ఈ లోకంలో నేను చాలా ఒంటరినే...అయితే ...
రెయ్నా మరియా రిల్క (డిసెంబర్ 4, 1875- డిసెంబర్ 29,1926) జర్మన్ భాషలో రాసే ఆస్ట్రియన్ కవి.
ఈ లోకంలో నేను చాలా ఒంటరినే...అయితే...
మూలం: రెయ్నా మారియా రిల్క
తెలుగు అనువాదం: గీతాంజలి
——
అవును...
ఈ లోకంలో నేను మహా ఒంటరినే! కానీ...
దాన్ని తప్పించు కోవడానికి...
లేని పనేదో సృష్టించుకుని కాలం వెళ్లదీసేవాడ్ని మాత్రం కాదు !
అయితే..
ఈ లోకంలో నేను చాలా అల్పుణ్ణి ఒప్పుకుంటా...
కానీ మీకోసం చీకటిలో కూడా కనపడనంత ...
చిన్న వస్తువు లాంటి వాణ్ణి మాత్రం కాదు.
నేను., నా గమ్యానికి నన్ను చేర్చే స్వేచ్చా స్వాతంత్య్రాలని...
ఆ దారుల్ని వెతుక్కుంటున్నవాణ్ణి !
ఏ దారైతే నన్ను కార్యోన్ముఖుణ్ణి చేస్తుందో...ఆ దారి కావాలి నాకు
ఆ నడకకోసం ఒక తోడు కావాలి.
ఆ నడక దారుల్లో కేవలం ప్రశ్నలు రేపే సమయాలు కావాలి.
అప్పుడైనా..నేను తెలిసిన వారి మధ్యలో అయినా ఉండాలి లేదా ఒంటరిగానైనా ఉండాలి.
ఎక్కడో అక్కడ నేనైతే ఉండాలి !
ఒక విషయం చెబుతా విను ! నేను ..
అధ్ధంలో మెరిసిపోయే నీ ప్రతిబింబాన్ని కావాలనుకుంటున్నా అదీ పరిపూర్ణంగా !
అందుకే...
నేనెప్పటికీ గుడ్డి వాడిగా..
త్వరగా వయసు మళ్ళిన వాడిగా కాదల్చుకోలేదు.
నేనూ నీలా వెలిగిపోవాలనుకుంటున్నా.
నీ ముందు., నన్ను నేను పొరలు పొరలుగా తెరుచుకోవాలనుకుంటున్నా
నేనేంటో... నీకు చెప్పు కోవాలనుకుంటున్నా
అయితే..అలా ఉండడం కోసం... నేనేమాత్రం లొంగిపోయో...నీ ముందు తలవొంచో ఉండాలనుకోవటం లేదు!
ఎందుకంటే..అక్కడే నేనొక అబద్దాలకోరుగా..నిజాయితీ లేనివాడిగా ఉండొచ్చు కదా..ఏమో ..చెప్పలేం !
ఎందుకంటే..నీ ముందు నేను,. నా వివేకం రెండూ స్వచ్ఛంగా ఉండాలి మరి !
అసలు నా కోరికేంటో చెబుతా విను!
నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటానో తెలుసా...చాలా దగ్గరనుంచి
ఎక్కువసేపు అలా చూస్తూ ఉండిపోయే అద్భుతమైన చిత్రంలా...
కొత్తగా విన్న పదాలను, శబ్దాలను నేర్చుకునేటట్లుండే అందమైన చిత్రంలోలా...
నన్ను నేను వర్ణించుకోవాలని ఆశ పడతాను తప్పా చెప్పు ?
అసలు మొత్తంగా ఎలా అంటే...
రోజూ ఉదయం పూట టేబుల్ మీద నా దాహాన్ని తీర్చే నీళ్ల జగ్గు లాగా., కారుణ్యం నిండిన మా అమ్మ మొఖంలాగా ..
చివరాఖరికి..
నన్ను భీకరమైన తూఫాన్ ల నుంచి తప్పించి వొడ్డుకి చేర్చిన నావలాగా ..!
అవును ..ఎందుకంటే నేను ఈ లోకంలో మహా ఒంటరివాణ్ణే అయి వుండొచ్చు గాక...
కానీ మరీ ఇంకా అంత ఒంటరేమీ కాలేదు కాబట్టి !
(మూలం : I am much too alone in this world...yet not Alone : Rainer Maria Rilke)