లలోనే స్టడీ అవర్స్ పెట్టించిన సంస్కృతి కూడా ఉండేది. ఇప్పుడా సంస్కృతి, అంత నిబద్ధత కలిగిన ఉపాథ్యాయులు లేరు. ఫలితంగా ప్రైవేటు విద్యాసంస్థలు పెరిగాయి. ఆ సంస్థలే పొద్దుట్నుంచి సాయంత్రం వరకు పిల్లలు మరెక్కడికో పోయి ప్రైవేట్లు చెప్పించుకునే వెసులుబాటు లేకుండా చేశాయన్నది శౌరయ్య మాట.
ప్రైవేట్ ట్యూషన్లు ఎలా పుట్టాయి?
ప్రైవేటు ట్యూషన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. "సాంప్రదాయ గురుకుల పద్ధతి మన సంస్కృతిలో భాగంగా ఉంది. అక్కడ వ్యక్తిగత శ్రద్ధ ఉండేది. కానీ పాఠశాల విద్య విస్తరించాక ఒకే క్లాస్‌రూమ్‌లో ఎక్కువమంది పిల్లలు ఉండటంతో అందరికీ సమాన దృష్టి పెట్టడం కష్టమైంది.
తల్లిదండ్రుల ఆశలు పెరగడం, పోటీ పరీక్షలు, మార్కుల ప్రాముఖ్యత పెరగడం వల్ల అదనపు సహాయం కోసం పిల్లలను ప్రైవేట్ టీచర్ల దగ్గరికి పంపించడం ప్రారంభమైంది" అన్నారు విజయవాడకు చెందిన విద్యావేత్త కృష్ణప్రసాద్.
1980ల నుండి ముఖ్యంగా పట్టణాల్లో కాంపిటీటివ్ పరీక్షల సంస్కృతి పెరిగింది (EAMCET, IIT, UPSC వంటివి). ఇది ట్యూషన్ సెంటర్ల వ్యాపారాన్ని పెంచింది అని అన్నారు గుంటూరు హిందూ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ ఏ.రామారావు.
ఓ సందర్భంలో సామాజిక కార్యకర్త, విద్యా రంగంలో నిపుణురాలు డాక్టర్ సుధా మూర్తి “పాఠశాలల బోధన సరిపోకపోవడం వల్లే తల్లిదండ్రులు ట్యూషన్లపై ఆధారపడుతున్నారు. బోధన నాణ్యత మెరుగుపరిస్తే, ట్యూషన్ అవసరం తగ్గిపోతుంది. లేకపోతే ఇది ఒక ‘ఎడ్యుకేషన్ బిజినెస్’ అవుతుంది” అన్నారు.

న్యూఢిల్లీకి చెందిన ఎడ్యుకేషన్ పాలసీ అనలిస్ట్ అభ్యుదయ్ శర్మ ఇంకో అడుగు ముందుకేసి “ఈ ధోరణి వల్ల విద్య ఒక ప్రైవేటు వస్తువుగా మారుతోంది. ట్యూషన్లు పట్టణాల్లో ఒక ‘స్టేటస్ సింబల్’గా మారాయి. కానీ గ్రామీణ ప్రాంతంలో అదే ట్యూషన్ ఖర్చు ఒక కుటుంబానికి పెద్ద భారమవుతుంది” అన్నారు.
ప్రైవేట్ ట్యూషన్ల ప్రయోజనాలు..
వ్యక్తిగత శ్రద్ధ: స్కూల్‌లో టీచర్‌కు సమయం లేకపోయినా, ట్యూషన్‌లో విద్యార్థి సందేహాలు క్లియర్ అవుతాయి.
పోటీకి సన్నద్ధం: Entrance exams, Olympiads, Board examsలో special coaching అందుతుంది.
ఓ అలవాటుగా చదువు: చదువు మీద క్రమశిక్షణ, హోంవర్క్ రివిజన్ అలవాటు పడతారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ట్యూషన్ల వలన పాఠశాల కంటే ఎక్కువగా నేర్చుకుంటున్నారు.
ప్రతికూలతలు ఏమిటంటే..
ఆర్థిక భారం: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఫీజులు భారమవుతాయి. పేరున్న ప్రైవేటు స్కూళ్లలో ఒక్కో విద్యార్థి కనీసం 40 నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ప్రకాశం జిల్లా ఏల్చూరులో పని చేస్తున్న టీచర్ జె. భాగ్యం అభిప్రాయపడ్డారు.
ఇటువంటి ట్యూషన్ల వల్ల స్కూల్ చదువు విలువ తగ్గుతుందని, “స్కూల్‌లో నేర్చుకోలేక పోయినా ట్యూషన్‌లోనే నేర్చుకుంటాం” అన్న ధోరణి పెరుగుతుందని విశాఖపట్నంలో స్కూలు టీచర్ గా పని చేసిన సాయిలత చెప్పారు. ఉదయం స్కూల్, సాయంత్రం ట్యూషన్ – పిల్లలకు ఆడుకునే సమయం ఉండదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది అని ఆమె అభిప్రాయపడ్డారు. కొందరు టీచర్లు స్కూల్‌లో సరిగ్గా బోధించకుండా, ట్యూషన్‌కి రమ్మని బలవంతం చేసే పరిస్థితులు వస్తాయని అన్నారు.

