
రంజాన్ యుద్ధ అజా!
గీతాంజలి’ యుద్ధ కవిత
రంజాన్ అంటే ఈద్ కాదిప్పుడు !
నెలవంక నిరీక్షణ కానే కాదిప్పుడు!
రంజాన్ అంటే
మిస్సైళ్ళు ఎగరని ఆకాశం!
నెత్తురు చిమ్మని భూమి!
రంజాన్ అంటే
ఈద్ సంబరంతో
పసినవ్వుల కిల కిలా రావాలు కదా!
రంజాన్ అంటే పరమత అసహనం లేకుండా
నీ గొంతులొ కమ్మగా దిగే ఖీర్ కదా?
రంజాన్,
ఒక అద్భుతమైన గులాం ఆలీ గజల్ కాదా?
అసలు యుద్ధం ఆగితేనే రంజాన్ కదా?
~~
అయినా పిల్లల సమాధుల దగ్గర
ఇంకా ఆర్తనాదాలు చేస్తున్న
తల్లులకు రంజాన్ ఎక్కడిది?
వాడికి దేశాలు అన్నీ
వాడు ఆడుకునే క్రికెట్ మైదానాలు!
వాడు సరదాగా వేసుకునే
బాంబు బంతుల దాడుల్లో చెల్లాచెదురైన
పిల్లల స్కూలు బ్యాగుల్లో ని పుస్తకాల్లో,
ఆ సామ్రాజ్యవాది రాసిన
నెత్తుటి అక్షరాల కథలేగా రంజాన్ అంటే?
~
వాడు దహనం చేయాలనుకున్న
ఎప్స్టీన్ ఫైళ్ల రహాస్యాలేగా ఇప్పటి యుద్ధమంటే?
రంజాన్ న్ని
ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు నుంచి
రక్త వర్ణం లోకి మార్చింది,
పరిమళ రహితం చేసింది యుద్ధమే కదా?
రంజాన్ న్ని తన చేతుల్లోకి గుంజుకుని
యుద్ధం,యుద్ధమయం చేసింది వాడేగా?
~
వాళ్ళకి రంజాన్ అంటే
ఆకాశంలో మెరిసిపోయే చందమామ కాదిప్పుడు!
తొలి వేసవి వెన్నెల కాదిప్పుడు!
ఎండను తగ్గించే
రూహ్ -అబ్జా శీతల పానీయం కాదిప్పుడు!
సాయంత్రాలు విచ్చుకునే
మల్లెల పరిమళం కాదిప్పుడు!
పిల్లలు అమ్మీ కాల్చిన రొట్టె తిని
ప్రశాంతంగా స్కూల్ కి వెళ్ళడం,
మళ్ళీ తిరిగి ప్రాణాలతో ఇంటికి చేరడం కాదిప్పుడు!
ఈద్ ముబారక్ అంటూ హిందువులకు కూడా
ప్రేమగా ఇచ్చుకునే కౌగిలింత కాదిప్పుడు!
రంజాన్
మధురంగా అద్దుకునే అత్తరు కాదిప్పుడు!
~
చూడండి!
నమాజు కూడా వేదనతో ఆజా పిలుపు ఇస్తుంది!
మస్జిద్ ముందు
మౌల్వీ దువా ఇవ్వడం మరచిపోతున్నాడు!
ఆకలికి ఖీర్ కాదు కదా
రొట్టె కూడా దొరకని రంజాన్ వాళ్ళది!
శరణార్థి శిబిరాల్లో
వాళ్ళ రంజాన్ దానపు రాజీలతో
సర్దుబాటు చేసుకుంటున్నది!
గాజా,ఇరాన్ శిథిలాల మీద
కన్నీటి వెన్నెల చల్లుతున్నది నెలవంక!
~
కానీ ఇప్పుడు రంజాన్ న్ను దోచుకున్న
వాడిని మస్జిద్ అజా నిలదీస్తున్నది !
వెన్నెలని కాకుండా మృత్యువును
ఒంపుతున్న ఆకాశాలని రంజాన్ తిరస్కరిస్తున్నది!
***
రంజాన్ ఎక్కడిది? ఖీర్ ఏది?
అత్తరు పరిమళాలు ఎక్కడవి?
వెల్లివిరిసే నెలవంక నవ్వులెక్కడ అంటూ,
గాజా,ఇరాన్
ఆకాశాలు దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాయి!
యుద్ధ గాయాలతో అలమటిస్తున్న
మనుషుల దుఃఖం చూడలేక,
నెలవంకని మబ్బులచాటున దాచేస్తున్నాయి!
***
రంజాన్ కి ఇప్పుడు
యుద్ధ మేఘాలు కమ్మని
గాజా,ఇరాన్ ఆకాశాలు కావాలి!
అప్పుడు గానీ నెలవంకను పంపియ్యదు!
రంజాన్ ఆకాశానికిప్పుడు
నక్షత్రాలు కాదు యుద్ధోన్మాది చిద్రం చేసిన
పసిదేహాల నెత్తుటి గాయాల లెక్కలు కావాలి!
పసిపిల్లలు కాదు!
యుద్ధోన్మాది నెత్తురు కక్కుకుంటూ
నేల రాలడం కావాలి!
విను!
మా ఆకాశాల్ని ఖాళీ చేయమని రంజాన్ గర్జిస్తున్నది
వెళ్ళి ఫో!
అప్పటి దాకా
మా రంజాన్ ఆగుతుంది,లేదా మళ్ళీ వస్తుంది. పో!
విను!
అత్తరు ఎప్పుడూ తయారవుతూనే ఉంటుంది!
ఖీర్ ఎప్పుడూ ఉడుకుతూనే ఉంటుంది!
మేంప్రశాంతమైన
ఆకాశపు నెలవంక కోసం నిరీక్షిస్తూనే ఉంటాం!
~~
విను!
బిడ్డల సమాధుల మీద
రోదిస్తున్న తల్లుల రోదనే
ఇప్పటి మస్జిద్ చేసే యుధ్ధ అజా !
అప్పటి దాకా,
నువ్వు చేసే అమానవీయమైన యుద్ధం
మధ్యలోనే మేం రంజాన్ జరుపుకుంటాం!
కావలిస్తే, నువ్వు కూడా రా!
మా పవిత్రమైన ఖీర్ తిని పోదువు!
వెళ్ళేటప్పుడు అత్తరు అద్దుతాం!
కాసింత పరిమళిద్దువు!

