బాలకాండలోనే యుద్ధకాండకు తెర
రామాయణంలో నిరుత్తరకాండ-9: కల్లూరి భాస్కరం వివరిస్తున్న రామాయణ అదృశ్యవిశేషాలు
యాగాన్నీ, దేవతల సమావేశాన్నీ, దాని వెనుకనున్న తొందరను, ఉద్రిక్తతను సమాంతరంగా కూర్చడంలో కథకుడు గొప్ప నాటకీయతను రంగరించాడు. ఇంకా చెప్పాలంటే, నేడు సినిమాలలో చూసే సన్నివేశకల్పనను అది గుర్తుచేస్తుంది.
“రావణుడనే రాక్షసుడు నువ్వు ఇచ్చిన వరం వల్ల కలిగిన పరాక్రమంతో మమ్మల్ని హింసిస్తున్నాడు. అతణ్ణి మేము ఏమీచేయలేకపోతున్నాం. నీ వరాన్ని గౌరవిస్తూ అతడు చేసే అపకారాలను క్షమిస్తున్నాం” అన్న నిష్ఠురవాక్యాలతో దేవతాదులు బ్రహ్మతో సంభాషణ ప్రారంభిస్తారు. దుర్బుద్ధి అయిన రావణుడు మూడు లోకాల్నీ పీడిస్తున్నాడనీ, లోకపాలకులను ద్వేషిస్తున్నాడనీ, ఇంద్రుని, ఋషులను, గంధర్వులను, అసురులను, బ్రాహ్మణులను అవమానిస్తున్నాడనీ, అతని రూపమే భయంకరంగా ఉంటుందనీ, అతణ్ణి చంపే ఉపాయాన్ని ఆలోచించమనీ అంటారు. ఆపైన, పంచభూతాలు కూడా అతనికి ఎలా భయపడిపోతున్నాయో ఇలా అందంగా చెబుతారు.
నైనం సూర్యః ప్రతపతి, పార్శ్వే వాతి న మారుతః
చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోzపి న కంపతే (బాల. సర్గ 15, శ్లోకం 10)
అతనికి సూర్యుడు వేడి కలిగించడంలేదనీ, వాయువు అతనికి దగ్గరగా వీచడంలేదనీ, ఎప్పుడూ ఎడతెగని కెరటాలతో చలిస్తూ ఉండే సముద్రుడు అతణ్ణి చూడగానే స్తంభించిపోతున్నాడనీ ఈ శ్లోక తాత్పర్యం.
అప్పుడు ఆలోచించిన బ్రహ్మ, ”దేవదానవరాక్షసగంధర్వయక్షుల చేతుల్లో తనకు చావు లేకుండా అతను వరం అడిగాడు; నేను ఇచ్చాను. కానీ మనుషులపై చిన్నచూపుతో వాళ్ళ మాట ఎత్తలేదు. కనుక అతను మనుషుల చేతిలో మాత్రమే చావడానికి అవకాశముంది. మరో మరణోపాయం లే” దని అనేసరికి దేవతలు మొదలైనవాళ్ళు అందరూ సంతోషించారు.
పై వివరాల ద్వారా మనకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి. మొదటిది- దేవతలు, దానవులు, రాక్షసులు, అసురులు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు ఒక వర్గం, లేదా ఒక కూటమి. పైన మహర్షులను కూడా చెప్పారు కనుక వారినీ; రావణుడు అవమానిస్తున్నట్టు చెప్పిన బ్రాహ్మణులనూ కూడా పై వర్గానికి మిత్రవర్గంగా భావించాలి. రావణుడు అసురుడే అయినా, అసురులను కూడా అవమానిస్తున్నాడంటే వారు అతని వ్యతిరేకవర్గానికో లేదా దేవతాదుల అనుకూలవర్గానికో చెందినవారై ఉండాలి. అలాగే, రావణుడు రాక్షసుడు కూడా అయినా, బ్రహ్మను కలసినవారిలో రాక్షసులు కూడా ఉండడం గమనార్హం. బహుశా వాళ్ళు కూడా దేవతాదుల మిత్రవర్గానికి చెందినవారై ఉండాలి. అంతకన్నా ముఖ్యంగా గమనించాల్సింది, మనుషులు ఒక్కరే పై జాబితాలోకి రాకుండా ఒంటరిగా ఉండిపోవడం. అంటే, వారొక ప్రత్యేకవర్గం అన్నమాట.
ఇక రెండవది, రావణుడికి మనుషుల మీద చిన్నచూపు ఉండడం!
