దశరథుని అశ్వమేధానికి మూడేళ్లు ఎందుకు పట్టింది?
x

దశరథుని అశ్వమేధానికి మూడేళ్లు ఎందుకు పట్టింది?

రామాయణంలో నిరుత్తరకాండ-4: సాహిత్య విమర్శకుడు కల్లూరి భాస్కరం రాయాయణ వ్యాసాలు



ఎట్టకేలకు కౌసల్య ప్రస్తావన నేరుగా ఏ సందర్భంలో, ఎలా వస్తుందో చెప్పుకునేముందు, దాని పూర్వరంగంలో ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పుకోవడం అవసరం:

ధర్మజ్ఞుడు, మహాత్ముడు అయిన దశరథమహారాజుకి చాలాకాలం వరకూ వంశోద్ధారకుడు కలగలేదనీ; పుత్రసంతానం కోసం తను అశ్వమేధయాగం ఎందుకు చేయకూడదని మనసులో అనుకున్నాడనీ(చింతయానస్య తస్యైవం బుద్ధిరాసీన్మహాత్మనః/సుతార్థం హయమేధేన కిమర్థం న యజామ్యహం-శ్లో.2)చెబుతూ 8వ సర్గ ప్రారంభమవుతుంది.

వెంటనే ఆయన మంత్రులను సంప్రదించాడు; పురోహితుడైన వసిష్ఠుని, ఇతర గురువులైన సుయజ్ఞుని, వామదేవుని, జాబాలిని, కాశ్యపుని తీసుకుని రమ్మన్నాడు; వారు వచ్చి అతని సంకల్పాన్ని అభినందించి, కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చుకుని అశ్వాన్ని విడిచిపెట్టమని చెప్పారు; సరయూనది ఉత్తరతీరంలో యజ్ఞభూమిని ఏర్పాటు చేయమని దశరథుడు ఆదేశించాడు; ఆ తర్వాత తన మనసుకు ఇష్టులైన పత్నుల దగ్గరకు వెళ్ళి, తను యాగం చేయబోతున్నట్టు చెప్పి దీక్ష వహించమని కోరాడు...! దీంతో 8వ సర్గ ముగుస్తుంది.

ఇక్కడ ఒకింత విచిత్రంగా కనిపించేదేమిటంటే, పుత్రసంతానం కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచన దశరథుడికే కలగడం; అందుకు వసిష్ఠుడూ, ఇతర గురువులూ ఆమోదించి సంతోషం వ్యక్తం చేయడం! సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో రాజు తన కోరిక తీరే మార్గం చెప్పమని గురువులను అడిగితే; వారు ఫలానా వ్రతమో, క్రతువో చేయమని చెబుతారు. అదిక్కడ తలకిందులైంది. నేను పరిశీలించిన పుల్లెల శ్రీరామచంద్రుడిగారి బాలానందినీవ్యాఖ్యలో దీనిపై వివరణ లేదు.

అంతకన్నా కీలకంగా ఇక్కడ పాఠకులకు కలిగే సందేహం- అశ్వమేధయాగానికీ, పుత్రసంతానానికీ ఎలాంటి సంబంధం ఉందన్నది! ఎందుకంటే, పుత్రసంతానం ఉన్న రాజులు కూడా అశ్వమేధయాగం చేసిన ఉదంతాలు మన పురాణ, ఇతిహాసాల్లో కనిపిస్తాయి. దశరథుని మూలపురుషుల్లో ఒకడైన సగరుడు అశ్వమేధయాగం చేసినప్పుడు అతని 64వేల మంది కొడుకులు అశ్వం వెంట వెళ్లారని రామాయణమే చెబుతోంది. మహాభారతంలోని ధర్మరాజు ఇంకొక ఉదాహరణ. అశ్వమేధయాగం చేస్తే అనేక కోరికలు తీరతాయనీ, వాటిలో పుత్రసంతానం ఒకటనే వివరణ ఉంటే ఉండవచ్చు; కాదనలేము. కాకపోతే, పాఠకులలో సందేహాలు రేకెత్తే ఇలాంటి ఘట్టాలలోనే వ్యాఖ్యాతలనుంచి తగిన వివరణ ఆశిస్తాం. వ్యాఖ్యాతలు చేయవలసిన పనే అది. పుల్లెలవారి బాలానందినీవ్యాఖ్యలో దీనిపై కూడా వివరణ లేదు. 17వ శతాబ్ది పూర్వార్థానికి చెందిన మహేశ్వరతీర్థుల ‘తత్త్వదీప’, అదే శతాబ్ది ఉత్తరార్థానికి చెందిన గోవిందరాజుల ‘భూషణ’ వంటి ప్రసిద్ధ రామాయణవ్యాఖ్యానాలను కూడా పుల్లెలవారు అక్కడక్కడ ఉటంకిస్తూ వచ్చారు కనుక; ఒకవేళ వారు వివరణ ఇచ్చుంటే దానిని తప్పక ప్రస్తావించి ఉండేవారు. ప్రస్తావించాలేదంటే, వారు కూడా ఇచ్చి ఉండరని అనుకోవాలి. ప్రత్యేకించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న రామాయణఘట్టంలో ఆ వివరణ మరింత అవసరం. ఎందుకు అవసరమో తర్వాత చెప్పుకుందాం.