జాతీయ సర్వే ప్రకారం దేశంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థుల్లో 37% మంది ప్రైవేట్‌ కోచింగ్‌కు సై అంటున్నారు. పట్టణాల్లోని ఇంటర్‌ స్టూడెంట్స్‌లో 44.6 మంది ట్యూషన్లకు వెళ్తున్నారు.
ప్రైవేట్‌ ట్యూషన్స్ కోసం దేశంలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు సగటున ఏటా రూ.6,384 ఖర్చు పెడుతున్నారు.
ప్రైవేటు కోచింగ్ సంస్థలు భారీగా ఆర్జిస్తున్నాయి. 2019–20లో ఈ సెంటర్లు చెల్లించిన జీఎస్టీయే రూ.2,240 కోట్లు. 2023–24కి వచ్చేసరికి ఇది రూ.5,517 కోట్లకు చేరింది.
కోచింగ్‌ కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఏటా అమ్మాయిలు రూ.2,227, అబ్బాయిలు రూ.2,572 వ్యయం చేస్తున్నట్టు సర్వే పేర్కొంది.
“ప్రైవేట్ ట్యూషన్లు పిల్లలకు అదనపు సహాయం అందిస్తున్నా, ఇది మధ్యతరగతి, పట్టణ కుటుంబాలకు ఎక్కువగా అందుబాటులో ఉంది. గ్రామీణ విద్యార్థులు మాత్రం వెనుకబడే ప్రమాదం ఉంది. ఇది సమానత్వం అనే భావనను బలహీనపరుస్తుంది” అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణయ్య.
ప్రైవేటు ట్యూషన్ల వైపు ఎందుకు మొగ్గుతున్నారంటే...
-మార్కుల వేట, కాంపిటిటివ్ పరీక్షల ఒత్తిడి.
-ప్రైవేట్ పాఠశాలల బోధన, ట్యూషన్ మేళవింపు.
-తల్లిదండ్రుల ఆకాంక్షలు
-పాఠశాల బోధన నాణ్యతపై నమ్మకం తగ్గడం
ఈ బెడదను నివారించాలంటే ప్రభుత్వ విద్యావ్యవస్థ పటిష్టం కావాలి. “స్కూల్ ఎడ్యుకేషన్‌ని బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల నాణ్యత పెంచితే ట్యూషన్ మీద ఆధారపడే అవసరం తగ్గుతుంది” అంటున్నారు నిపుణులు.
“ఐటీ, మెడికల్, UPSC పరీక్షల వాతావరణంలో హైదరాబాద్‌లో ట్యూషన్లు ఒక ‘అనివార్యత’గా మారాయి. స్కూళ్లలో బోధన సరిపోదన్న నమ్మకం తల్లిదండ్రుల్లో పెరిగింది. దీనివల్ల ట్యూషన్ బిజినెస్ ఉధృతమవుతోంది. అయితే ఇది ‘ఎడ్యుకేషన్‌లో అసమానతలు’ పెంచుతోందనే విషయం ఆందోళన కలిగిస్తోంది” అని హైదారాబాద్ కి చెందిన విద్యావేత్త డాక్టర్ సుబ్బారావు అన్నారు.
“ఇక్కడ (విశాఖ) ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్లు ఒక పరిశ్రమగా మారాయి. ఒక్కో విద్యార్థి కోసం తల్లిదండ్రులు సంవత్సరానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దీని వల్ల విద్య ఒక ‘ప్రెషర్ కుకర్’ లా మారింది. పిల్లలు విజయం సాధించడమే లక్ష్యంగా మారిపోతున్నారు, నేర్చుకోవడం మరిచిపోతున్నారు” అన్నారు విశాఖపట్నంలోని ఓ స్కూల్ ప్రిన్సిపాల్ రామకృష్ణ.

“విశాఖలో తల్లిదండ్రులు ట్యూషన్లను ఒక ‘సెక్యూరిటీ పాలసీ’లా భావిస్తున్నారు. ముఖ్యంగా SSC, ఇంటర్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు ట్యూషన్లపై ఎక్కువ ఆధారపడుతున్నారు. కానీ ఇది విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనను తగ్గిస్తోంది. దీర్ఘకాలంలో ఇది సృజనాత్మకతను దెబ్బతీయవచ్చు” అని అభిప్రాయపడ్డారు.
అందరికీ విద్య సమానంగా అందాలంటే విద్యావ్యవస్థ అంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగాలని, అప్పుడే ఈ బెడదకు పరిష్కారం దొరుకుతుందని అఖిల భారత విద్యార్థి సంఘం నాయకుడు లెనిన్. స్కూల్ బోధనను బలోపేతం చేయకపోతే, ట్యూషన్లపై ఆధారపడటం మరింత పెరుగుతుంది. ఇది విద్యలో అసమానతలకు దారితీస్తుంది. ప్రభుత్వం పబ్లిక్ స్కూళ్ల నాణ్యతను పెంచితేనే ఈ సమస్యకు పరిష్కారం అని నిపుణలు అభిప్రాయపడ్డారు.
Read More
Next Story