(న అకీర్తయత్ అవజ్ఞానాత్ తత్ రక్షో మానుషం స్తదా- బాల. స. 15. శ్లో.14- ఆ రాక్షసుడు వరమడిగినప్పుడు మనుషులపట్ల అవజ్ఞ వల్ల వాళ్ళ గురించి చెప్పలేదని ఈ శ్లోకపాదానికి అర్థం. ‘అవజ్ఞ’ అంటే తెగడడం, అనాదరం, తిరస్కారం, అవమానం అని నిఘంటు అర్థం).
దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు మొదలైన పేర్లతోపాటు విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, పిశాచులు, గుహ్యకులు, భూతాలు అనే పేర్లు కూడా మన పురాణ, ఇతిహాసాల్లో తరచు వస్తూ ఉంటాయి. వీళ్ళందరి నుంచీ మనుషులను విడదీసి చెప్పడమూ కనిపిస్తుంది. అసలు వీళ్ళంతా ఎవరో, మనుషులకూ వీళ్ళకు తేడా ఏమిటో చాలామందికి తెలిసి ఉండదు. వీరి గురించి వివరించిన వ్యాఖ్యాతలు దాదాపు కనబడరు. ప్రాచీనసంస్కృత నిఘంటువు అమరకోశం, ప్రథమకాండంలోని స్వర్గవర్గం వీరి గురించి ఇలా చెబుతుంది:
విద్యాధరో zప్సరో యక్ష రక్షో గంధర్వ కిన్నరాః
పిశాచో గుహ్యక స్సిద్ధో భూతో zమీ దేవయోనయః
గుటిక(గుళిక, లేదా గోళీ), అంజన(కాటుక)మనే విద్యలు తెలిసినవారు విద్యాధరులు. ఇవి దూరంగా ఉన్న వస్తువులనో, వ్యక్తులనో చూపించే మంత్ర/తంత్రవిద్యలు; నీటివలన పుట్టిన ఊర్వశి మొదలైనవారు అప్సరసలు; పూజింపబడే కుబేరుడు మొదలైనవాళ్లు యక్షులు; జంతువులను రక్షించే విభీషణుడు మొదలైనవాళ్లు రాక్షసులు; సువాసనను పొందే హాహాహూహూ మొదలైనవాళ్లు గంధర్వులు; గుర్రపు మొహంతో ఉండి ఏవగింపు కలిగించేవారు కిన్నరులు; మాంసం తినేవారూ, కుబేరుడి అనుచరులూ పిశాచులు; నిధులకు కాపలా కాసే మాణిభద్రుడు మొదలైనవాళ్లు గుహ్యులు; అణిమ మొదలైన ఎనిమిది రకాల సిద్ధులు కలిగిన విశ్వావసువు మొదలైనవాళ్లు సిద్ధులు; ఇష్టంతో ఆవేశించే బాలగ్రహం మొదలైనవి భూతాలు.
విశేషమేమిటంటే, ఈ పదిరకాల వాళ్ళు దేవతలవల్ల పుట్టినవారు(దేవయోనయః); దేవతాభేదాల్లోకి వస్తారు. వీరిలో రాక్షసులు కూడా ఉండడం మరింత విశేషం. రావణుని రాక్షసునిగానే రామాయణం పేర్కొంటుంది.
ఇక అసురులు మొదలైనవాళ్ళ గురించి అమరకోశం ఇలా చెబుతుంది:
అసురా దైత్య దైతేయ దనుజేంద్రారి దానవాః
శుక్రశిష్యా దితిసుతాః పూర్వదేవాః సురద్విషః
సుర (అమృతం) దక్కనివారు, దేవతలు కానివాళ్లు, యజ్ఞభాగంనుంచి బహిష్కృతులు, ‘అసూన్,’ అంటే ప్రాణాలను తీసేవారు -అసురులు; దితికొడుకులు దైత్యులు, దైతేయులు; దనువు కొడుకులు దనుజులు, దానవులు; ఇంద్రుని శత్రువులు ఇంద్రారులు; శుక్రుని శిష్యులు శుక్రశిష్యులు; దితి కొడుకులు దితిసుతులు; పూర్వం దేవతలుగా ఉన్నవారు పూర్వదేవులు; దేవతలను ద్వేషించేవారు సురద్విషులు. ఈ పదీ రాక్షసుల పేర్లు.
అమరకోశం ఇచ్చిన ఈ సమాచారం మనకు ఇచ్చే జ్ఞానం కన్నా, పెంచే గంద్రగోళమే ఎక్కువ. ముఖ్యంగా యక్షులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, పిశాచులు, అసురుల గురించిన వివరణలో స్పష్టత లేదు. దితి కొడుకులు, దను కొడుకులు అంటూ చెప్పడంలో తల్లుల తేడా తెలుస్తుంది తప్ప, ఇతరత్రా వారి మధ్య తేడా ఏమిటో తెలియదు. పైగా దితి కొడుకులనే వేర్వేరుగా చెబుతుంది. అలాగే, ఇంద్రారులు, శుక్రశిష్యులు, సురద్విషులు అనే మాటలు విశేషణాలే తప్ప ఆయా తెగల పేర్లుగా కనబడవు.
