మచ్చా, ఆ మాల్ కి వెళ్దామా!
x
malls

మచ్చా, ఆ మాల్ కి వెళ్దామా!

ప్రస్తుత ట్రెండ్ షాపింగ్ మాల్స్. అదో కొత్త లోకం. ఒక్కసారి లోపలికెళ్తే అంత తొందరగా బయటకి రాలేం.


ప్రపంచం కుగ్రామం అయింది. దేశదేశాల కల్చర్ వాలిపోతోంది. సరకుపై మోజు పెరిగింది. కోకోకోలా వద్దని తరిమికొట్టిన మన ఊళ్లనే మార్కెట్ సంస్కృతి చుట్టబెడుతోంది. అందుకు హైదరాబాద్ వంటి మహానగరాలే కాకుండా ఓ మాదిరి పట్టణం, పల్లెలకు కూడా షాపింగ్‌ మాల్స్ వ్యాపిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ షాపింగ్ మాల్స్. అదో కొత్త లోకం. ఒక్కసారి లోపలికెళ్తే అంత తొందరగా బయటకి రాలేం. ఆకట్టుకునే ఆఫర్లు, రకరకాల వస్తువులు, సెంట్రలైజ్‌డ్‌ ఏసీతోపాటు... కావాల్సింది తినేందుకు ఫుడ్‌ కోర్ట్స్‌ ఉంటాయి. ఇక ఆట పాటలకు గేమింగ్‌ జోన్స్, మూవీస్‌ చూసేందుకు సినిమా హాల్స్‌.. ఇలా జనాల్ని వ్యాపార ప్రపంచం ఎక్కడికో తీసుకువెళ్తోంది. ఇక, మెట్రో సిటీల్లో మాల్స్‌ కల్చర్‌ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఒకే బిల్డింగ్‌లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో పబ్లిక్ మాల్స్‌కు క్యూ కడుతున్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే హైదరాబాద్‌లోనే షాపింగ్ మాల్స్‌ స్పెస్‌ పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.

జన జీవితంలో భాగమేనా?


మెట్రో నగరాల్లోని ప్రజల జీవితాల్లో షాపింగ్‌ మాల్స్‌ ఓ భాగమైపోయాయి. పెరుగుతున్న నగరాల అభివృద్ధితో పాటు ప్రజల అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. షాపింగ్‌కి వెళ్లాలనుకుంటే మాల్స్‌కి వెళ్లడానికే నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అన్ని వస్తువులు ఒకే చోట దొరకడంతో పాటు ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండటంతో మాల్స్‌కి క్యూ కడుతున్నారు. సౌకర్యాల కల్పనలో హైదరాబాద్ ముందుండడంతో... సిటీలో ఉపాధితోపాటు మాల్స్‌ పెరుగుతున్నాయి. పలు సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఓపెన్ చేయడంతో ఇక్కడ రెసిడెన్షియల్ స్పెస్‌తోపాటు కమర్షియల్ స్పెస్‌కు డిమాండ్ పెరుగుతుంది.

హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల...

కొన్నేళ్లుగా హైదరాబాద్‌ సిటీ అన్ని వైపులా విస్తరిస్తోంది. భారీగా నివాస సముదాయాలతోపాటు, వ్యాపార వాణిజ్య సౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో సిటీలో మాల్స్ సంస్కృతి పెరిగింది. పిల్లలకు కావాల్సిన గేమింగ్‌.. ఆడవాళ్లకు కావాల్సిన ఆర్టికల్స్‌.. పురుషులకు అవసరమయ్యే ఐటమ్స్‌.. ఇంటిల్లిపాదికి కావాల్సిన అన్ని వస్తువులు ఒకే చోట దొరకడంతో షాపింగ్‌ మాల్స్‌కు ఫుల్‌ క్రేజ్‌ పెరిగింది. మాల్స్‌కి వెళ్లేవారి సంఖ్య రోజురోజుకీ పెరగడంతో సిటీతో పాటు నగర శివార్లలో కొత్త కొత్త మాల్స్ పుట్టుకొస్తున్నాయి.

హైదరాబాద్ కి పెరిగిన గిరాకీ...

దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో షాపింగ్ మాల్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంది. గతేడాది ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాల్లో ఒక్కో మాల్ అందుబాటులోకి వస్తే.... పుణె, చెన్నై నగరాల్లో రెండు మాల్స్ చొప్పున అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో హైదరాబాద్‌లో మూడు మాల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా సిటీలోని పలు ప్రాంతాల్లో మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఇలా సిటీలో మాల్స్ కల్చర్ రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీకి మంచి డిమాండ్ ఉందనడానికి సిటిలో పెరుగుతున్న మాల్సే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో మాల్‌ కల్చర్‌పై ఆదరణ ఇలాగే కొనసాగితే... లైఫ్‌స్టైల్‌తోపాటు రియల్‌ ఎస్టేట్‌కు మంచి ప్రయోజనాలు ఉంటాయని రియల్టీ నిపుణులు చెబుతున్నారు. సర్కార్‌ డెవలప్‌మెంట్ ప్లాన్‌తో శివారు ప్రాంతాల్లోనూ పెద్దసంఖ్యలో మాల్స్‌ పుట్టుకొస్తాయని అంచనా వేస్తున్నారు.

Read More
Next Story