
ఎవర్ గ్రీన్ తాజా రామ్మోహన్ రావ్
ఈ శనివారం జనవరి 3వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో రచయిత వీ. రాజా రామ్మోహన రావు 60 ఏళ్ల సాహితీ ఉత్సవం జరుగుతున్న సందర్భంగా.
అక్షరాలు కురిసీ, మాటలు ప్రవాహాలుగా మారీ, సాహిత్యం నైట్ క్వీన్ పువ్వులై విరిసిన ఒక మంచి బ్లాక్ అండ్ వైట్ కాలం లోంచి నడిచి వచ్చినవాడు -
అటు హరికథా, బుర్రకథా, పద్యనాటకం -
ఇటు స్వచ్ఛమైన ప్రేమ, విరహమూ, విషాదమూ పాటలై పిలిచిన అమాయక తెలుగు సినిమా, మోహనా, ముఖారీ, హంసధ్వనులు పలికిన సన్నజాజి సువాసనల శాస్త్రీయ సంగీతం, కృష్ణశాస్త్రీ, శ్రీశ్రీ, చలమూ, కొడవటిగంటి, బుచ్చిబాబు, శ్రీపాదలను తలుచుకుంటూ మలుపు తిరిగిన తెలుగు నవల, కథ, కవిత్వం…
ఆ లిటరరీ జడి వానలో తడిచి వచ్చినవాడు, ఆ వెన్నెల దారులంట నడిచి వచ్చినాడు-రాజారామ్మోహన్ రావ్ మంచి రచయిత కాకుండా ఎలా వుండగలడు?
మేం అందరం ఆ పశ్చిమ గోదావరి జిల్లా పచ్చని చెట్ల నీడల్లో ఆడి పాడి పెరిగినవాళ్లమే. నండూరి సుబ్బారావూ, కొనకళ్ల వెంకటరత్నం, బుచ్చిబాబు, చలంలాంటి రచయితలూ, కవులూ తిరిగిన ఆ చరిత్రాత్మకమైన ఏలూరు ఎర్రమట్టి రోడ్లను ప్రేమించిన కుర్రవాళ్ళమే మేమంతా! అక్కడి పిట్టలూ, పిచికలూ, పంటకాల్వలూ మా వెంటే వుంటాయి ఎప్పటికీ. అక్కడి తాజా పూల సౌందర్యం అంతా ఒక రూపు దాలిస్తే... అది రాజారామ్మోహన రావు అవుతుంది. ఆ అందమైన అనుభవం అక్షరాలై పేజీలు నిండితే అతను మనమెరిగిన మంచి రచయిత అవుతాడు.
1978లోనే అరుణాచలం వెళ్ళి గుడిపాటి వెంకట చలాన్ని చూసి, మాటలు కలిపాడు. చలం ఈ కుర్రాడి భుజమ్మీద ఆప్యాయంగా చెయ్యివేసి చిన్నగా నవ్వాడు. ఆ హిస్టారిక్ ఈవెంట్ ని రాజా మురిసిపోతూ చెబుతుంటే విన్నారా మీరెపుడైనా? పాలగుమ్మి పద్మరాజునీ కలిశాడు. శ్రీశ్రీ, కృష్ణ శాస్త్రిలకు వినమ్రంగా ఒక దణ్ణం పెట్టుకున్నాడు. అలనాటి ఉన్నత సంస్కారాన్నీ, స్నేహ మాధుర్యాన్నీ ఇప్పటి తరానికి పంచి యిచ్చినవాడు రాజా రామ్మోహన్ రావు. సాహిత్యం పేరిట మిడిల్ క్లాస్ ప్రేమకథలూ, గిలిగింతలు పెట్టే ఎంటర్‌టైన్మెంట్ రచనలూ వరసబెట్టి వస్తున్న రోజుల్లోనే - ధైర్యంగా, బతుకులోని ఒక చీకటి కోణాన్ని డిస్కవర్ చేశాడు. వాళ్ళు నిరాశోపహతులు, వేశ్యలు, నిశాచరులు - కలలు కాలిపోయిన వాళ్ళు. ఫుట్‌పాత్‌ల మీద పడుకునే వాళ్ళు, జీవితం చేతిలో వోడిపోయిన వాళ్ళు.. అలాంటి లంపెన్ అనే అలగాజనం మీద జాలీ, సానుభూతీ వుండడం వేరు.