అయితే, పై రెండు రకాల జాబితాలూ స్థూలంగా ఒక అవగాహన కలిగిస్తున్నాయి. ఎలాగంటే, దేవతలకు పుట్టినవారుగా చెప్పిన మొదటి జాబితాలో తల్లుల ప్రస్తావన లేదు; అసురులు మొదలైనవారిని చెప్పే రెండో జాబితాలో తల్లుల ప్రస్తావన ఉంది. దీనినిబట్టి ఈ రెండవ జాబితాలో ఉన్నవాళ్ళు మాతృస్వామ్యానికి చెందినట్టు స్పష్టంగా అనిపిస్తుంది. దాంతోపాటు అమృతమూ(సుర), యజ్ఞంలో భాగమూ వీరికి దక్కలేదని చెప్పడాన్ని బట్టి దేవతలతో పోల్చితే వీరు దుర్బలులనీ, రెండో తరగతి జనాలనీ, దేవతల ఆధిపత్యం కింద నలుగుతున్నవారనీ అర్థమవుతుంది. వీరి మధ్య తేడా పురాణ, ఇతిహాసాల పొడవునా పితృస్వామ్య, మాతృస్వామ్యాల మధ్య ఘర్షణగా కూడా వ్యక్తమవడం కనిపిస్తుంది. పురాణ, ఇతిహాసాలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన కోణం. ఈ వ్యాసకర్త రచించిన ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే’ అనే రచనలో దీని గురించిన చర్చ విస్తృతంగా ఉంది.
అసురులు మొదలైనవారిని ‘పూర్వదేవులు’గా చెప్పడం గమనించదగిన మరో వివరం. దీనినిబట్టి దేవతలు, అసురులు వగైరాలు ఒకప్పుడు అన్నదమ్ములన్నమాట. కశ్యపుడనే ప్రజాపతిని వీరందరికీ తండ్రిగా పురాణ, ఇతిహాసాలు చెబుతాయి. దీనికి మరో అన్వయం కూడా ఉంది. మంచుయుగం ముగిసి భూమి పొడిబారుతున్న దశలో వివిధ భాషలకు, తెగలకు, జీవనవిధానాలకు, వ్యవస్థలకు చెందిన జనాలు అందరూ కాశ్యపి అనే కాస్పియన్ సముద్రప్రాంతంలో కొంతకాలం కలసి జీవించారు. ఆవిధంగా వారి మధ్య అన్నదమ్ముల సంబంధం ఏర్పడి ఉండవచ్చు. ఈ అన్నదమ్ముల మధ్య ఘర్షణ రాగా బలవత్తరులైన వాళ్ళు బలహీనులను దూరానికి తరిమేశారనీ, ఆ బలహీనులు మెసపొటేమియా తుంగల్లోకి, ఆవల్లోకి చేరుకుని అక్కడ వ్యవసాయాన్ని ప్రారంభించి, నాగరికతను నెలకొల్పి, రాజ్యాలు స్థాపించే స్థాయికి ఎదిగారనీ రాంభట్ల కృష్ణమూర్తి తన ‘జనకథ’, ‘వేల్పులకథ’, ‘వేదభూమి’ మొదలైన రచనల్లో వివరిస్తారు. దీని గురించిన చర్చ కూడా ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అన్న రచనలో కనిపిస్తుంది.
ఇక మనుషుల గురించి అమరకోశం, రెండవ కాండంలోని ‘మనుష్యవర్గం’ ఇలా చెబుతుంది:
మనుష్యా మానుషా మర్త్యా మనుజా మానవా నరాః
మనువు కొడుకులు కనుక మనుష్యులు, మానుషులు; మృతిని పొందేవారు, మర్త-అంటే భూలోకంలో పుట్టినవారు కనుక మర్త్యులు; మనువు వలన పుట్టినవారు కనుక మనుజులు; మనువుకు సంబంధించినవారు కనుక మానవులు; అన్నింటిని తమ వశంలో ఉంచుకునేవారు కనుక నరులు. ఈ ఆరూ మనుషుల పేర్లని వివరణ.