8వ సర్గలో దశరథుడు సంకల్పించుకుని, భార్యలతో కలసి దీక్ష తీసుకున్న అశ్వమేధయాగం మళ్ళీ ఏ కొంచెమైనా ముందుకు కదిలిందంటే, అది 12వ సర్గలో! “చాలాకాలం గడిచిన తర్వాత ఒక మనోహరమైన వసంత ఋతువు రాగానే దశరథుడికి యజ్ఞం చేయాలనే కోరిక కలిగిం”దంటూ 12వ సర్గ ప్రారంభమవుతుంది(తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్సుమనోహరే/వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోZభవత్).

మధ్యలో ఇంత విరామం ఎందుకొచ్చిందంటే, ఋష్యశృంగుడనే గొప్ప తపశ్శాలిని రప్పించి అతని మార్గదర్శనంలో దశరథుడు యాగం చేయవలసి ఉంటుంది కనుక! ఆవిధంగా, 9-10-11 సర్గలు ఋష్యశృంగుడి జన్మవృత్తాంతాన్నీ, అంగదేశపు రాజు రోమపాదుడు అతణ్ణి తన దేశానికి రప్పించుకుని తన కూతురైన శాంతను ఇచ్చి వివాహం చేయడాన్నీ, దశరథుడు అంగదేశానికి వెళ్ళి తన మిత్రుడైన రోమపాదుని సమ్మతితో శాంతా, ఋష్యశృంగులను అయోధ్యకు తీసుకురావడాన్నీ చెబుతాయి.

అసలు ఋష్యశృంగుడనే పాత్ర రామాయణంలోకి ఎలా వచ్చాడు, కథాగమనానికి ఏమేరకు దోహదం చేశాడనేవి కూడా చర్చించాల్సిన విషయాలే. వాటిని ప్రస్తుతానికి వాయిదా వేసి, అలాంటి మరికొన్ని విషయాలను స్పృశిస్తూ, కౌసల్యతో ముడిపడిన ప్రస్తుతాంశంవైపు సాగుదాం:

తిరిగి 12వ సర్గకు వస్తే, ఋష్యశృంగుని ఋత్విక్కుగా వరించిన దశరథుడు, “నా వంశం పుత్రపౌత్రాభివృద్ధితో అవిచ్ఛిన్నంగా ఉండేటట్లుగా యజ్ఞం చేయించ”మని కోరాడు. “అలాగే చేయిస్తాను. యజ్ఞానికి కావలసిన సామగ్రిని సమకూర్చు, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు” అని ఋష్యశృంగుడు అన్నాడు. దశరథుడు మంత్రి సుమంత్రునితో చెప్పి బ్రహ్మవాదులైన ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలైనవారిని, పురోహితుడైన వసిష్ఠుడిని, ఇతర బ్రాహ్మణోత్తములను మళ్ళీ రప్పించాడు. వారు రాగానే, తను యాగం చేయబోతున్నాననీ, ఋష్యశృంగుని ప్రభావంతో తన కోరికలు తీరతాయనీ వారికి చెప్పాడు. మరోసారి ఋష్యశృంగుడూ, వాళ్ళూ కూడా సామగ్రిని సమకూర్చుకోమనీ, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టమనీ, నీకు నలుగురు పుత్రులు కలుగుతారనీ చెప్పారు. దీంతో 12వ సర్గ ముగుస్తుంది.

ఆ తర్వాత మరో సంవత్సరం పూర్తై తిరిగి వసంత ఋతువు వచ్చిందనీ, దశరథుడు సంతానం కోసం అశ్వమేధయాగం చేసే సంకల్పంతో యజ్ఞశాలలోకి ప్రవేశించాడనీ 13వ సర్గ ప్రారంభశ్లోకం చెబుతోంది(పునః ప్రాప్తే వసంతే తు పూర్ణస్సంవత్సరోZభవత్/ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్). ఆ తర్వాత దశరథుడు వసిష్ఠునికి నమస్కరించి, పూజించి, “యజ్ఞం యథాశాస్త్రంగా జరిగేలానూ, యజ్ఞాంగాలలో ఎలాంటి విఘ్నాలు కలగకుండానూ చూడ”మని కోరాడు. యజ్ఞానికి సంబంధించిన ఏర్పాట్లు, రాజులకు ఆహ్వానాలు పంపడం, యాగాన్ని చూడడానికి వచ్చే వేలాదిమందికి వసతి, భోజనాలను కల్పించడం సహా అన్నింటినీ పర్యవేక్షించే బాధ్యతను వసిష్ఠుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