ఆ శాపగ్రస్త జీవితాల గురించి రాయడం వేరు. పురుగుల్లాంటి, కురుపుల్లాంటి ఆ జీవన్మృతుల్ని పరిచయం చేసుకునీ, మాట్లాడీ, తిరిగి, వాళ్ళతో బతికీ, ఆ దయనీయమైన జీవితాల్ని కథలుగా రాయడం అంటే నరకానికి వెళ్ళి తిరిగి రావడమే. అలాంటి రచనలు చేయడానికి అలవిమాలిన ప్రేమ, నిజాయితీ, తపన వుంటే మాత్రమే చాలదు. తెగింపూ, గుండె ధైర్యమూ, ఒక అరుదైన ఆర్తీ వుండాలి. అలాంటి భరించరాని చిక్కని చీకటి లోతుల్లోకి చూసి, తట్టుకుని, వాటిని మనసుపిండే కన్నీటి కథలుగా మనకి మిగిల్చిన రచయిత రాజా రామ్మోహన్ రావు.
60 ఏళ్ళుగా నాన్‌స్టాప్ గా రచనలు చేస్తున్న రాజా, మొత్తం మూడు వందల కథలు, 23 నవలలు రాశారు. మంచి వాక్యమూ, చదివించే శైలీ, గతుక్కుమనిపించే ముగింపూ ఈయన ప్రతేకత. కలల గాలిమేడలు కట్టకుండా, నిజాలకు నగిషీలు చెక్కకుండా, ఈ జీవితం ఇంతే అన్నట్టు నిర్మోహంగా, సూటిగా, కటువుగా కథ చెప్పడంలో స్పెషలిస్టు. నూరుశాతమూ హ్యూమనిస్టు. నిరాశకు బహుదూరం. బతుకు నల్లమబ్బు చుట్టూ మెరిసే వెండి తీగలాంటి ఆశావాది.
ఇంత జీవితాన్ని చూసిన, విస్తృతంగా రాసిన రాజాకి రావలసినంత పేరూ, ప్రతిష్టా, గుర్తింపూ రాలేదా? ప్రమోట్ చేసుకునే ఆసక్తి లేని తరానికి చెందిన వాడు. పుస్తకాలు ప్రచురించుకోలేక పోవడమూ ఒక కారణం. ఉద్యోగం, కుటుంబం, నిరంతరం చదువు - అదే ప్రయారిటీ కావడం! ఏది ఏమైనా తాను అనుకున్నది చేశాడు ఒక నిష్టతో. సెక్స్ గురించి మాట్లాడడం తప్పు, శృంగారం గురించి రాయడం అంత దరిద్రం మరోటి వుండదు, అది పర్వర్షన్ కూడా అనుకునే మన చదువు తక్కువ సమాజాన్ని ఖాతరు చేయకుండా, 'శృంగార యాత్ర' నవల రాశారు. వోపెన్‌గా చిత్రించారు. గత అరవై ఏళ్ళలో సెక్స్ ఎలా మారింది? ఒక గొప్ప మానవానుభవం కేవలం ఒక బూతుపనిగా ఎలా దిగజారింది? శృంగారం వెర్రితలలు వేస్తున్న విషాదం గురించి రాస్తూ, సెక్స్‌ని అర్థం చేసుకోడానికో విశాల దృక్పథం వుండాలన్నారు. సెక్స్ అనగానే చీదరించుకునేవాళ్ళూ, ఫ్రాయిడ్‌ని కూడా భయపెట్టే మానసిక వికలాంగులూ ఒకే చోట వున్న విచిత్రమైన సమాజం మనది. సెక్స్ గురించి రాజా రామ్మోహన్ రావ్ అనుభవాన్ని రంగరించి చేసిన ఈ సీరియస్ విశ్లేషణ తప్పక చదవదగ్గది.
ఇన్ని ప్రత్యేకతలూ, అరుదైన ప్రతిభా వున్న రాజా రామ్మోహన్ రావ్ ఒక శ్రీపతి, ఒక అల్లం శేషగిరిరావు, ఒక పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఎందుకు కాలేకపోయారు? ఒక సొంత ముద్ర కలిగిన తెలుగు స్టార్ రైటర్ గా ఎందుకు పేరు తెచ్చుకోలేకపోయారు? what went wrong? ఒక సృజనాత్మక రచయితని మనం చిన్న చూపు చూశామా? లేదా విస్మరించామా? మనకి అలవాటైన అలసత్వం వల్లే యిలా జరిగిందా? ఆయన రాసిన గొప్ప కథలు వున్నా, ఒక piece of art గా నిలిచిపోయే అద్భుతమైన క్రియేటివ్ నవలని ఆయన్నించి ఆశిస్తున్నాను. ఈ ముదనష్టపు మానవ జీవితమ్మీద అవ్యాజమైన అనురాగం వున్న రాజా రామ్మోహన్ రావు అలాంటి అపురూపమైన నవలని అలవోకగా రాయగలరు. అలాంటి అరుదైన కానుక కోసం ఎదురుచూస్తూ... సమ్మోహన రూపంతో వెలిగే రామ్మోహనరావుకి జన్మదిన శుభాకాంక్షలతో….