తిరిగి రామాయణసందర్భానికి వస్తే, మనుషుల పట్ల రావణునికి చిన్నచూపు ఉందని బ్రహ్మ అనడమే చూడండి, ఆ చిన్నచూపు ఎందుకో ఆయన చెప్పలేదు. పుల్లెలవారు తన బాలానందినీ వ్యాఖ్యలో కూడా చెప్పలేదు. ఆయన ప్రస్తావించలేదు కనుక, ఇతర వ్యాఖ్యాతలు కూడా చెప్పి ఉండరు. అదంత యథాలాపంగా తీసుకోవాల్సిన చిన్నమాట కాదు, ఎంతో వ్యాఖ్యానించుకోవలసిన పెద్దమాట. ఎందుకంటే, రావణునికి మనుషుల మీద చిన్నచూపు ఉందని చెబుతున్న బ్రహ్మదేవుడూ, ఇతర దేవతాదులూ కూడా మనిషి మీద పెద్దచూపును చాటుకుంటున్న సందర్భమిది. మనిషే రామాయణంలో ప్రముఖపాత్ర పోషించబోతున్నాడు. అంతేకాదు; చిన్నచూపునకు గురయ్యే ఆ మనిషే విలోమగతిలో దేవుడిగా కూడా మారబోతున్నాడు.
ఈ పరిణామక్రమం వెనుక విస్తృతమైన చరిత్ర ఉంది, దానిని విశ్లేషించే లోతైన అధ్యయనాలున్నాయి. మన దగ్గరే కాదు, ఇతర చోట్ల కూడా పురాణ, ఇతిహాసాలకు ఇదే వస్తువు అయింది కూడా. ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే’ అన్న ఈ వ్యాసకర్త పుస్తకంలో దీని గురించిన చర్చ కూడా ఉంది. ఇంకాస్త వివరంగా చెప్పుకునే అవకాశం ఈ వ్యాసపరంపరలో ముందుముందు వస్తుందేమో చూద్దాం.
***
రావణుడు మనిషి చేతిలో మరణించడానికి అవకాశముందని దేవతాదులకు బ్రహ్మ చెప్పిన వెంటనే, వారున్న చోటికి విష్ణువు వచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ ఆయనకు మొక్కి నువ్వే మాకు శరణన్నారు. ధర్మజ్ఞుడైన దశరథుడి ముగ్గురి భార్యలకు నాలుగు విధాలైన పుత్రులుగా మానవరూపంలో జన్మించి రావణుని యుద్ధంలో సంహరించమని ప్రార్థించారు.
విష్ణువు వాళ్ళకు అభయమిస్తూ, దేవతలకు ఋషులకు భయం కలిగించే క్రూరుడూ, దురాత్ముడూ అయిన రావణుని పుత్ర-పౌత్ర-అమాత్య-మిత్ర-జ్ఞాతి-బంధువులతో సహా యుద్ధంలో సంహరిస్తాననీ, పదకొండువేల సంవత్సరాలు మానవలోకంలో నివసించి ఈ భూమిని పాలిస్తాననీ అన్నాడు(భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణం/సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవం; హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణామ్ భయావహం/దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ/వత్స్యామి మానుషే లొకే పాలయన్ పృథివీమిమాం- బా.స.15.శ్లో. 27, 28)
అంటే, రాముడు ఇంకా పుట్టకుండానే రావణునితోపాటు, ఎప్పుడో జరగబోయే రామ-రావణయుద్ధం కూడా కథలోకి అడుగుపెట్టిందన్నమాట! యుద్ధకోణం నుంచి రామాయణాన్ని అర్థం చేసుకోడానికి ఇదొక ముఖ్యమైన వివరం.
ఈ విధంగా వారికి వరమిచ్చి, మనుష్యలోకంలో తను అవతరించడానికి తగిన స్థానం గురించి ఆలోచించిన విష్ణువు, తనను నాలుగు విధాలుగా విభజించుకుని దశరథుని తండ్రిగా చేసుకోడానికి ఇష్టపడ్డాడు(తతః పద్మపలాశాక్షః కృత్యాత్మానం చతుర్విధం/పితరం రోచయామాస తదా దశరథం నృపం -బా.స.15.శ్లో.30).
చివరిగా పాఠకులకు రెండు ప్రశ్నలు!
లోకకంటకుడైన రావణుని ఒక్కడినీ సంహరిస్తే చాలు కదా? అతని కొడుకులను, మనవలను, మంత్రులను, మిత్రులను, జ్ఞాతులను, బంధువులను కూడా చంపాల్సిన అవసరమేముంది? అందులోనూ సాక్షాత్తు భగవంతునికి?! ఇది ఒక జాతినే తుడిచిపెట్టే ఆలోచన కాదా?
రెండోది- విష్ణువు దశరథుని తండ్రిగా చేసుకుంటానని అనుకునే బదులు, కౌసల్యను తల్లిగా చేసుకుంటానని అనుకోవచ్చుకదా?
పుత్రకామేష్టి విశేషాలు తర్వాత...