36 శ్లోకాలున్న ఈ సర్గలో ఋష్యశృంగుని పేరు చివరిలో రెండుసార్లు మాత్రం వస్తుంది. ఋష్యశృంగుడు కూడా వసిష్ఠుడు చెప్పినట్టే చెప్పాడనీ, వారిద్దరి వచనాన్ని అనుసరించి దశరథుడు శుభనక్షత్రంలో యాగశాలకు బయలుదేరాడనీ, వసిష్ఠుడు మొదలైనవారంతా ఋష్యశృంగుని ముందుంచుకుని యథాశాస్త్రంగా, కల్పోక్తప్రకారంగా యాగం ప్రారంభించారనీ చెప్పడంతో 13వ సర్గ ముగుస్తుంది.

ఆ తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం పూర్తయిందనీ, విడిచిపెట్టిన అశ్వం తిరిగి వచ్చిందనీ, అప్పుడు సరయూనది ఉత్తరతీరంలో దశరథుని యజ్ఞం ప్రారంభమైందనీ చెప్పడంతో 14వ సర్గ మొదలవుతుంది(అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే/సరయ్యాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోZఅభ్యవర్తత). మొత్తం 57 శ్లోకాలున్న ఈ సర్గ అశ్వమేధయాగం తంతును వివరించి, చివరిగా, “నా వంశవృద్ధికి హేతువైన కర్మను చేయ”మని మళ్ళీ దశరథుడు ఋష్యశృంగుని కోరడంతో ముగుస్తుంది.

ఇంతవరకూ చేసిన కర్మ అంతా వంశవృద్ధికే కదా, మళ్ళీ దశరథుడు ఋష్యశృంగుని అలా ఎందుకు కోరాడనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. దాని గురించి తర్వాత చూద్దాం.

మొత్తం మీద పై సర్గలు మనకు ఎలాంటి అవగాహన కలిగిస్తున్నాయి? అశ్వమేధయాగం చేయాలని దశరథుడు 8వ సర్గ ప్రారంభంలో సంకల్పించుకుంటే, అది 14వ సర్గలోకానీ కార్యరూపం ధరించలేదు. ఈ మధ్యలో కనీసం మూడు సంవత్సరాలు గతించిపోయాయి. “చాలాకాలం గడిచిన తర్వాత ఒక మనోహరమైన వసంత ఋతువు రాగానే దశరథుడికి యజ్ఞం చేయాలనే కోరిక కలిగిం”దని 12వ సర్గ చెబుతోంది కనుక; ఋష్యశృంగుని అయోధ్యకు రప్పించడంలో జరిగిన జాప్యంగా దానిని అర్థంచేసుకోవచ్చు. అలాగని ఋష్యశృంగుని రప్పించిన తర్వాత వెంటనే యాగం ముందుకు కదిలిందా అంటే అదీ లేదు. మరో సంవత్సరం పూర్తయి మళ్ళీ వసంత ఋతువు వచ్చాకే మళ్ళీ కదలిక వచ్చింది.

ఆ తర్వాత కూడా మరో సంవత్సరం గడిచాక కానీ అసలు యాగం జరగలేదు. ముందుగా యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టడమనే తంతు జరిగి, అది తిరిగి రావడానికి ఏడాది పట్టి ఉండవచ్చు కనుక దానినీ అర్థం చేసుకోవచ్చు. అయితే, విచిత్రం ఏమిటంటే, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టే తంతు ఫలానావిధంగా జరిగిందని కానీ; యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టారని కానీ ఎక్కడా చెప్పలేదు. యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టారన్న ఒక్క వివరం మాత్రం హఠాత్తుగా 14వ సర్గ ప్రారంభంలో వస్తుంది(అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే...సంవత్సరం పూర్తై గుర్రం తిరిగివచ్చిన తర్వాత).

ఇలా అశ్వమేధసంకల్పం దాదాపు మూడు సంవత్సరాలపాటు వాయిదాల పద్ధతిలో కార్యరూపం ధరించడం మరికొన్ని విచిత్రమైన సన్నివేశాలను సృష్టించింది. ప్రతిసారీ దశరథుడు మంత్రులనూ పురోహితునీ ఋత్విక్కులనూ పిలిపించి తాను యాగం చేయదలచుకున్నాననీ, అందుకు ఏర్పాట్లు చేయమనీ చెబుతాడు; ప్రతిసారీ వారు సంతోషం వ్యక్తం చేసి యజ్ఞానికి అవసరమైన సామగ్రిని సమకూర్చమనీ, యజ్ఞాశ్వాన్ని విడవమనీ చెబుతారు!!!

అశ్వమేధసంకల్పం సాకారం కావడానికి ఎందుకింత కాలం పట్టింది, అసలా యాగవిధానం ఏమిటి, అందులో ఏ తంతు ఎప్పుడు జరుగుతుందన్న సమాచారం కథలో ఉండదు. మొదట యజ్ఞాశ్వాన్ని విడిచిపెడతారనీ, అది కొంతకాలానికి తిరిగివచ్చిన తర్వాత యాగం జరుగుతుందనీ పాఠకుడు స్థూలంగా ఒక అవగాహనకు రావలసిందే తప్ప అశ్వాన్ని ఎందుకు విడిచిపెడతారో, విడిచిపెట్టేముందు జరిగే తంతు ఏమిటో కథ చెప్పదు.

ఇలా అనేక కథాంశాలు కొసలు ముడివేయని విడివిడి దారాల్లా చిక్కుబడి పాఠకునికి తికమక కలిగిస్తాయి; సూటిగా సరళంగా ఉండాల్సిన కథ కాస్తా అనవసరంగా సంక్లిష్టంగా మారుతుంది. ఎక్కువ, తక్కువ తేడాలతో రామాయణంలోని అన్ని కాండలలోనూ ఇది ఎదురవుతుంది. ప్రధానకథ తరచు ఉపకథల్లోకి జారిపోవడం; ఆ ఉపకథలు ప్రధానకథాగమనానికి ఒక్కోసారి ఏ కొంచెమైనా దోహదం చేసేవిగా ఉండకపోవడం; రెండింటి మధ్య తగిన అతుకు లోపించడం; ఆపైన కథనంలోనూ, వర్ణనల్లోనూ, సంభాషణాల్లోనూ పునరుక్తులు యథేచ్ఛగా దొర్లిపోవడం చూస్తాం. అయితే, రూప(form)పరమైన పరిమితులనుంచి, లేదా నిర్బంధాలనుంచి దీనిని అర్థంచేసుకోవలసిందే కానీ; కథకుని, లేదా కథకులను తప్పు పట్టలేం.

ఉదాహరణకు, ఒక పుస్తకాన్ని(లేదా రచనను) నిర్దిష్టమైన తుదీ, మొదలూ కలిగినవిగా చూడడానికి మనం చాలాకాలంగా అలవాటుపడ్డాం. ఫలానా వ్యక్తి, లేదా వ్యక్తులు రాసినదిగా దానిని సాధికారికంగా గుర్తిస్తాం. అంటే అది, మరొకరు వేలు పెట్టడానికి వీలులేకుండా ‘తుదీ, మొదలూ’ అనే తలుపులు బిగించిన పుస్తకమన్నమాట. రామాయణం అలాంటిది కాదు. ఆ కథ చాలాకాలంపాటు మౌఖికంగా వ్యాప్తిలో ఉండి ఆ తర్వాత క్రమంగా గ్రంథరూపం ధరించింది; అందులోనూ ఒక గ్రంథంగా కాదు; అనేక గ్రంథాలుగా. అందుకే అనేక రామాయణాలు అవతరించాయి. ఆవిధంగా, అది ఒక కథగానే కాక; గ్రంథంగా కూడా తుదీ, మొదలూ అనే తలుపులు లేనిదీ, లేదా తలుపులు పూర్తిగా తెరచిపెట్టినదీ అయింది! ఒకరి చేయి కాకుండా అనేకమంది చేతులు పడడానికీ; ఎవరికి తోచినట్టు వారు కొత్త కొత్త విషయాలను చొప్పించడానికీ(ప్రక్షిప్తాలు)అవకాశమిచ్చింది, ఇంకా ఇస్తూనే ఉంది.

ఇప్పటి మన అవగాహనలో చెప్పాలంటే అసలు ఎడిటింగ్ అనేదే ఊహించడానికి వీలులేని కూర్పు అది. అలాగని ఇప్పుడు కత్తెర పుచ్చుకుని అందులోకి తలదూర్చే అధికారమూ మనకు లేదు. కాకపోతే ఒక అధికారం, అవకాశం మనకు ఎప్పుడూ ఉంటాయి. అవి- వ్యాఖ్యానరూపంలో ఎడిటింగ్ చేసి సాధారణపాఠకులకు వీలైనంతవరకు కథను సూటిగా, తేటగా బోధపడేలా చేయడం.

వ్యాఖ్యాతలు, వివరణకర్తలు ఆ పనికి పూర్తిగా న్యాయం చేశారా?! చేసినట్టు అనిపించదు.






Read More
Next Story